అంతటా వర్షం
⇔ అత్యధికంగా ముల్కలపల్లిలో 17.0 సెం.మీ. వర్షపాతం
⇔ టేకులపల్లిలో 14.5, బూర్గంపాడులో 11.2
⇔ 32 మండలాల్లో 5 సెం.మీ. పైన నమోదు
⇔ కిన్నెరసాని ప్రాజెక్ట్ ఆరు గేట్లు ఎత్తివేత
⇔ కొన్ని చెరువులకు గండ్లు, మరికొన్ని రోడ్లకు కోత
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో గురువారం వర్షం పడింది. అత్యధికంగా ముల్కలపల్లిలో 17.0, టేకులపల్లిలో 14.5, బూర్గంపాడులో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరద వెల్లువతో కొన్ని చెరువులకు గండ్లు పడ్డాయి. వరుసగా ఐదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీలోని గ్రామాల్లో రోడ్లు కోతకు గురయ్యాయి. కిన్నెరసాని వరద ఉధృతితో ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు. 32 మండలాల్లో ఐదు సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. జూన్‌లో సాధారణ వర్షపాతం సగటున 12.7 సెం.మీ. ఇప్పటివరకు 33.6 సెం.మీ. వర్షపాతం కురిసింది. వాజేడు మినహా 40 మండలాల్లో సాధారణానికన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది.
కిన్నెరసాని పరవళ్లు
కిన్నెరసాని పాల్వంచ రూరల్): ఎగువ నుంచి వరద నీటి రాకతో కిన్నెరసాని రిజర్వాయర్ పరవళ్లు తొక్కుతోంది. దీని నీటి మట్టం 404 అడుగులకు చేరింది. దీని పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 407 అడుగులు. బుధవారం రాత్రి 10.30 గంటలకు ఆరు గేట్లను ఎత్తి, తిరిగి గురువారం ఉదయం 6.30 గంటలకు మూసివేశారు. ఒక్కో గేటును అడుగు చొప్పున పైకి ఎత్తి, 30వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేసినట్టు డ్యామ్ సైడ్ ఏఈ రామకృష్ణ తెలిపారు. ప్రస్తుతం 401.40 అడుగుల నీటిని రిజర్వాయర్‌లో నిల్వ ఉంచారు. ఇన్‌ఫ్లో 5000 క్యూసెక్కులు ఉందని చెప్పారు. కిన్నెరసాని ప్రాజెక్ట్ ఆరు గేట్లు ఎత్తడంతో యానంబైల్-రాజాపురం గ్రామాల మధ్య చప్టా వద్ద మునిగిపోయింది. దీంతో యానంబైల్, ఉల్వనూరు, చండ్రాలగూడెం గ్రామ పంచాయతీల పరిధిలోగల దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గేట్లు మూసివేసిన తరువాత నీరు తగ్గడంతో రాకపోకలు కొనసాగాయి.
వరదలతో ఎక్కడెక్కడ ఏమేం జరిగిందంటే...
⇔ అశ్వారావుపేట మండలంలోని ఊట్లపల్లి సమీపంలోగల వెంకమ్మ చెరువు అలుగు పారడంతో దిగువనున్న వాగొడ్డుగూడెం వద్ద వాగు పొంగిపొర్లింది. 10 గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి.
⇔పాల్వంచ మండలంలోని ఎర్రచెరువు, బండ్రుగుండ చెరువుకు గండి పడింది. కారుకొండ వద్ద లోలెవెల్ బ్రిడ్జి సైడ్‌వాల్స్ పూర్తిగా కొట్టుకుపోయింది. దీని మరమ్మతు పనులు సాగుతున్నాయి. సింగరేణి కొత్తగూడెం ఏరియాలో వర్షం కారణంగా 15వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయమేర్పడింది.
⇔ వైరా రిజర్వాయర్‌లోకి వరద నీరు వస్తోంది. నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం ఏడు అడుగులకు చేరింది.
⇔ అశ్వాపురం మండలంలోని సీతారాంపురం-ఆనందపురం గ్రామాల మధ్య రోడ్డుపై చప్టా తెగిపోవడంతో రాకపోకలు నిలి చాయి. మల్లెలమడుగు వద్ద రాజం పాపయ్య వాగు పొంగి సమీప గ్రామంలోని 15 రోడ్లు కోతకు గురయ్యాయి. గొందిగూడెం ఇసుకవాగు, బురదవాగు పొంగడంతో చుట్టుపక్కల 10 గ్రామా లు మునిగాయి. రోడ్లు కోతకు గురవడంతో ప్రజలు ైరైల్వే ట్రాక్‌పై నడుస్తున్నారు.
⇔ బూర్గంపాడు మండలంలో లక్ష్మీపురం-సంజీవరెడ్డిపాలెం మధ్య రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. బూర్గంపాడు వద్ద రోడ్డు కోతకు గురైంది.