అత్యవసర సమయంలో సాయం అందించేందుకు ముంబైతోపాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో హెలిప్యాడ్లు నిర్మించే ప్రతిపాదనల్లో కదలికవచ్చింది.
సాక్షి, ముంబై: అత్యవసర సమయంలో సాయం అందించేందుకు ముంబైతోపాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో హెలిప్యాడ్లు నిర్మించే ప్రతిపాదనల్లో కదలికవచ్చింది. హెలిప్యాడ్‌ల నిర్మాణం కోసం నగరాభివృద్ధిశాఖ రూపొందించిన ఈ ప్రతిపాదనలు ప్రస్తుతానికి అగ్నిమాపక శాఖకు చేరాయి. 2005 జూలై 26న నగరంలో కురిసిన భారీ వర్షానికి వరదలు వచ్చి ఆస్తి నష్టంతోపాటు 250 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి అత్యవసర సమయంలో దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాలలో సకాలంలో సాయం అందలేకపోయింది. ఇటువంటి పరిస్థితి మళ్లీ తలెత్తితే తీసుకోవల్సిన జాగ్రత్తలు, మార్గదర్శకాలు సూచించేందుకు అప్పట్లో ప్రభుత్వం చితలే కమిటీని నియమించింది. ఈ కమిటి కొన్ని సూచనలు జారీచేసింది.
ఆపద సమయాల్లో హెలిక్యాప్టర్ల ద్వారా సేవలు అందించే సదుపాయం ఉంటే ప్రాణనష్టం తప్పేదని కమిటీ సూచించింది. దీంతో రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో హెలిప్యాడ్డు నిర్మించాలనే ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. అయితే ఎక్కడ? ఎంత ఎత్తులో నిర్మించాలనే ప్రతిపాదనలను నగరాభివృద్ధిశాఖ రూపొందించింది. వీటిని అగ్నిమాపక శాఖకు పంపగా హెలిప్యాడ్ల ఎత్తులో మార్పులు అవసరమని అగ్నిమాపక శాఖ సలహాదారు మిలింద్ దేశ్‌ముఖ్ చెప్పారు. అయితే తాము రూపొందించిన ప్రతిపాదనల్లో.. ముంబై తరహా ప్రధాన నగరాలలో 150-200 మీటర్లకుపైగా ఎత్తున్న భవనాలపై హెలిప్యాడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని నగరాభివృద్ధిశాఖ భావించింది. దీనిపై అగ్నిమాపకశాఖ పక్షం రోజుల్లో తుది నిర్ణయం వెల్లడించనుంది.