బిహార్‌లో ఒకేరోజు కూలిన మూడు వంతెనలు
సివాన్(బిహార్): బిహార్‌లో వంతెనలు పేకమేడల్లా కూలుతున్నాయి. సివాన్ జిల్లాలో 11 రోజుల క్రితం ఒక వంతెన కూలగా బుధవారం అదే జిల్లాలో మరో రెండు వంతెనలు కూలాయి. సరన్ జిల్లాలో ఇంకోటి కూలింది. బుధవారం ఘటనలు కలుపుకుని గత 15 రోజుల్లో ఇలా రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది వంతెనలు కుప్పకూలాయి.
జిల్లాలోని దేవరియా బ్లాక్ పరిధిలో గండకీ నదిపై దాదాపు 42 సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక చిన్నపాటి వంతెన బుధవారం ఉదయం ఐదుగంటలకు కూలింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదు. ‘‘ వంతెనలో కొంత భాగమే కూలింది. గత కొద్దిరోజులుగా వంతెనకు మరమ్మత్తులు చేస్తున్నారు. కుప్పకూలడానికి కారణాలపై దర్యాప్తు మొదలుపెట్టాం’’ అని డెప్యూటీ డెవలప్‌మెంట్ కమిషనర్ ముకేశ్ చెప్పారు.
గత కొద్దిరోజులుగా గండకీ నది వర్షాల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తోందని, ప్రవాహం ధాటికి తట్టుకోలేక బ్రిడ్జి కూలిందని అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు. సివాన్ జిల్లాలో తెఘ్రా బ్లాక్‌లోనూ మరో వంతెన కూలింది. ఇటీవల మధుబని, అరారియా, తూర్పు చంపారన్, కిషన్‌గంజ్ జిల్లాల్లోనూ వంతెనలు కూలాపోయాయి. భారీ వర్షాలు, నదీ ప్రవాహం పెరిగిన ఈ తరుణంలో వంతెనలు కూలుతుండటంతో వాటి నాణ్యతపై అనుమానాలు పెరిగాయి. దీంతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసి వంతెనల సామర్థ్యం, స్థితిగతులపై సమీక్ష నిర్వహంచనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment