![Sikkim flash floods death toll rises, missing people safe - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/10/8/sikkim.jpg.webp?itok=3CaydFLp)
గ్యాంగ్‌టక్/జల్పాయ్‌గురి: సిక్కింలో తీస్తా నదికి బుధవారం సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన వారిలో 62 మంది సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో, గల్లంతైన వారి సంఖ్య 143 నుంచి 81కి తగ్గిపోయింది. మరోవైపు, వరదల్లో మృతుల సంఖ్య 30కి చేరుకుంది. మరో వైపు, గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
వరదల్లో గల్లంతైన 22 మంది ఆర్మీ సిబ్బందిలో మరో రెండు మృతదేహాలు శనివారం బయటపడ్డాయి. దీంతో, ఇప్పటి వరకు 9 మంది జవాన్ల మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు చెప్పారు. నాలుగు జిల్లాల్లోని సుమారు 42 వేల మంది ప్రజలపై వరదలు ప్రభావం చూపగా, 1,320 నివాసాలు దెబ్బతిన్నాయని, 13 వంతెనలు కొట్టుకుపోయాయని రాష్ట్ర యంత్రాంగం శనివారం తెలిపింది. తీవ్రంగా గాయపడిన 26 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది.
మంగన్ జిల్లాలోని లచెన్, లచుంగ్‌ల్లో వరద ముంపులో చిక్కుకున్న సుమారు 3వేల మంది పర్యాటకులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిని బయటకు తరలించేందుకు వైమానిక దళానికి చెందిన ఎంఐ–17 హెలికాప్టర్లతో ప్రయత్నించినప్పటికీ వాతావరణం అనుకూలించలేదని అధికారులు చెప్పారు. చుంగ్‌థంగ్ ప్రాంతంలో చిక్కుకుపోయిన పర్యాటకులకు హెలికాప్టర్ ద్వారా అత్యవసరాలను సరఫరా చేశారు.
సింగ్‌టమ్, బర్దంగ్, రంగ్‌పోల్లోని వారిని రక్షించే పనుల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు తలమునకలై ఉన్నాయి. అనూహ్య వరదలతో చుంగ్‌థంగ్ పట్టణం 80 శాతం మేరకు తీవ్రంగా దెబ్బతింది. వరద ప్రభావిత మాంగన్ జిల్లాను సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ శనివారం సందర్శించారు. సహాయక కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. అన్ని శాఖల అధికారులతో కూడిన అధికారుల కేంద్ర బృందం ఆదివారం వరద ప్రభావిత ప్రాంతాలకు పంపుతున్నట్లు కేంద్ర మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా చెప్పారు. ఇలా ఉండగా, వచ్చే అయిదు రోజులపాటు మంగన్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఆ 150 మంది తృటిలో తప్పించుకున్నారు
తీస్తా నదికి సమీపంలోని సిక్కిం– పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో రైల్వే సొరంగం పనుల్లో పాల్గొంటున్న సుమారు 150 మంది కార్మికులు ఆకస్మిక వరదల నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎగువ నుంచి భారీగా వరద ముంచుకొస్తున్న సమాచారాన్ని అధికారులు కాలింపాంగ్ జిల్లా జీరో మైల్ ప్రాంతం వద్ద ఉన్న ప్రైవేట్ రైల్వే కాంట్రాక్ట్ సంస్థకు చేరవేశారు. సంస్థ అధికారులు వెంటనే ఒక సెక్యూరిటీ గార్డును హుటాహుటిన కార్మికులుండే క్యాంపునకు పంపించారు.
పగలంతా పనులు చేసి, అలసిపోయి క్యాంపుల్లో నిద్రిస్తున్న కార్మికులను గార్డు అప్రమత్తం చేశారు. దాదాపు 150 మంది కార్మికులు ఉన్నఫళంగా విలువైన పత్రాలు, దగ్గరున్న డబ్బు, కట్టుబట్టలతో అక్కడి నుంచి అడ్డదారిన బయలుదేరారు. దాదాపు 20 నిమిషాల అనంతరం ప్రధాన రహదారికి వద్దకు చేరుకున్నారు. అప్పటికే వరద దిగువనున్న వారి క్యాంపును మింగేయడం కళ్లారా చూసి కార్మికులు షాక్ అయ్యారు. అప్పటికే అక్కడున్న ట్రక్కుల్లో 2 కిలోమీటర్ల దూరంలోని రాంబి బజార్‌లో ఏర్పాటు చేసిన క్యాంప్‌నకు చేరుకున్నారు. వీరంతా అస్సాం, బిహార్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారు.
Comments
Please login to add a commentAdd a comment