ప్రతిజ్ఞ చేయిస్తూనే ఇదేమిటి బాబూగారు?
హైదరాబాద్: ప్రస్తుతం నెలకొన్న తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ నీటిని పొదుపు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. విచిత్రమేమిటంటే ఆయన పర్యటనలోనే నీటిని పొదుపు చేయాలన్న ప్రతిజ్ఞకు నిలువునా తూట్లు పడ్డాయి.
దేశంలోనే అత్యంత కరువు పీడిత ప్రాతమైన అనంతపురం జిల్లాలో పర్యటన సందర్భంగా గురువారం ప్రజలతో సీఎం చంద్రబాబు నీటిపొదుపుపై ప్రతిజ్ఞ చేయించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రతిజ్ఞను సీఎం స్వయంగా పాటించి ఉంటే ఎంతోకొంత ప్రాధాన్యం చేకూరి ఉండేదని స్థానికులు అంటున్నారు. సీఎం చంద్రబాబు, ఇతర వీఐపీల చాపర్లు ల్యాండ్ అయ్యేందుకు ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ కోసం వేలలీటర్ల నీటిని వృథా చేశారు. సీఎం, ఇతర ప్రముఖుల హెలికాప్టర్లు ల్యాండైన సందర్భంగా దుమ్ము లేవకుండా ఉండేందుకు ఏకంగా హెలిప్యాడ్ ప్రాంతంలో 5వేల లీటర్ల పరిమాణం గల దాదాపు నాలుగు ట్యాంకర్ల నీటిని వృథా చేశారు.
రాజస్థాన్ తర్వాత దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం అనంతపురం జిల్లా. ప్రస్తుతం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న ఈ జిల్లాను కరువు జిల్లాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కూడా. ఈ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా భారీగా నీటిని వృథా చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రలోని మరాట్వాడ ప్రాంతంలో ఓ మంత్రి పర్యటన సందర్భంగా రోడ్లపై నీటి వృథా చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇదే తరహా వివాదంలో తన పర్యటన సందర్భంగా నీటిని వృథాగా చేసినందుకు బాధ్యులైన అధికారులపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య చర్యకు ఆదేశించిన విషయమూ విదితమే.