బురద రోడ్డుపై.. ఎడ్లబండిపై 5 కి.మీ. ప్రయాణం
వైద్యం ఆలస్యమై గర్భంలోనే శిశువు మృతి
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
కాగజ్‌నగర్ రూరల్/పెంచికల్‌పేట్: రోడ్డంతా బురద.. అడుగుతీసి అడుగు వేయలేని దారిలో సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేని పరిస్థితుల్లో లోకం చూడకుండానే ఓ పసిగుడ్డు తల్లి గర్భంలో కన్నుమూసింది. ఈ విషాదకర ఘటన సోమవారం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పెంచికల్‌పేట్ మండలం ఎల్లూర్ గ్రామ పంచాయతీ పరిధి మేరగూడ గ్రామానికి చెందిన దుర్గం పోచన్న భార్య పంచపూల నిండు గర్భిణి.
సోమవారం వేకువజామున ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. కుటుంబసభ్యులు 108కు సమాచారమిచ్చారు. మేరగూడకు వెళ్లే దారి పూర్తిగా బురదగా మారడంతో సిబ్బంది ఎల్లూర్ వరకు రావాలని సూచించారు. దీంతో తెల్లవారుజామున 4 గంటలకు కుటుంబసభ్యులు పంచపూలను ఎడ్లబండిలో ఎక్కించారు. మేరగూడ నుంచి ఎల్లూర్ వరకు ఐదుకిలోమీటర్ల దూరం వెళ్లడానికి ఆ బురద మార్గంలో రెండు గంటలకుపైగా పట్టింది.
అక్కడి నుంచి గర్భిణిని 108లో కాగజ్‌నగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో గర్భంలోనే శిశువు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆపరేషన్ చేసి ఆడ మృతశిశువును బయటకు తీశారు. ప్రస్తుతం పంచపూలకు చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. తమ గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడం వల్లే బిడ్డ మృతిచెందిందని పోచన్న కన్నీటిపర్యంతమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment