
కరీంనగర్ రూరల్: కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న సీఎం కేసీఆర్ నివాసగృహం ఉత్తర తెలంగాణ భవన్ ఎదుట చేపట్టనున్న హెలిప్యాడ్ నిర్మాణంపై ప్రభుత్వం వెనుకంజ వేసింది. ఈ మేరకు భూసేకరణ కార్యక్రమాన్ని వాయి దా వేస్తున్నట్లు మంగళవారం కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రకటించారు. ఉత్తర తెలంగాణ భవన్ ముందు జిల్లా అధికార యంత్రాంగం సీఎం రాకపోకల సౌకర్యార్థం హెలిప్యాడ్ నిర్మాణం చేపట్టేందుకు సర్వే నంబరు–232లోని 60 మంది రైతులకు చెందిన మొత్తం 5.14 ఎకరాల çస్థ్ధలాన్ని సేకరించేందుకు గతేడాది అక్టోబరులో నోటిఫికేషన్ జారీ చేసింది.
హైకోర్టులో బాధితుల పిటిషన్
హెలిప్యాడ్ నిర్మాణం కోసం తమ భూములను భూసేకరణ చట్టానికి విరుద్ధంగా అధికారులు సేకరిస్తున్నారని పేర్కొంటూ బాధితులు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పి.ప్రతిమతో పాటు మరో నలుగురు ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సోమవారం విచారణ జరిపిన హైకోర్టు రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, రహదారులు, భవనాలశాఖ ముఖ్యకార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, కరీంనగర్ ఆర్డీవోకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశిస్తు విచారణకు వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment