2 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించడం అసాధ్యం
అందుకే ప్రజలకు మేం చెప్పలేదు
రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సంచలన వ్యాఖ్యలు
వెలగలేరు గేట్లు ఎత్తుతామని 31నే ప్రభుత్వానికి చెప్పామన్న డీఈ మాధవ్ నాయక్
అయినా చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు
లక్షలాది మంది ప్రజల ప్రాణాలను గాలికొదిలేసింది
ముఖ్యమంత్రి ఇల్లు మునగడంతో ఆయన కలెక్టరేట్‌లో పునరావాసం పొందారు
⇒ బుడమేరుకు 35 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుందని ముందు రోజే మాకు తెలుసు. 2 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించడం అసాధ్యమైన ప్రక్రియ. గోదావరి జిల్లాల్లో వరద వస్తుందని చెబితే.. మాకు తెలుసు, తగ్గిపోతుందిలే అని లంక గ్రామాల ప్రజలు చెబుతారు. ప్రజలు వెళ్లరనే మేము వారికి చెప్పలేదు.
– శనివారం మీడియాతో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా
⇒ బుడమేరుకు వరద వస్తోందని.. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తామని శనివారం (ఆగస్టు 31) నా కంటే ముందే ఎస్‌ఈ, ఈఈలు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత మధ్యాహ్నం నేను తహసీల్దార్లకు ఫోన్ చేసి చెప్పా. – వెలగలేరు రెగ్యులేటర్ డీఈ మాధవ్ నాయక్
⇒ బుడమేరు ప్రవాహ సామర్థ్యం 15 వేల క్యూసెక్కులు. అలాంటిది 40 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో గండ్లు పడ్డాయి. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తారు. రెండు వైపుల నుంచి వచి్చన వరద విజయవాడను చుట్టుముట్టింది. వరద వస్తుందనే సమాచారం మాకు లేదు. – మీడియాతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన
సాక్షి, అమరావతి: బుడమేరుకు 35 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోందని ఒక రోజు ముందుగానే ప్రభుత్వానికి సమాచారం ఉందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. అయితే 2 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించడం అసాధ్యమైన ప్రక్రియ అన్నారు. ‘వరద వస్తోందని చెబితే గోదావరి జిల్లాల్లోని లంకల్లో ప్రజలెవరూ వెళ్లరు.. మాకు తెలుసులే.. ఇలాంటి వరదలెన్నిటినో చూశాం అంటారు.. అందుకే మేం ప్రజలకు చెప్పలేదు’ అని ఆర్పీ సిసోడియా శనివారం మీడియాకు అసలు విషయం చెప్పేశారు.
అలాగే.. బుడమేరుకు వరద వస్తోందని.. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తామని శనివారం (ఆగస్టు 31) మధ్యాహ్నం తన కంటే ముందే ఎస్‌ఈ, ఈఈలు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారని వెలగలేరు రెగ్యులేటర్ డీఈ మాధవ్ నాయక్ వెల్లడించారు. ఆ తర్వాత మధ్యాహ్నం తాను తహసీల్దార్లకు ఫోన్ చేసి విషయం చెప్పానన్నారు. దీన్నిబట్టి తమకు సమాచారం లేదని ఎనీ్టఆర్ జిల్లా కలెక్టర్ సృజన చెబుతున్న మాటలు అబద్ధమని ఆర్పీ సిసోడియా, మాధవ్ నాయక్ మాటలతో తేటతెల్లమైంది.
బుడమేరుకు భారీ వరద ప్రవాహం వస్తుందని చంద్రబాబు ప్రభుత్వానికి ముందే తెలిసినా.. దానివల్ల ఉధృతికి భారీగా ఆస్తి, ప్రాణనష్టాలు తప్పవని తెలిసినా వారిని నిర్లక్ష్యంగా వరదకొదిలేసింది. తద్వారా 57 నిండు ప్రాణాలు పోవడానికి కారణమైంది. మరోవైపు కృష్ణా కరకట్టలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వరదకు నీట మునగడంతో ఆయన తన మకాంను విజయవాడ కలెక్టరేట్‌కు మార్చారు. అక్కడ నుంచే బాధితులకు సాయం పేరిట తన ‘షో’ మొదలుపెట్టారు.
ఆగస్టు 31 మధ్యాహ్నమే సమాచారం ఇచి్చనా..
వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువకు వరద ప్రవాహాన్ని వదిలేస్తామని జలవనరుల శాఖ అధికారులు శనివారం (ఆగస్టు 31) మధ్యాహ్నం లోపే సమాచారం ఇచి్చనా.. విజయవాడ, ఎనీ్టఆర్ జిల్లాలో లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించాలనే ఆలోచన కూడా చేయలేదు. ఫలితంగా విజయవాడలో బుడమేరు జలప్రళయం సృష్టించింది.
ఇప్పటివరకూ వెల్లడైన సమాచారం మేరకు వరదల వల్ల 57 మంది మరణించారు. రూ.6,882 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు ప్రభుత్వమే ప్రకటించింది. చంద్రబాబు సర్కార్ ముందే తమను అప్రమత్తం చేసి ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేవారమని బాధితులు వాపోతున్నారు. తమకు జరిగిన తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టాలకు ఎవరిది బాధ్యతని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం వ్యవహరించి ఉంటే ఇలాంటి విపత్తు సంభవించేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ వైఫల్యం వల్లే జలప్రళయం చోటుచేసుకుందని నీటిపారుదలరంగ నిపుణులు, ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విపత్తు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ఆగస్టు 30, 31 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఆగస్టు 28నే భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. కర్ణాటక, మహారాష్ట్రల్లో కురిసిన వర్షాలకు ఎగువ నుంచి కృష్ణా నది భారీ వరదతో పోటెత్తింది. దీనికి తెలంగాణ, మన రాష్ట్రంలో కురిసిన వర్షాల ప్రభావంతో మూసీ, మున్నేరు, కట్టలేరు, పాలేరు తదితర వాగుల వరద కూడా తోడవడంతో ఆగస్టు 31 కృష్ణా మహోగ్రరూపం దాలి్చంది. అదే సమయంలో మరోవైపు బుడమేరు ఉప్పొంగింది. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువకు వరదను విడుదల చేస్తామని ప్రభుత్వానికి జలవనరుల శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు.
దీన్ని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ధ్రువీకరించారు కూడా. వరద వస్తుందని ముందే తెలిసినా.. ప్రోటోకాల్ ప్రకారం లోతట్టు ప్రాంతాలను ఎందుకు అప్రమత్తం చేయలేదు? సురక్షిత ప్రాంతాల్లోని పునరావాస శిబిరాలకు ఎందుకు తరలించలేదు? అన్నది అంతుచిక్కడం లేదు. ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్లే విపత్తు సంభవించిందని, అపార ప్రాణ, ఆస్తి నష్టానికి దారితీసిందంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment