అతి భారీ వర్షాలు ముంచెత్తాక తాపీగా అధికారుల కమిటీ
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా సీఎం వైఖరి
ముందే హెచ్చరికలు అందినా పట్టించుకోని ఫలితం
డిప్యూటీ సీఎంను ట్యాగ్ చేస్తూ లేఖ రాసిన ఏపీ వెదర్‌మ్యాన్
అయినా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయలేదు
ముందస్తు సమాచారం లేకుండా బుడమేరు గేట్లు ఎత్తివేత
దీంతో విజయవాడ నగరం, రూరల్ ప్రాంతాలు మునక
సాక్షి, అమరావతి: భారీ వర్షాల వల్ల ముంపు ముప్పు పొంచి ఉందని ముందే తెలిసినా అలసత్వంతో వ్యవహరించి లక్షలాది మందిని నిరాశ్రయులుగా మిగిల్చింది! సర్కారు నిర్లక్ష్యం బెజవాడకు పెనుశాపంగా మారింది. భారీ వర్షాలు కురుస్తాయని మూడు రోజులు ముందు నుంచే వాతావరణ శాఖ, నిపుణులు హెచ్చరిస్తున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. భారీ వర్షాలు, వరద నిర్వహణపై ప్రణాళిక, అవగాహన లేకపోవడం, అలసత్వం కారణంగా విజయవాడ నగరవాసులు ముంపులో చిక్కుకుపోయారు. వరద పోటెత్తిన తర్వాత సీఎం చంద్రబాబు హడావుడి చర్యలకు దిగారు.
ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందే పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రభుత్వానికి పలు రకాల మెసేజ్‌లు పంపింది. వాతావరణ సమాచారాన్ని ఇవ్వడంలో ఎప్పటికప్పుడు ముందుండే ఏపీ వెదర్‌మ్యాన్ ప్రణీత్ ఆగస్టు 28వ తేదీ నుంచి ఎక్స్ మాధ్యమం ద్వారా పదేపదే ఏపీ ప్రభుత్వం అప్రమత్తమవ్వాలని, అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూనే ఉన్నారు.
గత 31వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని ట్యాగ్ చేస్తూ ఓ వినతిపత్రాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఏయే జిల్లాల్లో వర్షాలు కురుస్తాయో అందులో వివరంగా పేర్కొన్నారు. అయినాసరే పట్టించుకునే నాథుడే లేకపోవడంతో రికార్డు స్థాయి వర్షానికి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు ముంపునకు గురయ్యాయి. మూడు లక్షల ఎకరాల్లోపంట పొలాలు దెబ్బతిన్నాయి. శనివారం అర్థరాత్రి నుంచి బుడమేరు ఉప్పొంగి బెజవాడలోని అనేక ప్రాంతాలను ముంచేసింది.
పీకల మీదకు వచ్చాక..
కనీస హెచ్చరికలు లేకుండా వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ గేట్లను ఎత్తి వేయడంతో బుడమేరు వరద విజయవాడను ముంచెత్తింది. భారీ వర్షాలకు బుడమేరు ఉప్పొంగి తిరువూరు, ఎ.కొండూరు, మైలవరం, జి.కొండూరు మీదుగా కౌలూరు హెడ్ రెగ్యులేటర్ వరకూ వస్తుంది. అక్కడ గేట్లు ఎత్తితే విజయవాడ రూరల్ మండలం, విజయవాడ నగరంలోని సింగ్‌నగర్ పరిసరాలన్నీ మునిగిపోతాయి. ఈ విషయం తెలిసి కూడా శనివారం రాత్రి 7.30 గంటలకు గేట్లు ఎత్తివేశారు. దీనికితోడు వెల్లటూరు వద్ద పటమట చెరువుతోపాటు దానిపైనున్న పలు చెరువులకు గండ్లు పడ్డాయి.
దీంతో వరద అంతా బుడమేరులోకి రావడంతో కట్ట తెగిపోయింది. బుడమేరు వరద నీరు పోలవరం కాలువ మీదుగా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం దగ్గర కృష్ణానదిలో కలవాలి. కానీ పోలవరం కాలువకు పలుచోట్ల గండ్లు పడడంతో ఆ వరదంతా విజయవాడవైపే వస్తోంది. బుడమేరు వరద హెడ్‌రెగ్యులేటర్ వద్ద 11 అడుగుల మేర నిలిచిపోయే దాకా అధికార యంత్రాంగం కళ్లు తెరవలేదు. పీకల మీదకు వచ్చాక ఎటువంటి హెచ్చరికలు లేకుండా గేట్లు ఎత్తేశారు. దీంతో శనివారం రాత్రి నుంచి విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. మరోవైపు కొండవీటివాగు పొంగి రాజధాని గ్రామాల్లోకి నీరు చేరింది. చివరికి హైకోర్టు కూడా ముంపు బారినపడింది. సెక్రటేరియేట్, అసెంబ్లీ కూడా జలమయంగా మారాయి. కృష్ణా డెల్టా పరిధిలో లక్షల ఎకరాలు మునిగిపోయాయి.
హడావుడే.. కానరాని సన్నద్ధత
వర్షాలపై హెచ్చరికలు పట్టించుకోకుండా సీఎంతో సహా మంత్రులు, ఉన్నతాధికారులు వీకెండ్ విశ్రాంతిలో ఉండిపోయారు. ముందస్తు సన్నద్ధత లేకపోగా, వర్షాలు తీవ్రంగా కురుస్తున్నా సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులు, జిల్లాలను అప్రమత్తం చేయలేదు. ఎప్పటిమాదిరిగానే ఆయన శనివారం సాయంత్రం హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మరోవైపు ఉన్నతాధికారులంతా చాలామంది శుక్రవారమే హైదరాబాద్ వెళ్లిపోయారు. వర్షాలు దంచి కొట్టడంతో సాయంత్రానికి పరిస్థితి తీవ్రత గమనించి అప్పుడు హడావుడిగా సమీక్ష నిర్వహించారు. రెండు గంటలకు ఒకసారి తనకు రిపోర్టు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
సీసీఎల్‌ఏ నేతృత్వంలో ఉన్నతాధికారులతో రాత్రి 8 గంటల తర్వాత ఒక కమిటీని నియమించారు. అయితే అప్పటికి వారిలో చాలామంది అధికారులు అందుబాటులో లేరు. తీవ్రత తెలిశాక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయానికి వెళ్లి తూతూమంత్రంగా సమీక్ష చేశారు. మరోవైపు చంద్రబాబు నివేదికలు, సమీక్షలతో కాలం గడిపారు. ఇదంతా జరుగుతుండగానే ఎటువంటి హెచ్చరికలు లేకుండా అధికారులు బుడమేరు హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తివేశారు.
ఫలితంగా తెల్లారేసరికి విజయవాడ ముంపునకు గురైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ (వాతావరణ శాఖ) మూడు రోజుల క్రితమే హెచ్చరించింది. మరోవైపు ఎగువ నుంచి కృష్ణాతో పాటు మూసీ, మున్నేరు, బుడమేరు, కట్టలేరు, నాలేరు, రామిలేరుల నుంచి భారీ వరద ప్రభావం ముంచెత్తుతుందని సీడబ్ల్యూసీ కూడా అప్రమత్తం చేసింది. అయినప్పటికీ ప్రజలను అప్రమత్తం చేయడం, సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.
మునిగాక బోట్లు తెప్పిస్తారా?
అనంతరం సమీక్షల పేరుతో అధికారులను పని చేయనివ్వకుండా సీఎం చంద్రబాబు హడావుడి చేశారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయానికి వెళ్లి సంబంధం లేని మాటలతో అధికారులకు విసుగు తెప్పించారు. ఆ తర్వాత ముంపునకు గురైన విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతానికి వెళ్లి రాత్రంతా అక్కడే ఉంటానని, బోట్లు తెప్పిస్తానని, హెలికాఫ్టర్లు రప్పిస్తానని చెప్పారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా మునిగిపోయాక వచ్చి పడవలు తెప్పిస్తాననడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద నిర్వహణపై ఏమాత్రం అవగాహన లేకుండా వ్యవహరించి తర్వాత తాపీగా తప్పు గత సర్కారుదేనని చంద్రబాబు బురద చల్లడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
వీటికి జవాబేది బాబూ?
1 ఐఎండీ, సీడబ్ల్యూసీ హెచ్చరికలను ఎందుకు బేఖాతర్ చేశారు?
2 ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకుండా ఇంత అలసత్వం ఎందుకు?
3 బుడమేరు గేట్లు ఎత్తేముందు ప్రజలను ఎందుకు అప్రమత్తం చేయలేదు?
4 సాక్షాత్తూ మీ ఇంట్లోకే వరద పోటెత్తితే కార్యాలయాల్లో తలదాచుకోవడం నిజం కాదా?
5 వరద బాధితులకు కనీసం మంచినీరు, ఆహారం అందకపోవటానికి మీ వైఫల్యం కారణం కాదా?
6 విపత్తు వేళ అధికార యంత్రాంగాన్ని పని చేయనివ్వకుండా మీ చుట్టూ తిప్పుకోవడం సబబేనా?
Comments
Please login to add a commentAdd a comment