Helipad
-
ఉత్తరాఖండ్‌కు మూడు ఎయిర్ పోర్టులు, 21 హెలీప్యాడ్లు!
ఉత్తరాఖండ్ ఎయిర్ కనెక్టివిటీ కొత్త రెక్కలను సంతరించుకోబోతోంది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉత్తరాఖండ్‌లోని విమానాశ్రయాల సంఖ్యను ఒకటి నుండి మూడుకు, హెలిప్యాడ్ల సంఖ్యను 10 నుండి 21కి పెంచే ప్రణాళికపై కసరత్తు చేస్తోంది. డెహ్రాడూన్ ఎయిర్‌పోర్టు విస్తరణ, మొదటి దశ కింద హెలిపోర్టుల నిర్వహణ పనులు పూర్తయ్యాయి. రెండో దశలో ఎయిర్‌పోర్టులు, హెలిపోర్టుల పనులు త్వరలో పూర్తి కానున్నాయి. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో గల ఏకైక జాలీ గ్రాంట్ విమానాశ్రయం నుంచి 2024లో రోజువారీ విమాన సర్వీసులను ప్రారంభించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. గతంలో డెహ్రాడూన్ విమానాశ్రయానికి దేశంలోని మూడు నగరాలతో మాత్రమే కనెక్టివిటీ ఉండేది. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ దాదాపు నాలుగున్నర రెట్లు పెరిగింది. ప్రస్తుతం డెహ్రాడూన్ విమానాశ్రయ ఎయిర్ కనెక్టివిటీ దేశంలోని మూడు నగరాల నుండి 13 నగరాలకు చేరింది. 2014 వరకు ఈ విమానాశ్రయం నుండి 40 విమానాలు మాత్రమే నడిచేవి. 2024 చివరి నాటికి ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే విమానాల సంఖ్య 200కి పెరగనుంది. గత పదేళ్లలో డెహ్రాడూన్ విమానాశ్రయ కార్యకలాపాల్లో దాదాపు 130 శాతం పెరుగుదల నమోదైంది. త్వరలో ఉత్తరాఖండ్‌లో నూతన హెలిపోర్ట్లతో పాటు నూతన విమానాశ్రయాలు రానున్నాయి. డెహ్రాడూన్‌తో పాటు ఉత్తరాఖండ్‌లోని పంత్నగర్, పితోర్‌గఢ్‌లలో విమానాశ్రయాల ఏర్పాటుకు విమానయాన మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తున్నదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. మరోవైపు ఉత్తరాఖండ్‌లో ఏడు హెలిపోర్ట్‌లు ప్రారంభమయ్యాయి. వీటిలో అల్మోరా, చిన్యాలిసౌర్, గౌచర్, సహస్త్రధార, న్యూ తెహ్రీ, శ్రీనగర్, హల్ద్వానీ మొదలైనవి ఉన్నాయి. ధార్చుల, హరిద్వార్, జోషిమా, ముస్సోరీ, నైనిటాల్, రామ్‌నగర్‌లో కొత్త హెలిపోర్ట్‌ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో ఒక విమానాశ్రయం, ఏడు హెలిపోర్టులను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. బాగేశ్వర్, చంపావత్, లాన్స్‌డౌన్, మున్సియరి, త్రియుగినారాయణ్‌లలో ఐదు కొత్త హెలిపోర్ట్‌లను ప్రారంభించే ప్రణాళిక సిద్ధంగా ఉంది. మరికొద్ది రోజుల్లో ఉత్తరాఖండ్‌లో విమానాశ్రయాల సంఖ్య మూడుకు, హెలిపోర్టుల సంఖ్య 21కి చేరనుంది. -
హెలిప్యాడ్‌ను అలానే ఎందుకు రూపొందిస్తారో తెలుసా?
ఆకాశంలో ఎగిరే విమానాలను, హెలికాప్టర్లను మనమంతా చూసేవుంటాం. విమానాలు ల్యాండ్ అయ్యేందుకు రన్‌వే అవసరం అవుతుంది. హెలికాప్టర్లు ఎక్కడైనా ల్యాండ్ అవుతాయి.అయితే హెలికాప్టర్ ఆగేందుకు నిర్దేశిత ప్రదేశంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.ఇది వృత్తాకారంలో కనిపిస్తుంది. దీనిలోపలనే హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. అయితే ఈ వృత్తాకారం లోపల ఇంగ్లీషు బాషలోని హెచ్ అక్షరం రాసివుంటుంది. ఇలా ఎందుకు రాస్తారో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోని అన్ని దేశాలలో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేప్రాంతంలో హెచ్ అని రాసివుంటుంది. హెలికాప్టర్లను వీవీఐపీలు వినియోగిస్తారనే సంగతి మనకు తెలిసిందే. హెలికాప్టర్ల వినియోగానికి సంబంధించి పలు దేశాల్లో ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేందుకు ఒక్కోసారి హెలిప్యాడ్లను తయారు చేస్తుంటారు. దీనిలో రూపొందించే హెచ్ ఆకారం హెలికాప్టర్ నడిపే పైలెట్‌కు ఎంతో ఉపయోగపడుతుంది. దీని కారణంగానే హెలికాప్టర్ ముందుభాగం, వెనుకభాగం ఎటువైపు ఉంచాలనేది పైలెట్‌కు తెలుస్తుంది. దీనిని తగిన రీతిలో నిలిపివుంచడం వలన హెలికాప్టర్లో ప్రయాణించేవారికి కూడా ఎంతో అనువుగా ఉంటుంది. సాధారణంగా వీవీఐపీ కేటగిరీలోకి వచ్చేవారు ఎంతో బిజీగా ఉంటారు. వీరి సమయం వృథాకాకుండా ఉండేందుకు కూడా హెలిప్యాడ్ రూపకల్పన ఉపకరిస్తుంది. చదవండి: ‘స్నేక్ వైన్’ అంటే ఏమిటి? దీనిని ఎలా తయారు చేస్తారో తెలిస్తే... -
సీఎం హెలిప్యాడ్ నిర్మాణం నిలిపివేత
కరీంనగర్ రూరల్: కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న సీఎం కేసీఆర్ నివాసగృహం ఉత్తర తెలంగాణ భవన్ ఎదుట చేపట్టనున్న హెలిప్యాడ్ నిర్మాణంపై ప్రభుత్వం వెనుకంజ వేసింది. ఈ మేరకు భూసేకరణ కార్యక్రమాన్ని వాయి దా వేస్తున్నట్లు మంగళవారం కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రకటించారు. ఉత్తర తెలంగాణ భవన్ ముందు జిల్లా అధికార యంత్రాంగం సీఎం రాకపోకల సౌకర్యార్థం హెలిప్యాడ్ నిర్మాణం చేపట్టేందుకు సర్వే నంబరు–232లోని 60 మంది రైతులకు చెందిన మొత్తం 5.14 ఎకరాల çస్థ్ధలాన్ని సేకరించేందుకు గతేడాది అక్టోబరులో నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టులో బాధితుల పిటిషన్ హెలిప్యాడ్ నిర్మాణం కోసం తమ భూములను భూసేకరణ చట్టానికి విరుద్ధంగా అధికారులు సేకరిస్తున్నారని పేర్కొంటూ బాధితులు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పి.ప్రతిమతో పాటు మరో నలుగురు ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సోమవారం విచారణ జరిపిన హైకోర్టు రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, రహదారులు, భవనాలశాఖ ముఖ్యకార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, కరీంనగర్ ఆర్డీవోకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశిస్తు విచారణకు వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది. -
అమిత్ షా ర్యాలీకి ఆటంకం
కోల్‌కతా : బీజేపీ చీఫ్ అమిత్ షా ఆదివారం నిర్వహించే ర్యాలీకి హాజరయ్యేందుకు మాల్ధా ఎయిర్‌పోర్ట్‌లోని హెలిప్యాడ్‌ను వాడుకునేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. విమానాశ్రయంలో హెలిప్యాడ్ ఉపయోగంలో లేదని, అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులతో తాత్కాలిక హెలిప్యాడ్‌ను ఉపయోగించడం సాధ్యం కాదని మాల్ధా జిల్లా యంత్రాగం స్పష్టం చేసింది. హెలిప్యాడ్ వాడుకొనేందుకు అనుమతి నిరాకరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను పార్టీ స్ధానిక విభాగానికి మాల్ధా అదనపు జిల్లా మేజిస్ర్టేట్ శుక్రవారం తెలియచేశారు. కాగా అమిత్ షా పర్యటన కోసం హెలిప్యాడ్‌కు బెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై బీజేపీ రాష్ట్ర శాఖ మండిపడింది. బీజేపీ నేతలు రాష్ట్రంలో ర్యాలీలు చేపట్టకుండా నిరోధించేందుకు తృణమూల్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని ఆరోపించింది. కాగా రథయాత్రల స్ధానంలో బెంగాల్ అంతటా ర్యాలీలు నిర్వహించేందుకు సుప్రీం కోర్టు అనుమతించిన క్రమంలో బీజేపీ మాల్ధాలో ర్యాలీకి సన్నాహాలు చేసుకుంది. అమిత్ షా విమానం దిగేందుకు వీలుగా మరో ప్రాంతంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. -
డోక్లాం : చైనా కొత్త కుట్ర
-
డోక్లాం : చైనా కొత్త కుట్ర
న్యూఢిల్లీ : భారత్‌ను దొంగ దెబ్బ కొట్టేందుకు చైనా రెడీ అవుతోంది. డోక్లాం వివాదంతో అంతర్జాతీయ స్థాయిలో అవమాన పడ్డ చైనా.. వివాదాస్పద ప్రాంతంలోనే గుట్టుచప్పుడు కాకుండా సైనిక స్థావరాన్ని నిర్మించింది. అత్యంత పకడ్బందీగా నిర్మించిన ఈ సైనిక స్థావరం ఆనవాళ్లను శాటిలైట్లు గుర్తించాయి. భూటాన్ భూభాగంలోని డోక్లాం ప్రాంతం తమదే అంటూ చైనా కొంతకాలంగా వాదిస్తోంది. తాజాగా డోక్లాం వివాదాస్పద ప్రాంతానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే సైనిక స్థావరంతోపాట, రహదారులను, హెలీపాడ్, కందకాలను, గన్ పాయింట్లను చైనా నిర్మించింది. ఈ రహదారిలో పదుల సంఖ్యలో ప్రయాణిస్తున్న ఆయుధ వాహనాలను శాటిలైట్ గుర్తించింది. ఇదిలావుండగా వివాదాస్పద భూభాగానికి కేవలం 400 మీటర్ల దూరంలో డ్రాగన్ కంట్రీ.. పలు సొరంగాలను, సైనికులకు బారక్స్‌ని నిర్మించినట్లు శాటిలైట్ ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. సిక్కింలోని డోక్లామ్ పోస్ట్‌కు కేవలం 81 మీటర్ల దూరంలో ఈ మిలటరీ కాంప్లెక్స్ ఉండడం గమనార్హం. -
మణిపూర్ సీఎంపై ఉగ్రవాదుల కాల్పులు
-
మణిపూర్ సీఎంపై ఉగ్రవాదుల కాల్పులు
ఇంఫాల్ : మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబీ సింగ్ సోమవారం తృటిలో ఉగ్రవాద దాడి నుంచి తప్పించుకున్నారు. ఎన్ఎస్సీఎన్ ఉగ్రవాదులు ఉక్రుల్ హెలిప్యాడ్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై కాల్పులు జరిపారు. రాజధాని ఇంఫాల్ కు 84 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఛింగాయ్ జిల్లాలో ఓ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రిపై ఉగ్రవాదులు తెగబడ్డారు. అయితే ఆ కాల్పుల నుంచి ఇబోబీ సింగ్ సురక్షితంగా బయటపడ్డారు. దాంతో సీఎం అక్కడనుంచి హుటాహుటీన తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎర్రపహాడ్‌కు 14న సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 14న జిల్లాకు రానున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలం ఎర్రపహాడుకు వస్తున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్ రెడ్డి తల్లి రాజమ్మ వృతి చెందిన విషయం తెలిసిందే. మాతృవియోగంతో ఉన్న ఎమ్మెల్యే రవీందర్ రెడ్డిని పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ ఆదివారం ఎర్రపహాడ్‌కు రానున్నారని తెలిసింది. హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్ ద్వారా ఆయన జిల్లాకు వస్తారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎర్రపహాడ్ను సందర్శించి రవీందర్‌రెడ్డిని పరామర్శించిన కలెక్టర్ డాక్టర్ యోగితారాణా.. హెలిప్యాడ్ ఏర్పాట్లపై స్థానిక అధికారులతో చర్చించారు. హెలికాప్టర్ ద్వారా సీఎం జిల్లాకు రానున్న నేపథ్యంలో ఎర్రపహాడ్–మోతె రోడ్డున రవీందర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రం వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కామారెడ్డి డీఎస్పీ భాస్కర్ బుధవారం స్థల పరిశీలన చేశారు. -
హెలీప్యాడ్ల వద్ద మూడో నేత్రం
నిరంతర నిఘాలో భద్రతా దళాలు డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు వర్గల్: ప్రధాని రాక సందర్భంగా మండలంలోని నెంటూరు శివారులోని హెలిప్యాడ్ వద్ద నిఘా నేత్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధాని కోసం ఆర్అండ్బీ అధికారుల పర్యవేక్షణలో మూడు హెలిప్యాడ్లు నిర్మించారు. విశాలమైన అంతర్గత రోడ్లు నిర్మించారు. మొదట మట్టిని, ఆ తరువాత కంకర, వెట్‌మిక్స్‌ను పోసి పటిష్ఠం చేశారు. తరువాత తారుతో తీర్చిదిద్దారు. ప్రధానికి హై సెక్యూరిటీ నేపథ్యంలో నిరంతరం మెటల్ డిటెక్టర్ బృందాలు, డాగ్ స్క్వాడ్ బృందాలు అక్కడ తనిఖీలు కొనసాగిస్తూనే ఉన్నాయి. అనుమానం వచ్చిన చోట తవ్వకాలు జరిపించి ఇనుము, తదితర గుర్తించిన లోహపు ముక్కలు తొలగిస్తున్నారు. తిరిగి అక్కడ మరమ్మతులు చేయిస్తున్నారు. హెలిప్యాడ్ల సముదాయం, పరిసరాలను నిరంతరం గమనించేలా రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ వద్ద భద్రతా బలగాలు మోహరించి నిఘా కొనసాగిస్తున్నాయి. తరచూ మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు హెలిప్యాడ్ల సముదాయాన్ని సందర్శిస్తున్నారు. అక్కడ ఏర్పాట్లు, భద్రతా చర్యలు సమీక్షిస్తున్నారు. తగు ఆదేశాలిస్తున్నారు. -
భద్రాచలంలోని హెలిపాడ్ వద్ద భారీ బందోబస్తు
ఖమ్మం: మావోయిస్టుల కార్యకలాపాల పై సమీక్ష నిర్వహించడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన పోలీస్ ఉన్నతాధికారులు ఆదివారం భద్రచాలంలో సమావేశం కానున్నారు. అందులోభాగంగా భద్రాచలంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా నేడు తెలంగాణ బంద్‌కు మావోయిస్టులు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. -
ప్రతిజ్ఞ చేయిస్తూనే ఇదేమిటి బాబూగారు?
హైదరాబాద్: ప్రస్తుతం నెలకొన్న తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ నీటిని పొదుపు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. విచిత్రమేమిటంటే ఆయన పర్యటనలోనే నీటిని పొదుపు చేయాలన్న ప్రతిజ్ఞకు నిలువునా తూట్లు పడ్డాయి. దేశంలోనే అత్యంత కరువు పీడిత ప్రాతమైన అనంతపురం జిల్లాలో పర్యటన సందర్భంగా గురువారం ప్రజలతో సీఎం చంద్రబాబు నీటిపొదుపుపై ప్రతిజ్ఞ చేయించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రతిజ్ఞను సీఎం స్వయంగా పాటించి ఉంటే ఎంతోకొంత ప్రాధాన్యం చేకూరి ఉండేదని స్థానికులు అంటున్నారు. సీఎం చంద్రబాబు, ఇతర వీఐపీల చాపర్లు ల్యాండ్ అయ్యేందుకు ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ కోసం వేలలీటర్ల నీటిని వృథా చేశారు. సీఎం, ఇతర ప్రముఖుల హెలికాప్టర్లు ల్యాండైన సందర్భంగా దుమ్ము లేవకుండా ఉండేందుకు ఏకంగా హెలిప్యాడ్ ప్రాంతంలో 5వేల లీటర్ల పరిమాణం గల దాదాపు నాలుగు ట్యాంకర్ల నీటిని వృథా చేశారు. రాజస్థాన్ తర్వాత దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం అనంతపురం జిల్లా. ప్రస్తుతం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న ఈ జిల్లాను కరువు జిల్లాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కూడా. ఈ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా భారీగా నీటిని వృథా చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రలోని మరాట్వాడ ప్రాంతంలో ఓ మంత్రి పర్యటన సందర్భంగా రోడ్లపై నీటి వృథా చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇదే తరహా వివాదంలో తన పర్యటన సందర్భంగా నీటిని వృథాగా చేసినందుకు బాధ్యులైన అధికారులపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య చర్యకు ఆదేశించిన విషయమూ విదితమే. -
ఈ మంత్రిని ఏమనాలి?
మంచినీళ్ల కోసం జనం 'అలో లక్ష్మణా..' అని అరుస్తోంటే, మరో పక్క అవే మంచినీళ్లను మట్టిపాలుచేసిన మంత్రిగారి ఉదంతమిది. గడిచిన 100 ఏళ్లలో మహారాష్ట్ర కనీవినీ ఎరుగని రీతిలో కరువు ఎదుర్కొంటున్నది. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలన్నీ బీటలు వేడటంతో పక్కరాష్ట్రం నుంచి రైళ్ల ద్వారా మంచినీళ్లు తెప్పించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజష్థాన్ లోని మిరాజ్ డ్యామ్ నుంచి మహారాష్ట్రలోని కరువు ప్రభావిత లాతూర్ సహా ఇతర జిల్లాలకు రైళ్ల ద్వారా ప్రతిరోజు 5లక్షల లీటర్ల నీటిని సరఫరాచేస్తున్నారు. రైళ్ల రాకపోకలు, నీటి పంపకం తదితర వ్యవహారాలను ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఏక్ నాథ్ ఖడ్నే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత నాలుగు రోజులుగా లాతూర్ లోనే మకాం వేసిన ఆయన శుక్రవారం ఓ కార్యక్రమానికి వెళ్లాల్సి వచ్చింది. లాతూర్ నుంచి 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న భేల్ కుండ్ గ్రామంలో జరిగే కార్యక్రమానికి రోడ్డు మార్గంలో కాకుండా హెలికాప్టర్ ద్వారా వెళ్లాలని మంత్రి గారు నిర్ణయించుకున్నారు. దీంతో చకచకా ఏర్పాట్లు చేశారు అధికారులు. హెలికాప్టర్ టేకాఫ్ అయ్యేచోట, ట్యాండ్ అవ్వాల్సిన చోట దుమ్ము లేవకుండా నీళ్లు చల్లించారు. ఇందుకోసం దాదాపు 10వేల లీటర్ల నీటిని మట్టిపై చల్లారు. అసలే బంగారమైన నీటిని మంత్రిగారు ఇలా వృథాచేయటాన్ని స్థానికులు సహా ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. 'ఏక్ నాథ్ వెళ్లాలనుకున్న ఊరు లాతూర్ నుంచి తిప్పికొడితే 40 కిటోమీటర్ల దూరం ఉండదు. ఆ మాత్రం దూరానికే ఆయన హెలికాప్టర్ వాడటం, ట్యాంకుల కొద్దీ నీళ్లను వృథాచేయటం దారుణం'అని కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సచిన్ సావంత్ అన్నారు. చేసిన పనికి ప్రజలకు క్షమాపణలు చెప్పి, మరోసారి అలా జరగదని మంత్రి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
సీఎం కార్యాలయంపై హెలీప్యాడ్ ప్రతిపాదన ఉత్తిదే
విమర్శలతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం విజయవాడ: తుళ్లూరు మండలం వెలగపూడి వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంపై హెలీప్యాడ్ నిర్మాణ ప్రతిపాదన లేదని సీఆర్డీఏ కమిషన్ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యాలయంపైనే హెలీప్యాడ్ ఏర్పాటుచేసుకోవడం ద్వారా అక్కడ దిగి నేరుగా ఛాంబర్లోకి ముఖ్యమంత్రి వెళ్లేలా భవనానికి డిజైన్ చేసినట్లు ప్రచారం జరిగింది. దేశంలో ఇప్పటివరకూ ఏ ముఖ్యమంత్రికి ఇలాంటి సౌకర్యం లేదని, హెలీప్యాడ్ నిర్మిస్తే కార్యాలయంపైనే దాన్ని ఏర్పాటుచేసుకున్న మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలుస్తారని సీఆర్డీఏ వర్గాలు తెలిపాయి. కానీ దీనిపై విమర్శలు రావడంతో ప్రభుత్వం ప్లేటు ఫిరాయించింది. లోటు బడ్జెట్, ఉద్యోగులకు జీతాలివ్వలేమని ఒకవైపు చెబుతూ మరోవైపు ఇలాంటి విలాసాలేంటనే వాదన మొదలైంది. అసలు తాత్కాలిక సచివాలయమే అనవసరమని, డబ్బు వృధా చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న తరుణంలో దానిపై ఏకంగా హెలీప్యాడ్ నిర్మిస్తే ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం భావించనట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం నుంచి సైతం అభ్యంతరాలు వస్తాయనే ఆలోచనతో దీన్ని విరమించుకున్నారు. అయితే అధికారికంగా చెప్పలేదు కాబట్టి ఈ ప్రతిపాదనే లేదని సీఆర్డీఏ కమిషనర్‌తో చెప్పించినట్లు తెలిసింది. -
భీమ్ ఆశయాలు నెరవేర్చుతాం..
కెరమెరి : కొమురం భీమ్ ఆశయాలను తప్పకుండా నెరవేర్చుతామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం మండలంలోని జోడేఘాట్‌లో భీమ్ వర్ధంతి సభా ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్ స్థలాన్ని చూశారు. వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేసే స్థలం, మ్యూజియం, భీమ్ విగ్రహం, బొటానికల్ పార్కు, భీమ్ స్మారక చిహ్నం, తదితరాలను పరిశీలించారు. మెదటిసారిగా సీఎం కేసీఆర్ వస్తున్నారని.. ఎలాంటి ఆటుపోట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో నాయకులు వచ్చి పోయినా భీమ్ ఆశయాలు నెరవేరలేదన్నారు. ఆదివాసీల బాధలు తెలుసుకునేందుకు, వివిధ రకాల సంక్షేమ ఫలాలు అందించేందుకు సీఎం కేసీఆర్ వస్తున్నారని తెలిపారు. దైవసన్నిధి అయిన భీమ్ వర్ధంతికి రావడం అందరి అదృష్టమన్నారు. ఈ సందర్భంగా హట్టి బేస్ క్యాంప్‌లో భీమ్ వర్ధంతి, గిరిజన దర్బార్ పోస్టర్ విడుదల చేశారు. ఎంపీ నగేష్ మాట్లాడుతూ.. విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి తదితర రంగాలతోపాటు అన్నింటా ఆదివాసీలు వెనుకబడి ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌తోనే అందరి అభివృద్ధి సాధ్యమన్నారు. సీఎం కోసం భారీ పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ గజరావు భూపాల్ తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, ఇంద్రకరణ్‌రెడ్డి, రాథోడ్ బాపూరావ్, డీఎస్పీ సురేశ్‌బాబు, మంచిర్యాల, ఆదిలాబాద్, ఉట్నూర్ ఆర్డీవోలు ఆయేశా నమ్రతా, సుధాకర్‌రెడ్డి, రామచంద్రయ్య తదితర శాఖలకు చెందిన అధికారులున్నారు. -
శాశ్వత హెలిప్యాడ్ నిర్మించండి..
జోడేఘాట్‌లో శాశ్వత హెలిప్యాడ్ నిర్మించాలని సీఎం పేషి నుంచి వచ్చిన ప్రభుత్వ సలహాదారు రామ్‌లక్ష్మణ్ జిల్లా అధికారులకు సూచించారు. ఈనెల 8న భీమ్ వర్ధంతి నేపథ్యంలో సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా ఆయన శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. కెరమెరి : జోడేఘాట్‌లో శాశ్వత హెలిప్యాడ్ నిర్మించాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ప్రభుత్వ సలహాదారు రామ్‌లక్ష్మణ్ ఆదేశించారు. కెరమెరి మండలం జోడేఘాట్‌ను ఆయన శనివారం సందర్శించారు. ఈ నెల 8న జరిగే కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా నిర్వహించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సభా ఏర్పాట్లను పరిశీలించారు. మరో రెండు రోజుల్లో హెలిప్యాడ్ స్థలం తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మ్యూజియం ఏర్పాటుకు నిర్మిస్తున్న స్టాండ్‌ను పరిశీలించారు. గుట్టపైకి మెట్లు తయారు చేస్తామని, దాని పైభాగంలో 2, 3 ఎకరాల్లో మ్యూజియం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఆయనకు వివరించారు. అక్కడి నుంచి సీఎం సభా స్థలాన్ని పరిశీలించారు. ప్రజలు కనిపించేలా ఎత్తులో నిర్మించాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌లోని కొమురం భీమ్ విగ్రహంలాగే నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేస్తున్న స్టాండ్‌ను పరిశీలించారు. భీమ్ విగ్రహాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాలన్నారు. 20 వేల మంది కంటే ఎక్కువగా ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో సభ కోసం అధిక స్థలం తీసుకోవాలని చెప్పారు. ప్రాంగణంలో పచ్చని కార్పెట్ పర్చాలన్నారు. 200 ఎకరాల్లో పర్యాటక కేంద్రం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో స్థలం ఎంపిక చేశారా అని అధికారులను ప్రశ్నించారు. జోడేఘాట్ వాసుల్లో కుటుంబంలో ఒకరికి ఉద్యోగావకాశం కల్పించే ఆలోచనలో సీఎం ఉన్నారని తెలిపారు. సభకు వచ్చే ప్రజలకు తాగునీరు, భోజన వసతి కల్పించనున్నట్లు చెప్పారు. ఆశ్రమ పాఠశాలకు ప్రహరీ మంజూరు చేయాలని ఐటీడీఏ ఇన్చార్జి ప్రాజెక్టు అధికారి ప్రశాంత్ పాటిల్‌ను ఆదేశించారు. రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. జోడేఘాట్‌ను అన్ని హంగులతో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సందర్భంగా కాగజ్‌నగర్ డీఎస్పీ సురేశ్ ముఖ్యమంత్రి సభ కోసం చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. మార్గమధ్యంలో పాట్నాపూర్ గ్రామంలో కలిసిన ఎస్పీతో మాట్లాడారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి.. గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఊట్నూర్లోనే ఏర్పాటు చేయాలని గిరిజన నాయకులు మర్సుకోల తిరుపతి, లక్కేరావు, బొంత ఆశారెడ్డి, జోడేఘాట్‌లోనే ఏర్పాటు చేయాలని కొమురం భీమ్ వర్ధంతి నిర్వహణ కమిటీ చైర్మన్ కోవ దేవరావు, ఆత్రం లక్ష్మణ్ ప్రభుత్వ సలహాదారు రామ్లక్ష్మణ్ను కోరారు. స్పందించిన ఆయన యూనివర్సిటీ ఆదిలాబాద్ జిల్లాకు మంజూరైందని, ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి చేతిలో ఉందని చెప్పారు. తాము సీఎంను కలిసి మెమోంటో ఇచ్చే అవకాశం కల్పించాలని కోరగా ఐదుగురికి అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు. ఆర్డీవో రామచంద్రయ్య, ఏపీవో భీమ్,తహశీల్దార్ సిడాం దత్తు, ఎంపీడీవో సాజిత్అలీ, ఏటీడబ్ల్యువో అంబాజీ, నాయకులు యాదోరావు, తిరుపతి, మహెశ్, ఎస్సై అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏర్పాట్లు చకచకా
జడ్చర్ల: ఈనెల 18న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాలమూరుకు తొలిసారిగా రానున్నారని జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందిన నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. అందులో భాగంగానే ఆదివారం సాయంత్రం జడ్చర్ల మండలంలోని పోలేపల్లి సెజ్‌లో కలెక్టర్ జీడీ ప్రియదర్శిని పర్యటించారు. మొదటగా అరబిందో ఫార్మా కంపెనీలో సీఎం హెలిక్యాప్టర్ దిగేందుకు వీలుగా గతంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. అయితే ఇక్కడ గతంలో ఉన్న పరిస్థితులు లేవని, సీఎం భద్రతాసిబ్బంది హెలిప్యాడ్ స్థలాన్ని ఆక్షేపించే అవకాశం ఉందని జిల్లా ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. దీంతో మరోచోట హెలిప్యాడ్‌ను ఏర్పాటుచేయాలని భావించి.. అక్కడినుండి బయలుదేరి సెజ్ ప్రధానరహదారి పక్కన ఖాళీస్థలాన్ని పరిశీలించారు. అయితే ఇక్కడ విద్యుత్‌తీగలు అడ్డంకిగా ఉన్నాయని, సాంకేతిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని విద్యుత్‌శాఖ అధికారులు వివరించారు. దీంతో పోలేపల్లి గ్రామసమీపంలో నిర్వాసితులకు కేటాయించిన ఇంటి స్థలాల పక్కనే ఉన్న ఖాళీస్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ హెలిప్యాడ్‌కు స్థలం అనుకూలంగా ఉందని అధికారులు క లెక్టర్‌కు వివరించారు. దీంతో చివరికి ఇక్కడే హెలిప్యాడ్ స్థలాన్ని ఖరారుచేశారు. సీఎం పరిశీలించే అంశాలివే సెజ్ నిర్వాసితులకు ఇంటిపట్టాలను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఇప్పించాలని జిల్లా ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సెజ్‌లో నిర్మించిన 132/33 కేవీ విద్యుత్ సబ్ష్టేషన్ను సీఎం ప్రారంభించే ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. సబ్‌స్టేషన్ ఆవరణలో ప్రారంభోత్సవానికి తూర్పు వైపునకు శిలాఫలకాన్ని ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి సెజ్‌ను పూర్తిస్థాయిలో పరిశీలించే అవకాాశం ఉందని, పరిశ్రమలను కూడా సీఎం సందర్శించే అవకాశం ఉందని కలెక్టర్ అధికారులతో చర్చించారు. మొత్తం ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్ని కొనసాగుతున్నాయి.. అందులో ఏయే పరిశ్రమలు ఉన్నాయన్న వివరాలను తమకు తక్షణమే అందజేయాలని టీఎస్ఐఐసీ అధికారులను కలెక్టర్ కోరారు. ఇంకా ఖరారు కాలేదు: కలెక్టర్ జిల్లాలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పర్యటన ఇంకా ఖరారు కాలేదని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని వెల్లడించారు. ఆదివారం ఆమె ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడు తూ.. సీఎం పర్యటనకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను పరిశీలించినట్లు చెప్పారు. పర్యటనపై ఇంకా స్పష్టత రాలేదని కలెక్టర్ తెలిపారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఆర్డీఓ హన్మంత్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఎస్ఈ సదాశివరెడ్డి, డీఈ నర్సింహారెడ్డి, టీఎస్ఐఐసీ మేనేజర్ సూరిబాబు, డీఎస్పీ కృష్ణమూర్తి, తహశీల్దార్ జగదీశ్వర్‌రెడ్డి, ఆర్అండ్బీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. కొజెంట్ కంపెనీని సందర్శించిన కలెక్టర్ అడ్డాకుల : మండంలోని వేముల శివారులో ఉన్న కొజెంట్ కంపెనీని ఆదివారం సాయంత్రం కలెక్టర్ ప్రియదర్శిని సందర్శించారు. కొజెంట్ కంపెనీలో నూతనంగా ఏర్పాటుచేసే ఓ విభాగాన్ని ఈనెల 18న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కంపెనీని సందర్శించి ఇక్కడి ప్రతినిధులతో మా ట్లాడారు. ఆమె వెంట ఆర్డీఓ హన్మంత్‌రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ విజయ్‌కుమార్, అడ్డాకుల తహశీల్దార్ జె.రాంకోటి ఉన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే సందర్శన ఎంపీ ఏపీ.జితేందర్‌రెడ్డి, దేవరకద్ర శాసనసభ్యుడు ఆల వెంకటేశ్వర్‌రెడ్డిలు కొజెంట్ కంపెనీని ఆదివారం రాత్రి సందర్శించారు. కంపెనీ ప్రతినిధులతో సమవేశమై సీఎం రాకకు సంబంధించిన అంశాలపై చర్చించారు. హెలిప్యాడ్‌తో పాటు ప్రారంభ కార్యక్రమం, సమావేశంపై పలు సూచనలు చేశారు. -
అత్యవసర సాయం కోసం హెలిప్యాడ్లు
సాక్షి, ముంబై: అత్యవసర సమయంలో సాయం అందించేందుకు ముంబైతోపాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో హెలిప్యాడ్లు నిర్మించే ప్రతిపాదనల్లో కదలికవచ్చింది. హెలిప్యాడ్ల నిర్మాణం కోసం నగరాభివృద్ధిశాఖ రూపొందించిన ఈ ప్రతిపాదనలు ప్రస్తుతానికి అగ్నిమాపక శాఖకు చేరాయి. 2005 జూలై 26న నగరంలో కురిసిన భారీ వర్షానికి వరదలు వచ్చి ఆస్తి నష్టంతోపాటు 250 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి అత్యవసర సమయంలో దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాలలో సకాలంలో సాయం అందలేకపోయింది. ఇటువంటి పరిస్థితి మళ్లీ తలెత్తితే తీసుకోవల్సిన జాగ్రత్తలు, మార్గదర్శకాలు సూచించేందుకు అప్పట్లో ప్రభుత్వం చితలే కమిటీని నియమించింది. ఈ కమిటి కొన్ని సూచనలు జారీచేసింది. ఆపద సమయాల్లో హెలిక్యాప్టర్ల ద్వారా సేవలు అందించే సదుపాయం ఉంటే ప్రాణనష్టం తప్పేదని కమిటీ సూచించింది. దీంతో రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో హెలిప్యాడ్డు నిర్మించాలనే ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. అయితే ఎక్కడ? ఎంత ఎత్తులో నిర్మించాలనే ప్రతిపాదనలను నగరాభివృద్ధిశాఖ రూపొందించింది. వీటిని అగ్నిమాపక శాఖకు పంపగా హెలిప్యాడ్ల ఎత్తులో మార్పులు అవసరమని అగ్నిమాపక శాఖ సలహాదారు మిలింద్ దేశ్‌ముఖ్ చెప్పారు. అయితే తాము రూపొందించిన ప్రతిపాదనల్లో.. ముంబై తరహా ప్రధాన నగరాలలో 150-200 మీటర్లకుపైగా ఎత్తున్న భవనాలపై హెలిప్యాడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని నగరాభివృద్ధిశాఖ భావించింది. దీనిపై అగ్నిమాపకశాఖ పక్షం రోజుల్లో తుది నిర్ణయం వెల్లడించనుంది. -
2న నల్సార్‌కు ప్రణబ్
శామీర్‌పేట్ రూరల్: వచ్చే నెల 2న నల్సార్ లా యూనివర్సిటీస్నాతకోత్సవానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో హెలీప్యాడ్ ఏర్పాటుకు మండల కేంద్రంలోని మినీస్టేడియంను కలెక్టర్ శ్రీధర్ శనివారం పరిశీలించారు. మూడు హెలీప్యాడ్ లు అవసరమవుతాయని భావించి ఆ మేరకు వాటిని మినీస్టేడియంలో ఏర్పాటుకు అధికారులతో చర్చించారు. అనంతరం అక్కడినుంచి నల్సా ర్ లా యునివర్సిటీకి వెళ్లి స్నాతకోత్సవం వివరాలను తెలుసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ ఆశారాణి, ఈఈ ఆనంద్‌కుమార్, తహసీల్దార్ రాజేశ్వర్, డీసీపీ శ్రీనివాస్, సీఐ బాబ్జీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
హెలిపాడ్ ఏర్పాటుకు స్థలం పరిశీలన: రేపు సీఎం రాక
గుడ్లూరు, న్యూస్‌లైన్: మండలంలోని ఐదో నంబరు జాతీయ రహదారి పక్కన ఉన్న చేవూరు చెరువులో హెలిపాడ్ ఏర్పాటుకు స్థలాన్ని కలెక్టర్ విజయ్‌కుమార్, ఎస్పీ ప్రమోద్‌కుమార్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 18వ తేదీ రామదూత ఆశ్రమంలో జరిగే వేణుదత్త దాంపత్యవ్రత దీక్ష విరమణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వస్తారనే సమాచారంతో ఆశ్రమంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్లో వస్తుండటంతో చేవూరు చెరువులో హెలిపాడ్ సిద్ధం చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించామన్నారు. ఎస్పీ ప్రమోద్‌కుమార్ మాట్లాడుతూ ఆశ్రమంలో స్టేజీ వద్ద, ఆశ్రమ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వీరి వెంట జిల్లా ఆర్అండ్బీ అధికారులు, ఆర్డీఓ బాపిరెడ్డి, డీఎస్పీ శంకర్, సీఐ మధుబాబు, గుడ్లూరు, ఉలవవపాడు, కందుకూరు ఎస్సైలు హుస్సేన్‌బాషా, నసీఫ్బాషా, రమణయ్య ఉన్నారు. -
అధినేత్రి వచ్చింది... పొలం మాయమైంది
మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షురాలు వస్తున్నారు. అది హెలికాప్టర్లో... దిగడానికి అనువైన స్థలం లేదు . ఏం చేయాలి. కార్యకర్తలు బుర్రలు చించుకున్నారు. అంతే బంగారంలాంటి పొలాన్ని హెలిపాడ్ కోసం ఏర్పాటు చేయాలన్న ఆలోచనల కార్యకర్తల బుర్రలో చటుకున్న మెరుపులా మెరిసింది. అంతే అనుకున్నదే తడువుగా పొలాన్ని పార్టీ కార్యకర్తలు క్షణాల్లో హెలిపాడ్గా మర్చేశారు. ఆ తతంగమంతా ఉత్తరప్రదేశ్ బుదాయూ జిల్లాలోని కట్రా గ్రామంలో చోటు చేసుకుంది. అది కూడా బీఎస్పీ అధ్యక్షురాలు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారి మాయావతి కోసం. ఈ వారం మొదట్లో కట్రా గ్రామంలో వరుసకు అక్కాచెల్లిళ్లపై సామూహిక అత్యాచారం చేసి ఆపై వారిని మామిడి చెట్టుకు ఉరి వేశారు. ఆ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆ బాలికల కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు జాతీయనాయకులు ఇప్పటికే ఆ గ్రామానికి క్యూడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి ఆదివారం కట్రాలో బాధిత కుటుంబసభ్యులను ఓదార్చనున్నారు. అందుకోసం ఆమె హెలికాప్టర్లో కట్రా గ్రామానికి రానున్నారు. దాంతో బంగారం లాంటి పోలాన్ని హెలిపాడ్గా మార్చేశారు. అయితే శనివారం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బాధిత కుటుంబాలను పరామర్శించిన సంగతి తెలిసిందే.