రోను అలజడి
పెదగంట్యాడలో 17 సెం.మీల వర్షం
పెనుగాలుల్లేక ఊరట
నేడు, రేపు భారీ వర్షాలు
విశాఖపట్నం : రోను తుపాను కుండపోత వర్షం కురిపిస్తోంది. నగరాన్ని, జిల్లాను తడిసి ముద్ద చేస్తోంది. బుధవారం భారీగా కురిసిన వాన గురువారం కూడా అంతకుమించి కుంభవృష్టిని తలపించింది. ఈదురుగాలులు లేకపోవడంతో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదు.
రోజంతా తెరలు తెరలుగా విరామం ఇస్తూ కురవడంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడానికి ఆస్కారం కలగలేదు. సాధారణంగా వాయుగుండం, తుపానులు ఏర్పడితే పెనుగాలులు వీస్తాయి. పెను బీభత్సం సృష్టిస్తాయి. కానీ ప్రస్తుత తుపాను గురువారం నాటికి 200 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉండడం వల్ల ఈదురుగాలుల జాడ లేదు. ఏడాదిన్నర క్రితం సంభవించిన హుద్‌హుద్ తుపాను సృష్టించిన విలయానికి తుపాను అంటేనే విశాఖ వాసులు హడలెత్తిపోతున్నారు.
ఈ తరుణంలో వచ్చిన రోను తుపాను ఎలాంటి బీభత్సం సృష్టిస్తుందోనని ఆందోళన చెందారు. అయితే గురువారం రాత్రి వరకు భారీ వర్షమే తప్ప పెనుగాలులు లేకపోవడంతో ప్రస్తుతానికి ఊరట చెందుతున్నారు.
భారీ వానలకు నగరంలో గెడ్డలు పొంగాయి. రోడ్లపై నీరు జోరుగా ప్రవహించింది. లోతట్టు ప్రాంతాల్లో కొద్దిపాటి నీరు చేరింది. గాజువాక మెయిన్‌రోడ్డుపై వర్షపు నీరు చేరడంతో ఉదయం దాదాపు గంట సేపు హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది. విశాఖ నగర శివారులోని పెదగంట్యాడలో అత్యధికంగా 17 సెం.మీల భారీ వర్షపాతం నమోదయింది. నగరంలో 10 సెం.మీల వర్షం కురిసింది.
యంత్రాంగం అప్రమత్తం..
తుపాను తీవ్ర తుపానుగా బలపడనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమయింది. తీరప్రాంతంలో ఉన్న 96 గ్రామాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 50 తుపాను షెల్టర్లతో పాటు ఆయా గ్రామాల్లో ఉన్న హైస్కూలు భవనాలను ఇందుకు సన్నద్ధంగా ఉంచారు. తాగునీటిని సమకూరుస్తున్నారు. సంబంధిత తహసీల్దార్లు, మండలాభివృద్ధి అధికారులకు పరిస్థితులను పర్యవే క్షించాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా 16 కరకట్టలు బలహీనంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. భారీ వర్షాలకు వాటికి గండ్లు పడకుండా చర్యలు తీసుకుంటున్నారు.
మరో రెండ్రోజులు వానలు
తుపాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు మరో రెండ్రోజుల పాటు కొనసాగనున్నాయి. పెను తుపానుగా బలపడి, విశాఖకు చేరువగా వస్తే వర్ష ఉధృతితో పాటు పెనుగాలులు భారీగా వీస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందువల్ల ప్రజలు బయటకు రాకుండా, చె ట్లు, పాత భవనాలు, ఇళ్లలోనూ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వీరు సూచిస్తున్నారు.
జిల్లాలో వర్ష బీభత్సం
మరోవైపు జిల్లాలోనూ భారీ వర్షమే కురుస్తోంది. వర్షాలకు ఆనందపురంలోని జెడ్పీ హైస్కూలు గోడ కూలింది. చోడవరంలో మూడు ఇళ్లు కూలాయి. పద్మనాభం మండలంలో సుమారు 500 ఎకరాల్లోని నువ్వు పంట, 50 ఎకరాల్లో దొండ, మరో 50 ఎకరాల్లో మల్లెతోటలు, 20 ఎకరాల్లో ఆనపపాదులు నీట మునిగాయి. సబ్బవరం మండలంలో 25 ఎకరాల్లో కూరగాయల పంటకు నష్టం వాటిల్లింది. అక్కడ రాయపురాజు చెరువుకు గండిపడింది. ఏజెన్సీలో వర్షాలకు గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో దాదాపు 80 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.