
వర్షం కారణంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దు
ఇరు జట్లకు చెరో పాయింట్
రావల్పిండి: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ‘బి’లో హోరాహోరీగా సాగాల్సిన మ్యాచ్‌పై వరుణుడు నీళ్లు చల్లాడు. దీంతో రావల్పిండిలో పసందైన క్రికెట్ విందును ఆస్వాదించాలని వచ్చిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. రెండు పటిష్ట జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతుందనుకున్న సమరం సర్వత్రా ఆసక్తిని రేపింది. గెలిచిన జట్టు సెమీఫైనల్ వైపు నడిచేది. కానీ వర్షం వల్ల ఈ మ్యాచ్ ఒక్క బంతికైనా నోచుకోలేకపోయింది.
తెరిపినివ్వని వానతో మైదానమంతా చిత్తడిగా మారడంతో బ్యాట్లు, బంతులతో కుస్తీ చేయాల్సిన ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లకే పరిమితమయ్యారు. చివరకు చేసేదేమీ లేక ఫీల్డ్ అంప్లైర్లు క్రిస్ గఫాని (ఆస్ట్రేలియా), రిచర్డ్ కెటిల్‌బొరొ (ఇంగ్లండ్)లు అవుట్‌ఫీల్డ్‌ను పరిశీలించి మ్యాచ్ నిర్వహణ అసాధ్యమని తేల్చారు. వెంటనే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు.
గ్రూప్ ‘బి’లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్‌ల్లో శుభారంభం చేశాయి. ఫలితమివ్వని ఈ మ్యాచ్ వల్ల గ్రూప్‌లోని ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్... అన్ని జట్లు ఇప్పుడు రేసులో నిలిచినట్లయ్యింది. ఎందుకంటే మూడేసి పాయింట్లతో ఉన్న దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలకు మిగిలింది ఒక్కటే మ్యాచ్ కాగా... పాయింట్ల పట్టికలో ఖాతా తెరువని ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్‌లకు రెండేసి మ్యాచ్‌లున్నాయి.
చాంపియన్స్ ట్రోఫీలో నేడు
ఇంగ్లండ్ X అఫ్గానిస్తాన్
వేదిక: లాహోర్, మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment