జలకళ కొంతే! | no water in the Ponds | Sakshi
Sakshi News home page

జలకళ కొంతే!

Published Mon, Aug 8 2016 4:59 PM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

జలకళ కొంతే! - Sakshi

జలకళ కొంతే!

  • వానలు సరే.. చెరువుల్లో నీళ్లేవి?
  •  మిషన్‌ కాకతీయ చెరువుల పరిస్థితి అంతే
  •  30 శాతం కూడా నిండని జలవనరులు
  • సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఇంతవరకు కురిసిన వర్షాలతో ఏ ఒక్క చెరువు నిండలేదు. జిల్లాలో చిగురుమామిడి, రామడుగు మినహా మిగిలిన అన్ని మండలాల్లోనూ సమద్ధిగా వానలు కురిశాయి. జిల్లా వ్యాప్తంగా 35 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాగా మరో 20 మండలాల్లో అత్యధికంగా వర్షాలు పడ్డాయి. అయినా ఏ ఒక్కచెరువులో చెరువుల్లో సమద్ధిగా నీరు చేరలేదు. ప్రధానంగా మిషన్‌ కాకతీయ మొదటి, రెండోదశ కింద చేపట్టిన చెరువుల్లో సుమారు 30 శాతంలోపే చెరువుల్లో నీరు చేరింది. మిగిలిన చెరువులు వెలవెలబోతున్నాయి. ‘మిషన్‌’ రెండు దశల్లో జిల్లా వ్యాప్తంగా 1904 చెరువుల పనులు ప్రారంభించారు. ఇంతవరకు 820 చెరువుల పనులే పూర్తయ్యాయి. కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు దాదాపు రూ.100 కోట్లు చెల్లించారు. మరోవైపు ఆయా చెరువుల కట్టలకు అప్పుడే పగళ్లు ఏర్పడి తేగే ప్రమాదం ఏర్పడింది. మరోవైపు వానల కారణంగా ప్రస్తుతం మిషన్‌ కాకతీయ పనులు పూర్తిగా నిలిపేశారు. నియోజకవర్గాలవారీగా మిషన్‌ కాకతీయ కింద చేపట్టిన చెరువుల్లో పనుల పురోగతి, నీటి చేరిక పరిస్థితిపై కథనం..
     
    సిరిసిల్లలో 15 చెరువుల్లో నీటి కళకళ..
    సిరిసిల్ల నియోజకవర్గంలో మొత్తం 278 చెరువులు ఉండగా.. మొదటి విడతగా 48 చెరువుల్లో మిషన్‌ కాకతీయ పనులు ప్రారంభించారు. సిరిసిల్ల మండలంలో 12, ముస్తాబాద్‌లో 13, ఎల్లారెడ్డిపేటలో 14, గంభీరావుపేటలో 9 చెరువుల అభివద్ధికి ప్రతిపాదించి రూ.15.71 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు 80 శాతం మేరకే పనులు పూర్తయ్యాయి. నియోజకవర్గంలో రెండో విడత మిషన్‌ కాకతీయ పనులు వర్షం కారణంగా నిలిచిపోయాయి. ఇప్పటికే పనులు జరిగిన చెరువుల్లో కొంతమేర నీరు చేరింది. 
     
    మంథనిలో నాట్లు వేయని దుస్థితి
    మంథని నియోజక వర్గంలో రెండు విడతల్లో మిషన్‌ కాకతీయలో 210 చెరువులను పునరుద్ధరించారు. మల్హర్‌ మండలంలోని 29 మినహా అన్ని చెరువుల పనులు చివరిదశలో ఉన్నాయి. వర్షాలు  భారీగా కురుస్తున్నా.. కేవలం 30 శాతం చెరువుల్లో మాత్రమే నీరు చేరింది. మిగిలిన 70 శాతం చెరువులు వెలవెల బోతున్నాయి. 10 నుంచి 50 ఎకరాలలోపు ఆయకట్టు ఉన్న చెరువులు మాత్రమే పూర్తిస్థాయిలో నిండాయి. రెండు మూడు వందల పైచిలుకు ఆయకట్టు ఉన్న పెద్ద చెరువుల్లోకి మాత్రం కొద్దిపాటి నీరు చేరింది. నియోజకవర్గంలోని ఆయా చెరువుల కింద ఇప్పటికి ఎకరం భూమిలో కూడా సాగుకు నోచుకోకపోవడం గమనార్హం.
     
    జగిత్యాలలో అంతంతే..
    జగిత్యాల నియోజకవర్గంలో దాదాపు వందకుపైగా చెరువుల్లో పునరుద్ధరణ పనులు చేపట్టినప్పటికీ రాయికల్‌ మినహా సారంగపూర్, జగిత్యాల మండలాల చెరువుల్లో ఆశించిన మేరకు నీళ్లు చేరలేదు. రాయికల్‌ మండలంలో మిషన్‌ కాకతీయ ద్వారా చేపట్టిన చెరువులన్నీ ఇటీవల కురిసిన వర్షాలతో నిండిపోయాయి. మొదటిదశలో 21 చెరువులు ఎంపిక కాగా 21 చెరువులు పూర్తయ్యాయి. ఇటీవల రెండో దశలో 18 చెరువులు ఎంపికకాగా వర్షాలు కురవడంతో పనులు నిలిచిపోయాయి.
     
    మేడిపల్లి, కథలాపూర్‌లో జలకళ
    వేములవాడ నియోజకవర్గంలో మేడిపల్లి, కథలాపూర్‌ మండలాల్లోని చెరువులు ఇటీవల కురిసిన వర్షాలతో నిండుకుండను తలపిస్తున్నాయి. వేములవాడ, కోనరావుపేట, చందుర్తి మండలాల్లోని చెరువులు మాత్రం వెలవెలబోతున్నాయి. ఇటీవల కురిసినవర్షాలకు మిషన్‌ కాకతీయ పనులన్నీ నిలిచిపోయాయి. వేములవాడలోని రాజన్న గుడి చెరువు రూ. 62.89 కోట్లతో ఇటీవలే పనులు చేపట్టారు. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు మల్లారం ఫీడర్‌ చానల్‌ ద్వారా గుడి చెరువులోకి వర్షపు నీరు వచ్చి చేరుతుందనే కారణంగా ఫీడర్‌ చానల్‌ను మూసివేశారు.
     
    హుస్నాబాద్‌లో ప్రమాద ఘంటికలు
    ఇటీవల కురిసిన వర్షాలకు హుస్నాబాద్‌లో మిషన్‌ కాకతీయ చెరువులు జలకళతో ఉప్పొంగుతుంటే మరోవైపు కట్టపై పగుళ్లు, తూముల వద్ద గండ్లు పడే ప్రమాదం ఏర్పడింది. హుస్నాబాద్‌ చిగురుమామిడి మినమా మిగిలిన మండలాల్లోని పలు చెరువుల కట్టల వద్ద పగుళ్లు కన్పిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి కొట్టుకుపోయింది. భారీ వర్షాలొస్తే చెరువులు తెగే ప్రమాదమేర్పడింది. చిగురుమామిడి మండలంలో చెరువుల మరమ్మత్తులు నామమాత్రంగానే జరగడం, అతి తక్కువ వర్షపాతం నమోదు కావడంతో ఇక్కడ చెరువులు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి.
     
    ధర్మపురిలో సాగేది
    ధర్మపురి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోనూ చెరువుల కింద ఇందతవరకు వరి నాట్లు పడలేదు. నియోజకవర్గవంలో జోరుగా వర్షాలు కురుస్తున్నా చెరువులు మాత్రం నిండకపోవడమే ఇందుకు కారణం.  బోర్లు, బావుల కింద మాత్రం రైతులు మొక్క జొన్న, పత్తి, పసుపు, మిర్చి తదితర పంటలు వేశారు. గొల్లపల్లి,  పెగడపల్లి మండలాల్లోని చెరువుల్లో ఏ ఒక్క దానిలోనూ నీరు ఆశించిన స్థాయిలో చేరలేదు. వెల్గటూర్‌లో మొదటి, రెండవ విడుతలో 14 చెరువులు మంజూరైనా ఇక్కడ అదే పరిస్థితి. ఎత్తిపోతల పధకం కింద ఉన్న ముత్తునూర్‌ చెరువు మాత్రం నిండి ఉంది. ధర్మారం, ధర్మపురి మండలంలో చెరువులు సైతం నీళ్లు లేక వెలవెలబోతున్నాయి.
     
    కోరుట్ల చెరువులకు జలకళ..
    ఈ నియోజకవర్గంలో మిషన్‌కాకతీయ కింద రెండు దశల్లో మొత్తం 89 చెరువుల పనులు పూర్తి చేసి సుమారు రూ.30 కోట్లు ఖర్చు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు దాదాపు 50కి పైగా చెరువుల్లో నీరు చేరి కళకళలాడుతున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం కేంద్రంలోని పెద్ద చెరువు, వర్షకొండ చెరువు నాణ్యత సక్రమంగా లేక కట్టలు కోసుకుపోయాయి. కోరుట్ల పట్టణంలోని తాళ్ల చెరువు పనులు పూర్తి కాకముందే నీరు వచ్చి చేరడంతో పనులు ఆగిపోయాయి. మల్లాపూర్‌ మండలంలోని దాదాపు అన్ని చెరువులు నిండిపోయాయి. మెట్‌పల్లి మండలంలో మిషన్‌కాకతీయ కింద పూర్తి అయిన చెరువులన్నింటికీ 70 శాతం నీరు వచ్చింది. మొత్తం మీద సెగ్మెంట్‌లో చెరువులన్నింటికి జలకళ చేకూరింది. 
     
    మానకొండూర్‌లో...
    మానకొండూరు నియోజకవర్గంలో దాదాపు రెండొందల చెరువుల్లో మిషన్‌ కాకతీయ పనులుకాగా...వాటిలో 30 శాతం చెరువుల్లో ఓ మోస్తారుగా నీళ్లు చేరాయి. దాదాపు వందకుపైగా చెరువుల్లో నీళ్లు లేక వెలవెలబోతున్నాయి.   మానకొండూరు మండలంలోని దేవంపల్లి పాల చెరువులో మాత్రం కొద్ది పాటి నీరు  చేరింది.. ఇల్లంతకుంట మండలంలో పత్తికుంటపల్లె, ఒగులాపూర్, పొత్తూరు చెరువుల్లోకి ఓ మోస్తరు వర్షపు నీరు చేరింది. బెజ్జంకి మండలంలోని మత్తన్నపేట, గాగిల్లపూర్, బేగంపేట, లక్ష్మీపూర్, గ్రామాలలోని మిషన్‌ కాకతీయ చెరువులకు స్వల్పంగా నీరు చేరింది. కొత్తగట్టులోని సాయికుంట చెరువు మినహా శంకరపట్నం మండలంలోని చెరువుల్లో మాత్రం చుక్క నీరు కూడ చేరలేదు. తిమ్మాపూర్‌ మండలంలో మండలంలో  47 చెరువుల్లో కాకతీయ పనులు జరగగా...సగానికిపైగా చెరువుల్లో  నీళ్లు లేక వెలవెలబోతున్నాయి.
     
    పెద్దపల్లి చెరువుల్లో నీటి కళ
     నియోజకవర్గ పరిధిలో మిషన్‌ కాకతీయ కింద చేపట్టిన చెరువుల పూడికతీత పనులు పూర్తయిన 132 చెరువుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. నియోజకవర్గంలోని ఆరు మండలాలలో తొలివిడతగా 54 చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టగా 40 మాత్రమే పూర్తయ్యాయి. ఈ పనులకోసం దాదాపుగా రూ.5కోట్లను చెల్లించారు. అలాగే మలివిడతలో ప్రత్యేక దష్టి సారించి 148 చెరువుల్లో పూడికతీత పనులను చేపట్టగా 92పనులు చేశారు. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు ఆయా చెరువుల్లో నీళ్లు చేరుతున్నాయి. పలు చెరువులు జలకళను సంతరించుకున్నాయి. 
     
    వెలవెలబోతున్న చొప్పదండి చెరువులు
    చొప్పదండి నియోజకవర్గంలోని మిషన్‌ కాకతీయ చెరువుల్లోకి ఇంకా వర్షం నీరు రాక వెలవెలబోతున్నాయి. మొదటి విడుదలో అరువైకి పైగా చెరువుల్లో పూడిక తీత పనులు చేపట్టినా మొజారిటీ చెరువుల్లో ఇంకా నీటి ప్రవాహమే లేదు. జులైలో పదిహేను రోజులకుపైగా వర్షాలు కురిసి, ముసుర్లు ముసురుకున్నా, చెరువుల్లోకి వెళ్ళే కాలువలు కబ్జాల పాలవడంతో సత్ఫలితాలనివ్వడం లేదు. బోయిన్‌పల్లి మండలంలో రూ. 5 కోట్ల వరకు వెచ్చించి, మొదటి విడుత పదమూడు చెరువులు ప్రారంభించి పనులు పూర్తి చేసినా అయిదు చెరువుల్లోకి మాత్రమే మత్తడి వరకు నీరు వచ్చింది. చొప్పదండి మండలంలో నాలుగు చెరువుల్లోనే తూముల వరకు నీరు రాగా, మిగితా చెరువుల్లోకి పూర్తి స్థాయిలో నీరు రాలేదు. మల్యాల మండలంలో పదమూడు చెరవులు మొదటి విడుత ప్రారంభించినా నీరులేక చెరువులు వెలవెలబోతున్నాయి. రామడుగు, కొడిమ్యాల మండలాల్లోనూ మెజారిటీ చెరువుల్లో పూర్తిస్థాయిలో నీరు లేక వెలవెలబోతున్నాయి. గంగాధర మండలంలో అన్ని చెరువుల్లో అభివద్ది పనులు పూర్తయ్యాయని చెబుతున్నా ఒక్క చెరువులోకీ నీరు రాలేదు. 
     
    రామగుండంలో నీటి కళ
    రామగుండం మండలంలోని ఎల్కలపల్లి గ్రామంలోని కొత్త చెరువు నీటితో నిండి కళకళాడుతుంది.  కొత్త చెరువులో నీరు ద్వారా  50 ఎకరాల భూమి సాగులోకి వస్తుంది. మిషన్‌ కాకతీయ–2లో బాగంగా చెరువు పూడికతీత చేపట్టారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో మండలంలోని చెరువుల్లో నీళ్లు చేరి కళకళలాడుతున్నాయి. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement