property damage
-
ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా..ఏం చర్యలు తీసుకున్నారు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ‘రాష్ట్రంలో వరద కారణంగా ఇంతవరకు ఎంతమంది చనిపోయారు? డిజాస్టర్ చట్టం ప్రకారం ఎంతమందిని రక్షించారు? గోదావరి తీర ప్రాంత గ్రామాల రక్షణకు ఏం చర్యలు చేపట్టారు? బాధితులకు కనీస సౌకర్యాలు అందిస్తున్నారా? వరదలపై వార్‌రూమ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎన్నికలప్పుడు ఏర్పాటు చేస్తారు కానీ.. వరదలు లాంటి అత్యవసర సమయంలో ఏర్పాటు చేయరా?..’అని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో ఓ నివేదికను సోమవారం అందజేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో వెల్లడించడం లేదని, రక్షణ చర్యలు తీసుకునేలా రాష్ట్ర సర్కారుకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పడం లేదు.. ‘వర్షాలు, వరదలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం హెచ్చరించింది. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో వరదల కారణంగా 19 మంది మృతి చెందారని పత్రికల్లో వస్తున్న వార్తలు తెలియజేస్తున్నాయి. వరదలు ఇంకా కొనసాగే అవకాశం ఉందని కేంద్రం మరోసారి తెలియజేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వరదల నుంచి ప్రజలను రక్షించడానికి ఏం చర్యలు తీసుకున్నారు? ఎంత మంది మరణించారు? లాంటి వివరాలను వెల్లడించడం లేదు. కడెం ప్రాజెక్టు వద్ద తీవ్ర భయానక పరిస్థితి కొనసాగుతోంది. ప్రాజెక్టు తెగితే వందల గ్రామాలు నీట మునగడంతో పాటు లక్షల మంది నిరాశ్రయులుగా మారే అవకాశం ఉంది..’అంటూ న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్, పల్లె ప్రదీప్‌కుమార్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ‘వరద బాధితులకు తక్షణమే కనీస సౌకర్యాలు అందేలా ఏర్పాట్లు చేయాలి. కడెం ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని భద్రతా చట్ట ప్రకారం చర్యలు చేపట్టి వెంటనే రక్షించాలి. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా చూడాలి..’అని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. తదు పరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. -
ఆగమవుతున్న ఫ్రాన్స్.. అదుపులోకి రాని పరిస్థితులు, వివాదంలో అధ్యక్షుడు
పారిస్: యూరప్ దేశం ఫ్రాన్స్ రణరంగాన్ని తలపిస్తోంది. నగరాలు, పట్టణాల్లో వాహన, గృహ దహనాలు, దుకాణాల లూటీలు, ఆస్తుల విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఏకంగా 45,000 మంది పోలీసులను రంగంలోకి దించినప్పటికీ పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. రేవు నగరం మార్సిలీలో ఆందోళనకారులు ఓ ఆయుధ దుకాణాన్ని లూటీ చేసి, ఆయుధాలు ఎత్తుకెళ్లారు. యువతీయువకులు బయటకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండేలా వారి తల్లిదండ్రులు చూడాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నాలుగో రోజు శనివారం సైతం పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. శనివారం ఒక్కరోజే 1,311 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటిదాకా 2,400 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,500 దాకా దహనాలు, లూటీల ఘటనలు చోటుచేసుకున్నాయని చెప్పారు. నిరసనకారుల దాడుల్లో వందలాది మంది పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. అయితే, ఎంతమంది నిరసనకారులు గాయపడ్డారన్నది ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. మంగళవారం రాజధాని పారిస్ శివారులోని నాంటెర్రేలో పోలీసు కాల్పుల్లో నేహల్ అనే 17 ఏళ్ల యువకుడు మరణించడం దేశవ్యాప్తంగా తీవ్ర అశాంతికి దారితీసిన సంగతి తెలిసిందే. నేహల్ అంత్యక్రియలను కుటుంబ సభ్యులు, మిత్రులు శనివారం నిర్వహించారు. మతాచారం ప్రకారం తొలుత మసీదులో ప్రార్థనలు చేసి, నాంటెర్రే అనంతరం శ్మశాన వాటికలో ఖననం చేశారు. సంగీత కచేరీలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్స్‌లో ఘర్షణలను నివారించడంలో దారుణంగా విఫలమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. దేశమంతటా ఒకవైపు ఆందోళనలు, హింసాకాండ కొనసాగుతుండగా, మరోవైపు ఆయన పారిస్‌లో ఓ సంగీత కచేరీలో తన భార్యతో కలిసి పాల్గొన్నారు. సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా గడిపారు. భార్యతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ సంగీత కచేరీ బుధవారం జరిగినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మేక్రాన్ నిర్వాకంపై ప్రజలు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. అధ్యక్షుడు చేయాల్సిన పని ఇదేనా? అని మండిపడుతున్నారు. As protesters burn French cities, Macron lights up at Elton John concert in Paris The President of France in these shots is in a great mood, he enjoys music with his wife and dances a little. pic.twitter.com/v1CSKI7WB8 — Spriter Team (@SpriterTeam) June 30, 2023 సోషల్ మీడియానే కారణం: మేక్రాన్ ఫ్రాన్స్‌లో అలజడికి సోషల్ మీడియానే కారణమని అధ్యక్షుడు మేక్రాన్ ఆక్షేపించారు. హింసను ప్రేరేపించడానికి కొందరు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారని, వారిని కచి్చతంగా అరెస్టు చేస్తామని చెప్పారు. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టే ఉద్దేశపూర్వక సమాచారాన్ని సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించాలన్నారు. ఈ విషయంలో ఆయా సంస్థలతో ప్రభుత్వం కలిసి పని చేస్తుందన్నారు. యువత బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని స్పష్టం చేశారు. సోషల్ మీడియాపై ఆంక్షలు విధించాలని అధికారులను మేక్రాన్ ఆదేశించారు. ఇదిలా ఉండగా, మేక్రాన్ సోమవారం నుంచి జర్మనీలో పర్యటించాల్సి ఉంది. స్వదేశంలోని పరిణామాల దృష్ట్యా ఈ పర్యటనను వాయిదా వేసుకున్నారు. అంతమాత్రానికే కాల్చి చంపుతారా? నేహల్ మృతి పట్ల అతడి తల్లి, అల్జీరియా మూలాలున్న మౌనియా స్పందించారు. తన బిడ్డను కాల్చి చంపిన పోలీసు అధికారిపై మాత్రమే తనకు ఆగ్రహం కలుగుతోందని, ఇతరులపై కాదని చెప్పారు. ఏ నేరమూ చేయని పిల్లల ప్రాణాలను బలిగొనే హక్కు పోలీసులకు ఎక్కడిదని ప్రశ్నించారు. తన కుమారుడు నేహల్ చూడడానికి అరబ్ దేశస్తుడిలా కనిపిస్తాడని, అంతమాత్రానికే కాల్చి చంపుతారా? అని నిలదీశారు. -
టాస్క్‌ఫోర్స్ పోలీసులకు టీమార్ట్ అగ్ని ప్రమాదం కేసు
ఖలీల్‌వాడి: నిజామాబాద్ నగరంలోని టీమార్ట్ అగ్నిప్రమాదం కేసు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చేరింది. నగరంలోని హైదరాబాద్ రోడ్డులోని ఆర్యనగర్‌లో గల టీమార్ట్ సూపర్ మార్కెట్లో 2022 ఆగస్టు 28న రాత్రి 2 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. టీమార్ట్‌లో ఉన్న సుమారు రూ. 2 కోట్ల ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితుడు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేక ఇతర కారణలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. కేసులో నగరంలోని ఓ ప్రజాప్రతినిధి బంధువుతో పాటు మరి కొందరు, ఓ పోలీస్ అధికారి ఎంట్రీ కావడంతో కేసు డీలా పడింది. ప్రమాదానికి కారణమైన ఆధారాలను సేకరించిన పోలీసులు.. కొన్నింటిని లేకుండా చేశారనే ఆరోపణలున్నాయి. దీంతో కేసు ఆలస్యం కావడంతో బాధితుడు కొంత కాలంగా పోలీసు అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇన్చార్జి సీపీ ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు ఏసీపీ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో టీమార్ట్ కేసు ఫైల్ మళ్లీ తెరపైకి వచ్చింది. కేసును ట్రాస్క్ఫోర్స్కు అప్పగించడంతో కేసు వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. రంగంలోకి టాస్క్‌ఫోర్స్ టీమార్ట్ అగ్నిప్రమాదం కేసును నీరుకార్చడానికి ప్రయత్నించిన ఓ ప్రజాప్రతినిధి బంధువు, ఓ పోలీసు అధికారి, కొంత మంది వివరాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. కేసును పక్కదారి పట్టించడానికి ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. దీంతో 10 నెలలుగా కేసును పోలీసులు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. తాజాగా ఈ కేసును మళ్లీ టాస్క్‌ఫోర్స్‌కు చేరడంతో ప్రజాప్రతినిధి బంధువుతో పాటు ఓ పోలీసు అధికారి, మరి కొందరు కలిసి బాధితుడితో ఒప్పందం పేరుతో రాజీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మంత్రి, సీపీకి ఫిర్యాదు చేయడంతో..! బాధితుడు శేఖర్ అగ్నిప్రమాదం కేసు విషయమై మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఇన్చార్జి సీపీ ప్రవీణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసును పరిశీలించాలని పోలీసులకు మంత్రి ఆదేశాాలు జారీ చేయడంతో టీమార్ట్ కేసులో పురోగతి వచ్చిందనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఏసీపీ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేసు వివరాలను సేకరించే పనిలో పడినట్లు తెలిసింది. కేసు ఈ సారైనా కొలిక్కి వస్తుందా లేదా అనే సందిగ్ధత నెలకొంది. అయితే కేసు విషయమై టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీధర్‌ను సంప్రదించగా ఇన్చార్జి సీపీ, ఏసీపీల ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
Secunderabad Railway Station: రైల్వేకు నష్టం రూ.12 కోట్లు
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన విధ్వంసంలో ప్రత్యక్షంగా రూ.12 కోట్ల నష్టం వాటిల్లిందని, పరోక్షంగా కూడా కోట్లలో నష్టం ఉంటుందని డివిజన్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తా వెల్లడించారు. శనివారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 30 బోగీలు, 5 రైలు ఇంజన్లు దెబ్బతిన్నాయని.. ప్లాట్‌ఫామ్‌లపై సీసీ కెమెరాలు, టీవీలు, దుకాణాలు, పార్శిళ్లకు పూర్తిగా నష్టం వాటిల్లిందని ఏకే గుప్తా చెప్పారు. రైళ్లు రద్దు కావడంతో జరిగే చెల్లింపులు, పార్శిళ్లు, ఇతర పరోక్ష నష్టాలను అంచనా వేస్తున్నామని తెలిపారు. రైల్వే ప్రయాణికుల లగేజీ కూడా నష్టం జరిగిందన్నారు. రైల్వే సిగ్నల్ వ్య వస్థకు ఎలాంటి నష్టం జరగలేదని.. శుక్రవా రం రాత్రి నుంచే రైళ్లను పునరుద్ధరించామని చెప్పారు. రైళ్లన్నీ యథావిధిగా నడుస్తున్నాయన్నారు. అదృష్టవశాత్తు పవర్ కార్కు ఎలాంటి నష్టం జరగలేదని, అందులో 3 వేల లీటర్ల డీజి ల్ ఉండటం వల్ల నిప్పంటుకుంటే నష్టం తీవ్రం గా ఉండేదని తెలిపారు. ఇందులో కుట్ర కోణ మేదైనా ఉందా అన్నదానిని దర్యాప్తు సంస్థలు తేలుస్తాయన్నారు. ఘటనలో 8 మంది రైల్వే సిబ్బందికి స్వల్పగాయాలైనట్టు చెప్పారు. -
‘లాయల్ టెక్స్టైల్స్’లో భారీ అగ్ని ప్రమాదం
నాయుడుపేట టౌన్: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలంలోని మేనకూరు పరిశ్రమల కేంద్రంలో ఉన్న లాయల్ టెక్స్టైల్స్ పరిశ్రమలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రూ.కోట్లలో ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అగ్నిమాపక శాఖ అధికారుల కథనం మేరకు.. పరిశ్రమలో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు రావడంతో కార్మికులు బయటకు పరుగులు పెట్టారు. పరిశ్రమ ప్రతినిధులు వెంటనే అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారమిచ్చారు. అగ్ని మాపక శాఖ ఇన్చార్జి అధికారి టి.చలమయ్య ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేశారు. నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, కోట తదితర ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలను రప్చించారు. పరిశ్రమలోని దూది గోదాముతో పాటు వస్త్రాలు భద్రపరిచే గోడౌన్లను మంటలు చుట్టముట్టాయి. రాత్రి పొద్దు వరకు కూడా ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు. సీఐ సోమయ్య సర్కిల్ పరిధిలోని ఎస్ఐలతో కలిసి వెళ్లి సహాయక కార్యక్రమాలు చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. -
4 యూనిట్లలో భారీ నష్టం
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాద ఘటనలో జరిగిన ఆస్తి నష్టంపై ప్రాథమిక అంచనాకు వచ్చేందుకు ఒక ట్రెండు రోజులుపట్టే అవకాశముందని విద్యుత్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. జల విద్యుత్ కేంద్రంలో 150 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంగల ఆరు యూనిట్లు ఉండగా, నాలుగు యూనిట్లలో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మొదటి, రెండో యూనిట్లో ప్రమాద తీవ్రత తక్కువగా ఉండటంతో నష్టం కూడా స్వల్పం గానే ఉండే అవకాశముందని భావిస్తున్నారు. స్వల్ప మరమ్మతులతో ఒకటి, రెండో యూని ట్లను వీలైనంత త్వరగా పునరుద్ధరించి తిరిగి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించే అవకాశముందని జెన్కో వర్గాలు ‘సాక్షి’కి వెల్లడించాయి. ఆరో యూనిట్ నుంచి మంటలు.. ఆరో యూనిట్‌లోని ఎక్సైలేషన్ ప్యానెల్లో అగ్ని ప్రమాదం తలెత్తి ఐదు, నాలుగు, మూడో యూనిట్ వరకు విస్తరించినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. అయితే ప్రమాదం జరిగి మూడు రోజులు గడుస్తున్నా ఘటనాస్థలికి అధి కారులు చేరుకోలేకపోతున్నారు. పొగతోపాటు తీవ్రమైన వేడి ఉండటంతో పూర్తిస్థాయిలో ప్రమాద నష్టాన్ని అంచనా వేయలేకపోతున్నారు. ప్యానెళ్లు, కేబుళ్లు, స్టార్టర్లు ఇతర సామగ్రి దెబ్బతినడంతో నష్టం ఏ స్థాయిలో జరిగిందో తెలుసుకొనేందుకు కొంత సమయం పడుతుందని భావిస్తున్నారు. సోమవారం నాటికి కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబున్నారు. నష్టం అంచనాకు టెక్నికల్ కమిటీ... శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో ఈ నెల 20న జరిగిన అగ్నిప్రమాద ఘటనపై విచారణకు సంబంధించి టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేస్తూ జెన్కో–ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ సంస్థల్లో పనిచేస్తున్న సీనియర్ ఇంజనీర్లను ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు. దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ జి. రఘుమారెడ్డి చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీకి జెన్కో సీఈ పి.రత్నాకర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ట్రాన్స్‌కో జెఎండీ సి. శ్రీనివాస్‌రావు, ట్రాన్స్‌కో డైరెక్టర్ టి. జగత్‌రెడ్డి, జెన్కో డైరక్టర్ ఎం.సచ్చిదానందం కమిటీ సభ్యులుగా ఉంటారు. జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదానికి దారితీసిన పరిస్థితులతోపాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, ప్రతిపాదనలతో కూడిన నివేదికను 15 రోజుల్లోగా కమిటీ సమర్పించాల్సి ఉంటుంది. బాధిత కుటుంబాలకు జెన్కో తరఫునా సాయం: సీఎండీ శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు తాను ఘటనాస్థలికి చేరుకున్నా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని ట్రాన్స్‌కో–జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. ‘ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్, సీఐఎస్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాం. ప్లాంటులో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకటి, పొగ అలుముకొని ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే యూనిట్ ఆటోమెటిక్‌గా ట్రిప్ కావాల్సి ఉన్నా ఎందుకు జరగలేదనే దానిపై విచారణ కమిటీ వేశాం. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, ఎమర్జెన్సీ వెంటిలేటర్ కూడా తెరుచుకోకపోవడంతో వెంటిలేషన్ నిలిచిపోయింది. నెల రోజులుగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా రోజుకు 128 మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉందని కొంత మేర తగ్గించాం. గతంలోనూ ఎన్టీపీసీతోపాటు నైవేలి లిగ్నైట్ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో జరిగిన ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. శ్రీశైలం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. జెన్కో తరఫున కూడా బాధిత కుటుంబాలకు సాయం అందజేస్తాం. ఒకటి, రెండు యూనిట్లలో 15 రోజుల్లోగా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఇంజనీర్లు కృషి చేస్తున్నారు’ అని సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను సీఎండీ స్వయంగా పరామర్శించి బాధిత కుటుంబాల్లో భరోసా నింపాలని నిర్ణయించారు. మన పని అయిపోయింది మోహన్‌తో సుందర్ చివరి సంభాషణ సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందిన ఘటనకు సంబంధించి ఏఈలు సుందర్ నాయక్, మోహన్ల చివరి సంభాషణ వెలుగులోకి వచ్చింది. అలాగే చనిపోయే ముందు మోహన్ తన సెల్ఫోన్లో తీసిన ప్రమాద దృశ్యాల వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. భర్త ఫోన్‌కు చార్జింగ్ పెట్టిన మోహన్ భార్య ఆ వీడియోలోని దృశ్యాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సంభాషణ ఇదీ... సుందర్: ఇక కష్టం! మన పని అయిపోయింది. ఆశలు వదులుకో... మోహన్: నై బై.. ఆశగా ఉండాలె. కొద్దిసేపు ఆలోచించుకొని పోదాం. సుందర్: ఇక మనం బతకం. పొగ మొత్తం అలుముకుంది. నేను చనిపోవచ్చు.. పిల్లలు జాగ్రత్త: భార్యతో సుందర్ చివరి మాటలు చివ్వెంల (సూర్యాపేట): ఏఈ సుందర్ నాయక్ తన భార్యతో జరిపిన ఫోన్ సంభాషణ కూడా వైరల్‌గా మారింది. ‘ఇక్కడ ప్రమాదం జరిగింది.. నేను చనిపోవచ్చు.. పిల్లలు జాగ్రత్త. ఇక్కడ మంటలు, పొగ బాగా వస్తున్నాయి. నేను మాట్లాడే పరిస్థితి లేదు’ అంటూ తన భార్య ప్రమీలతో సుందర్ చివరిసారిగా మాట్లాడారు. తన భర్త చేసిన చివరి ఫోన్కాల్తోపాటు ఆ రోజు జరిగిన విషయాలను ప్రమీల ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలోని ఎంసీఆర్ (మెయిన్ కంట్రోల్ రూమ్)లో విధులు నిర్వహించేందుకు ఇంటి నుంచి ఆయన 20వ తేదీ రాత్రి 8:15 గంటలకు బయలుదేరారు. రాత్రి 11:45 గంటలకు ఆయన నుంచి ఫోన్ వచ్చింది.. అది చూస్తూనే ఏదో జరిగిందని అర్థమైంది. ఆయన మాట్లాడుతుండగానే ఫోన్ కట్ అయింది. 33 సెకన్లు మాత్రమే నాతో మాట్లాడిండు. ఆ తర్వాత గంట వరకు ఫోన్ చేసినా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అర్ధరాత్రి 2 గంటల వరకు మెయిన్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఏదో జరిగిందని భయం వేసి ఆ రాత్రే నా పిల్లలతో వెళ్లి కాలనీలో పక్కనే తెలిసిన వారింట్లో ఉన్నా. 21వ తేదీ ఉదయం అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల ద్వారా జల విద్యుత్ కేంద్రంలో పేలుడు జరిగిందని, అందులో కొందరు చిక్కుకుపోయారని తెలిసింది. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో నా భర్త చనిపోయారని చెప్పారు. ఆయన ఇక మాకు దక్కడని, ఇంత ప్రమాదం జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదు. ఆయన చివరి మాటలు ఇప్పటికీ నా చెవిలో మార్మోగుతున్నాయి’ అంటూ ప్రమీల కన్నీటి పర్యంతమయ్యారు. ప్రమాద సమయంలో ఫోన్లో ఆయన తీసిన వీడియోలు మాకు వచ్చాయి. ఆయన ఎంత ప్రమాదంలో చిక్కుకున్నారో అవి చూశాక అర్థమైంది. చీకట్లో ఆయన వీడియో తీస్తూ మిత్రులతో ఆపద ఉన్నట్లు మాట్లాడింది చూస్తే ఆయన బతికి ఉంటాడేమో అనిపించింది. కానీ మంటలు, పొగ వల్ల ఆయన ఒళ్లంతా కాలి చనిపోయారు’ అని ప్రమీల విలపించారు. సీఐడీ విచారణ షురూ ►భూగర్భ జలవిద్యుత్ కేంద్రాన్ని పరిశీలించిన సీఐడీ చీఫ్ గోవింద్‌సింగ్ ►నాలుగు బృందాలతో విచారణ ►ప్యానెల్ బోర్డులకు రివర్స్ పవర్‌పై అనుమానాలు సాక్షి, నాగర్‌కర్నూల్/మన్ననూర్/అమ్రాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ కేం ద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఐడీ విచారణ ప్రారంభమైంది. సీఐడీ చీఫ్ అదనపు డీజీ గోవింద్ సింగ్ నేతృత్వంలో డీఐజీ సుమతి, సీఐడీ ఏఎస్పీ శ్రీనివాసన్, ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు ఇన్స్పె క్టర్లు, ఎలక్ట్రికల్, ఫోరెన్సిక్ సైన్స్, సీఐడీ, స్థానిక పోలీసులు.. 4 టీమ్‌లతో 25 మందితో కూడిన బృందం విచారణ చేపట్టింది. శనివారం మధ్యా హ్నం జెన్కో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అగ్నిప్రమాదానికి సంబంధించి విచారణకు అన్ని విభాగాల అధికారులు, కార్మికులు సహకరించాలని గోవింద్‌సింగ్ బృందం కోరింది. సంఘటకు సంబంధించి జెన్కో అధికారులను అడిగి ప్రాథమికంగా వివరాలు సేకరించింది. కాగా, ఆదివారం ప్రమాద సంఘటనపై సమీక్ష జరిపిన గోవింద్‌సింగ్.. పవర్‌హౌస్‌లో ప్రమాదం జరిగిన ప్రదేశాలు, ప్లాంట్లను సీఈ ప్రభాకర్, డీఎస్పీ నర్సింహులు తదితర ఉన్నతాధికారులతో కలసి పరిశీలించారు. ఇప్పటికీ తగ్గని పొగలు.. అగ్ని ప్రమాదంలో విద్యుత్ కేంద్రంలోని 4వ యూనిట్లో ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. దీనికి సంబంధించిన కొన్ని బ్యాటరీలు ధ్వంసమయ్యాయి. కాగా, పవర్ ప్లాంట్‌లో ఇప్పటికీ పొగలు తగ్గలేదు. ప్రస్తుతం బ్లోజర్స్ను ఉపయోగించి పొగ తగ్గించే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సిబ్బంది పవర్ హౌస్‌లోకి వెళ్లేందుకు వీలుగా తాత్కాలికంగా విద్యుత్ సదుపాయం కల్పించి, ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. అగ్ని ప్రమాదంలో ధ్వంసమైన విభాగాలను గుర్తించే పనిలో ప్రస్తుతం సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. ప్రమాదంపై వివిధ కోణాల్లో విచారణ.. ప్రమాద ఘటనపై వివిధ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆశించిన స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు అదనపు బ్యాటరీల అవసరం ఉందని జెన్కో ఏఈలు రెండు నెలలుగా కోరుతున్నప్పటికీ వెంటనే స్పందించని ఓ ఉన్నతాధికారి, ప్రమాదం జరగడానికి రెండు రోజుల ముందే బ్యాటరీలు తెప్పించినట్లు తెలుస్తోంది. అయితే అప్పటికే కార్మికుల కృషి ఫలితంగా ఆశించిన మేరకు యూనిట్లు పని చేస్తున్నాయని, హైదరాబాద్‌కు చెందిన ఓ అధికారి సూచన మేరకు బ్యాటరీలు మార్పిడి చేశారని సమాచారం. ఆ విధంగా మార్చడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని పవర్ ప్లాంట్ ఇంజనీర్లు పదేపదే సూచనలు చేసినప్పటికీ ఆ అధికారి బ్యాటరీలను బిగింపజేశారని పలువురు ఉద్యోగులు, కార్మికులు ఆరోపణలు చేస్తున్నారు. బ్యాటరీల సామర్థ్యం పెరగడంతో 180 మెగావాట్లు ఉత్పత్తి కావాల్సిన విద్యుత్.. ఒక్కసారిగా 200 మెగావాట్లకు చేరడంతో షార్ట్ సర్క్యూట్ సంభవించి ఉండొచ్చని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి అధికంగా జరగడమే ప్రమాదానికి కారణమా? అనే కోణంలో కూడా విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. బ్యాటరీల నుంచి రివర్స్ పవర్ ప్యానల్ బోర్డులకు రావడం వల్ల కూడా ఘటన జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ప్రమాదం సందర్భంగా ఉద్యోగులు తీసిన వీడియోలు, సీసీ కెమెరాల ఫుటేజీలను, ఇతర ఆధారాలను సీఐడీ సేకరిస్తోంది. అమరాన్ కంపెనీ టెక్నీషియన్ల పనితీరుపైనా సీఐడీ అధికారులు ఆరా తీశారు. ప్యానల్ నుంచి ట్రాన్స్ఫార్మర్లకు, రియాక్టర్లకు మంటలు ఎలా వ్యాపించాయి? సంఘటన జరిగినప్పుడు అలారం సైరన్లు పని చేశాయా? లేదా? అనే అంశాలపై అధికారులు విచారించారు. పోస్టుమార్టం ప్రాథమిక నివేదికను కూడా పరిశీలించారని, మృతుల శరీరాల్లో సరిపడినంత ఆక్సిజన్ లేకపోవడం, ఊపిరి తిత్తుల్లో పొగ నిండిపోవడమే 9 మంది మరణానికి కారణంగా నివేదికలో ఉన్నట్లు సమాచారం. పొగలు కమ్ముకోవడంతోనే మృతి! యూనిట్–4 పవర్ బోర్డులో మంటలు రావడంతో దట్టమైన పొగలు కమ్ముకోవడవం వల్లే అందులో చిక్కుకున్న ఉద్యోగులు చనిపోయారని జెన్కో అధికారులు సీఐడీ బృందానికి వివరించినట్లు తెలిసింది. మంటలు ఆర్పే ప్రయత్నంలోనే 9 మంది సిబ్బంది యూనిట్–1లో చిక్కుకున్నారని, ప్రమాదం కారణంగా కరెంటు çపవర్ ట్రిప్ కావడంతో ఎగ్జాస్ట్ ఫ్యాన్లు పనిచేయకపోవడం వల్ల పొగ పేరుకుందని, మొత్తం చీకటిగా మారడంతో సిబ్బంది పూర్తిగా పొగలో చిక్కుకుపోయారని సీఐడీ బృందానికి తెలిపారు. క్షణాల్లో పొగలు కమ్ముకోవడంతో సిబ్బందికి ఆక్సిజన్ సమస్య ఎదురైందని, ముగ్గురు సిబ్బంది సీట్లోనే చనిపోయారని, మిగిలిన ఆరుగురు ఎగ్జిట్ వైపు పరుగులు తీశారని సీఐడీకి వివరించారు. ఉద్యోగులు, కార్మికుల మృతికి సంతాపం.. ప్రమాదంలో మృతి చెందినవారికి నివాళిగా ఉద్యోగులు మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం పవర్ హౌస్ గేటు ముందు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ తమతో కలసి పని చేసిన మిత్రులు కళ్ల ముందే నిమిషాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. సోమవారం కొవ్వొత్తుల ర్యాలీ, ఈ నెల 25న సంతాప సభ నిర్వహిస్తామని ఉద్యోగ నేతలు పేర్కొన్నారు. -
2,700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ వల్లే..
బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్ నగరంలో మంగళవారం సంభవించిన శక్తివంతమైన పేలుడులో మృతుల సంఖ్య 135కు చేరిందని, 5,000 మందికి పైగా ప్రజలు గాయపడ్డారని లెబనీస్ రెడ్‌క్రాస్ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారి జార్జి కెటానెహ్ చెప్పారు. నగరంలో ఇటీవలి కాలంలో ఇదే అతి పెద్ద పేలుడని భావిస్తున్నారు. బుధవారం నగరంలో బీతావహ దృశ్యాలు కనిపించాయి. పోర్ట్ నుంచి ఇప్పటికీ పొగ వెలువడుతోంది. పరిసర ప్రాంతాలు బూడిద, వ్యర్థాలతో నిండిపోయాయి. పెద్దసంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. భవనాలు నేలమట్టమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. చిన్న మంటగా మొదలైన ఈ విస్ఫోటనం క్షణాల్లోనే భీకర రూపం దాల్చింది. ఈ దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. 1975–1990 మధ్య జరిగిన సివిల్ వార్‌లో, పొరుగు దేశం ఇజ్రాయెల్‌తో జరిగిన ఘర్షణల్లో, ఉగ్రవాద దాడుల్లో ఇలాంటి పేలుళ్లు కనిపించాయని స్థానికులు అంటున్నారు. ప్రాణాలు తీసిన అమ్మోనియం నైట్రేట్ 2,700 టన్నులకు పైగా అమ్మోనియం నైట్రేట్‌కు మంటలు అంటుకోవడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లు లెబనాన్ మంత్రి మొహమ్మద్ ఫహ్మీ చెప్పారు. బీరుట్ పోర్ట్‌లోని ఓ గోదాములో దీన్ని నిల్వ చేసినట్లు తెలిసింది. 2014లో ఓ సరుకు రవాణా నౌక నుంచి ఈ అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు జరిగిన వెంటనే ముదురు నారింజ రంగు మేఘం పుట్టుగొడుగు ఆకారంలో ఆకాశంలోకి ఎగిరిపోతున్న దృశ్యం కనిపించింది. విషపూరితమైన నైట్రోజన్ డయాక్సైడ్ గ్యాస్ విడుదలైంది. దీన్ని పీల్చడం వల్ల చాలామంది శ్వాస ఆడక ప్రాణాలొదిలారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న భవనాలు ధ్వంసమయ్యాయి. ఆహార సంక్షోభం తప్పదా? చాలా చిన్న దేశమైన లెబనాన్‌లో ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుప్పకూలింది. సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. ప్రజల్లో అసంతృప్తిజ్వాలలు రగులుతున్నాయి. వారు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. మరోవైపు కరోనా మహమ్మారి లెబనాన్‌పై పంజా విసురుతోంది. ఆసుపత్రులు కరోనా బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పేలుడు సంభవించి, 135 మంది అమాయక జనం చనిపోవడం పాలకులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. లెబనాన్ 10 లక్షల మందికి పైగా సిరియా శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తోంది. విదేశాల నుంచి నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాల దిగుమతికి బీరూట్ పోర్ట్ అత్యంత కీలకం. తాజా పేలుడు వల్ల ఈ ఓడరేవు చాలావరకు నామరూపాల్లేకుండా పోయింది. దిగుమతులన్నీ ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. దేశంలో ఇకపై ఆహార సంక్షోభం తప్పదని వాదన వినిపిస్తోంది. భారత ప్రధాని మోదీ దిగ్భ్రాంతి లెబనాన్‌లో పేలుడు సంభవించి, 135 మంది మరణించడం పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మిన్నంటిన ఆక్రందనలు కూలిన భవనాలు, రేగుతున్న పొగలు, గల్లంతైన కుటుంబ సభ్యులు.. ఇదీ ప్రస్తుతం బీరుట్ లో పరిస్థితి. ఓ వైపు అంబులెన్స్ సైరన్లు మోగుతుంటే మరోవైపు బాధితుల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. దారుణమైన ఈ పేలుడు నగరాన్ని ఛిద్రం చేసేసింది. రంగు రంగుల అద్దాలతో, అందమైన రాళ్ల నిర్మాణాలతో ఉన్న ప్రాంతమంతా మరుభూమిగా మారింది. తరాల పాటు నిర్మించిన భవనాలు క్షణాల్లో నేలమట్టమయ్యాయి. 1975 నుంచి 1990ల మధ్య జరిగిన సివిల్ వార్‌ను సైతం తట్టుకున్న భవనాలు, పేలుడు ధాటిని మాత్రం తట్టుకోలేక చరిత్రలో కనుమరుగయ్యేలా నేలకూలాయి. ఇంటి బాల్కనీలు రోడ్డు నడిమధ్యకు వచ్చి పడ్డాయి. రెస్టారెంట్లు, షాపుల్లోని కుర్చీలు ఎవరినీ రానివ్వద్దన్నట్టు తలకిందులుగా పడిపోయాయి. నేనెక్కడికెళ్లాలి ? నేనేం చేయాలి అంటూ కుప్పకూలిన ఓ ఇంటి ఎదుట యజమానురాలు బాధను వ్యక్తం చేస్తూ కనిపించింది. పసి పిల్లలు పేలుడు ధాటికి ఆస్పత్రుల పాలయ్యారు. ఇంతకు మించి వినాశనమంటూ ఉంటుందా అనే స్థాయిలో నగరం దిబ్బగా మారింది. ప్రస్తుతానికైతే కుయ్ మంటూ తిరిగే అంబులెన్సులు, రాళ్లెత్తి మరీ మనుషుల కోసం వెతుకుతున్న వాలంటీర్ల శ్రమ, అయినవారిని కోల్పోయి రోదిస్తున్న బాధితుల ఆక్రందనలు మాత్రమే కనిపిస్తున్నాయి. లెబనాన్‌కు వెల్లువెత్తుతున్న సాయం లెబనాన్‌కి అంతర్జాతీయ సమాజం నుంచి సహాయం వెల్లువెత్తుతోంది. లెబనాన్‌లో సంభవించిన పేలుడు అనంతరం క్షతగాత్రులను ఆదుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ విమానాల ద్వారా అవసరమైన మందులను పరికరాలను పంపిస్తున్నట్లు వెల్లడించింది. మందులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్‌లోని మానవతా సహాయ కేంద్రం నుంచి క్షతగాత్రులకు చేరవేస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో అధికార ప్రతినిధి తారిక్ జెసా రెవిక్ చెప్పారు. ఓడరేవు కేంద్రంగా జరిగిన భారీ పేలుడు ప్రభావంతో అనేక భవనాలు శిథిలమయ్యాయి. బీరుట్లో బీభత్సం సృష్టించిన ఈ పేలుడు ప్రభావంతో ప్రజా జీవనం ఛిన్నాభిన్నమైంది. యూరోపియన్ సమాజం, రష్యా, నార్వే, టర్కీ, నెదర్లాండ్స్, సైప్రస్, గ్రీక్, ఫ్రాన్స్, జర్మనీ, పోలండ్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు ఇప్పటికే మందులు, వాహనాలు, హెలికాప్టర్లు, అంబులెన్సులు, వైద్య బృందాలు, రెస్క్యూ టీమ్‌లను తరలించడం ప్రారంభించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ లెబనాన్‌ను సందర్శించారు. దేశాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో అనేక విదేశీ రాయబార కార్యాలయాలు సైతం దెబ్బతిన్నాయి. కష్టాల్లో ఉన్నాం.. ఆదుకోండి ప్రపంచ దేశాలకు లెబనాన్ ప్రధాని వేడుకోలు ఆర్థిక సంక్షోభంతోపాటు బీరుట్లో పేలుడు వల్ల తాము కష్టాల్లో కూరుకుపోయామని, ప్రపంచ దేశాలు, మిత్ర దేశాలు వెంటనే స్పందించి, ఆదుకోవాలని లెబనాన్ ప్రధానమంత్రి హసన్ దియాబ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో ప్రసంగం విడుదల చేశారు. పేలుడుకు పాల్పడి, అమాయకుల ప్రాణాలను బలిగొన్న వారు ఎప్పటికైనా మూల్యం చెల్లించకోక తప్పదని పేర్కొన్నారు. పేలుడులో గాయపడిన మహిళకు చికిత్స అందిస్తున్న ఆరోగ్య కార్యకర్త పేలుడులో గాయపడిన చిన్నారి పేలుడు వల్ల ఎగిసిపడుతున్న మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది -
బెంగాల్, ఒడిశాల్లో విధ్వంసం
సాక్షి, విశాఖపట్నం/కోల్‌కతా/భువనేశ్వర్: అతి తీవ్ర తుపాను ‘ఉంపన్’ పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో భారీ విధ్వంసం సృష్టించింది. ప్రభుత్వాలు తీసుకున్న ముందస్తు జాగ్రత్తలతో.. ప్రాణనష్టం తప్పినా.. ఆస్తినష్టం భారీగానే వాటిల్లింది. పశ్చిమబెంగాల్లోని దీఘా బంగ్లాదేశ్‌లోని హతియా ద్వీపం మధ్య బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో అతి తీవ్ర తుపానుగా ఉంపన్ తీరం దాటింది. ఆ సమయంలో తీరం వెంబడి బీభత్సం సృష్టించింది. (తగ్గుతున్న వెరీయాక్టివ్ క్లస్టర్లు) గంటకు సుమారు 190 కిమీల వేగంతో వీచిన పెనుగాలులు, భారీ వర్షాల కారణంగా బలహీనమైన ఇళ్లు నేలమట్టం అయ్యాయి. భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్, సమాచార వ్యవస్థ ధ్వంసమయింది. ఇళ్ల పై కప్పులు ఎగిరిపోయాయి. తీరం దాటే సమయంలో తీరంలో అలలు భారీగా ఎగసిపడ్డాయి. కోల్‌కతాలో లోతట్టు ప్రాంతాలు వర్షం నీటిలో మునిగిపోయాయి. ఒడిశాలో పురి, ఖుర్ద, జగత్సింగ్పుర్, కటక్, కేంద్రపార, జాజ్‌పుర్, గంజాం, భద్రక్, బాలాసోర్‌ల్లో మంగళవారం నుంచి భారీ వర్షపాతం నమోదైంది. తుపాను ప్రభావం ప్రారంభమవడానికి ముందే రెండు రాష్ట్రాల్లో 6.58 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. భారీ ఈదురుగాలులకు చెట్లు నేలకూలి తమపై పడిన వేర్వేరు ఘటనల్లో పశ్చిమబెంగాల్లోని హౌరా, నార్త్ 24 పరగణ జిల్లాల్లో ముగ్గురు చనిపోయారు. జాతీయ విపత్తు స్పందన దళాలు రెండు రాష్ట్రాల్లో సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టాయని ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ బుధవారం తెలిపారు. ఒడిశాలో 20 బృందాలు, పశ్చిమబెంగాల్లో 19 బృందాలు ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయన్నారు. రోడ్లపై పడిన భారీ వృక్షాలను తొలగిస్తున్నాయన్నారు. పశ్చిమబెంగాల్లో 5 లక్షల మందిని, ఒడిశాలో 1.58 లక్షల మందిని సహాయ కేంద్రాలకు చేర్చామన్నారు. పశ్చిమబెంగాల్లోని దక్షిణ, ఉత్తర 24 పరగణ జిల్లాలు, తూర్పు మిద్నాపూర్ జిలాల్లో తుపాను ప్రభావం తీవ్రంగా ఉందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహోపాత్ర తెలిపారు. వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పంటలు, మౌలిక వసతులకు ఎక్కువగా నష్టం వాటిల్లిందన్నారు. ఈ తుపాను కారణంగా అస్సాం, మేఘాలయాల్లో గురువారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. బంగాళాఖాతంలో తుపాను ఏర్పడినప్పటి నుంచి, తుపాను దిశ, తీవ్రత విషయంలో వాతావరణ శాఖ అంచనాలన్నీ 100% కచ్చితత్వంతో వాస్తవమయ్యాయన్నారు. సహాయ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ సమర్ధంగా వ్యూహాలు రూపొందించుకోగలిగిందన్నారు. బంగ్లాదేశ్‌లో... ఉంపన్ బంగ్లాదేశ్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. పెను గాలులు, భారీ వర్షాల కారణంగా తీర ప్రాంతాల్లో ఇళ్లు కూలాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరానిలిచిపోయింది. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సమయంలో బోటు బోల్తా పడటంతో వాలంటీరు చనిపోయారు. పలు జిల్లాల్లో అత్యంత ప్రమాదకర హెచ్చరిక స్థాయిని అధికారులు ప్రకటించారు. 20 లక్షల మందిని సహాయ కేంద్రాలకు తరలించామని, ఆర్మీని రంగంలోకి దింపామని ప్రధాని షేక్ హసీనా చెప్పారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘గజ’ తుపాను మృతులు 59
సాక్షి ప్రతినిధి, చెన్నై: దక్షిణ తమిళనాడుపై గజ తుపాను తీవ్ర ప్రభావం చూపింది. తుపాను కారణంగా చనిపోయిన వారి సంఖ్య అనధికారిక లెక్కల ప్రకారం శనివారం నాటికి 59కి చేరింది. కొండచరియలు విరిగిపడటంతో కొడైకెనాల్లో నలుగురు చనిపోయారు. దాదాపు ఏడు జిల్లాల్లో ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తినష్టం సంభవించింది. గజ తుపాను నాగపట్నం–వేదారణ్యం మధ్యన శుక్రవారం తీరం దాటిన విషయం తెలిసిందే. తీరం దాటుతున్న సమయంలో అత్యంత తీవ్రతతో వీచిన ఈదురుగాలులు, వర్షాలు కడలూరు, తంజావూరు, తిరువా రూరు, నాగపట్నం, దిండు గల్లు, పుదుక్కోటై, రామనాధపురం జిల్లాల్లో పెను విధ్వంసం సృష్టించాయి. ఈ తుపాను కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని కారైక్కాల్ జిల్లాలోనూ తీవ్ర ప్రభావం చూపింది. తంజావూరు, నాగపట్నం, తిరువారూరు జిల్లాల్లో రూ. 10 వేల కోట్లు నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు. కొడైకెనాల్ పరిసరాల్లో 50కి పైగా ప్రాంతాల్లో రోడ్లు తెగిపోవడంతో, వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. 22 వేల ఇళ్లు పాక్షికంగాను, పూర్తిగాను దెబ్బతిన్నాయి. తుపానువల్ల తంజా వూరు, తిరువారూరు, నాగపట్నం, తదితర జిల్లాల్లో తీవ్రస్థాయిలో పంటనష్టం సంభవించింది. కాగా, తుపాను సహాయ చర్యలను ప్రభుత్వం సమర్ధవంతంగా నిర్వహించడంపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వచ్చాయి. కాగా, ఈ తుపాను వల్ల 36 మంది చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. పుదుకోట్టైలో ఏడుగురు, కడలూరులో ముగ్గురు, నాగపట్నంలో నలుగురు, తంజావూరులో నలుగురు, తిరుచ్చిలో ఇద్దరు, దిండుగల్‌లో ఇద్దరు, శివగంగైలో ఇద్దరు సహా మొత్తం 36 మంది ప్రాణాలు కోల్పోయారని జాతీయ విపత్తు సహాయ దళం ప్రకటించింది. -
జపాన్‌లో భూకంపం.. ముగ్గురు మృతి
టోక్యో: భారీ భూకంపంతో జపాన్ వణికింది. జపాన్‌లో రెండో అతిపెద్ద నగరమైన ఒసాకాలో సోమవారం రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. తీవ్రత తక్కువే అయినప్పటికీ శక్తిమంతమైన ప్రకంపనల కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగింది. 9 ఏళ్ల బాలిక సహా ముగ్గురు మరణించారు. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. సుమారు 20 లక్షల మంది నివసించే ఒసాకా నగరంలో ఉదయం 8 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. భవనాలు ఊగడం, పైపులు పగిలిపోయి నీళ్లు విరజిమ్మడం వీడియోల్లో కనిపించింది. వేలాది మంది ప్రయాణికులు రోడ్లపైనే నిలిచిపోగా.. చాలాచోట్ల విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఉత్తర ఒసాకాలోని టకట్సుకీలో భూకంపం కారణంగా పాఠశాల గోడ కూలి 9 ఏళ్ల బాలిక మరణించింది. ఓ వృద్ధుడు (80) కూడా గోడ కూలి మృతి చెందగా, ఇంటిలోని బుక్ షెల్ఫ్ మీద పడటంతో మరో 84 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. వచ్చే రెండు మూడు రోజుల్లో మరింత తీవ్రతతో కూడిన ప్రకంపనలు సంభవించే ప్రమాదముందని ప్రభుత్వ అధికార ప్రతినిధి యోషిహిడే సుగా హెచ్చరించారు. కాగా, జపాన్ ప్రభుత్వం ఎలాంటి సునామీ హెచ్చరికలూ జారీ చేయలేదు. -
గూడు చెదిరింది.. బూడిదె మిగిలింది
వారంతా నిరుపేదలు... పనికి వెళ్తేనే పూట గడిచేది... లేకపోతే పస్తులే... ఎంతో కష్టపడి తలదాచుకోవడానికి గూడు వేసుకున్నారు... రోజు వారి జీవనానికి అవసరమయ్యే వస్తువులను సమకూర్చున్నారు... అంతో ఇంతో కూడబెట్టుకున్నారు... ఒక్క సారిగా వారి జీవితాన్ని.. అగ్ని ప్రమాదం బుగ్గిపాలు చేసింది... గుడిసెలు కాలిపోయాయి... అందులో ఉన్న కొద్దిపాటి సామగ్రి బూడిదైంది... కట్టుబట్టలతో మిగిలారు... పుస్తకాలు కాలిపోవడంతో తాము బడికెలా వెళ్లాలని పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు... ఇది బద్వేలు సమీపంలోని బాధితుల పరి(దు)స్థితి. బద్వేలు/బద్వేలు అర్బన్ : బద్వేలు సమీపంలోని నెల్లూరు రోడ్డులో గురుకుల పాఠశాల వెనుక ప్రాంతంలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయారు. అక్కడ దాదాపు 3,200 మంది ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగించే వారు. గురువారం రాత్రి సంభవించిన అగ్నిప్రమాదంలో మొత్తం 2 వేల గుడిసెలు కాలిపోయాయి. దాదాపు ఆరు వేల మంది నిరాశ్రయులుగా మిగిలారు. రూ.60 లక్షల పైనే ఆస్తి నష్టం సంభవించింది. ఈ ప్రమాదం జరగడానికి గల కారణం స్థానికులు తెలిపిన ప్రకారం ఇలా ఉంది. ఒక గుడిసెలో వంట చేస్తుండగా నిప్పురవ్వలు చెలరేగి మంటలు వ్యాపించాయి. గాలితో ఇవి చాలా స్వల్ప సమయంలో మిగతా గుడిసెలకు వ్యాపించాయి. ఆ గుడిసెలన్నింటినీ కేవలం ఎండుకర్రలు, బోద, ప్లాస్టిక్‌తో నిర్మించారు. దీంతో మంటలు అదుపులోకి రాలేదు. మంటలు నలుదిశలా వ్యాపించడంతో ఆగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చేందుకు వీలు లేని పరిస్థితి ఏర్పడింది. ఒక గుడిసె నుంచి మరో గుడిసెకు ఇలా... రెండు గంట వ్యవధిలో రెండు వేల గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. తెల్లవారే సరికి బూడిద మాత్రమే మిగిలింది. అధిక శాతం దినసరి కూలీలే: బాధితులలో చాలా మంది దినసరి కూలీలే. కూ లికెళితే గానీ పూట గడవని పరిస్థితి. మున్సిపల్ కూలీలు, హమాలీలు, బేల్దారులు, మెకానిక్ షెడ్డులలోని దినసరి కూలీలు.. ఇలా ప్రతి ఒక్కరూ రోజూ పనికి వెళ్లి జీవనం సాగించే వారే. ఈ స్థలం మంజూరు చేయాలని కోరుతూ.. వీరంతా ఇక్కడే నివాసం ఉంటున్నారు. ప్రస్తుత ప్రమాదంలో సర్వస్వం కోల్పోయారు. కట్టుబట్టతో మిగిలారు. అధిక శాతం మందిది ఇదే పరిస్థితి. ఏమీ మిగల్లే.. ప్రమాదంలో అగ్ని కీలలు చుట్టుపక్కల ఒక్కసారిగా వ్యాపించాయి. గాలులతో అవి తీవ్రమయ్యాయి. ఉన్నవి చిన్నపాటి గది ఉన్న గుడిసెలే. చాలా మంది సామగ్రిని అదే గుడిసెలలో ఉంచుకుని జీవనం సాగిస్తున్నారు. ఆగ్ని ప్రమాదం విషయం తెలుసుకునేలోపే ప్లాస్టిక్ పట్టలు, బోదతో మంటలు చుట్టుముట్టాయి. దీంతో ఒక్కరూ కూడా తమ సామగ్రిని బయటకు తెచ్చుకునే అవకాశం లేకపోయింది. సిలిండర్లు పేలే ప్రమాదం ఉండటంతో.. బాధితులు తమ గుడిసెల వద్దకు వెళ్లేందుకు సాహసం చేయలేదు. ప్రమాదంలో నాలుగు సిలిండర్లు సైతం పేలిపోయాయి. నుసిగా మారిన పుస్తకాలు, గుర్తింపు కార్డులు ప్రభుత్వ స్థలంలో ని వాసముంటున్న తమ కు అధికారులు స్థలం కేటాయించాలనే ఉద్దేశంతో.. చాలా మంది అక్కడే ఆ ధార్కార్డులు, రేషన్‌కార్డులు తెచ్చుకుని ఉంటున్నారు. ప్రమాదంలో వీరంతా వాటితోపాటు తాము పని చేసే సంస్థలలో ఇచ్చిన గుర్తింపుకార్డులను పొగోట్టుకున్నారు. ప్రస్తుతం వీటితో ఏదైనా అవసరం పడితే తమ పరిస్థితి ఏమిటని బాధితులు వాపోతున్నారు. గుడిసెలలో నివాసముంటున్న వారి పిల్లలు దాదాపు 200 మంది చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యపురం, మార్తోమ నగర్, గౌరీశంకర్ నగర్ పాఠశాలలో చదువుకుంటున్నారు. ప్రమాదంలో వీరంతా తమ దుస్తులతో పాటు పుస్తకాలు, బ్యాగులను పొగోట్టుకున్నారు. తాము పాఠశాలకు వెళ్లాలంటే ఎలా అని వారు వాపోతున్నారు. రూ.50 వేలు నష్టపోయా ప్రమాదంలో రూ.50 వేలు పైనే నష్టపోయా. కూలీ పనికెళ్లి పైసా పైసా కూడబెట్టి సామగ్రిని సమకూర్చుకోగా.. కేవలం నిమిషాల వ్యవధిలో అన్ని కోల్పోయా. పెట్టలో ఉన్న బంగారం, నగదు, టీవీ, ఇతర సామగ్రి ఇలా అన్ని బూడిదగా మారాయి. – సరోజ, బాధితురాలు స్థలం కోసమే అగచాట్లు ఇక్కడ స్థలమిస్తారనే ఉద్దేశంతో గుడిసె వేసుకుని ఉంటున్నాం. చలితో నెల కిందట అనారోగ్యం బారిన పడి మా తల్లి కూడా మరణించింది. ఇదే ప్రాంతంలో గత మూడు నెలల కాలంలో ముగ్గురు వృద్ధులు చలితో చనిపోయారు. స్థలం వస్తుందని ఇక్కడే ఉంటే.. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలాం. – సుబ్బరాయుడు, బాధితుడు -
తొమ్మిదేళ్లలో 14 మంది బలి
సీతంపేట: ఒకటి కాదు రెండు తొమ్మిదేళ్లుగా ఏనుగులు మన్యం ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. పంటలను ధ్వంసం చేస్తున్నారయి. ఆస్తులకు నష్టం చేకూరుస్తున్నా యి. ఎదురు పడిన వారి ప్రాణాలు తీస్తున్నా యి. ఇంత జరుగుతున్నా... అధికారుల్లో చల నం లేదు. వాటి తరలింపునకు చర్యలు తీసుకోవడంలేదంటూ గిరిజనులు మండిపడుతున్నారు. భయంభయంతో బతుకుతున్నారు. 2007 సంవత్సరంలో ఒడిశా లఖేరీ అడవుల నుంచి వచ్చిన ఏనుగుల గుంపు ఇప్పటి వర కు 14 మందిని చంపేశారుు. సీతంపేట, హిరమండలం, కొత్తూరు, ఎల్.ఎన్.పేట, పాతపట్నం మండలాల్లో సంచరిస్తూ వందలాది ఎకరాల్లోని పంటలను ధ్వంసం చేసి రైతులకు నష్టాన్ని మిగిల్చారుు. ఏనుగుల నష్టాలు ఇలా... 2007 డిసెంబర్ 14న సీతంపేట మండలం చినబగ్గకు చెందిన పసుపురెడ్డి అప్పారావును, దోనుబారుు గ్రామానికి చెందిన సిరిపోతుల మేరమ్మను కోదుల వీరఘట్టం వద్ద ఏనుగులు మట్టుపెట్టాయి. అదే నెల 19న కుంబిడి నాగరాజు అనే వీరఘట్టానికి చెందిన పాత్రికేయుడిని హుస్సేన్‌పురం వద్ద దారుణంగా హతమార్చాయి. 21న ఇదే మండలం సంతనర్సిపురం వద్ద తెంటు శ్రీనివాసరావును విచక్షణారహితంగా చెట్లకు విసిరికొట్టి మాంసం ముద్దను చేశాయి. ఏడాది కాలం వ్యవధి తర్వాత వీరఘట్టం మండలం చలివేంద్రి వద్ద కొండగొర్రె సాంబయ్యను కూడా ఇదే తరహా లో ఏనుగులు పొట్టనపెట్టుకున్నారుు. అటు తర్వాత ఏడాది, రెండేళ్లకొక మారు ఒకరిద్దరిని చంపేయడం రివాజుగా మారింది. వ్యవసాయ పనులకు వెల్లిన వారిని చాలా మందిని ఏనుగులు పొట్టన బెట్టుకోవడంతో ఆ కుటుం బాలన్నీ దిక్కుతోచని స్థితిలో రోడ్డున పడ్డాయి. ఇదే క్రమంలో వందలాది ఎకరాల్లో పంట కూడా ధ్వంసమౌతుంది. పంటలను కాపాడుకునే క్రమంలో గిరిజనులు మృత్యువాత పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాపై చిన్నచూపు కొద్ది నెలల కిందట ఆపరేషన గజా పేరుతో విజయనగరం జిల్లాలోని ఒక గున్న ఏనుగు ను, చిత్తూరు జిల్లాలోని రారుువరం పరిధిలో మరో ఏనుగును జంతు ప్రదర్శన శాలలకు తరలించారు. శ్రీకాకుళం ఏజెన్సీలో తొమ్మిదేళ్లుగా ఏనుగులు సంచరిస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. కనీసం ప్రభుత్వం నుం చి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీడీఏలో జరిగిన పాలకవర్గ సమావేశానికి వచ్చిన మంత్రులు ఏనుగులు తరిమేస్తామని, సమస్య పరిష్కరిస్తామని, సీఎం దృష్టికి తీసుకెళ్తామన్న ప్రకటనలు శూన్యమే అయ్యాయి. -
ఒకే రోజు రెండు అగ్ని ప్రమాదాలు
సుల్తాన్‌బజార్: నగరంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఒకే రోజు రెండు రెడీమేడ్ దుస్తుల దుకాణాల్లో అగ్నిప్రమాదాలు సంభవించడంతో రూ. లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లింది. సుల్తాన్ బజార్, బోయిన్ పల్లిలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో దుకాణాలకు నిప్పంటుకుని దసరా పండుగకు తీసుకువచ్చిన రెడీమేడ్ వస్త్రాలు అగ్నికి అహుతయ్యాయి. వివరాల్లోకి వెళితే..ముసారాంబాగ్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్ సుల్తాన్ బజార్ జైన్‌మందిర్ సమీపంలో న్యూ స్వప్న ట్రేడర్స్ పేరుతో రెడీమేడ్ దుఖానం నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి దుకాణానికి తాళాలు వేసి ఇంటికి వెళ్లిన ప్రవీణ్‌కుమార్‌కు తెల్లవారుజామున షాపునకు నిప్పంటుకున్నట్లు స్థానికులు ఫోన్‌ద్వారా సమాచారం అందించారు. దీంతో అతను హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. సుల్తాన్ బజార్ పోలీసుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ దసరా పండుగ నేపథ్యంలో రూ. 1.5 కోట్ల స్టాక్ తెచ్చామని, సుమారు రూ. 60 లక్షల నుంచి రూ. 70 లక్షలు ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలిపాడు. సుల్తాన్ బజార్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు బోయిన్పల్లి ‘డెనిమ్’ షోరూమ్‌లో.. కంటోన్మెంట్: బోయిన్పల్లి ఫిలిప్స్ గోడౌన్ బ్రిడ్జి సమీపంలోని ఓ బట్టల దుకాణంలో మంగళవారం ఉదయం మంటలు చెలరేగి భారీ ఆస్తినష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళితే ప్రముఖ వస్త్రవ్యాపార సంస్థ ‘డెనిమ్’ బోయిన్పల్లి ప్రాంతంలో సంస్థ ప్రధాన కార్యాలయంతో పా టు కింది అంతస్తులో షోరూం నిర్వహిస్తోంది. మంగళవారం తెల్లవారుజామున దుకాణానికి నిపకపంటుకోవడంతో దుస్తులు కాలిబూడిదయ్యాయి, పై అంతస్తులోని కార్యాయంలో ఫర్నిచర్, ఫైళ్లు దగ్దమైనట్లు సమాచారం. షార్ట్సర్యూటే కారణమా? డెనిమ్ షోరూములో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నా పూర్తి వివరాలు తెలియరాలేదు. ఫిలిప్స్ బ్రిడ్జి సమీపంలోని ఈ భవనం మీదుగా విద్యుత్ హైటెన్షన్ లైన్లు వెళ్తున్నాయి. ఇటవల బ్రిడ్జి విస్తరణ పనుల్లో భాగంగా పాత వంతెన కూల్చేసి విద్యుత్, మంచినీటి పైపులైన్ల తరలింపు పనులు చేపట్టడంతో షాపు ముందు వైర్లు బయటికి కనిపిస్తున్నాయి. మంగళవారం ఉదయం వర్షం కురియడంతో షార్ట్ర్క్యూట్ సంభవించి మంటలు చెలరేగి ఉండవచ్చునని అంచనా. -
సెంట్రో షోరూంలో భారీ అగ్నిప్రమాదం
చందానగర్: ప్రధాన రహదారి పక్కన ఉన్న సెంట్రో చెప్పుల షోరూమ్‌లో శనివారం అగ్నిప్రమాదం జరిగి సుమారు రూ. 6 కోట్ల ఆస్తినష్టం జరిగింది. వివరాలు... ఉదయం 10.30కి చందానగర్‌లోని సెంట్రో షోరూమ్‌ను తెరిచేందుకు సిబ్బంది రాగా.. లోపలి నుంచి పొగ వస్తోంది. వెంటనే వారు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటికే మంటలు చెలరేగి షోరూమ్ మొత్తం వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లు, ఒక క్రేన్ ఫైర్ ఇంజిన్‌తో మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు. అయితే, షోరూమ్ ముందు 33 కేవీ విద్యుత్ వైర్లు ఉండటంతో సరఫరా నిలిపేందుకు సమయం పట్టడంతో క్రేన్‌ను షోరూమ్ ముందుకు చేర్చేందుకు ఆలస్యమైంది. తర్వాత క్రేన్ సహాయంతో మూడో ఫ్లోర్‌లోని అద్దాలు పగులగొట్టి నీటిని చిమ్మారు. ఎట్టకేలకు సాయంత్రం 4 గంటలకు మంటలను పూర్తిగా ఆర్పేశారు. దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరి... ఏప్రిల్ 17న షోరూమ్‌ను ప్రారంభించిన తాము పెద్ద మొత్తంలో వస్త్రాలు, చెప్పులు, ఖరీదైన బ్రాండ్ షూలు తెచ్చి నిల్వ చేశామని షోరూమ్ యజమానులు తెలిపారు. ఈ ప్రమాదంలో రూ. 6 కోట్ల విలువైన సరుకు కాలిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మంటల్లో లెదర్, ఫ్లాస్టిక్, కాటన్ ఉత్పత్తులు కాలి దట్టమైన పొగ రావడంతో స్థానికులు ఊపిరాడక ఇబ్బందిపడ్డారు. ఘటనా స్థలానికి నాలుగు ఫైర్ ఇంజిన్లు రావడంతో ఆ మార్గంలో చందానగర్ వరకూ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో సీఐ తిరుపతిరావు, ట్రాఫిక్ సీఐ వాసు దగ్గరుండి ట్రాఫిక్‌ను నియంత్రించారు. వెస్ట్ జోన్ కమిషనర్ గంగాధర్‌రెడ్డి, ఉప కమిషనర్ మమత, కార్పొరేటర్లు బొబ్బ నవతారెడ్డి, జగదీశ్వర్‌గౌడ్ పరిశీలించారు.∙ఎన్నో ఏళ్లు కష్టపడి నిర్మించుకున్న భవనం అగ్నిప్రమాదంలో కాలిపోయిందని భవన యాజమానులు రాధాకృష్ణ, శ్రీకాంత్, ప్రసాద్ కన్నీరుపెట్టుకున్నారు. -
కొనసాగుతున్న శిథిలాల తొలగింపు
ఫిలింనగర్‌లోని ఎఫ్ఎన్సీసీలో గత ఆదివారం నిర్మాణంలో ఉన్న పోర్టికో కుప్పకూలిన ఘటనలో శిథిలాల తొలగింపు ఇంకా పూర్తి కాలేదు. శిథిలాల తొలగింపులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు జీహెచ్ఎంసీ ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ఇనుపచువ్వలు కట్ చేయడం, పిల్లర్లు పగలగొట్టడం చాలా సమస్యాత్మకంగా ఉండటంతో ఆరు రోజుల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా కూలిన పోర్టికో శిథిలాలను జేసీబీ సహాయంతో తొలగించే క్రమంలో ఎఫ్ఎన్సీసీ ప్రధాన భవనానికి ముప్పు ఏర్పడింది. ఇప్పటికే అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రధాన గేటు వద్ద కిటికీలు విరిగిపోయాయి. గోడలు ధ్వంసమయ్యాయి. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుండటంతో ఎఫ్ఎన్సీసీ యాజమాన్యం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
రోను అలజడి
పెదగంట్యాడలో 17 సెం.మీల వర్షం పెనుగాలుల్లేక ఊరట నేడు, రేపు భారీ వర్షాలు విశాఖపట్నం : రోను తుపాను కుండపోత వర్షం కురిపిస్తోంది. నగరాన్ని, జిల్లాను తడిసి ముద్ద చేస్తోంది. బుధవారం భారీగా కురిసిన వాన గురువారం కూడా అంతకుమించి కుంభవృష్టిని తలపించింది. ఈదురుగాలులు లేకపోవడంతో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదు. రోజంతా తెరలు తెరలుగా విరామం ఇస్తూ కురవడంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడానికి ఆస్కారం కలగలేదు. సాధారణంగా వాయుగుండం, తుపానులు ఏర్పడితే పెనుగాలులు వీస్తాయి. పెను బీభత్సం సృష్టిస్తాయి. కానీ ప్రస్తుత తుపాను గురువారం నాటికి 200 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉండడం వల్ల ఈదురుగాలుల జాడ లేదు. ఏడాదిన్నర క్రితం సంభవించిన హుద్‌హుద్ తుపాను సృష్టించిన విలయానికి తుపాను అంటేనే విశాఖ వాసులు హడలెత్తిపోతున్నారు. ఈ తరుణంలో వచ్చిన రోను తుపాను ఎలాంటి బీభత్సం సృష్టిస్తుందోనని ఆందోళన చెందారు. అయితే గురువారం రాత్రి వరకు భారీ వర్షమే తప్ప పెనుగాలులు లేకపోవడంతో ప్రస్తుతానికి ఊరట చెందుతున్నారు. భారీ వానలకు నగరంలో గెడ్డలు పొంగాయి. రోడ్లపై నీరు జోరుగా ప్రవహించింది. లోతట్టు ప్రాంతాల్లో కొద్దిపాటి నీరు చేరింది. గాజువాక మెయిన్‌రోడ్డుపై వర్షపు నీరు చేరడంతో ఉదయం దాదాపు గంట సేపు హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది. విశాఖ నగర శివారులోని పెదగంట్యాడలో అత్యధికంగా 17 సెం.మీల భారీ వర్షపాతం నమోదయింది. నగరంలో 10 సెం.మీల వర్షం కురిసింది. యంత్రాంగం అప్రమత్తం.. తుపాను తీవ్ర తుపానుగా బలపడనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమయింది. తీరప్రాంతంలో ఉన్న 96 గ్రామాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 50 తుపాను షెల్టర్లతో పాటు ఆయా గ్రామాల్లో ఉన్న హైస్కూలు భవనాలను ఇందుకు సన్నద్ధంగా ఉంచారు. తాగునీటిని సమకూరుస్తున్నారు. సంబంధిత తహసీల్దార్లు, మండలాభివృద్ధి అధికారులకు పరిస్థితులను పర్యవే క్షించాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా 16 కరకట్టలు బలహీనంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. భారీ వర్షాలకు వాటికి గండ్లు పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరో రెండ్రోజులు వానలు తుపాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు మరో రెండ్రోజుల పాటు కొనసాగనున్నాయి. పెను తుపానుగా బలపడి, విశాఖకు చేరువగా వస్తే వర్ష ఉధృతితో పాటు పెనుగాలులు భారీగా వీస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందువల్ల ప్రజలు బయటకు రాకుండా, చె ట్లు, పాత భవనాలు, ఇళ్లలోనూ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వీరు సూచిస్తున్నారు. జిల్లాలో వర్ష బీభత్సం మరోవైపు జిల్లాలోనూ భారీ వర్షమే కురుస్తోంది. వర్షాలకు ఆనందపురంలోని జెడ్పీ హైస్కూలు గోడ కూలింది. చోడవరంలో మూడు ఇళ్లు కూలాయి. పద్మనాభం మండలంలో సుమారు 500 ఎకరాల్లోని నువ్వు పంట, 50 ఎకరాల్లో దొండ, మరో 50 ఎకరాల్లో మల్లెతోటలు, 20 ఎకరాల్లో ఆనపపాదులు నీట మునిగాయి. సబ్బవరం మండలంలో 25 ఎకరాల్లో కూరగాయల పంటకు నష్టం వాటిల్లింది. అక్కడ రాయపురాజు చెరువుకు గండిపడింది. ఏజెన్సీలో వర్షాలకు గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో దాదాపు 80 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
కొమరోలు, రాచర్లలో వడగండ్ల వాన
కొమరోలు, రాచర్ల మండలాల్లో ఆదివారం వడగండ్ల వర్షం కురిసింది. గాలి బీభత్సం సృష్టించడంతో పలు చోట్లు చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇళ్లు నేలకొరిగాయి. భారీ సైజులో వడగండ్లు పడటంతో జనం ఇళ్లలోకి పరిగెత్తారు. -
వాన.. హైరానా
♦ జిల్లావ్యాప్తంగా ఒక మోస్తరు వర్షం ♦ సగటున 2.8 సెం.మీ. వర్షపాతం నమోదు ♦ పలు చోట్ల ఆస్తినష్టం, దెబ్బతిన్న పంటలు ♦ చెరువులు,కుంటల్లోకి చేరిన కొద్దిపాటి నీరు సాక్షి, రంగారెడ్డి జిల్లా: భానుడి ప్రతాపానికి వరుణుడు బ్రేక్ వేశాడు. శుక్రవారం తెల్లవారుజామున జిల్లావ్యాప్తంగా ఒక మోస్తరు వర్షం కురిసింది. అధికారుల గణాం కాల ప్రకారం జిల్లాలో 2.8 సెంటీమీటర్ల వర్షం పడింది. వానలతో పలుచోట్ల చిన్నపాటి కుంటల్లో నీరు చేరగా.. చెరువుల్లోనూ మోస్తరు నీరు నిలిచాయి. జిల్లాలో మే నెలలో 3.1 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ గత మూడురోజులుగా కురిసిన వర్షాలతో ఏకంగా సాధారణ వర్షాన్ని మించి 4.3 సెంటీమీర్ల వర్షం కురవడం గమనార్హం. శుక్రవారం తెల్లవారు జామున ఈదురుగాలుల ధాటికి చెట్లు కుప్పకూలాయి. అత్యధికంగా రాజేంద్రనగర్ మండలంలో 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్‌నగర్ మండలంలో 7.4, ఇబ్రహీంపట్నంలో 6.37 సెంటీమీటర్ల వర్షం కురిసింది. -
విశాఖ ప్రమాదంలో అదుపులోకి రాని మంటలు
విశాఖపట్నం: విశాఖ ఎస్ఈజెడ్లోని బయోమాక్స్ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. 40 ఫైరింజన్లతో 14 గంటలకు పైగా ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు అదుపులోకి రావడానికి మరో పది గంటలు పడుతుందని అధికారులు చెప్పుతున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. 100 అడుగులకుపైగా ఎత్తులో ఎగసిపడిన మంటలు చుట్టుపక్కల ప్రజలను భయభ్రాంతులకు గురిస్తున్నాయి. బయో డీజిల్ ట్యాంకర్లు పేలడంతో పొగ కాలుష్యం ఆ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు విశాఖ నగరాన్ని కమ్మేసింది. ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం ఆరా తీశారు. మంగళవారం రాత్రి బయోమాక్స్ కంపెనీలో ఆయిల్ రిఫైనరీ ట్యాంకర్లు పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాంట్‌లో మొత్తం 18 ట్యాంకులు ఉండగా..11 ట్యాంకులకు మంటలు వ్యాపించాయి. మిగతా ఆరు ట్యాంకులను సురక్షితంగా ప్రాంతానికి తరలించారు. సుమారు రూ.200 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. నేవీ హెలికాఫ్టర్‌తో అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనా స్ధలాన్ని హోంమంత్రి చినరాజప్ప, మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. సమీప ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రులు సూచించారు. ఆస్తి నష్టం పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు చినరాజప్ప తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని ఫ్యాక్టరీ వర్గాలు చెబుతున్నాయి. కంపెనీలో ఉన్న బయో డీజిల్ వల్లే మంటలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని ఫైర్ అధికారులు చెప్పుతున్నారు. -
సోమేశ్వరంలో భారీ అగ్ని ప్రమాదం
* నిరాశ్రయమైన ఆరు కుటుంబాలు * నాలుగిళ్లు, పాన్‌షాపు, స్కూల్ బస్సు దగ్ధం * రూ.12 లక్షల ఆస్తినష్టం సోమేశ్వరం (రాయవరం) : నాలుగేళ్ల క్రితం జరిగిన అగ్ని ప్రమాదం భయానక దృశ్యాలను వారింకా మరువలేదు. మరోసారి అగ్ని ప్రమాదం వారి జీవితాల్లో నిప్పులుకక్కింది. సోమేశ్వరం గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో నాలుగిళ్లు, ఓ పాన్‌షాప్‌తో పాటు స్కూల్ బస్సు పూర్తిగా కాలిపోయింది. సుమారు రూ.12 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. దీపంలో చమురు పోస్తుండగా.. సోమేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఉన్న రుద్రగుండాన్ని ఆనుకుని సబ్బెళ్ల మంగ, మట్టా రామారావు, అచ్చాలు, విత్తనాల మంగ, చింతా వీరన్న కుటుంబాలు తాటాకిళ్లలో నివ సిస్తున్నాయి. వెలుగుతున్న కిరోసిన్ దీపంలో అచ్చమ్మ చమురు పోస్తుండగా, మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ఇంటిని చుట్టుముట్టిన మంటలు.. పక్కనున్న ఇళ్లకూ వ్యాపించాయి. ఈ సంఘటనలో నాలుగు తాటాకిళ్లు, నందికోళ్ల శ్రీనివాస్‌కు చెందిన పాన్‌షాపు దగ్ధమయ్యాయి. కుతుకులూరుకు చెందిన ఓ ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్‌గా అడట ప్రసాద్ పనిచేస్తున్నాడు. బస్సును సంఘటన స్థలానికి సమీపంలో పార్కింగ్ చేసి, చింతలూరు తీర్థానికి వెళ్లాడు. అగ్నిప్రమాదంలో ఆ బస్సు కూడా పూర్తిగా కాలిపోయింది. అదుపు చేసేందుకు యత్నం మంటలు ఎగిసిపడిన వెంటనే స్థానికులు వాటిని అదుపు చేసేందుకు విఫలయత్నం చేశారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వారేమీ చేయలేకపోయారు. సమాచారం అందుకున్న రామచంద్రపురం అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకునేసరికి నాలుగిళ్లు, పాన్‌షాపు, బస్సు భస్మీపటలమయ్యాయి. ఇంటిలోని సామగ్రి తెచ్చుకునేందుకు కూడా వీల్లేకపోవడంతో ఆయా కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి. రామచంద్రపురం, మండపేట అగ్నిమాపక అధికారులు ఎన్.నాగేంద్రప్రసాద్, డి.చిన్నిబాబు ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపు చేశారు. సోమేశ్వరం-రాజానగరం రహదారి పక్కనే సంఘటన చోటుచేసుకోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. సర్వం కోల్పోయాం ప్రమాదంలో తాము సర్వం కోల్పోయామని బాధితులు బోరున విలపించారు. అప్పు తెచ్చిన రూ.10 వేలు బూడిదైనట్టు మట్టా రామారావు విలపించాడు. మనవడి కాలి ఆపరేషన్ చేయించేందుకు తెచ్చిన రూ.30 వేలు బుగ్గయినట్టు సబ్బెళ్ల మంగ రోదించింది. 2010 డిసెంబర్ 4న ఇదే ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. కాగా బాధిత కుటుంబాలకు స్థానిక కొబ్బరితోట పాఠశాలలో పునరావసం కల్పించారు. -
గోగులపాడులో ఏడు పూరిళ్లు దగ్ధం
గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలం గోగులపాడు గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో ఏడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటనలో 5 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిప్పు రాజుకుని మంటలు ఎగిశాయి. రెండు సిలిండర్లు కూడా పేలిపోయాయి. ఏడు కుటుంబాలవారు కూలిపనులకు పోయినపుడు ఈ అగ్నిప్రమాదం జరిగింది. -
చిత్తూరు ఎస్టేట్‌లో అగ్ని ప్రమాదం
రూ.30 లక్షల ఆస్తి నష్టం చిత్తూరు (అర్బన్): చిత్తూరు నగరంలోని ఆటో నగర్లో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. రూ.30 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. వన్‌టౌన్ సీఐ విజయకుమార్ కథనం మేరకు పలమనేరుకు చెందిన ఓ బస్సుకు టింకరింగ్ పనులు చేయడానికి చిత్తూరుకు తీసుకొచ్చారు. ఇక్కడున్న ఎస్టేట్‌లో సాయంత్రం గ్యాస్ కట్టర్‌తో పనులు చేస్తుండగా బస్సు కింది భాగానికి నిప్పంటుకుంది. దీన్ని చూసుకోకపోవడంతో ఒక్కసారిగా అగ్ని జ్వాలలు ఎగసిపడ్డాయి. సమీపంలో ఉన్న శీన అనే వ్యక్తికి చెందిన బ్యాటరీ దుకాణానికి అంటుకోవడంతో బ్యాటరీలు, ఎలక్ట్రికల్ వస్తువులు కాలి బూడిదయ్యాయి. అలాగే ఓ స్కూటర్ సైతం కాలిపోయింది. టింకరింగ్ చేస్తున్న వ్యక్తి కుట్టికి సంబంధించిన దుకాణం కూడా బూడిదయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. లేకుంటే బస్సులోని డీజల్ ట్యాంకుకు నిప్పంటుకుని పెద్ద ప్రమాదమే జరిగేది. వన్‌టౌన్ సీఐ విజయకుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. -
అగ్ని ప్రమాదంలో రూ. లక్ష ఆస్తి నష్టం
వంట చేయడానికి పోయి వెలిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మంటలు ఎగిసి పడి గుడిసెకు అంటుకున్నాయి. ఇది గుర్తించిన గృహిణి భయంతో బయటకు పరుగులు తీసింది. అప్రమత్తమైన స్థానికులు మంటలు ఆర్పేలోపే పూరిళ్లు కాలి బూడిదైంది. ఈ ఘటనలో సుమరు రూ. లక్ష ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అర్వపల్లి మండలం కొమ్మాల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు -
గోడౌన్లో అగ్నిప్రమాదం, భారీగా ఆస్తినష్టం
జమ్మలమడుగు: వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బ్యాట్ కో ట్రాన్స్ పోర్ట్ బట్టల గోడౌన్లో శుక్రవారం ఉదయం మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్నవారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కొన్ని నిమిషాల్లోనే గోడౌన్ ప్రాంతానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ అగ్నిప్రమాదం వల్ల భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అగ్ని ప్రమాదంలో 17 పూరిళ్లు బుగ్గి
కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గోపాలకృష్ణాపురం గ్రామంలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో లేచిన మంటలు వేగంగా పక్కనే ఉన్న పూరిళ్లకు వ్యాపించాయి. అర్ధరాత్రి గాఢ నిద్ర సమయంలో ఒక్కసారిగా ఎగసిపడిన మంటలతో ఇళ్లల్లోని వారు భయంతో బయటకు పరుగులు తీశారు. మొవ్వ, ఉయ్యూరు నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మొత్తం 17 పూరిళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. సుమారు రూ.6 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.