జోడేఘాట్‌లో శాశ్వత హెలిప్యాడ్ నిర్మించాలని సీఎం పేషి నుంచి వచ్చిన ప్రభుత్వ సలహాదారు రామ్‌లక్ష్మణ్ జిల్లా అధికారులకు సూచించారు. ఈనెల 8న భీమ్ వర్ధంతి నేపథ్యంలో సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా ఆయన శనివారం ఏర్పాట్లను పరిశీలించారు.
కెరమెరి : జోడేఘాట్‌లో శాశ్వత హెలిప్యాడ్ నిర్మించాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ప్రభుత్వ సలహాదారు రామ్‌లక్ష్మణ్ ఆదేశించారు. కెరమెరి మండలం జోడేఘాట్‌ను ఆయన శనివారం సందర్శించారు. ఈ నెల 8న జరిగే కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా నిర్వహించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సభా ఏర్పాట్లను పరిశీలించారు. మరో రెండు రోజుల్లో హెలిప్యాడ్ స్థలం తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మ్యూజియం ఏర్పాటుకు నిర్మిస్తున్న స్టాండ్‌ను పరిశీలించారు. గుట్టపైకి మెట్లు తయారు చేస్తామని, దాని పైభాగంలో 2, 3 ఎకరాల్లో మ్యూజియం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఆయనకు వివరించారు. అక్కడి నుంచి సీఎం సభా స్థలాన్ని పరిశీలించారు.
ప్రజలు కనిపించేలా ఎత్తులో నిర్మించాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌లోని కొమురం భీమ్ విగ్రహంలాగే నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేస్తున్న స్టాండ్‌ను పరిశీలించారు. భీమ్ విగ్రహాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాలన్నారు. 20 వేల మంది కంటే ఎక్కువగా ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో సభ కోసం అధిక స్థలం తీసుకోవాలని చెప్పారు. ప్రాంగణంలో పచ్చని కార్పెట్ పర్చాలన్నారు. 200 ఎకరాల్లో పర్యాటక కేంద్రం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో స్థలం ఎంపిక చేశారా అని అధికారులను ప్రశ్నించారు. జోడేఘాట్ వాసుల్లో కుటుంబంలో ఒకరికి ఉద్యోగావకాశం కల్పించే ఆలోచనలో సీఎం ఉన్నారని తెలిపారు.
సభకు వచ్చే ప్రజలకు తాగునీరు, భోజన వసతి కల్పించనున్నట్లు చెప్పారు. ఆశ్రమ పాఠశాలకు ప్రహరీ మంజూరు చేయాలని ఐటీడీఏ ఇన్‌చార్జి ప్రాజెక్టు అధికారి ప్రశాంత్ పాటిల్‌ను ఆదేశించారు. రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. జోడేఘాట్‌ను అన్ని హంగులతో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సందర్భంగా కాగజ్‌నగర్ డీఎస్పీ సురేశ్ ముఖ్యమంత్రి సభ కోసం చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. మార్గమధ్యంలో పాట్నాపూర్ గ్రామంలో కలిసిన ఎస్పీతో మాట్లాడారు.
గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి..
గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఊట్నూర్‌లోనే ఏర్పాటు చేయాలని గిరిజన నాయకులు మర్సుకోల తిరుపతి, లక్కేరావు, బొంత ఆశారెడ్డి, జోడేఘాట్‌లోనే ఏర్పాటు చేయాలని కొమురం భీమ్ వర్ధంతి నిర్వహణ కమిటీ చైర్మన్ కోవ దేవరావు, ఆత్రం లక్ష్మణ్ ప్రభుత్వ సలహాదారు రామ్‌లక్ష్మణ్‌ను కోరారు. స్పందించిన ఆయన యూనివర్సిటీ ఆదిలాబాద్ జిల్లాకు మంజూరైందని, ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి చేతిలో ఉందని చెప్పారు. తాము సీఎంను కలిసి మెమోంటో ఇచ్చే అవకాశం కల్పించాలని కోరగా ఐదుగురికి అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు. ఆర్డీవో రామచంద్రయ్య, ఏపీవో భీమ్,తహశీల్దార్ సిడాం దత్తు, ఎంపీడీవో సాజిత్‌అలీ, ఏటీడబ్ల్యువో అంబాజీ, నాయకులు యాదోరావు, తిరుపతి, మహెశ్, ఎస్సై అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.
శాశ్వత హెలిప్యాడ్ నిర్మించండి..
Published Sun, Oct 5 2014 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM
Advertisement