ఈ మంత్రులు అంతా ఎక్కడ?: ఆర్కే రోజా | Ex Minister Roja Slams TDP Govt For Vijayawada Floods | Sakshi
Sakshi News home page

విహారయాత్ర బిజీలో నిర్లక్ష్యం.. ఈ మంత్రులు అంతా ఎక్కడ?: ఆర్కే రోజా

Published Tue, Sep 3 2024 4:48 PM | Last Updated on Tue, Sep 3 2024 5:14 PM

Ex Minister Roja Slams TDP Govt For Vijayawada Floods

సాక్షి, తిరుపతి: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలంగా మారిన విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుందన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్న చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధుల కష్టాలు వర్ణనాతీతమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో సందేశం విడుదల చేశారు. 

బాధితుల మాటలు విటుంటే నాలుగురోజుల నుండి వాళ్లు ఎంత నరకం అనుభవించారో అర్థమవుతుందని అన్నారు. కనీసం పసిబిడ్డలకు పాలు కూడా అంలేదని తెలిపారు. రోజుల తరబడి మంచి నీళ్లు కూడా అందలేదని, ఎంతమంది వరదల్లో కొట్టుకువెళ్లిపోయారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం విఫలం కావడం దారుణం
ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి, ఇంత మంది ప్రాణాలు పోవడానికి  రాష్ట్ర ప్రభుత్వం వైపల్యమే కారణమని మండిపడ్డారు. త్రులు విహార యాత్రలకు వెళ్లి.. ప్రజలను వరదల్లో ముంచేశారని విమర్శించారు. విజయవాడ మునిగిపోతుంటే ప్రభుత్వం ఐదురోజులైన కనీసం ఆహారం కూడా అందించడంలో విఫలం కావడం దారుణమని అన్నారు. 

ఏ టీవీ చూసినా, తెలుగుదేశం పార్టీ చానళ్లు చూసినా ప్రజలు ఎంత నరక యాతన అనుభవిస్తున్నారో, జనాన్ని మూడు రోజుల పాటు ఎలా గాలికొదిలేశారో వాళ్ల మాటల్లోనే మనకు అర్థమవుతుందన్నారు. వరద సహాయ చర్యల్లో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు.

ముందే అప్రమత్తం చేసి ఉంటే..
‘చంద్రబాబు ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు వచ్చినా కనీసం ప్రజలను ఆదుకోలేకపోయారంటే.. ఇది ముమ్మాటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం. కనీసం గంట ముందు అప్రమత్తం చేసినా.. విజయవాడ నగరంలోని ప్రజలు ముంపు బారిన పడేవారు కాదు. నాలుగు రోజుల పాటు కరెంట్ లేకుండా, నీళ్లు లేకుండా, ఆహారం లేకుండా కష్టాలు పడ్డారంటే...ఇంతకంటే ఘోరమైన వైఫల్యం మరొకటి ఉండదు.

.. ముఖ్యమంత్రికి, మంత్రులు ప్రజల కష్టాల కోసం ఆలోచించడం లేదు. గత నెల 29, 30 వ తేదీల్లో సీఎం నుండి మంత్రుల వరకు అందరూ వీకెండ్ విహార యాత్రలకు ప్లాన్ చేసుకున్నారు. కానీ,  28వ తేదీనాడే వాతావరణ శాఖ భారీ వర్షాలు పడతాయి అయినా సమాచారం ఇచ్చింది. కనీసం సీఎం చంద్రబాబు కానీ హోంమంత్రి కానీ, పంచాయతీరాజ్ మంత్రి కానీ, రెవెన్యూ మంత్రికానీ, మున్సిపల్ శాఖ మంత్రి కానీ, ఇరిగేషన్ మంత్రి కానీ.. ఒక్కరంటే ఒక్కరు కూడా ఎలాంటి సమీక్ష కూడా చేయలేదు.

.. ప్రభుత్వం భారీ వర్షాలపైనా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వలన 10 మంది ప్రాణాలు పోయాయి. వరదల కోసం కూడా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వలన ఏకంగా మూడు లక్షల మంది విజయవాడ సెంట్రల్, వెస్ట్, మైలవరం, నందిగామ, గన్నవరం, అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాల్లో జనం వరదలో చిక్కుకుపోయారు. 

వీకెండ్ నాయకులు... ఈ రోజు జగనన్నే సీఎంగా ఉండుంటే...!

జగనన్న హయాంలో..
మా జగనన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు వర్షాలు, వరదలు, తుఫాన్లు వస్తాయన్న సమాచారం ఉంటే.. ముందుగానే సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలను అప్రమత్తం చేసే వాళ్లం. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఆహారం, పాలు, మంచినీళ్లు అందించేవాళ్లం. అంతేకాదు వరద, తుఫాన్ బాధితులకు వాళ్ల ఇళ్లకు కూడా ఆహారం, నిత్యవసరాలు పంపిణీ చేసేవాళ్లం

జగనన్న నిరంతరం అధికారులతో సమీక్షలు జరిపి, ఆయన చుట్టూ అధికారులను తిప్పుకోకుండా ప్రజలకు ముందు సహాయ చర్యలు అందేలా చేసేవారు. ఈరోజు విజయవాడ వరదల్లో అలాంటి సహాయం ఎవ్వరికైనా ఇంటికి వెళ్లి అందించారా..? అధికారులను కనీసం సీఎం కానీ, మంత్రులు కానీ ముందుగా సిద్ధం చేశారా..? 

మంత్రులు ఏం చేస్తున్నారు?
హోంమంత్రి , విపత్తుల నిర్వహణ మంత్రి కనీసం ఈ విపత్తుపైనా అధికారులను కానీ, ఇతర శాఖలను కానీ అప్రమత్తం చేసిందా..? ఒక్క సమీక్ష అయినా ముందుగా చేసిందా..? ఇక మంత్రి లోకేష్ ఏం చేశారు. మంగళగిరిలో వర్షాలు కురిస్తే, విజయవాడలో వరద వస్తే వాళ్లను వదిలేసి హైదరాబాద్‌కు వెళ్లిపోతారా..?

మున్సిపల్ శాఖమంత్రి నారాయణ ఏం చేశారు. విజయవాడలో ప్రజలను ముంచేసింది మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం కాదా..? మంత్రి నారాయణ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండని కనీసం ఒక్క రివ్యూ మీటింగ్ అయినా పెట్టారా? ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు...ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డ్రామాలు తెలుసు కానీ..ఇప్పుడు ఇంత పెద్ద వరద వస్తుందని ఆ మంత్రికి తెలియదా..?జనాన్ని ముంచేస్తుందని తెలియదా? ఇంత వరద వస్తే కనీసం జనం కోసం బోట్లు కూడా సిద్ధం చేయలేదు

రెవెన్యూ మంత్రి నాలుగు రోజులు కనిపించలేదు..
జనం వరదల్లో ఉంటే రెవెన్యూ మంత్రి సత్య ప్రసాద్ ఎక్కడో విహార యాత్రలకు వెళ్లారు. రెవెన్యూ మంత్రి ఇంత వర్షాలు వస్తాయని తెలిసి కనీసం ఒక్క సమీక్ష అయినా చేశారా..? అసలు పునరావాస కేంద్రాలు లేవు...వరదలు, వర్షాలు వస్తే రెవెన్యూ శాఖనే కీలకం. అలాంటిది ఆ మంత్రి కనీసం పట్టించుకోలేదు

కేంద్రంలో చక్రం తిప్పుతాం అని చెప్పుకుంటారు. కనీసం నాలుగు రోజులుగా వరద ఉంటే ఆరు హెలికాఫ్టర్లకు మించి తెప్పించలేకపోయారు. విమానయాన మంత్రి కూడా ఈ టీడీపీ నేత రామ్మోహన్ నాయుడే ఉన్నారు కదా.. ఆయనేమో నాలుగు రోజులు కనీసం పట్టించుకోలేదు. పంచాయతీరాజ్ శాఖమంత్రి పవన్ కల్యాణ్‌ ఐదు రోజులైనా ఇంకా విజయవాడ వెళ్లలేదు. కనీసం వరదలపై ఆయన శాఖ అధికారులతోను, సహాయ చర్యలపైనా సమీక్ష చేయలేదు

ఇలా మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ జనాన్ని ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా గాలికివదిలేశారు. ఇప్పటికైనా గతంలో మా జగనన్న ప్రభుత్వంలో ఎలా సహాయ చర్యలు అందించామో తెలుసుకుని...వాటిని అమలు చేయండి. దయచేసి ఈ ప్రభుత్వం ప్రజలను కాపాడండి. ముందు ఆహారం, నీళ్లు అందించండని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను.’ అని రోజా పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement