nenturu
-
కుంగుతున్న వంతెనలు
నెంటూరులో మున్నాళ్ల ముచ్చటగా నిర్మాణ పనులు వర్గల్: ఆర్అండ్బీ పనుల్లో నాణ్యత కొరవడుతోంది. వంతెనల నిర్మాణ పనులు మూన్నాళ్ల ముచ్చటగా మిగులుతున్నాయి. వర్గల్ మండలం నెంటూరు వద్ద బరువు తట్టుకోలేక కృంగిన వంతెనలు నాణ్యతా లోపానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. కోమటిబండ నుంచి నెంటూరు మీదుగా గోవిందాపూర్ వరకు దాదాపు రూ. 10 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ మార్గంలో అనేక చోట్ల వంతెనలు నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా గత నెలాఖరున నెంటూరు-గోవిందాపూర్ మార్గంలోని స్కూల్ సమీపంలో ఒక వంతెన నిర్మించారు. నాణ్యత లోపించిందో, సరిగా క్యూరింగ్ చేయలేదో తెలియదుగాని అది కుంగిపోయింది. అదేవిధంగా నెంటూరు-కోమటిబండ మార్గంలోని వంతెన పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అక్కడ సైతం వంతెన కుంగిగిపోవడంతో సంబంధిత కంట్రాక్టర్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాడు. పనుల నాణ్యత విషయంలో ఆర్అండ్బీ అధికారుల ఉదాసీనత, పర్యవేక్షణ లోపం కారణంగానే రోడ్ల నాణ్యత ప్రశ్నార్థకమవుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారీ వాహనాల ఒత్తిడి తట్టుకోలేకనే: ఏఈ శ్రీనివాస్ భారీ వాహనాల ఒత్తిడి తట్టుకోలేకనే నెంటూరు సమీపంలో కొత్తగా నిర్మించిన వంతెనలు కుంగిపోయాయి. వంతెన నిర్మాణం తరువాత కనీసం 20-28 రోజుల వరకు వాటర్ క్యూరింగ్ చేపట్టాలి. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఈ రెండు వంతెనలపై తప్పనిసరిగా భారీ వాహనాలను అనుమతించాం. దీంతో అవి కుంగిపోయాయి. ఈ వంతెనలను మళ్లీ పటిష్ఠంగా నిర్మిస్తాం. నాణ్యతలో రాజీ పడబోం. -
హెలీప్యాడ్ల వద్ద మూడో నేత్రం
నిరంతర నిఘాలో భద్రతా దళాలు డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు వర్గల్: ప్రధాని రాక సందర్భంగా మండలంలోని నెంటూరు శివారులోని హెలిప్యాడ్ వద్ద నిఘా నేత్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధాని కోసం ఆర్అండ్బీ అధికారుల పర్యవేక్షణలో మూడు హెలిప్యాడ్లు నిర్మించారు. విశాలమైన అంతర్గత రోడ్లు నిర్మించారు. మొదట మట్టిని, ఆ తరువాత కంకర, వెట్‌మిక్స్‌ను పోసి పటిష్ఠం చేశారు. తరువాత తారుతో తీర్చిదిద్దారు. ప్రధానికి హై సెక్యూరిటీ నేపథ్యంలో నిరంతరం మెటల్ డిటెక్టర్ బృందాలు, డాగ్ స్క్వాడ్ బృందాలు అక్కడ తనిఖీలు కొనసాగిస్తూనే ఉన్నాయి. అనుమానం వచ్చిన చోట తవ్వకాలు జరిపించి ఇనుము, తదితర గుర్తించిన లోహపు ముక్కలు తొలగిస్తున్నారు. తిరిగి అక్కడ మరమ్మతులు చేయిస్తున్నారు. హెలిప్యాడ్ల సముదాయం, పరిసరాలను నిరంతరం గమనించేలా రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ వద్ద భద్రతా బలగాలు మోహరించి నిఘా కొనసాగిస్తున్నాయి. తరచూ మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు హెలిప్యాడ్ల సముదాయాన్ని సందర్శిస్తున్నారు. అక్కడ ఏర్పాట్లు, భద్రతా చర్యలు సమీక్షిస్తున్నారు. తగు ఆదేశాలిస్తున్నారు. -
గ్రీన్ హెలిప్యాడ్
వర్గల్: భారత ప్రధాని పర్యటన కోసం వర్గల్ మండలం నెంటూరు వద్ద హెలిప్యాడ్లు హరిత శోభను సంతరించుకుంటున్నాయి. ఆకాశంలో నుంచి కిందికి చూడగానే హెలిప్యాడ్లు పచ్చదనంతో ఆకట్టుకునేలా ఉద్యానవన శాఖ ల్యాండ్ స్కేపింగ్ పనులు చేపడుతున్నది. ‘ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్’ అన్నట్లు ప్రధాని తొలి చూపులోనే మనసు దోచుకునేలా హెలిప్యాడ్ల చుట్టూ రెండు మీటర్ల మేర ఆకుపచ్చని కార్పెట్ గ్రాస్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనుల్లో ఎలాంటి లోపం లేకుండా ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సురేష్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం వరకు హెలిప్యాడ్ల చుట్టూ కార్పెట్ గ్రాస్ ఏర్పాటు పూర్తవుతుందని ఏడీ సురేష్ తెలిపారు.