పారిస్: యూరప్ దేశం ఫ్రాన్స్ రణరంగాన్ని తలపిస్తోంది. నగరాలు, పట్టణాల్లో వాహన, గృహ దహనాలు, దుకాణాల లూటీలు, ఆస్తుల విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఏకంగా 45,000 మంది పోలీసులను రంగంలోకి దించినప్పటికీ పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. రేవు నగరం మార్సిలీలో ఆందోళనకారులు ఓ ఆయుధ దుకాణాన్ని లూటీ చేసి, ఆయుధాలు ఎత్తుకెళ్లారు.
యువతీయువకులు బయటకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండేలా వారి తల్లిదండ్రులు చూడాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నాలుగో రోజు శనివారం సైతం పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. శనివారం ఒక్కరోజే 1,311 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటిదాకా 2,400 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,500 దాకా దహనాలు, లూటీల ఘటనలు చోటుచేసుకున్నాయని చెప్పారు.
నిరసనకారుల దాడుల్లో వందలాది మంది పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. అయితే, ఎంతమంది నిరసనకారులు గాయపడ్డారన్నది ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. మంగళవారం రాజధాని పారిస్ శివారులోని నాంటెర్రేలో పోలీసు కాల్పుల్లో నేహల్ అనే 17 ఏళ్ల యువకుడు మరణించడం దేశవ్యాప్తంగా తీవ్ర అశాంతికి దారితీసిన సంగతి తెలిసిందే. నేహల్ అంత్యక్రియలను కుటుంబ సభ్యులు, మిత్రులు శనివారం నిర్వహించారు. మతాచారం ప్రకారం తొలుత మసీదులో ప్రార్థనలు చేసి, నాంటెర్రే అనంతరం శ్మశాన వాటికలో ఖననం చేశారు.
సంగీత కచేరీలో ఫ్రాన్స్ అధ్యక్షుడు
ఫ్రాన్స్‌లో ఘర్షణలను నివారించడంలో దారుణంగా విఫలమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. దేశమంతటా ఒకవైపు ఆందోళనలు, హింసాకాండ కొనసాగుతుండగా, మరోవైపు ఆయన పారిస్‌లో ఓ సంగీత కచేరీలో తన భార్యతో కలిసి పాల్గొన్నారు. సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా గడిపారు. భార్యతో కలిసి డ్యాన్స్ చేశారు.
ఈ సంగీత కచేరీ బుధవారం జరిగినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మేక్రాన్ నిర్వాకంపై ప్రజలు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. అధ్యక్షుడు చేయాల్సిన పని ఇదేనా? అని మండిపడుతున్నారు.
As protesters burn French cities, Macron lights up at Elton John concert in Paris
— Spriter Team (@SpriterTeam) June 30, 2023
The President of France in these shots is in a great mood, he enjoys music with his wife and dances a little. pic.twitter.com/v1CSKI7WB8
సోషల్ మీడియానే కారణం: మేక్రాన్
ఫ్రాన్స్‌లో అలజడికి సోషల్ మీడియానే కారణమని అధ్యక్షుడు మేక్రాన్ ఆక్షేపించారు. హింసను ప్రేరేపించడానికి కొందరు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారని, వారిని కచి్చతంగా అరెస్టు చేస్తామని చెప్పారు. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టే ఉద్దేశపూర్వక సమాచారాన్ని సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించాలన్నారు. ఈ విషయంలో ఆయా సంస్థలతో ప్రభుత్వం కలిసి పని చేస్తుందన్నారు. యువత బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని స్పష్టం చేశారు. సోషల్ మీడియాపై ఆంక్షలు విధించాలని అధికారులను మేక్రాన్ ఆదేశించారు. ఇదిలా ఉండగా, మేక్రాన్ సోమవారం నుంచి జర్మనీలో పర్యటించాల్సి ఉంది. స్వదేశంలోని పరిణామాల దృష్ట్యా ఈ పర్యటనను వాయిదా వేసుకున్నారు.
అంతమాత్రానికే కాల్చి చంపుతారా?
నేహల్ మృతి పట్ల అతడి తల్లి, అల్జీరియా మూలాలున్న మౌనియా స్పందించారు. తన బిడ్డను కాల్చి చంపిన పోలీసు అధికారిపై మాత్రమే తనకు ఆగ్రహం కలుగుతోందని, ఇతరులపై కాదని చెప్పారు. ఏ నేరమూ చేయని పిల్లల ప్రాణాలను బలిగొనే హక్కు పోలీసులకు ఎక్కడిదని ప్రశ్నించారు. తన కుమారుడు నేహల్ చూడడానికి అరబ్ దేశస్తుడిలా కనిపిస్తాడని, అంతమాత్రానికే కాల్చి చంపుతారా? అని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment