ఈ మంత్రిని ఏమనాలి?
మంచినీళ్ల కోసం జనం 'అలో లక్ష్మణా..' అని అరుస్తోంటే, మరో పక్క అవే మంచినీళ్లను మట్టిపాలుచేసిన మంత్రిగారి ఉదంతమిది. గడిచిన 100 ఏళ్లలో మహారాష్ట్ర కనీవినీ ఎరుగని రీతిలో కరువు ఎదుర్కొంటున్నది. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలన్నీ బీటలు వేడటంతో పక్కరాష్ట్రం నుంచి రైళ్ల ద్వారా మంచినీళ్లు తెప్పించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజష్థాన్ లోని మిరాజ్ డ్యామ్ నుంచి మహారాష్ట్రలోని కరువు ప్రభావిత లాతూర్ సహా ఇతర జిల్లాలకు రైళ్ల ద్వారా ప్రతిరోజు 5లక్షల లీటర్ల నీటిని సరఫరాచేస్తున్నారు. రైళ్ల రాకపోకలు, నీటి పంపకం తదితర వ్యవహారాలను ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఏక్ నాథ్ ఖడ్నే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత నాలుగు రోజులుగా లాతూర్ లోనే మకాం వేసిన ఆయన శుక్రవారం ఓ కార్యక్రమానికి వెళ్లాల్సి వచ్చింది.
లాతూర్ నుంచి 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న భేల్ కుండ్ గ్రామంలో జరిగే కార్యక్రమానికి రోడ్డు మార్గంలో కాకుండా హెలికాప్టర్ ద్వారా వెళ్లాలని మంత్రి గారు నిర్ణయించుకున్నారు. దీంతో చకచకా ఏర్పాట్లు చేశారు అధికారులు. హెలికాప్టర్ టేకాఫ్ అయ్యేచోట, ట్యాండ్ అవ్వాల్సిన చోట దుమ్ము లేవకుండా నీళ్లు చల్లించారు. ఇందుకోసం దాదాపు 10వేల లీటర్ల నీటిని మట్టిపై చల్లారు. అసలే బంగారమైన నీటిని మంత్రిగారు ఇలా వృథాచేయటాన్ని స్థానికులు సహా ప్రతిపక్షాలు తప్పుపట్టాయి.
'ఏక్ నాథ్ వెళ్లాలనుకున్న ఊరు లాతూర్ నుంచి తిప్పికొడితే 40 కిటోమీటర్ల దూరం ఉండదు. ఆ మాత్రం దూరానికే ఆయన హెలికాప్టర్ వాడటం, ట్యాంకుల కొద్దీ నీళ్లను వృథాచేయటం దారుణం'అని కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సచిన్ సావంత్ అన్నారు. చేసిన పనికి ప్రజలకు క్షమాపణలు చెప్పి, మరోసారి అలా జరగదని మంత్రి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.