robery team
-
థక్ థక్ గ్యాంగ్: కాలు తొక్కారు.. అద్దం దించండి
ఢిల్లీలో ఒంటరిగా కారు నడుపుతున్న స్త్రీల వస్తువుల చోరీకి ఒక గ్యాంగ్ ప్రయత్నిస్తోంది. ఆ గ్యాంగ్‌ను థక్‌థక్ గ్యాంగ్ అంటారు. వీరు ఎలా చోరీ చేస్తారు? ఒంటరి స్త్రీలు కారు ప్రయాణం చేసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? విస్తృతంగా వాహనాలు నడుపుతున్న స్త్రీలూ... బహుపరాక్. థక్‌థక్ గ్యాంగ్ ఎక్కడైనా ఉండొచ్చు. సంఘటన 1: నిర్మానుష్య ప్రాంతం అక్కర్లేదు. బాగా రద్దీ ఉన్న రోడ్డు మీదే. ట్రాఫిక్ సమయంలోనే. మీరు కారు మెల్లగా పోనిస్తుంటారు. ఒక మనిషి మీ కారు ముందు నుంచి దాటుతాడు. ఆ తర్వాత వేగంగా వెనక్కు వచ్చి మీ పక్క అద్దం మీద ‘టక్ టక్’మని వేలితో కొట్టి అద్దం దించమని కోపంగా అంటాడు. ‘నా కాలు తొక్కావు. అద్దం దించు’ అని హడావిడి చేస్తాడు. మీరు కంగారులో అద్దం దించుతారు. అంతే! మీ పక్క సీటులో మీరు ఉంచుకున్న హ్యాండ్‌బ్యాగ్, పర్స్, ల్యాప్‌టాప్ తీసుకుని తుర్రుమంటాడు. మీరు కారు దిగి వెంటాడ లేరు. ట్రాఫిక్‌లో ఉంటారు. ఇదీ ‘టక్ టక్’ లేదా ‘థక్‌థక్ గ్యాంగ్’ నేరం చేసే తీరు. సంఘటన 2: ఇలాగే ట్రాఫిక్‌లో మీరు వెళుతుంటారు. మెల్లగా వెళుతున్న మీ కారు వెనుక టైరు ఏదో ఎక్కి దిగినట్టుగా అవుతుంది. వెంటనే ఒక మనిషి డ్రైవింగ్ సీట్ దగ్గరకు వచ్చి అద్దం మీద బాది ‘నా కాలు తొక్కావ్’ అంటాడు. మీరు ఇంజన్ ఆఫ్ చేసినా, కారు పక్కకు తీసి ఆ మనిషితో వాదనకు దిగినా, మరో మనిషి మీ కారు వెనుక సీటులో ఉన్న వస్తువు తీసుకుని ఉడాయిస్తాడు. మీరు స్లోగా వెళుతున్నప్పుడు వెనుక టైరు కింద రాయి పెట్టి కాలు తొక్కిన భావన కలిగిస్తారు. ఇంకా ఏం చేస్తారు?: మీ కారు బైక్ మీద వెంబడించి ఇంజన్ లీక్ అవుతుంది అంటారు. అలా అనిపించడానికి వారే వెనుక కొంత ఆయిల్ వేస్తారు. మిమ్మల్ని అలెర్ట్ చేసిన వారు మిమ్మల్ని దాటి వెళ్లిపోతారు. కాని మీరు కారు ఆపి ఇంజన్ ఆయిల్‌ను చెక్ చేస్తుంటే ఇంకో బ్యాచ్ వచ్చి డోర్లు తీసి దోచుకుని పోతుంది. కారు ఎక్కేటప్పుడు కొన్ని నోట్లు కింద పడేసి మీ డబ్బు పడింది అంటారు. మీరు నోట్లు ఏరుకుంటుంటే కారులో ఉన్న వస్తువులు పట్టుకెళతారు. బ్యాక్ టైర్ పంక్చర్ అయ్యిందని చెప్తారు. కారు ఆపితే అంతే సంగతులు. కొన్నిసార్లు క్యాటపల్ట్ (క్యాట్‌బాల్)తో రాయి విసిరి అద్దం మీద కొడతారు. టప్పున అద్దం తాకితే మీరు కంగారులో కారు ఆపి దిగుతారు. వారు చేతివాటం చూపుతారు. ఒంటరి స్త్రీలు ఉన్నప్పుడు ఇవన్నీ థక్ థక్ గ్యాంగ్ చాలా సులువుగా చేస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఏం చేయాలి? అద్దాలు ఎప్పుడూ ఎత్తి పెట్టాలి ► ఎవరు వచ్చి వాదనకు దిగినా అద్దం దించకుండా పోలీసులకు ఫోన్ చేయాలి. ఇంజన్ ఆఫ్ చేయకూడదు. చేస్తే డోర్లు తెరుచుకుంటాయి. ► మీ పక్క సీటులో, వెనుక సీటులో విలువైన ఏ వస్తువులూ కనిపించేలా పెట్టకూడదు. ► ఏదైనా రాయి వచ్చి అద్దాన్ని కొట్టినా వెంటనే ఆపకుండా బాగా దూరం వెళ్లి ఎవరూ వెంబడించడం లేదని గమనించుకుని ఆపాలి. ► ముఖ్యంగా ఫ్లై ఓవర్లు దిగేప్పుడు, ట్రాఫిక్ ఉంటే ఇలాంటి దాడులు చేస్తారు. ఫ్లై ఓవర్ మీద కారు పక్కకు తీసి మీరు వారిని పట్టుకునే ప్రయత్నం చేయలేకపోవడమే ఇందుకు కారణం. కాబట్టి ఫ్లై ఓవర్ల మీద జాగ్రత్తగా ఉండాలి. -
ఆగమవుతున్న ఫ్రాన్స్.. అదుపులోకి రాని పరిస్థితులు, వివాదంలో అధ్యక్షుడు
పారిస్: యూరప్ దేశం ఫ్రాన్స్ రణరంగాన్ని తలపిస్తోంది. నగరాలు, పట్టణాల్లో వాహన, గృహ దహనాలు, దుకాణాల లూటీలు, ఆస్తుల విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఏకంగా 45,000 మంది పోలీసులను రంగంలోకి దించినప్పటికీ పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. రేవు నగరం మార్సిలీలో ఆందోళనకారులు ఓ ఆయుధ దుకాణాన్ని లూటీ చేసి, ఆయుధాలు ఎత్తుకెళ్లారు. యువతీయువకులు బయటకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండేలా వారి తల్లిదండ్రులు చూడాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నాలుగో రోజు శనివారం సైతం పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. శనివారం ఒక్కరోజే 1,311 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటిదాకా 2,400 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,500 దాకా దహనాలు, లూటీల ఘటనలు చోటుచేసుకున్నాయని చెప్పారు. నిరసనకారుల దాడుల్లో వందలాది మంది పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. అయితే, ఎంతమంది నిరసనకారులు గాయపడ్డారన్నది ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. మంగళవారం రాజధాని పారిస్ శివారులోని నాంటెర్రేలో పోలీసు కాల్పుల్లో నేహల్ అనే 17 ఏళ్ల యువకుడు మరణించడం దేశవ్యాప్తంగా తీవ్ర అశాంతికి దారితీసిన సంగతి తెలిసిందే. నేహల్ అంత్యక్రియలను కుటుంబ సభ్యులు, మిత్రులు శనివారం నిర్వహించారు. మతాచారం ప్రకారం తొలుత మసీదులో ప్రార్థనలు చేసి, నాంటెర్రే అనంతరం శ్మశాన వాటికలో ఖననం చేశారు. సంగీత కచేరీలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్స్‌లో ఘర్షణలను నివారించడంలో దారుణంగా విఫలమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. దేశమంతటా ఒకవైపు ఆందోళనలు, హింసాకాండ కొనసాగుతుండగా, మరోవైపు ఆయన పారిస్‌లో ఓ సంగీత కచేరీలో తన భార్యతో కలిసి పాల్గొన్నారు. సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా గడిపారు. భార్యతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ సంగీత కచేరీ బుధవారం జరిగినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మేక్రాన్ నిర్వాకంపై ప్రజలు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. అధ్యక్షుడు చేయాల్సిన పని ఇదేనా? అని మండిపడుతున్నారు. As protesters burn French cities, Macron lights up at Elton John concert in Paris The President of France in these shots is in a great mood, he enjoys music with his wife and dances a little. pic.twitter.com/v1CSKI7WB8 — Spriter Team (@SpriterTeam) June 30, 2023 సోషల్ మీడియానే కారణం: మేక్రాన్ ఫ్రాన్స్‌లో అలజడికి సోషల్ మీడియానే కారణమని అధ్యక్షుడు మేక్రాన్ ఆక్షేపించారు. హింసను ప్రేరేపించడానికి కొందరు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారని, వారిని కచి్చతంగా అరెస్టు చేస్తామని చెప్పారు. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టే ఉద్దేశపూర్వక సమాచారాన్ని సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించాలన్నారు. ఈ విషయంలో ఆయా సంస్థలతో ప్రభుత్వం కలిసి పని చేస్తుందన్నారు. యువత బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని స్పష్టం చేశారు. సోషల్ మీడియాపై ఆంక్షలు విధించాలని అధికారులను మేక్రాన్ ఆదేశించారు. ఇదిలా ఉండగా, మేక్రాన్ సోమవారం నుంచి జర్మనీలో పర్యటించాల్సి ఉంది. స్వదేశంలోని పరిణామాల దృష్ట్యా ఈ పర్యటనను వాయిదా వేసుకున్నారు. అంతమాత్రానికే కాల్చి చంపుతారా? నేహల్ మృతి పట్ల అతడి తల్లి, అల్జీరియా మూలాలున్న మౌనియా స్పందించారు. తన బిడ్డను కాల్చి చంపిన పోలీసు అధికారిపై మాత్రమే తనకు ఆగ్రహం కలుగుతోందని, ఇతరులపై కాదని చెప్పారు. ఏ నేరమూ చేయని పిల్లల ప్రాణాలను బలిగొనే హక్కు పోలీసులకు ఎక్కడిదని ప్రశ్నించారు. తన కుమారుడు నేహల్ చూడడానికి అరబ్ దేశస్తుడిలా కనిపిస్తాడని, అంతమాత్రానికే కాల్చి చంపుతారా? అని నిలదీశారు. -
వామ్మో వీళ్లేం దొంగలు.. భారీ సొరంగం
సావ్పౌలో : ఈ సంగతి వింటే బహుషా ప్రపంచంలోని గజదొంగలు వీరేనని అంటారేమో.. ఎందుకంటే వారు బ్యాంకును దోచుకునేందుకు చేసింది మాములు పని కాదు.. ఏకంగా అరకిలోమీటర్పైగా భూగర్భంలో మార్గాన్ని ఏర్పాటు చేశారు. నేరుగా 600 మీటర్ల పొడవు(రెండు వేల అడుగులు) భూమిలోపల తాము దోచుకోవాలనుకున్న బ్యాంకుకు సొరంగం ఏర్పాటుచేసుకున్నారు. కానీ, దురదృష్టం వారిని వెక్కిరించింది. ఆశలు అడియాశలు అయ్యాయి. పోలీసుల చేతికి చిక్కారు. వారిని పట్టుకున్న తర్వాత వారు దొంగతనం చేయడానికి చేసిన సాహసం చూసి అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే.. సావ్ పౌలోలోని బ్యాంకో డు బ్రేసిల్ బ్రాంచ్‌లో దొంగతనానికి పాల్పడేందుకు కొంతమంది దొంగలు ప్లాన్ చేశారు. దాదాపు మూడు నెలలపాటు ఎవరికీ తెలియకుండా భూగర్భంలో పెద్ద సొరంగాన్ని బ్యాంకు వరకు తీశారు. అందులోని 317 మిలియన్ డాలర్లను కొల్లగొట్టాలని అనుకున్నారు. ఒక ఇంటిలో నుంచి ఈ సొరంగాన్ని తవ్వడం ప్రారంభించారు. అందులో ఫ్యాన్లు, లైట్లు కూడా ఏర్పాటుచేసుకున్నారు. మొత్తానికి పోలీసులు వారి కుట్రను చేధించి 16మంది అనుమానితులను అరెస్టు చేశారు. -
ముగ్గురు కారుదొంగల అరెస్టు
రూ. 4.65 లక్షల సొత్తు స్వాధీనం పెద్దాపురం : స్థానిక శ్రీనివాసా ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఇంట్లో ఇటీవల జరిగిన కారు చోరీ కేసును పెద్దాపురం పోలీసులు ఛేదించారు. సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్ సోమవారం రాత్రి ఆ వివరాలను తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం పాతకొండంగూడానికి చెందిన చీకట్ల సతీష్, పెనుగొండకు చెందిన మద్దుల రాజేష్, విశాఖ జిల్లా మర్రిపాలెం మహారాణి వీధికి చెందిన కాలింగ అశోక్‌కుమార్ పెద్దాపురంతో పాటు తణుకు, జంగారెడ్డిగూడెం, ఇనగుడుదురు, పాలకొల్లు, గన్నవరం, మండపేట, కాళ్ళ, విజయనగరం ప్రాంతాల్లో పలు నేరాలకు పాల్పడ్డారు. ఇటీవల పెద్దాపురంలో చోరీకి గురైన కారును టోల్‌ప్లాజా వద్ద గుర్తించడంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు రూ. 4 లక్షల 65 వేల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వీరిని కోర్టుకు తరలిస్తామని సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సైలు వై.సతీష్, బీవీ రమణ, ఎస్జీ వలీ, రాధాకృష్ణ, సాయి, గణేష్ పాల్గొన్నారు. కేసును ఛేదించిన సీసీఎస్ ఎస్సైలు రమణ, వలీ, సతీష్, ఏఎస్సై బి.నరసింహారావు, సీసీఎస్ హెచ్‌సీలు బలరాంమూర్తి, జీఎస్ఎన్ మూర్తి, కె. రంగబాబు, పీసీ బి.రాధాకృష్ణ, ఎం.రాకేష్, జె. నాగరాజు, హెచ్‌సీలు వి.నాగభూషణం, వై.కృష్ణ, పీసీలు డి.సాయికృష్ణ, శ్రీనివాసరావులను సీఐ అభినందించారు.