ఈడు మగాడ్రా బుజ్జీ ! | Face of the 'botaks' injunction has been obtained | Sakshi
Sakshi News home page

ఈడు మగాడ్రా బుజ్జీ !

Published Tue, May 12 2015 3:00 AM | Last Updated on Sun, Sep 3 2017 1:51 AM

భారతీయ మగాళ్లలో మరీ అంతగా సౌందర్యస్పృహ డెవలప్ కాలేదు. ఫేస్ క్రీమ్‌లతో సరిపెట్టుకుంటున్నారు.

భారతీయ మగాళ్లలో మరీ అంతగా సౌందర్యస్పృహ డెవలప్ కాలేదు. ఫేస్ క్రీమ్‌లతో సరిపెట్టుకుంటున్నారు.

మగాడంటే మన లెక్కలో మగాడు.
అది కానివాడు మగాడెలా అవుతాడు?
అసలు మగాడంటే ఎవరు?
పది మంది గురించి పట్టించుకునేవాడు, తన గురించి పట్టించుకోనివాడు మగాడు.
మరి వాట్ అబౌట్  అవర్ మాడర్న్ మగాడు?
మొన్నెప్పుడో ఫేస్‌ప్యాక్‌తో మొదలుపెట్టాడు. ఆ తర్వాత రీసెంట్‌గా క్రీములు అలుకుతున్నాడు. వద్దంటే అలుగుతున్నాడు.
ఇప్పుడేదో బొటాక్స్ అంట... ఒక్క సూది గుచ్చితే టెన్ ఇయర్స్ యంగరంట.
ఇవాళ చిత్రంగా మాట్లాడుకుంటున్నాం.
రేపు ఇదే మన చిత్రం కావచ్చు.

 
‘‘ఆడు మగాడ్రా బుజ్జీ’’ అంటాడు ‘అతడు’ సినిమాలో తనికెళ్ల భరణి.. బ్రహ్మాజీతో. భరణి ‘మగాడు’ అన్నది మహేశ్‌బాబు గురించి.
 అంతకు ముందే భరణి దగ్గర్నుంచి పొలం కాగితాల్ని విడిపించుకుని ఉంటాడు మహేశ్‌బాబు. ఆ తర్వాత భరణి మనుషుల్ని ఒక్కొక్కడినీ తుక్కురేగ్గొడతాడు. దీన్ని బట్టి ప్రాథమికంగా అర్థమయేదేమిటంటే.. మగాడు రఫ్‌గా ఉండాలని. పరిస్థితుల్ని ఫేస్ చెయ్యాలని.  అయితే ఇప్పుడు కొత్త మగాళ్లు బయల్దేరారు. పరిస్థితుల్ని ఫేస్ చేస్తూనే, తన ఫేస్‌ని ఫెయిర్‌గా ఉంచుకునేందుకు వయసు తెచ్చే ముడుతలతో వాళ్లు ఫైట్ చేస్తున్నారు. లంచ్‌టైమ్‌లో వెళ్లి ఫేస్‌కి ‘బొటాక్స్’ ఇంజక్షన్ చేయించుకుని వస్తున్నారు.
 ఇది బ్రిటన్ సంగతి.

మన ఆఫీసుల్లో కూడా కొందరు మగాళ్లు పని మధ్యలో తరచు వాష్‌రూమ్‌కి వెళ్లి, ముఖం కడుక్కునో, తలదువ్వుకునో వస్తుంటారు. అయితే బ్రిటన్ ఉద్యోగులు ఫ్రెష్ లుక్ కోసం ఇక్కడితో ఆగిపోవడం లేదు. బొటాక్స్ ఇంజెక్షన్ చేయించుకుంటున్నారు.
 బ్రిటన్‌లో ఇలాంటి మగాళ్లు పది శాతం వరకూ ఉన్నారని తాజాగా అక్కడ జరిగిన సర్వే వెల్లడించింది. ఈ పదిమందిలో సగం మంది, మిగతా ఐదుగురికి తెలియకుండా భోజనవిరామ సమయంలో గుట్టుగా వెళ్లి ముఖానికి బొటాక్స్ ఇంజెక్షన్ చేయించుకుని వచ్చి, ఏమీ ఎరుగని అమాయకుల్లా కొత్త గ్లోతో తమ సీట్లలోకి వచ్చి కూర్చుంటున్నారట. ఇంటికి కూడా అదే గ్లోతో వెళ్లినప్పటికీ అసలు రహస్యాన్ని వీళ్లు తమ భార్యలకు కూడా చెప్పడం లేదని సర్వేలో బయటపడింది.

బొటాక్స్ ఇంజక్షన్ చేయించుకోవడం వల్ల ముఖంపై ముడతలు దాదాపుగా వెంటనే మాయమైపోతాయి. బ్రిటన్‌లో ప్రధానంగా 35-45 ఏళ్ల మధ్య వయసు గలిగిన మగవాళ్లు, కొత్తగా విడాకుల తీసుకున్న మగాళ్లు (బహుశా ఇంకో పెళ్లి కోసం కావచ్చు) రహస్యంగా బొటాక్స్‌ను ఆశ్రయించి ఇన్‌స్టంట్‌గా మన్మథావతారం ఎత్తుతున్నారు. ఈ రహస్యం అక్కడితో ఆగడం లేదు! బ్యాంకు, క్రెడిట్ కార్టు అకౌంట్లలో కనిపించకుండా ఉండడం కోసం వీరు తమ కార్డులను వాడకుండా, క్యాష్ రూపంలో మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారు.
 ఇంత కష్టం ఎందుకబ్బా? ఫేస్‌ప్యాక్ చేయించుకుని ఫ్రెష్‌గా లుక్ ఇవ్వచ్చు కదా. ఇవ్వొచ్చు కానీ, ఏదో చేయించుకుని వచ్చినట్లు కనిపించడం వారికి ఇష్టం లేదని ఈ సర్వేను చేసిన ‘రైట్ క్లినిక్’ చెబుతోంది.

ఇంతకీ ఈ క్లినిక్ ఫౌండర్ ఎవరో తెలుసా? డాక్టర్ గణేశ్ రావ్. మన తెలుగాయనలానే ఉన్నాడు. బొటాక్స్ సూది అప్పటికప్పుడు ముఖంపై ముడతల్ని అదృశ్యం చెయ్యడంతోపాటు, ఆత్మవిశ్వాసాన్నీ ఇంజెక్ట్ చేస్తుందట! ఆయన అలా అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. అందమే ఆనందం, ఆత్మవిశ్వాసం కదా.  చూస్తుంటే డాక్టర్ గ ణేశ్ రావ్ పురుష పక్షపాతిలా ఉన్నారు. అందుకే వెయ్యిమంది పురుషుల రహస్య సౌందర్యకాంక్షపై వివరాలను రాబట్టి వారిని సమర్థిస్తూ ఒక స్టేట్‌మెంట్ కూడా ఇచ్చేశారు.  ‘‘ఏం? మగువలు మాత్రమే సౌందర్య సాధనాలు వాడాలా? మగవాళ్లకు మాత్రం ఎవర్‌గ్రీన్‌గా ఉండాలనిపించదా? ’’ అని అడుగుతున్నారు.  ఈ ధోరణి ఇండియాకు ఇంకా రాలేదు. వస్తే బొటాక్స్‌కు కొరత ఏర్పడుతుందేమో! చెప్పలేం. వయసును దాచేసుకోవాలని ఏ మగాడికి మాత్రం ఉండదు? సో... అమ్మాయిలూ జాగ్రత్త. బొటాక్స్ బాబులు అందంలో మిమ్మల్ని మించిపోతారేమో! మిమ్మల్ని బురిడీ కొట్టిస్తారేమో?!
బొటాక్స్ ఎలా పుట్టింది?
 
బొటాక్స్ అనేది ఒక విష పదార్థం. క్లాస్ట్రీడియమ్ బోట్యులినమ్ అనే ఒక బ్యాక్టీరియా క్రిమి నుంచి ఈ విషం పుడుతుంది.
 ఇదొక ప్రోటీన్. దీన్ని ప్యూరిఫైడ్ డిరైవ్‌డ్ ప్రోటీన్ అంటారు. ఎందుకంటే విషాన్ని ఎంతగానో శుద్ధి చేసి అందులోంచి దీన్ని రాబడతారు. బోట్యులినమ్ క్రిమి నుంచి వస్తుంది. ఇది ఒక టాక్సిన్ (విషపదార్థం) కాబట్టి ఆ రెండు పేర్లనూ కలుపుకుని దీనికి ‘బొటాక్స్’ అనే పేరు పెట్టారు.
 
 ఏమిటి చరిత్ర   


చరిత్రలో మొట్టమొదటిసారి 1970లలో డాక్టర్ అలాన్ స్కాట్ అనే వైద్యుడు మెల్లకన్ను (స్ట్రాబి స్మస్)తో బాధపడుతున్న ఒక కోతికి బొటాక్స్‌తో చికిత్స చేసి చూశారు. అలా తన క్లినికల్ ట్రయల్స్ మొదలుపెట్టిన ఆయన... కొద్దికాలంలోనే (అంటే ఏడేళ్ల వ్యవధిలో) దాన్ని మనుషుల మీద కూడా ప్రయోగించారు. ఇక వైద్యచికిత్స కోసమే గాక... అందాన్ని ఇనుమడింపజేసేందుకూ ఇది ఉపయోగ పడుతుందని డాక్టర్ రిచర్డ్ క్లాక్ అనే శాక్రిమెంటో (కాలిఫోర్నియా)కు చెందిన ప్లాస్టిక్ సర్జన్ తెలుసుకున్నాడు. దీన్ని ప్రయోగించి ముఖంపై ఉన్న ముడుతలను తొలగించాడాయన.
 
ఎలా పని చేస్తుంది?

అనేక రకాల చికిత్సలతో పాటు... అందాన్ని ఇనుమడింపజేసే ప్రక్రియలకూ బొటాక్స్ ఉపయోగపడుతుందని తేలింది.అందుకే ముఖం మీద ముడుతలను తొలగించి వయసు తగ్గినట్లుగా కనిపించడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇంజెక్షన్ ద్వారా ముఖం మీద అనేక పొరల్లోకి దీన్ని క్రమక్రమంగా 4-6 నెలల పాటు ప్రవేశపెడుతూ చేసే చికిత్స ద్వారా ముఖం ముడుతలను తొలగించవచ్చు. ముడుతలు తొలగిపోయాక ముఖ చర్మం మునుపటికంటే బిగుతుగా ఉన్నట్లు కనిపించడంతో వయసు తగ్గినట్లుగా అనిపిస్తుంది.
 
 జాగ్రత్తగా ఉండాలి

బొటాక్స్ చికిత్సను చాలా అనుభవజ్ఞులైన, నిపుణులైన డాక్టర్లతో మాత్రమే చేయించాలి. ఆ ఇంజెక్షన్ మోతాదు మీరితే వచ్చే దుష్ర్పభావాల గురించి నిపుణులైన వారికి మాత్రమే బాగా తెలుసు. అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల కూడా వారికి అవగాహన ఉంటుంది. ఉదాహరణకు మోతాదు మించినప్పుడు కనురెప్పలు, కనుబొమలు, కింది పెదవులు కిందికి మరింతగా జారినట్లుగా అనిపించవచ్చు. అందుకే ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి నిపుణులైన డాక్టర్ల చేతనే బొటాక్స్ ట్రీట్‌మెంట్ తీసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement