వాన.. హైరానా
♦ జిల్లావ్యాప్తంగా ఒక మోస్తరు వర్షం
♦ సగటున 2.8 సెం.మీ. వర్షపాతం నమోదు
♦ పలు చోట్ల ఆస్తినష్టం, దెబ్బతిన్న పంటలు
♦ చెరువులు,కుంటల్లోకి చేరిన కొద్దిపాటి నీరు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భానుడి ప్రతాపానికి వరుణుడు బ్రేక్ వేశాడు. శుక్రవారం తెల్లవారుజామున జిల్లావ్యాప్తంగా ఒక మోస్తరు వర్షం కురిసింది. అధికారుల గణాం కాల ప్రకారం జిల్లాలో 2.8 సెంటీమీటర్ల వర్షం పడింది. వానలతో పలుచోట్ల చిన్నపాటి కుంటల్లో నీరు చేరగా.. చెరువుల్లోనూ మోస్తరు నీరు నిలిచాయి. జిల్లాలో మే నెలలో 3.1 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ గత మూడురోజులుగా కురిసిన వర్షాలతో ఏకంగా సాధారణ వర్షాన్ని మించి 4.3 సెంటీమీర్ల వర్షం కురవడం గమనార్హం. శుక్రవారం తెల్లవారు జామున ఈదురుగాలుల ధాటికి చెట్లు కుప్పకూలాయి. అత్యధికంగా రాజేంద్రనగర్ మండలంలో 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్‌నగర్ మండలంలో 7.4, ఇబ్రహీంపట్నంలో 6.37 సెంటీమీటర్ల వర్షం కురిసింది.