హెలీప్యాడ్‌ల వద్ద మూడో నేత్రం
నిరంతర నిఘాలో భద్రతా దళాలు
డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు
వర్గల్: ప్రధాని రాక సందర్భంగా మండలంలోని నెంటూరు శివారులోని హెలిప్యాడ్ వద్ద నిఘా నేత్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధాని కోసం ఆర్‌అండ్‌బీ అధికారుల పర్యవేక్షణలో మూడు హెలిప్యాడ్‌లు నిర్మించారు. విశాలమైన అంతర్గత రోడ్లు నిర్మించారు. మొదట మట్టిని, ఆ తరువాత కంకర, వెట్‌మిక్స్‌ను పోసి పటిష్ఠం చేశారు. తరువాత తారుతో తీర్చిదిద్దారు. ప్రధానికి హై సెక్యూరిటీ నేపథ్యంలో నిరంతరం మెటల్ డిటెక్టర్ బృందాలు, డాగ్ స్క్వాడ్ బృందాలు అక్కడ తనిఖీలు కొనసాగిస్తూనే ఉన్నాయి. అనుమానం వచ్చిన చోట తవ్వకాలు జరిపించి ఇనుము, తదితర గుర్తించిన లోహపు ముక్కలు తొలగిస్తున్నారు.
తిరిగి అక్కడ మరమ్మతులు చేయిస్తున్నారు. హెలిప్యాడ్‌ల సముదాయం, పరిసరాలను నిరంతరం గమనించేలా రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ వద్ద భద్రతా బలగాలు మోహరించి నిఘా కొనసాగిస్తున్నాయి. తరచూ మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు హెలిప్యాడ్‌ల సముదాయాన్ని సందర్శిస్తున్నారు. అక్కడ ఏర్పాట్లు, భద్రతా చర్యలు సమీక్షిస్తున్నారు. తగు ఆదేశాలిస్తున్నారు.