రాజ్యసభలో దుయ్యబట్టిన ఖర్గే ∙ ఆరెస్సెస్‌పై తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ‘‘పదేళ్ల తన పాలన కేవలం ట్రైలరేనని, అసలు సినిమా ముందుందని లోక్‌సభ ఎన్నికల ప్రచారం పొడవునా మోదీ పదేపదే చెప్పుకున్నారు. ఆయన సినిమా ఎలా ఉండనుందో ఈ నెల రోజుల పాలన చెప్పకనే చెప్పింది. పేపర్ లీకేజీలు, కశీ్మర్‌లో ఉగ్ర దాడులు, రైలు ప్రమాదాలు, దేశమంతటా టోల్ ట్యాక్సుల పెంపు, బ్రిడ్జిలు, విమానాశ్రయాల పై కప్పులు కూలడాలు, చివరికి మోదీ ఎంతో గొప్పగా చెప్పుకున్న అయోధ్య రామాలయంలో కూడా లీకేజీలు... ఇదే మోదీ చూపిస్తానని చెప్పిన సినిమా!’’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. గంటన్నర పాటు సాగిన ప్రసంగంలో మోదీ ప్రభుత్వాన్ని అంశాలవారీగా ఏకిపారేశారు. సామాన్యుల కష్టాలను పట్టించుకోకుండా మోదీ కేవలం ‘మన్ కీ బాత్’కు పరిమితమయ్యారంటూ చురకలు వేశారు. గతంలో ఏ ప్రధాని చేయని విధంగా ఎన్నికల ప్రచారంలో విద్వేష వ్యాఖ్యలతో సమాజాన్ని విభజించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇటీవలి పేపర్ లీకేజీలతో 30 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ప్రమాదంలో పడిందని ఖర్గే అన్నారు. మణిపూర్ హింసాకాండ వంటి దేశం ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావనకు కూడా నోచుకోలేదంటూ ఆక్షేపించారు.
విద్యా వ్యవస్థ గురించి మాట్లాడే క్రమంలో ఆరెస్సెస్‌పై ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణలు, విమర్శలు చేశారు. ‘‘ఆరెస్సెస్ విధానం దేశానికి చాలా ప్రమాదకరం. వర్సిటీలతో పాటు అన్ని విద్యా సంస్థల్లో వీసీలు, ప్రొఫెసర్ల నియామకాలపై దాని ప్రభావం ఉంటోంది’’ అంటూ ఆక్షేపించారు. ఆ వ్యాఖ్యలను రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ తీవ్రంగా ఖండించారు. ‘‘ఆరెస్సెస్ సభ్యుడు కావడమే నేరమన్నట్టుగా మీ మాటలున్నాయి. ఆ సంస్థలో ఎందరో మేధావులున్నారు. అది జాతి నిర్మాణానికి అవిశ్రాంతంగా పాటుపడుతోంది. అలాంటి సంస్థను నిందిస్తున్నారు మీరు’’ అన్నారు. మోదీపై, ఆరెస్సెస్‌పై ఖర్గే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.
కూర్చుని మాట్లాడతా: ఖర్గే
అలాగే కానీయండి: ధన్‌ఖడ్
విపక్ష సభ్యుల తీవ్ర విమర్శలు, అధికార పక్ష ప్రతి విమర్శలతో వేడెక్కిపోయిన రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే వ్యాఖ్యలు, చైర్మన్ స్పందన నవ్వులు పూయించాయి. గంటన్నర పాటు ప్రసంగించిన ఖర్గే, తనకు మోకాళ్ల నొప్పులున్నందున కూర్చుని మాట్లాడేందుకు అనుమతి కోరారు. ‘మీకెలా సౌకర్యంగా ఉంటే అలా చేయండి. ఇబ్బందేమీ లేదు’ అంటూ ధన్‌ఖడ్ బదులిచ్చారు. కానీ కూర్చుని చేసే ప్రసంగం నిలబడి చేసినంత ప్రభావవంతంగా ఉండదని ఖర్గే అనడంతో సభ్యులంతా గొల్లుమన్నారు. ఆ విషయంలో మీకు వీలైనంత సా యం చేస్తా లెమ్మని ధన్‌ఖడ్ బదులివ్వడంతో సోనియాతో సహా అంతా మరోసారి నవ్వుకున్నారు. మరో సందర్భంలో ‘‘నేను దక్షిణాదికి చెందిన వాడిని. కనుక ద్వివేది, త్రివేది, చతుర్వేది పదాలు నన్ను చాలా అయోమయపరుస్తాయి’’ అని ఖర్గే అనడంతో ‘కావాలంటే వాటిపై ఓ అరగంట పాటు ప్రత్యేక చర్చ చేపడదాం’ అని ధన్‌ఖడ్ బదులిచ్చారు. దాంతో సభంతా మరోసారి నవ్వులతో దద్దరిల్లిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment