ముంచెత్తిన ‘రోను’
ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు 15 నేవీ బృందాలు సిద్ధం
తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన యంత్రాంగం
పెదగంట్యాడలో అత్యధికంగా 17 సెం.మీ. వర్షం కశింకోటలో 15.5 సెం.మీ.
లోతట్టు ప్రాంతాలు జలమయం.. నీటమునిగిన వరి, చెరకు
వేసవి దుక్కులకు అనుకూలం
జిల్లాలో రోను తుపాను అలజడి సృష్టించింది. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఏజెన్సీలోని అనేక గిరిజన గ్రామాల్లో అంధకారం నెలకొంది. చోడవరం, అనకాపల్లిలో ఇళ్లు కూలాయి. కశింకోట, రాంబిల్లి, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. దేవరాపల్లిలో ఇంటి ముందు పోర్టికో కూలి తల్లీ కూతుళ్లు గాయపడ్డారు. అనంతగిరి సమీపంలో కేకే రైలు మార్గంలో కొండ చరియలు విరిగిపడి రైలు పట్టాల మీద పడటంతో గూడ్స్‌రైలు పట్టాలు తప్పింది. జలాశయాల్లో నీటిమట్టం పెరుగుతోంది. అక్కడక్కడా పంటలకు నష్టం కలగజేసినప్పటికీ ఈ వర్షాలు వేసవి దుక్కులకు అనుకూలమని రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
విశాఖపట్నం: మండువేసవిలో కుండపోత జిల్లాను ముంచెత్తింది. ‘రోవాను’ తుపాను వల్ల ఎదురయ్యే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. ఇప్పటికే జిల్లా కేంద్రంలో టోల్‌ఫ్రీ నెంబర్‌తో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. గురువారం డివిజన్, మండల కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్‌లు తెరిచారు. తుపానును ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ గురువారం మీడియాకు వివరించారు. తహసీల్దార్లు, ఎంపీడీఒలను మండల కేంద్రాల్లోనే ఉండేలా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్ తుపాను విపత్తును ఎదుర్కోడానికి వీలుగా జిల్లాలో అందుబాటులో ఉన్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందంతో పాటు నావీ అధికారులతో చర్చించి 15 ప్రత్యేక సహాయ బృందాలను సిద్ధం చేశారు. 96 తీరగ్రామాల్లో ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను అవసరాన్ని బట్టి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. హుద్‌హుద్ తుపానుకు 250 కి.మీ వేగంతో గాలులు వేయగా...ప్రస్తుత రోవాను తుపాను సందర్భంగా తీరం వెంబడి 100 కి.మీ.వేగంతోనే ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనావేయడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని కలెక్టర్ ప్రకటించారు. ఈ గాలులుకు పూరిళ్లు ఎగిరి పోయే ప్రమాదం ఉన్నందున, పూరిళ్లలో నివసించే వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి తరలింపు నిర్ణయం తీసుకోనున్నారు.
తుపాను షెల్టర్లు, ఫ్లడ్‌బ్యాంక్స్ పునరుద్ధరణ
86 తుఫాన్ షెల్టర్స్‌లో 36 షెల్టర్లను పునర్నిర్మించగా, మరో 15 వరకు పునరావాస కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా కమ్యూనిటీ హాల్స్, పాఠశాలలను కూడా సిద్ధం చేశారు. మండలాలకు అదనంగా బియ్యం నిల్వలను తరలిస్తున్నారు. జిల్లాలోని శారదా, వ రహా, గోస్తని, పెద్దేరు వంటి నదీ తీర ప్రాంతాల్లో 16 చోట్ల ఫ్లడ్ బ్యాంక్స్ బలహీనంగా ఉన్నట్టుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో గండ్లు పడకుండా ముందుజాగ్రత్త చర్యగా ఇరిగేషన్ శాఖ ద్వారా ఇసుక బస్తాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే చోడవరం మండలం వడ్డాది వద్ద అత్యంత బలహీనంగా ఉన్న పెద్దేరు నదిగట్టుపై ఇసుక బస్తాలతో పటిష్టపర్చే చర్యలు చేపట్టారు. సబ్బవరం మండలం రాయపురాజుచెరువు గండిపడి 25 ఎకరాల కూర గాయల పంటలు దెబ్బతినడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న సాగు, తాగునీటి చెరువులను ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖాధికారులు పరిశీలిస్తున్నారు. నీరుచెట్టు కార్యక్రమంలో భాగంగా ఎక్కడైనా చెరువుగట్లు తొలగించి ఉంటే వెంటనే పూడ్చే చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.