నెంటూరు సమీపంలో కుంగిన వంతెన
- నెంటూరులో మున్నాళ్ల ముచ్చటగా నిర్మాణ పనులు
వర్గల్: ఆర్‌అండ్‌బీ పనుల్లో నాణ్యత కొరవడుతోంది. వంతెనల నిర్మాణ పనులు మూన్నాళ్ల ముచ్చటగా మిగులుతున్నాయి. వర్గల్ మండలం నెంటూరు వద్ద బరువు తట్టుకోలేక కృంగిన వంతెనలు నాణ్యతా లోపానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. కోమటిబండ నుంచి నెంటూరు మీదుగా గోవిందాపూర్ వరకు దాదాపు రూ. 10 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి.
ఈ మార్గంలో అనేక చోట్ల వంతెనలు నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా గత నెలాఖరున నెంటూరు-గోవిందాపూర్ మార్గంలోని స్కూల్ సమీపంలో ఒక వంతెన నిర్మించారు. నాణ్యత లోపించిందో, సరిగా క్యూరింగ్ చేయలేదో తెలియదుగాని అది కుంగిపోయింది. అదేవిధంగా నెంటూరు-కోమటిబండ మార్గంలోని వంతెన పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
అక్కడ సైతం వంతెన కుంగిగిపోవడంతో సంబంధిత కంట్రాక్టర్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాడు. పనుల నాణ్యత విషయంలో ఆర్‌అండ్‌బీ అధికారుల ఉదాసీనత, పర్యవేక్షణ లోపం కారణంగానే రోడ్ల నాణ్యత ప్రశ్నార్థకమవుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
భారీ వాహనాల ఒత్తిడి తట్టుకోలేకనే: ఏఈ శ్రీనివాస్
భారీ వాహనాల ఒత్తిడి తట్టుకోలేకనే నెంటూరు సమీపంలో కొత్తగా నిర్మించిన వంతెనలు కుంగిపోయాయి. వంతెన నిర్మాణం తరువాత కనీసం 20-28 రోజుల వరకు వాటర్ క్యూరింగ్ చేపట్టాలి. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఈ రెండు వంతెనలపై తప్పనిసరిగా భారీ వాహనాలను అనుమతించాం. దీంతో అవి కుంగిపోయాయి. ఈ వంతెనలను మళ్లీ పటిష్ఠంగా నిర్మిస్తాం. నాణ్యతలో రాజీ పడబోం.