Ronu the storm
-
‘రోను’తో అపార నష్టం
సాక్షి నెట్వర్క్: ‘రోను’ తుపాను ప్రభావం వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి, అరటి, పెసర, మొక్కజొన్న పంటలకు అపార నష్టం కలిగింది. మూడు రోజులుగా భారీ వర్షాల వల్ల శ్రీకాకుళం జిల్లాలోని 29 మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఒక్క వజ్రపుకొత్తూరు ప్రాంతంలోనే సుమారు రూ.30 లక్షల వరకు నష్టపోయినట్లు ఉప్పు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూర్పున రూ.2 కోట్లు నష్టం తూర్పుగోదావరి జిల్లాలో 16 వేల ఎకరాల్లో అపరాలు సాగు కాగా, 90 శాతం పంటకు నష్టం వాటిల్లింది. దీంతో రైతులు రూ.రెండు కోట్ల మేర నష్టపోయారు. 500 గ్రామాల్లో అంధకారం సాక్షి, హైదరాబాద్: రోను తుపానుకు రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ కకావికలమైంది. శుక్రవారం రాత్రికి 91 మండలాల పరిధిలోని 1053 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. 156 ఫీడర్లలో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. రాత్రి వరకు 80 శాతం మేర విద్యుత్ సరఫరా చేయగలిగామని ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర తెలిపారు. కానీ దాదాపు 500 గ్రామాలకు పైగా చీకటిలో మగ్గుతున్నాయి. -
గండం గడిచినట్టే!
మచిలీపట్నం : రోను తుపాను గండం జిల్లాను వీడినట్టేనని అధికారులు చెబుతున్నారు. ఇది పెను తుపానుగా మారి శుక్రవారం సాయంత్రానికి కళింగపట్నానికి 50 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాలోని పారాదీప్‌కు 300 కిలోమీటర్ల దూరంలో, బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌కు 870 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. తుపాను కారణంగా జిల్లాలో గురువారం భారీ వర్షం నమోదైంది. గురువారం రాత్రి నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవటంతో వర్షం తగ్గింది. అయినప్పటికీ రోను తుపాను తీరం దాటే వరకు సముద్రతీరం వెంబడి ఉన్న నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో ప్రత్యేక అధికారులను నియమించి అప్రమత్తంగా ఉంచినట్లు కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. తుపాను పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా తెలుసుకుంటున్నారు. బుధ, గురువారాల్లో 84.62 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఉద్యాన పంటలకు నష్టం రోను తుపాను ప్రభావంతో మోపిదేవి, అవనిగడ్డ, చల్లపల్లి, తోట్లవల్లూరు, కంకిపాడు తదితర మండలాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. అవనిగడ్డ, మోపిదేవి మండలాల్లో 1200 ఎకరాలకు పైగా మామిడి తోటలు ఉన్నాయి. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవటంతో 40 శాతం మేర మాత్రమే కాపు నిలబడిందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం మామిడి కాయలు కోతకు సిద్ధంగా ఉన్న దశలో ఉన్నాయని భారీ వర్షాలు, ఈదురుగాలుల తాకిడికి కాయలు రాలిపోయాయని రైతులు అంటున్నారు. ఉద్యాన శాఖాధికారులు నష్టం అంచనాలు తయారుచేసేందుకు వస్తామని చెప్పినా రాలేదని మోపిదేవి, అవనిగడ్డ మండలాలకు చెందిన మామిడి రైతులు చెబుతున్నారు. నూజివీడు, మైలవరం తదితర ప్రాంతాల్లో ఈదురుగాలుల ప్రభావం అంతగా లేదని, మామిడికి నష్టం జరిగిన దాఖలాలు లేవని ఉద్యానవన శాఖాధికారులు చెబుతున్నారు. వర్షం కారణంగా పూర్తిగా తయారుకాని మామిడి రాలితే రంగు మారటంతో పాటు ఆశించిన ధర పలకదని మామిడి రైతులు వాపోతున్నారు. తుపాను తాకిడికి జిల్లాలో 76 విద్యుత్ స్తంభాలు, నాలుగు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని కలెక్టరేట్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఖరీఫ్‌కు మేలు నడి వేసవిలో కురిసిన ఈ వర్షాలు వరి సాగు చేసే దాదాపు 6.34 లక్షల ఎకరాలకు మేలు చేస్తాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. నైచ్చిన నేల వర్షం కారణంగా వేసవి దుక్కులకు అనుకూలంగా మారుతుందని, దుక్కి అనంతరం పచ్చిరొట్ట విత్తనాలను రైతులు సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. రోను తుపాను జిల్లాలో తీరం దాటడంతో అధికారులు, జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. -
రోను అలజడి
పెదగంట్యాడలో 17 సెం.మీల వర్షం పెనుగాలుల్లేక ఊరట నేడు, రేపు భారీ వర్షాలు విశాఖపట్నం : రోను తుపాను కుండపోత వర్షం కురిపిస్తోంది. నగరాన్ని, జిల్లాను తడిసి ముద్ద చేస్తోంది. బుధవారం భారీగా కురిసిన వాన గురువారం కూడా అంతకుమించి కుంభవృష్టిని తలపించింది. ఈదురుగాలులు లేకపోవడంతో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదు. రోజంతా తెరలు తెరలుగా విరామం ఇస్తూ కురవడంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడానికి ఆస్కారం కలగలేదు. సాధారణంగా వాయుగుండం, తుపానులు ఏర్పడితే పెనుగాలులు వీస్తాయి. పెను బీభత్సం సృష్టిస్తాయి. కానీ ప్రస్తుత తుపాను గురువారం నాటికి 200 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉండడం వల్ల ఈదురుగాలుల జాడ లేదు. ఏడాదిన్నర క్రితం సంభవించిన హుద్‌హుద్ తుపాను సృష్టించిన విలయానికి తుపాను అంటేనే విశాఖ వాసులు హడలెత్తిపోతున్నారు. ఈ తరుణంలో వచ్చిన రోను తుపాను ఎలాంటి బీభత్సం సృష్టిస్తుందోనని ఆందోళన చెందారు. అయితే గురువారం రాత్రి వరకు భారీ వర్షమే తప్ప పెనుగాలులు లేకపోవడంతో ప్రస్తుతానికి ఊరట చెందుతున్నారు. భారీ వానలకు నగరంలో గెడ్డలు పొంగాయి. రోడ్లపై నీరు జోరుగా ప్రవహించింది. లోతట్టు ప్రాంతాల్లో కొద్దిపాటి నీరు చేరింది. గాజువాక మెయిన్‌రోడ్డుపై వర్షపు నీరు చేరడంతో ఉదయం దాదాపు గంట సేపు హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది. విశాఖ నగర శివారులోని పెదగంట్యాడలో అత్యధికంగా 17 సెం.మీల భారీ వర్షపాతం నమోదయింది. నగరంలో 10 సెం.మీల వర్షం కురిసింది. యంత్రాంగం అప్రమత్తం.. తుపాను తీవ్ర తుపానుగా బలపడనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమయింది. తీరప్రాంతంలో ఉన్న 96 గ్రామాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 50 తుపాను షెల్టర్లతో పాటు ఆయా గ్రామాల్లో ఉన్న హైస్కూలు భవనాలను ఇందుకు సన్నద్ధంగా ఉంచారు. తాగునీటిని సమకూరుస్తున్నారు. సంబంధిత తహసీల్దార్లు, మండలాభివృద్ధి అధికారులకు పరిస్థితులను పర్యవే క్షించాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా 16 కరకట్టలు బలహీనంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. భారీ వర్షాలకు వాటికి గండ్లు పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరో రెండ్రోజులు వానలు తుపాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు మరో రెండ్రోజుల పాటు కొనసాగనున్నాయి. పెను తుపానుగా బలపడి, విశాఖకు చేరువగా వస్తే వర్ష ఉధృతితో పాటు పెనుగాలులు భారీగా వీస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందువల్ల ప్రజలు బయటకు రాకుండా, చె ట్లు, పాత భవనాలు, ఇళ్లలోనూ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వీరు సూచిస్తున్నారు. జిల్లాలో వర్ష బీభత్సం మరోవైపు జిల్లాలోనూ భారీ వర్షమే కురుస్తోంది. వర్షాలకు ఆనందపురంలోని జెడ్పీ హైస్కూలు గోడ కూలింది. చోడవరంలో మూడు ఇళ్లు కూలాయి. పద్మనాభం మండలంలో సుమారు 500 ఎకరాల్లోని నువ్వు పంట, 50 ఎకరాల్లో దొండ, మరో 50 ఎకరాల్లో మల్లెతోటలు, 20 ఎకరాల్లో ఆనపపాదులు నీట మునిగాయి. సబ్బవరం మండలంలో 25 ఎకరాల్లో కూరగాయల పంటకు నష్టం వాటిల్లింది. అక్కడ రాయపురాజు చెరువుకు గండిపడింది. ఏజెన్సీలో వర్షాలకు గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో దాదాపు 80 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
ముంచెత్తిన ‘రోను’
ఎన్డీఆర్ఎఫ్తో పాటు 15 నేవీ బృందాలు సిద్ధం తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన యంత్రాంగం పెదగంట్యాడలో అత్యధికంగా 17 సెం.మీ. వర్షం కశింకోటలో 15.5 సెం.మీ. లోతట్టు ప్రాంతాలు జలమయం.. నీటమునిగిన వరి, చెరకు వేసవి దుక్కులకు అనుకూలం జిల్లాలో రోను తుపాను అలజడి సృష్టించింది. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఏజెన్సీలోని అనేక గిరిజన గ్రామాల్లో అంధకారం నెలకొంది. చోడవరం, అనకాపల్లిలో ఇళ్లు కూలాయి. కశింకోట, రాంబిల్లి, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. దేవరాపల్లిలో ఇంటి ముందు పోర్టికో కూలి తల్లీ కూతుళ్లు గాయపడ్డారు. అనంతగిరి సమీపంలో కేకే రైలు మార్గంలో కొండ చరియలు విరిగిపడి రైలు పట్టాల మీద పడటంతో గూడ్స్‌రైలు పట్టాలు తప్పింది. జలాశయాల్లో నీటిమట్టం పెరుగుతోంది. అక్కడక్కడా పంటలకు నష్టం కలగజేసినప్పటికీ ఈ వర్షాలు వేసవి దుక్కులకు అనుకూలమని రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. విశాఖపట్నం: మండువేసవిలో కుండపోత జిల్లాను ముంచెత్తింది. ‘రోవాను’ తుపాను వల్ల ఎదురయ్యే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. ఇప్పటికే జిల్లా కేంద్రంలో టోల్‌ఫ్రీ నెంబర్‌తో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. గురువారం డివిజన్, మండల కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్‌లు తెరిచారు. తుపానును ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ గురువారం మీడియాకు వివరించారు. తహసీల్దార్లు, ఎంపీడీఒలను మండల కేంద్రాల్లోనే ఉండేలా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్ తుపాను విపత్తును ఎదుర్కోడానికి వీలుగా జిల్లాలో అందుబాటులో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు నావీ అధికారులతో చర్చించి 15 ప్రత్యేక సహాయ బృందాలను సిద్ధం చేశారు. 96 తీరగ్రామాల్లో ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను అవసరాన్ని బట్టి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. హుద్‌హుద్ తుపానుకు 250 కి.మీ వేగంతో గాలులు వేయగా...ప్రస్తుత రోవాను తుపాను సందర్భంగా తీరం వెంబడి 100 కి.మీ.వేగంతోనే ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనావేయడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని కలెక్టర్ ప్రకటించారు. ఈ గాలులుకు పూరిళ్లు ఎగిరి పోయే ప్రమాదం ఉన్నందున, పూరిళ్లలో నివసించే వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి తరలింపు నిర్ణయం తీసుకోనున్నారు. తుపాను షెల్టర్లు, ఫ్లడ్‌బ్యాంక్స్ పునరుద్ధరణ 86 తుఫాన్ షెల్టర్స్‌లో 36 షెల్టర్లను పునర్నిర్మించగా, మరో 15 వరకు పునరావాస కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా కమ్యూనిటీ హాల్స్, పాఠశాలలను కూడా సిద్ధం చేశారు. మండలాలకు అదనంగా బియ్యం నిల్వలను తరలిస్తున్నారు. జిల్లాలోని శారదా, వ రహా, గోస్తని, పెద్దేరు వంటి నదీ తీర ప్రాంతాల్లో 16 చోట్ల ఫ్లడ్ బ్యాంక్స్ బలహీనంగా ఉన్నట్టుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో గండ్లు పడకుండా ముందుజాగ్రత్త చర్యగా ఇరిగేషన్ శాఖ ద్వారా ఇసుక బస్తాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే చోడవరం మండలం వడ్డాది వద్ద అత్యంత బలహీనంగా ఉన్న పెద్దేరు నదిగట్టుపై ఇసుక బస్తాలతో పటిష్టపర్చే చర్యలు చేపట్టారు. సబ్బవరం మండలం రాయపురాజుచెరువు గండిపడి 25 ఎకరాల కూర గాయల పంటలు దెబ్బతినడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న సాగు, తాగునీటి చెరువులను ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖాధికారులు పరిశీలిస్తున్నారు. నీరుచెట్టు కార్యక్రమంలో భాగంగా ఎక్కడైనా చెరువుగట్లు తొలగించి ఉంటే వెంటనే పూడ్చే చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.