భీమ్ ఆశయాలు నెరవేర్చుతాం..
కెరమెరి : కొమురం భీమ్ ఆశయాలను తప్పకుండా నెరవేర్చుతామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం మండలంలోని జోడేఘాట్‌లో భీమ్ వర్ధంతి సభా ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్ స్థలాన్ని చూశారు. వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేసే స్థలం, మ్యూజియం, భీమ్ విగ్రహం, బొటానికల్ పార్కు, భీమ్ స్మారక చిహ్నం, తదితరాలను పరిశీలించారు. మెదటిసారిగా సీఎం కేసీఆర్ వస్తున్నారని.. ఎలాంటి ఆటుపోట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో నాయకులు వచ్చి పోయినా భీమ్ ఆశయాలు నెరవేరలేదన్నారు.
ఆదివాసీల బాధలు తెలుసుకునేందుకు, వివిధ రకాల సంక్షేమ ఫలాలు అందించేందుకు సీఎం కేసీఆర్ వస్తున్నారని తెలిపారు. దైవసన్నిధి అయిన భీమ్ వర్ధంతికి రావడం అందరి అదృష్టమన్నారు. ఈ సందర్భంగా హట్టి బేస్ క్యాంప్‌లో భీమ్ వర్ధంతి, గిరిజన దర్బార్ పోస్టర్ విడుదల చేశారు. ఎంపీ నగేష్ మాట్లాడుతూ.. విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి తదితర రంగాలతోపాటు అన్నింటా ఆదివాసీలు వెనుకబడి ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌తోనే అందరి అభివృద్ధి సాధ్యమన్నారు. సీఎం కోసం భారీ పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ గజరావు భూపాల్ తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, ఇంద్రకరణ్‌రెడ్డి, రాథోడ్ బాపూరావ్, డీఎస్పీ సురేశ్‌బాబు, మంచిర్యాల, ఆదిలాబాద్, ఉట్నూర్ ఆర్డీవోలు ఆయేశా నమ్రతా, సుధాకర్‌రెడ్డి, రామచంద్రయ్య తదితర శాఖలకు చెందిన అధికారులున్నారు.