Jode Ghat
-
Jodeghat Museum: జోడెన్‌ఘాట్ వీరభూమి
‘కుమ్రుం భీము గిరిజన సంగ్రహాలయం’ ఇది ట్రైబల్ మ్యూజియం. ఆదివాసీల జీవనశైలితోపాటు కుమ్రుం భీము జీవితాన్ని బొమ్మల్లో చూపించే ప్రయత్నం. కొండ అద్దంలో ఇముడుతుందేమో కానీ కుమ్రుం భీము పోరాటం, జీవితాశయ సాధనలను ప్రతిబింబించడానికి ఒక మ్యూజియం సరిపోదు, ఇలాంటి పది మ్యూజియాలు కావాలి. ఈ మ్యూజియం కుమ్రుంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా, కెరిమెర మండలం, జోడెన్‌ఘాట్ గ్రామంలో ఉంది. జోడెన్‌ఘాట్‌లో కుమ్రుం భీము సమాధి, సమాధి పక్కనే భీము చేత్తో తుపాకీ పట్టుకున్న విగ్రహం ఉన్నాయి. విగ్రహం ఎదురుగా మ్యూజియం ఉంది. ఇందులో ఆదివాసీలు ఉపయోగించే వస్తువులు, పాత్రలు, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ, ఆభరణాల అలంకరణ, పెళ్లి వేడుక చిత్రాలు, వేడుకలు, దేవతాపూజ సన్నివేశాలను కళ్లకు కట్టారు. వీటన్నింటిలో మేటిగా కుమ్రుం భీము జీవితావిష్కరణ కనిపిస్తుంది. మ్యూజియంలోకి ప్రవేశించగానే ఎడమ వైపు ఒక నాయకుడు, పది మంది అనుచరుల శిల్పాలు మన దృష్టిని ఆకర్షిస్తాయి. మధ్యలో ఉన్నది భీము. ద్వారానికి కుడివైపు భీము ఫొటో, విగ్రహంతోపాటు భీము భార్య సోమ్బాయి ఫొటో ఉంది. ఆ పక్కనే భీముతో కలిసి పని చేసిన కుమ్రుం సూరు ఫొటో, వేడమ రాము ఫొటో కూడా. భీము ఆచూకీ కోసం నిజాం మనుషులు గాలిస్తున్న సమయంలో ప్రమాదం ముంచుకు వస్తోందని హెచ్చరించడానికి రాము కాలికొం అనే వాద్యాన్ని ఊది భీమును, భీము బృందాన్ని అప్రమత్తం చేసేవాడు. ఈ మ్యూజియానికి పక్కనే ఉన్న ఆశ్రమ పాఠశాలలో భీము మనుమరాలు సోమ్బాయి ఉంది. ఆ స్కూల్లో చదువుకుంటూ కాదు, పాఠాలు చెప్తూ కూడా కాదు. స్కూలు పిల్లలకు భోజనం వండి పెట్టే ఉద్యోగంలో ఉందామె. భీము గౌరవార్థం సభలకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. జిల్లాకు పేరు కూడా పెట్టింది. కానీ అతడి వారసుల ఉపాధి గురించి పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. అంతేకాదు... భీముకు ఇస్తున్న గౌరవం అతడి పోరాటానికి ఇవ్వడం లేదని తెలిసినప్పుడు కూడా ఆశ్చర్యమేస్తుంది. భూమి కోసం పోరాటం కుమ్రుం భీము పుట్టింది ఆసిఫాబాద్ జిల్లా సంకేపల్లిలో. నిజాం పాలన కాలంలో రెవెన్యూ శాఖ వేధింపులు ఎక్కువగా ఉండేవి. పంటను ఐదు వంతులుగా విభజించి మూడు వంతులు ప్రభుత్వానికి కట్టాల్సి వచ్చేది. పండించిన వాళ్లకు రెండు వంతులు మాత్రమే మిగిలేది. ‘ఇదేం న్యాయం’ అని ప్రశ్నించిన భీము కుటుంబాన్ని స్థానిక పటేదారు వేధించడం మొదలుపెట్టాడు. భీము కుటుంబం ఊరు వదిలి సుర్దాపూర్కి పారిపోయింది. పటేదారు మనుషులు అక్కడికీ వచ్చారు. భీము ఆవేశం పట్టలేక పటేదారును కొట్టడంతో అతడు చనిపోతాడు. అప్పుడు భీము అడవుల్లోకి పారిపోతాడు. అడవుల నుంచి అస్సాంకు వెళ్లి ఆరేడేళ్ల పాటు అక్కడే ఉండి చదవడం, రాయడం నేర్చుకుని తిరిగి సుర్దాపూర్కొస్తాడు. అప్పటి నుంచి ఆదివాసీలకు సాగు చేసుకుంటున్న భూమి మీద సంపూర్ణ హక్కుల కోసం మరింత పటిష్టంగా పోరాడడం మొదలు పెట్టాడు. అనేక దరఖాస్తులు పెట్టాడు. నిజాంను స్వయంగా కలిసి విన్నవించుకోవడానికి పదిహేను మంది ఆదివాసీలతో హైదరాబాద్‌కు వెళ్లాడు. నిజామ్ అనుమతి ఇవ్వకపోవడంతో తన స్వస్థలంలోనే పోరాడాలని నిర్ణయించుకుని వెనక్కి వచ్చేశాడు భీము. అప్పటి నుంచి శిస్తు కట్టమని అడిగిన పటేదార్లను, రెవెన్యూ అధికారులను ధిక్కరించడమే ధ్యేయంగా పోరాటం తీవ్రతరం చేశాడు. వీరి స్థావరం కొండ మీద జోడెన్‌ఘాట్‌కు సమీపంలో ఉన్న భాభేఝరి. ఇక్కడి నుంచి ఉద్యమాన్ని నడిపాడు భీము. చుట్టు పక్కల 14 గ్రామాలను ప్రభావితం చేశాడు. భీము పోరాటాన్ని అణచివేయడానికి నిజాం సైన్యాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. రెండు వందల మందితో కూడిన భీము సైన్యం రెండు నెలల పాటు నిజాం సైన్యాన్ని విజయవంతంగా నిలువరించగలిగింది. భీము అనుచరుల్లో ‘కొద్దు’ అనే వ్యక్తి రోజూ కొండ కిందకు వెళ్లి భీము బృందానికి అవసరమైన ఆయుధాలు, ఆహారాన్ని కొండమీదకు తెచ్చేవాడు. అతడిని వేధించి, ప్రలోభ పెట్టిన నిజాం సేనలు ఎట్టకేలకు భీము కదలికలను పసిగట్టాయి. భీము ఉన్న కొండకు వెనుక వైపు మోవాడ్ ప్రాంతం నుంచి నిజాం సేనలు వచ్చి జోడెన్‌ఘాట్‌లో ఉన్న భీమును తుపాకీతో కాల్చి చంపేశాయి. భీము అక్కడికక్కడే తుది శ్వాస వదిలాడు. ఇది జరిగింది 1940, ఆశ్వయుజ పౌర్ణమి రోజున. అప్పటికి అతడి వయసు 39. నిజాం పాలకులు తుపాకీ తూటాతో భీము ఆశయానికి గండికొట్టారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా నిశ్శబ్దంగా అదే పంథాను కొనసాగిస్తున్నాయి. భీము ఏ ఆశయం కోసం పోరాడాడో ఆ ఆశయం ఇప్పటికీ నెరవేరనే లేదు. స్థానిక ఆదివాసీలు ఇప్పటికీ పోడు భూముల మీద హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. ఆదివాసీలు భీము జీవిత కథను వివరిస్తూ... మా చేతిలో తుపాకీ లేదు, కానీ తుపాకీ పట్టిన భీము స్ఫూర్తి మాలో ఉందని చెబుతున్నారు. ఈ పర్యటనలో తరాలకు కూడా తరగని స్ఫూర్తినిచ్చిన కుమ్రుం భీము జీవితం కళ్ల ముందు మెదలుతుంది. చదవండి: కురువపురం దీవి; కృష్ణమ్మ సిగలో చేమంతి అండర్‌వాటర్‌లో మ్యూజియం.. అదెక్కడంటే? -
ఎస్టీల నుంచి లంబాడీలను తొలగించాలి
సాక్షి, ఆసిఫాబాద్: ఎస్టీల జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని ఆదివాసీ ప్రజాప్రతినిధులు కుమురం భీం వర్ధంతి సందర్భంగా ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ఆదివాసీల న్యాయమైన పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించి సమస్యను పరిష్కరించాలని కోరారు. కుమురం భీం జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో ఆదివారం ఆదివాసీ పోరాట యోధుడు కుమురం భీం 79వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు జోగు రామన్న, ఆత్రం సక్కు, కుమురం భీం జెడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మాజీ ఎంపీ గొడెం నగేశ్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, ఉట్నూర్ ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య, కుమురం భీం మనవడు సోనే రావు, 9 ఆదివాసీ తెగల నేతలు హాజరయ్యారు. ముందుగా భీం స్మారకం, సమాధి వద్ద ఆదివాసీ డప్పు చప్పుల మధ్య పూజలు చేసి నివాళులర్పించారు. -
ఆదివాసీ యోధుడు కొమురం భీం
ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా ఆసిఫాబాద్ మండలం జోడేఘాడ్ సంకెనపల్లి గ్రామంలో 1900లో కొమురం భీం జన్మించినాడు. భీంకి 15 ఏండ్లు ఉన్నప్పుడే అతని తండ్రిని అటవీ అధికారులు చంపివేశారు. భీం కుటుంబం సాగుచేస్తున్న భూమిని ‘‘సిద్దిభి’’ అనే జాగిర్దార్ తనకు వదిలి పెట్టాల్సిందిగా బెదిరించాడు. ఎక్కడికి పారిపోయి బ్రతకాలి ఎందుకు భయపడాలి. ప్రళయ ఘర్జనలో భీంలో ధిక్కారస్వరం ప్రతిధ్వనించింది. సిద్దిభి తలౖపై కట్టెతో గట్టిగా కొట్టాడు. సిద్దిభి అక్కడే చనిపోయాడు. పోలీసులు భీంనీ వేటాడారు. దీంతో అస్సాంలో ఏళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపాడు. బాభి ఝారి చుట్టు పక్కల తన నాయకత్వంలో ఉన్న 12 గ్రామాల్లో మా గ్రామం మా స్వరాజ్యం అనే నినాదాన్ని అబ్దుల్ సత్తార్ అనే తాలుక్ దారుతో ఒప్పించడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. అక్కడ నుంచి సుర్దాపూర్కి తిరిగి వచ్చి పెత్తందారి వ్యవస్థ కింద నలుగుతున్న తన జాతి విముక్తి కోసం ‘జల్ జంగల్ జమీన్’ తమదే అంటూ గర్జించాడు. స్వయం పాలన 12 గ్రామాలతో స్వతంత్ర గోండు రాజ్యం కావాలని ఆసిఫాబాద్ కలెక్టర్‌తో చర్చలు జరి పాడు. పరిష్కారం దొరకలేదు. దీంతో నిజాం రాజును కలవడానికి హైదరాబాద్ వెళ్ళాడు కానీ నిజాం నుంచి అనుమతి దొరకలేదు ఇక గెరిల్లా పోరాటంతోనే నిజాం సైన్యాన్ని ఎదుర్కోవాలి అని నిర్ణయించుకున్నాడు. దట్టమైన అడవుల్లో ఉన్న ‘జోడే ఘాట్’ గుట్టల్లో గెరిల్లా అర్మీని తయారు చేశాడు. భీంతో చర్చలు జరిపినప్పటికీ ఫలించకపోవడంతో భీంని అంతం చేస్తే తప్ప తిరుగుబాటు ఆగదని నిజాం సర్కార్ భావించింది. భీం దగ్గర హవల్దార్‌గా పనిచేసే కుర్దు పటేల్‌ని లోబరుచుకుని భీం స్థావరాన్ని బ్రిటిష్ ఆర్మీ సహాయంతో అర్ధరాత్రి సమయంలో చుట్టుముట్టింది. 3 రోజుల సుదీర్ఘ పోరాటంలో అలసిన భీం గెరిల్లాలపై నిజాం సైన్యం ఒకసారి గుంపుగా విరుచుకపడి కొమురం భీం గుండెల్లో బుల్లెట్ దింపారు. ఆదివాసీల ఆశయాల సాధనే భీంకి ఇచ్చే ఘన నివాళి. వ్యాసకర్త: పెనుక ప్రభాకర్, ఆదివాసీ రచయితల సంఘం(తెలంగాణ). -
ఆదివాసీలకు అండ
కొమురం భీం వర్ధంతి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ * జోడేఘాట్‌లో గిరిజన పోరాట యోధుడికి ఘన నివాళి * గోండు గూడేల్లో అంటువ్యాధుల అడ్డుకట్టకు చర్యలు * కార్పొరేట్ ఆసుపత్రుల ద్వారా అవగాహన కార్యక్రమాలు * గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారాలు * కొమురం భీం పేరుతో కొత్త జిల్లా, 25 కోట్లతో స్మారక వనం * బంజారాహిల్స్‌లో ఆదివాసీ భవన్, బంజారా భవన్ * ఆదివాసీల చెంతకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు * భీం వారసులకు ప్రభుత్వ ఉద్యోగాలు, 10 లక్షల ఆర్థిక సాయం కొమురం భీం కీర్తి అంతర్జాతీయ స్థాయికి చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తెలంగాణ కాశ్మీరం వంటి జోడేఘాట్‌ను పర్యాటక సిటీగా మారుస్తాం. రూ. 25 కోట్లతో జోడేఘాట్ చుట్టూ ఉన్న వంద ఎకరాల్లో భీం స్మారక వనం నిర్మిస్తాం. - కేసీఆర్ జోడేఘాట్ నుంచి సాక్షి ప్రతినిధి: గిరిజన గూడేల్లో అంటువ్యాధులను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకుంటామని, ఆరోగ్య పరిరక్షణపై ఆదివాసీలకు హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రుల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అడవి బిడ్డల్లో చైతన్యం కలిగించడం ద్వారా అకాల మరణాలను అరికట్టవచ్చునని పేర్కొన్నారు. కొమురం భీం 74వ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని మారుమూల అటవీ ప్రాంతమైన జోడేఘాట్‌కు వచ్చిన కేసీఆర్.. ఆదివాసీ పోరాట యోధుడికి ఘన నివాళులర్పించారు. భీం సమాధి వద్ద ఆదివాసీ సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆ యోధుడి మనుమడు సొనేరావు ప్రారంభించిన గిరిజన దర్బార్‌లో సీఎం పాల్గొన్నారు. ఆదివాసీ, గిరిజన సంఘాల నేతల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన ఆదివాసీలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ‘సందీర్కు రాం..రాం.. మావనాటే.. మావరాజ్ (అందరికీ నమస్కారం, మా ఊరు.. మా రాజ్యం..)’ అంటూ గోండు భాషలో ప్రసంగాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి.. ఆదివాసీల ఆరోగ్యస్థితిని మెరుగుపరిచేందుకు అంటువ్యాధులపై దాడులు చేస్తామని ప్రకటించారు. ‘రాష్ట్రవ్యాప్తంగా 500 కళాజాత బృందాలను నియమించి ఆరోగ్య సూత్రాలపై చైతన్యం నింపుతాం. గోండు భాషలోనే ఈ బృందాలు చైతన్యపరుస్తాయి. గోండు గూడేల్లో అంటువ్యాధులను అరికట్టేందుకు గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తాం’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. గిరిజన మరణాల విషయంలో నాయకుల తీరు.. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు. మరణాలకు అసలు కారణాలను కనుగొని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ కాశ్మీరం జోడేఘాట్ జోడేఘాట్‌ను తెలంగాణ కాశ్మీరంగా అభివర్ణించిన కేసీఆర్.. ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ‘కొమురం భీం కీర్తి అంతర్జాతీయ స్థాయికి చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తెలంగాణ కాశ్మీరం వంటి జోడేఘాట్‌ను పర్యాటక సిటీగా మారుస్తాం. రూ. 25 కోట్లతో జోడేఘాట్ చుట్టూ ఉన్న వంద ఎకరాల్లో భీం స్మారక వనం నిర్మిస్తాం. ప్రత్యేక ఆర్కిటెక్చర్లతో స్మృతి చిహ్నం ఏర్పాటు చేస్తాం. ఆదివాసీల విద్యాభివృద్ధి కోసం గిరిజన విశ్వ విద్యాలయం మంజూరు చేస్తాం’ అని కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాకు కొమురం భీం పేరు పెడతామని ప్రకటించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై ఆదివాసీలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. అలాగే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఆదివాసీ, బంజారా భవన్లను నిర్మిస్తామని కూడా తెలిపారు. వాటర్ గ్రిడ్ ద్వారా సురక్షిత నీరు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా ప్రతి గోండు గూడేనికి తాగునీటి వసతి కల్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతి ఆదివాసీకి సురక్షిత నీరు అందేలా ప్రతి ఇంటికీ నల్లాను బిగిస్తామన్నారు. ఏజెన్సీ ఏరియా అభివద్ధికి ఐటీడీఏ, జిల్లా అధికార యంత్రాంగంతో చర్చించి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామన్నారు. కొద్ది రోజుల్లోనే తిరిగి జిల్లాలో పర్యటిస్తానని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా సాగు, తాగు నీటి అవసరాలు తీరాకే ‘ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టు నీటిని ఇతర జిల్లాలకు తరలిస్తామన్నారు. కొమురం భీం కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయంతోపాటు, సోనేరావు కుమారుడు, కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ గిరిజన దర్భార్‌లో రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న, సీఎం ఓఎస్డీ, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి కూడా ప్రసంగించారు. ఎంపీలు గొడం నగేష్, సీతారాంనాయక్, జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో ప్రశాంత్‌పాటిల్, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందులో పాల్గొన్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం, తొలిసారిగా ముఖ్యమంత్రి రావడంపై ఆదివాసీల్లో హర్షం వ్యక్తమైంది. ఇక మావోయిస్టుల అత్యంత ప్రాబల్య ప్రాంతమైన జోడేఘాట్‌లో ముఖ్యమంత్రి పర్యటన ప్రశాంతంగా ముగియడంపై జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. -
శాశ్వత హెలిప్యాడ్ నిర్మించండి..
జోడేఘాట్‌లో శాశ్వత హెలిప్యాడ్ నిర్మించాలని సీఎం పేషి నుంచి వచ్చిన ప్రభుత్వ సలహాదారు రామ్‌లక్ష్మణ్ జిల్లా అధికారులకు సూచించారు. ఈనెల 8న భీమ్ వర్ధంతి నేపథ్యంలో సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా ఆయన శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. కెరమెరి : జోడేఘాట్‌లో శాశ్వత హెలిప్యాడ్ నిర్మించాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ప్రభుత్వ సలహాదారు రామ్‌లక్ష్మణ్ ఆదేశించారు. కెరమెరి మండలం జోడేఘాట్‌ను ఆయన శనివారం సందర్శించారు. ఈ నెల 8న జరిగే కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా నిర్వహించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సభా ఏర్పాట్లను పరిశీలించారు. మరో రెండు రోజుల్లో హెలిప్యాడ్ స్థలం తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మ్యూజియం ఏర్పాటుకు నిర్మిస్తున్న స్టాండ్‌ను పరిశీలించారు. గుట్టపైకి మెట్లు తయారు చేస్తామని, దాని పైభాగంలో 2, 3 ఎకరాల్లో మ్యూజియం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఆయనకు వివరించారు. అక్కడి నుంచి సీఎం సభా స్థలాన్ని పరిశీలించారు. ప్రజలు కనిపించేలా ఎత్తులో నిర్మించాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌లోని కొమురం భీమ్ విగ్రహంలాగే నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేస్తున్న స్టాండ్‌ను పరిశీలించారు. భీమ్ విగ్రహాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాలన్నారు. 20 వేల మంది కంటే ఎక్కువగా ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో సభ కోసం అధిక స్థలం తీసుకోవాలని చెప్పారు. ప్రాంగణంలో పచ్చని కార్పెట్ పర్చాలన్నారు. 200 ఎకరాల్లో పర్యాటక కేంద్రం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో స్థలం ఎంపిక చేశారా అని అధికారులను ప్రశ్నించారు. జోడేఘాట్ వాసుల్లో కుటుంబంలో ఒకరికి ఉద్యోగావకాశం కల్పించే ఆలోచనలో సీఎం ఉన్నారని తెలిపారు. సభకు వచ్చే ప్రజలకు తాగునీరు, భోజన వసతి కల్పించనున్నట్లు చెప్పారు. ఆశ్రమ పాఠశాలకు ప్రహరీ మంజూరు చేయాలని ఐటీడీఏ ఇన్చార్జి ప్రాజెక్టు అధికారి ప్రశాంత్ పాటిల్‌ను ఆదేశించారు. రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. జోడేఘాట్‌ను అన్ని హంగులతో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సందర్భంగా కాగజ్‌నగర్ డీఎస్పీ సురేశ్ ముఖ్యమంత్రి సభ కోసం చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. మార్గమధ్యంలో పాట్నాపూర్ గ్రామంలో కలిసిన ఎస్పీతో మాట్లాడారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి.. గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఊట్నూర్లోనే ఏర్పాటు చేయాలని గిరిజన నాయకులు మర్సుకోల తిరుపతి, లక్కేరావు, బొంత ఆశారెడ్డి, జోడేఘాట్‌లోనే ఏర్పాటు చేయాలని కొమురం భీమ్ వర్ధంతి నిర్వహణ కమిటీ చైర్మన్ కోవ దేవరావు, ఆత్రం లక్ష్మణ్ ప్రభుత్వ సలహాదారు రామ్లక్ష్మణ్ను కోరారు. స్పందించిన ఆయన యూనివర్సిటీ ఆదిలాబాద్ జిల్లాకు మంజూరైందని, ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి చేతిలో ఉందని చెప్పారు. తాము సీఎంను కలిసి మెమోంటో ఇచ్చే అవకాశం కల్పించాలని కోరగా ఐదుగురికి అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు. ఆర్డీవో రామచంద్రయ్య, ఏపీవో భీమ్,తహశీల్దార్ సిడాం దత్తు, ఎంపీడీవో సాజిత్అలీ, ఏటీడబ్ల్యువో అంబాజీ, నాయకులు యాదోరావు, తిరుపతి, మహెశ్, ఎస్సై అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.