ఆదివాసీలకు అండ | We will fully support to tribals, says Telangana CM KCR | Sakshi
Sakshi News home page

ఆదివాసీలకు అండ

Published Thu, Oct 9 2014 1:04 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

జోడేఘాట్ లో కొమురం భీం విగ్రహానికి పూలమాల వేస్తున్న కేసీఆర్ - Sakshi

జోడేఘాట్ లో కొమురం భీం విగ్రహానికి పూలమాల వేస్తున్న కేసీఆర్

కొమురం భీం వర్ధంతి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ
 

* జోడేఘాట్‌లో గిరిజన పోరాట యోధుడికి ఘన నివాళి
* గోండు గూడేల్లో అంటువ్యాధుల అడ్డుకట్టకు చర్యలు
* కార్పొరేట్ ఆసుపత్రుల ద్వారా అవగాహన కార్యక్రమాలు
* గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారాలు
* కొమురం భీం పేరుతో కొత్త జిల్లా, 25 కోట్లతో స్మారక వనం
* బంజారాహిల్స్‌లో ఆదివాసీ భవన్, బంజారా భవన్
* ఆదివాసీల చెంతకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు
* భీం వారసులకు ప్రభుత్వ ఉద్యోగాలు, 10 లక్షల ఆర్థిక సాయం
 
 కొమురం భీం కీర్తి అంతర్జాతీయ స్థాయికి చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తెలంగాణ కాశ్మీరం వంటి జోడేఘాట్‌ను పర్యాటక సిటీగా మారుస్తాం. రూ. 25 కోట్లతో జోడేఘాట్ చుట్టూ ఉన్న వంద ఎకరాల్లో భీం స్మారక వనం నిర్మిస్తాం.
 - కేసీఆర్

 
 
జోడేఘాట్ నుంచి సాక్షి ప్రతినిధి: గిరిజన గూడేల్లో అంటువ్యాధులను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకుంటామని, ఆరోగ్య పరిరక్షణపై ఆదివాసీలకు హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రుల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అడవి బిడ్డల్లో చైతన్యం కలిగించడం ద్వారా అకాల మరణాలను అరికట్టవచ్చునని పేర్కొన్నారు. కొమురం భీం 74వ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని మారుమూల అటవీ ప్రాంతమైన జోడేఘాట్‌కు వచ్చిన కేసీఆర్.. ఆదివాసీ పోరాట యోధుడికి ఘన నివాళులర్పించారు.


 భీం సమాధి వద్ద ఆదివాసీ సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆ యోధుడి మనుమడు సొనేరావు ప్రారంభించిన గిరిజన దర్బార్‌లో సీఎం పాల్గొన్నారు. ఆదివాసీ, గిరిజన సంఘాల నేతల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన ఆదివాసీలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ‘సందీర్‌కు రాం..రాం.. మావనాటే.. మావరాజ్ (అందరికీ నమస్కారం, మా ఊరు.. మా రాజ్యం..)’ అంటూ గోండు భాషలో ప్రసంగాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి.. ఆదివాసీల ఆరోగ్యస్థితిని మెరుగుపరిచేందుకు అంటువ్యాధులపై దాడులు చేస్తామని ప్రకటించారు.
 
‘రాష్ట్రవ్యాప్తంగా 500 కళాజాత బృందాలను నియమించి ఆరోగ్య సూత్రాలపై చైతన్యం నింపుతాం. గోండు భాషలోనే ఈ బృందాలు చైతన్యపరుస్తాయి. గోండు గూడేల్లో అంటువ్యాధులను అరికట్టేందుకు గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తాం’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. గిరిజన మరణాల విషయంలో నాయకుల తీరు.. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు. మరణాలకు అసలు కారణాలను కనుగొని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
 
 తెలంగాణ కాశ్మీరం జోడేఘాట్
 జోడేఘాట్‌ను తెలంగాణ కాశ్మీరంగా అభివర్ణించిన కేసీఆర్.. ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ‘కొమురం భీం కీర్తి అంతర్జాతీయ స్థాయికి చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తెలంగాణ కాశ్మీరం వంటి జోడేఘాట్‌ను పర్యాటక సిటీగా మారుస్తాం. రూ. 25 కోట్లతో జోడేఘాట్ చుట్టూ ఉన్న వంద ఎకరాల్లో భీం స్మారక వనం నిర్మిస్తాం.
 
 ప్రత్యేక ఆర్కిటెక్చర్లతో స్మృతి చిహ్నం ఏర్పాటు చేస్తాం. ఆదివాసీల విద్యాభివృద్ధి కోసం గిరిజన విశ్వ విద్యాలయం మంజూరు చేస్తాం’ అని కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాకు కొమురం భీం పేరు పెడతామని ప్రకటించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై ఆదివాసీలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. అలాగే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఆదివాసీ, బంజారా భవన్‌లను నిర్మిస్తామని కూడా తెలిపారు.
 
 వాటర్ గ్రిడ్ ద్వారా సురక్షిత నీరు
 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా ప్రతి గోండు గూడేనికి తాగునీటి వసతి కల్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతి ఆదివాసీకి సురక్షిత నీరు అందేలా ప్రతి ఇంటికీ నల్లాను బిగిస్తామన్నారు. ఏజెన్సీ ఏరియా అభివద్ధికి ఐటీడీఏ, జిల్లా అధికార యంత్రాంగంతో చర్చించి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామన్నారు. కొద్ది రోజుల్లోనే తిరిగి జిల్లాలో పర్యటిస్తానని హామీ ఇచ్చారు.
 
 ఆదిలాబాద్ జిల్లా సాగు, తాగు నీటి అవసరాలు తీరాకే ‘ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టు నీటిని ఇతర జిల్లాలకు తరలిస్తామన్నారు. కొమురం భీం కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయంతోపాటు, సోనేరావు కుమారుడు, కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ గిరిజన దర్భార్‌లో రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న, సీఎం ఓఎస్‌డీ, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి కూడా ప్రసంగించారు. ఎంపీలు గొడం నగేష్, సీతారాంనాయక్, జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ప్రశాంత్‌పాటిల్, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందులో పాల్గొన్నారు.
 
 ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం, తొలిసారిగా ముఖ్యమంత్రి రావడంపై ఆదివాసీల్లో హర్షం వ్యక్తమైంది. ఇక మావోయిస్టుల అత్యంత ప్రాబల్య ప్రాంతమైన జోడేఘాట్‌లో ముఖ్యమంత్రి పర్యటన ప్రశాంతంగా ముగియడంపై జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement