
సావ్‌పౌలో : ఈ సంగతి వింటే బహుషా ప్రపంచంలోని గజదొంగలు వీరేనని అంటారేమో.. ఎందుకంటే వారు బ్యాంకును దోచుకునేందుకు చేసింది మాములు పని కాదు.. ఏకంగా అరకిలోమీటర్‌పైగా భూగర్భంలో మార్గాన్ని ఏర్పాటు చేశారు. నేరుగా 600 మీటర్ల పొడవు(రెండు వేల అడుగులు) భూమిలోపల తాము దోచుకోవాలనుకున్న బ్యాంకుకు సొరంగం ఏర్పాటుచేసుకున్నారు. కానీ, దురదృష్టం వారిని వెక్కిరించింది. ఆశలు అడియాశలు అయ్యాయి. పోలీసుల చేతికి చిక్కారు.
వారిని పట్టుకున్న తర్వాత వారు దొంగతనం చేయడానికి చేసిన సాహసం చూసి అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే.. సావ్ పౌలోలోని బ్యాంకో డు బ్రేసిల్ బ్రాంచ్‌లో దొంగతనానికి పాల్పడేందుకు కొంతమంది దొంగలు ప్లాన్ చేశారు. దాదాపు మూడు నెలలపాటు ఎవరికీ తెలియకుండా భూగర్భంలో పెద్ద సొరంగాన్ని బ్యాంకు వరకు తీశారు. అందులోని 317 మిలియన్ డాలర్లను కొల్లగొట్టాలని అనుకున్నారు. ఒక ఇంటిలో నుంచి ఈ సొరంగాన్ని తవ్వడం ప్రారంభించారు. అందులో ఫ్యాన్లు, లైట్లు కూడా ఏర్పాటుచేసుకున్నారు. మొత్తానికి పోలీసులు వారి కుట్రను చేధించి 16మంది అనుమానితులను అరెస్టు చేశారు.