bridges collapse
-
కూలడంలో.. వరస కట్టిన వంతెనలు
సివాన్(బిహార్): బిహార్‌లో వంతెనలు పేకమేడల్లా కూలుతున్నాయి. సివాన్ జిల్లాలో 11 రోజుల క్రితం ఒక వంతెన కూలగా బుధవారం అదే జిల్లాలో మరో రెండు వంతెనలు కూలాయి. సరన్ జిల్లాలో ఇంకోటి కూలింది. బుధవారం ఘటనలు కలుపుకుని గత 15 రోజుల్లో ఇలా రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది వంతెనలు కుప్పకూలాయి. జిల్లాలోని దేవరియా బ్లాక్ పరిధిలో గండకీ నదిపై దాదాపు 42 సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక చిన్నపాటి వంతెన బుధవారం ఉదయం ఐదుగంటలకు కూలింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదు. ‘‘ వంతెనలో కొంత భాగమే కూలింది. గత కొద్దిరోజులుగా వంతెనకు మరమ్మత్తులు చేస్తున్నారు. కుప్పకూలడానికి కారణాలపై దర్యాప్తు మొదలుపెట్టాం’’ అని డెప్యూటీ డెవలప్మెంట్ కమిషనర్ ముకేశ్ చెప్పారు. గత కొద్దిరోజులుగా గండకీ నది వర్షాల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తోందని, ప్రవాహం ధాటికి తట్టుకోలేక బ్రిడ్జి కూలిందని అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు. సివాన్ జిల్లాలో తెఘ్రా బ్లాక్‌లోనూ మరో వంతెన కూలింది. ఇటీవల మధుబని, అరారియా, తూర్పు చంపారన్, కిషన్‌గంజ్ జిల్లాల్లోనూ వంతెనలు కూలాపోయాయి. భారీ వర్షాలు, నదీ ప్రవాహం పెరిగిన ఈ తరుణంలో వంతెనలు కూలుతుండటంతో వాటి నాణ్యతపై అనుమానాలు పెరిగాయి. దీంతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసి వంతెనల సామర్థ్యం, స్థితిగతులపై సమీక్ష నిర్వహంచనున్నారు. -
Mallikarjun Kharge: లీకేజీలు, ప్రమాదాలు, దాడులు... ఇదే మోదీ ‘పిక్చర్’!
న్యూఢిల్లీ: ‘‘పదేళ్ల తన పాలన కేవలం ట్రైలరేనని, అసలు సినిమా ముందుందని లోక్‌సభ ఎన్నికల ప్రచారం పొడవునా మోదీ పదేపదే చెప్పుకున్నారు. ఆయన సినిమా ఎలా ఉండనుందో ఈ నెల రోజుల పాలన చెప్పకనే చెప్పింది. పేపర్ లీకేజీలు, కశీ్మర్లో ఉగ్ర దాడులు, రైలు ప్రమాదాలు, దేశమంతటా టోల్ ట్యాక్సుల పెంపు, బ్రిడ్జిలు, విమానాశ్రయాల పై కప్పులు కూలడాలు, చివరికి మోదీ ఎంతో గొప్పగా చెప్పుకున్న అయోధ్య రామాలయంలో కూడా లీకేజీలు... ఇదే మోదీ చూపిస్తానని చెప్పిన సినిమా!’’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. గంటన్నర పాటు సాగిన ప్రసంగంలో మోదీ ప్రభుత్వాన్ని అంశాలవారీగా ఏకిపారేశారు. సామాన్యుల కష్టాలను పట్టించుకోకుండా మోదీ కేవలం ‘మన్ కీ బాత్’కు పరిమితమయ్యారంటూ చురకలు వేశారు. గతంలో ఏ ప్రధాని చేయని విధంగా ఎన్నికల ప్రచారంలో విద్వేష వ్యాఖ్యలతో సమాజాన్ని విభజించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇటీవలి పేపర్ లీకేజీలతో 30 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ప్రమాదంలో పడిందని ఖర్గే అన్నారు. మణిపూర్ హింసాకాండ వంటి దేశం ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావనకు కూడా నోచుకోలేదంటూ ఆక్షేపించారు. విద్యా వ్యవస్థ గురించి మాట్లాడే క్రమంలో ఆరెస్సెస్‌పై ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణలు, విమర్శలు చేశారు. ‘‘ఆరెస్సెస్ విధానం దేశానికి చాలా ప్రమాదకరం. వర్సిటీలతో పాటు అన్ని విద్యా సంస్థల్లో వీసీలు, ప్రొఫెసర్ల నియామకాలపై దాని ప్రభావం ఉంటోంది’’ అంటూ ఆక్షేపించారు. ఆ వ్యాఖ్యలను రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తీవ్రంగా ఖండించారు. ‘‘ఆరెస్సెస్ సభ్యుడు కావడమే నేరమన్నట్టుగా మీ మాటలున్నాయి. ఆ సంస్థలో ఎందరో మేధావులున్నారు. అది జాతి నిర్మాణానికి అవిశ్రాంతంగా పాటుపడుతోంది. అలాంటి సంస్థను నిందిస్తున్నారు మీరు’’ అన్నారు. మోదీపై, ఆరెస్సెస్‌పై ఖర్గే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.కూర్చుని మాట్లాడతా: ఖర్గే అలాగే కానీయండి: ధన్‌ఖడ్ విపక్ష సభ్యుల తీవ్ర విమర్శలు, అధికార పక్ష ప్రతి విమర్శలతో వేడెక్కిపోయిన రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే వ్యాఖ్యలు, చైర్మన్ స్పందన నవ్వులు పూయించాయి. గంటన్నర పాటు ప్రసంగించిన ఖర్గే, తనకు మోకాళ్ల నొప్పులున్నందున కూర్చుని మాట్లాడేందుకు అనుమతి కోరారు. ‘మీకెలా సౌకర్యంగా ఉంటే అలా చేయండి. ఇబ్బందేమీ లేదు’ అంటూ ధన్‌ఖడ్ బదులిచ్చారు. కానీ కూర్చుని చేసే ప్రసంగం నిలబడి చేసినంత ప్రభావవంతంగా ఉండదని ఖర్గే అనడంతో సభ్యులంతా గొల్లుమన్నారు. ఆ విషయంలో మీకు వీలైనంత సా యం చేస్తా లెమ్మని ధన్‌ఖడ్ బదులివ్వడంతో సోనియాతో సహా అంతా మరోసారి నవ్వుకున్నారు. మరో సందర్భంలో ‘‘నేను దక్షిణాదికి చెందిన వాడిని. కనుక ద్వివేది, త్రివేది, చతుర్వేది పదాలు నన్ను చాలా అయోమయపరుస్తాయి’’ అని ఖర్గే అనడంతో ‘కావాలంటే వాటిపై ఓ అరగంట పాటు ప్రత్యేక చర్చ చేపడదాం’ అని ధన్‌ఖడ్ బదులిచ్చారు. దాంతో సభంతా మరోసారి నవ్వులతో దద్దరిల్లిపోయింది. -
బిహార్‌లో కూలిన మూడో వంతెన
మోతీహారి: బిహార్‌లో వంతెనలు వరుసగా కూలిపోతున్నాయి. ఇప్పటికే రెండు బ్రిడ్జిలు కూలిపోగా, తాజాగా ఆదివారం తూర్పు చంపారన్ జిల్లాలోని మోతీహారిలోని ఘోరాసహన్ బ్లాక్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన మరొకటి కూలిపోయింది. కాలువపై నిర్మిస్తున్న ఈ వంతెన అమ్వా గ్రామాన్ని బ్లాక్‌లోని ఇతర ప్రాంతాలకు కలుపుతుంది. 16 మీటర్ల పొడవైన వంతెనను రూరల్ వర్క్స్ విభాగం రూ.1.5 కోట్ల వ్యయంతో నిర్మిస్తోంది. ఘటనపై విచారణకు ఆదేశించామని, అయితే కారణాలేమీ తెలియ రాలేదని ప్రభుత్వ అదనపు కార్యదర్శి దీపక్ కుమార్ సింగ్ తెలిపారు. -
గల్లంతైన వారిలో 62 మంది సురక్షితం
గ్యాంగ్‌టక్/జల్పాయ్గురి: సిక్కింలో తీస్తా నదికి బుధవారం సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన వారిలో 62 మంది సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో, గల్లంతైన వారి సంఖ్య 143 నుంచి 81కి తగ్గిపోయింది. మరోవైపు, వరదల్లో మృతుల సంఖ్య 30కి చేరుకుంది. మరో వైపు, గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వరదల్లో గల్లంతైన 22 మంది ఆర్మీ సిబ్బందిలో మరో రెండు మృతదేహాలు శనివారం బయటపడ్డాయి. దీంతో, ఇప్పటి వరకు 9 మంది జవాన్ల మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు చెప్పారు. నాలుగు జిల్లాల్లోని సుమారు 42 వేల మంది ప్రజలపై వరదలు ప్రభావం చూపగా, 1,320 నివాసాలు దెబ్బతిన్నాయని, 13 వంతెనలు కొట్టుకుపోయాయని రాష్ట్ర యంత్రాంగం శనివారం తెలిపింది. తీవ్రంగా గాయపడిన 26 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. మంగన్ జిల్లాలోని లచెన్, లచుంగ్ల్లో వరద ముంపులో చిక్కుకున్న సుమారు 3వేల మంది పర్యాటకులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిని బయటకు తరలించేందుకు వైమానిక దళానికి చెందిన ఎంఐ–17 హెలికాప్టర్లతో ప్రయత్నించినప్పటికీ వాతావరణం అనుకూలించలేదని అధికారులు చెప్పారు. చుంగ్థంగ్ ప్రాంతంలో చిక్కుకుపోయిన పర్యాటకులకు హెలికాప్టర్ ద్వారా అత్యవసరాలను సరఫరా చేశారు. సింగ్టమ్, బర్దంగ్, రంగ్పోల్లోని వారిని రక్షించే పనుల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తలమునకలై ఉన్నాయి. అనూహ్య వరదలతో చుంగ్థంగ్ పట్టణం 80 శాతం మేరకు తీవ్రంగా దెబ్బతింది. వరద ప్రభావిత మాంగన్ జిల్లాను సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ శనివారం సందర్శించారు. సహాయక కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. అన్ని శాఖల అధికారులతో కూడిన అధికారుల కేంద్ర బృందం ఆదివారం వరద ప్రభావిత ప్రాంతాలకు పంపుతున్నట్లు కేంద్ర మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా చెప్పారు. ఇలా ఉండగా, వచ్చే అయిదు రోజులపాటు మంగన్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆ 150 మంది తృటిలో తప్పించుకున్నారు తీస్తా నదికి సమీపంలోని సిక్కిం– పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో రైల్వే సొరంగం పనుల్లో పాల్గొంటున్న సుమారు 150 మంది కార్మికులు ఆకస్మిక వరదల నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎగువ నుంచి భారీగా వరద ముంచుకొస్తున్న సమాచారాన్ని అధికారులు కాలింపాంగ్ జిల్లా జీరో మైల్ ప్రాంతం వద్ద ఉన్న ప్రైవేట్ రైల్వే కాంట్రాక్ట్ సంస్థకు చేరవేశారు. సంస్థ అధికారులు వెంటనే ఒక సెక్యూరిటీ గార్డును హుటాహుటిన కార్మికులుండే క్యాంపునకు పంపించారు. పగలంతా పనులు చేసి, అలసిపోయి క్యాంపుల్లో నిద్రిస్తున్న కార్మికులను గార్డు అప్రమత్తం చేశారు. దాదాపు 150 మంది కార్మికులు ఉన్నఫళంగా విలువైన పత్రాలు, దగ్గరున్న డబ్బు, కట్టుబట్టలతో అక్కడి నుంచి అడ్డదారిన బయలుదేరారు. దాదాపు 20 నిమిషాల అనంతరం ప్రధాన రహదారికి వద్దకు చేరుకున్నారు. అప్పటికే వరద దిగువనున్న వారి క్యాంపును మింగేయడం కళ్లారా చూసి కార్మికులు షాక్ అయ్యారు. అప్పటికే అక్కడున్న ట్రక్కుల్లో 2 కిలోమీటర్ల దూరంలోని రాంబి బజార్లో ఏర్పాటు చేసిన క్యాంప్‌నకు చేరుకున్నారు. వీరంతా అస్సాం, బిహార్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారు. -
కుంగుతున్న వంతెనలు
నెంటూరులో మున్నాళ్ల ముచ్చటగా నిర్మాణ పనులు వర్గల్: ఆర్అండ్బీ పనుల్లో నాణ్యత కొరవడుతోంది. వంతెనల నిర్మాణ పనులు మూన్నాళ్ల ముచ్చటగా మిగులుతున్నాయి. వర్గల్ మండలం నెంటూరు వద్ద బరువు తట్టుకోలేక కృంగిన వంతెనలు నాణ్యతా లోపానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. కోమటిబండ నుంచి నెంటూరు మీదుగా గోవిందాపూర్ వరకు దాదాపు రూ. 10 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ మార్గంలో అనేక చోట్ల వంతెనలు నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా గత నెలాఖరున నెంటూరు-గోవిందాపూర్ మార్గంలోని స్కూల్ సమీపంలో ఒక వంతెన నిర్మించారు. నాణ్యత లోపించిందో, సరిగా క్యూరింగ్ చేయలేదో తెలియదుగాని అది కుంగిపోయింది. అదేవిధంగా నెంటూరు-కోమటిబండ మార్గంలోని వంతెన పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అక్కడ సైతం వంతెన కుంగిగిపోవడంతో సంబంధిత కంట్రాక్టర్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాడు. పనుల నాణ్యత విషయంలో ఆర్అండ్బీ అధికారుల ఉదాసీనత, పర్యవేక్షణ లోపం కారణంగానే రోడ్ల నాణ్యత ప్రశ్నార్థకమవుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారీ వాహనాల ఒత్తిడి తట్టుకోలేకనే: ఏఈ శ్రీనివాస్ భారీ వాహనాల ఒత్తిడి తట్టుకోలేకనే నెంటూరు సమీపంలో కొత్తగా నిర్మించిన వంతెనలు కుంగిపోయాయి. వంతెన నిర్మాణం తరువాత కనీసం 20-28 రోజుల వరకు వాటర్ క్యూరింగ్ చేపట్టాలి. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఈ రెండు వంతెనలపై తప్పనిసరిగా భారీ వాహనాలను అనుమతించాం. దీంతో అవి కుంగిపోయాయి. ఈ వంతెనలను మళ్లీ పటిష్ఠంగా నిర్మిస్తాం. నాణ్యతలో రాజీ పడబోం.