
రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన సైబర్ మోసాలు
వ్యక్తిగత సమాచారం కోసం నమ్మకంగా ఫోన్లు
వివరాలు తెలియగానే ఖాతాలు ఖాళీ లబోదిబోమంటున్న అమాయకులు
మూడునెలల్లో ఎన్‌సీసీఆర్‌పీ హెల్ప్‌లైన్‌కు 64 వేలకుపైగా ఫిర్యాదులు
రూ.1,085 కోట్ల మేర మోసపోయిన బాధితులు
గుర్తు తెలియని వ్యక్తులకు బ్యాంకు అకౌంట్ వివరాలు, ఆధార్, పాన్ కార్డు నంబర్లు, ఓటీపీల వంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదని పదేపదే పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ అనేక మంది అమాయకులు సైబర్ మోసగాళ్ల చేతిలో సులభంగా మోసపోతున్నారు. ఆ తరువాత అసలు విషయం తెలుసు కుని లబోదిబోమంటున్నారు. గడచిన మూడు నెలల్లో వెలుగుచూసిన సంఘటనలలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఏకంగా రూ.1,085 కోట్ల మేర మోసపోయినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మూడు నెలల్లో నేషనల్ సైబర్ క్రైం రిపోరి్టంగ్ పోర్టల్ (ఎన్‌సీసీఆర్‌పీ) హెల్ప్‌లైన్ నంబరుకు 64 వేలకుపైగా ఫిర్యాదులు వచ్చాయి. దీన్ని బట్టి సైబర్ మోసగాళ్లు ఏ స్ధాయిలో రెచ్చి పోతున్నారో ఇట్టే అర్ధమవుతోంది. ముంబై మినహా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అప్రమత్తమైన సైబర్ డిపార్టుమెంట్ పోలీసులు మరికొందరని రూ.119 కోట్లు మోసపోకుండా కాపాడడంలో సఫలీకృతమయ్యారు.
విస్తృతంగా ప్రచారం చేస్తున్నా...
సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దంటూ వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా అనునిత్యం ప్రభుత్వం హెచ్చరిస్తోంది.మీ బంధువులు అనారోగ్యంతో అస్పత్రిలో చేరారని, మీ పిల్లల్ని ఏదో కేసులో నేరం కింద పోలీసులు అరెస్టు చేశారని, బ్యాంకు మేనేజర్లు , సీబీఐ, కస్టమ్ డిపార్టుమెంట్ ఇలా రకరకాల శాఖల నుంచి, అలాగే కేవైసీ చేయాలని, ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని ఇలా రకరకాల వంకలతో సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేస్తున్నారు. అయితే ఇలాంటి ఫోన్లు వస్తే స్పందించవద్దని, ఏ బ్యాంకు సిబ్బందీ ఇలా ఫోన్‌లో వివరాలు అడగరనే సందేశాలను గత కొద్ది రోజులుగా టెలికామ్ డిపార్టుమెంట్ ద్వారా వినిపిస్తున్నారు. అయినప్పటికీ అనేకమంది అమాయకులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు.
కొందరు ఆలస్యంగానైనా మేలుకుని 1930 నంబరుకి ఫిర్యాదు చేస్తున్నారు. ఈమేరకు పోగొట్టుకున్న సొమ్మును పూర్తిగా కాకపోయినా కొంతమేర అయినా పోలీసులు కాపాడగలుగుతున్నారు. లేదంటే బ్యాంక్ ఖాతాలోంచి మొత్తం డబ్బులు ఖాళీ అయ్యే ప్రమా దం ఉంటుంది. ఇలాంటి సైబర్ మోసాలను అరికట్టేందుకు ఇటీవల న్యూ ముంబైలోని మహాపే ప్రాంతంలో అత్యాధునిక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 150పైగా సిబ్బంది, 24 గంటలు విధులు నిర్వహిస్తారు. 1930 హెల్ప్‌లైన్ నంబరుకు ప్రతీరోజు సగటున ఏనిమిది వేల వరకూ ఫిర్యాదులు వస్తుంటాయి. కంట్రోల్ రూం సిబ్బంది ఈ ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తారని, సా«ధ్యమైనంత వరకు అమాయకులు మోసపోకుండా ప్రయత్నిస్తుంటారని మహారాష్ట్ర సైబర్ డిపార్టుమెంట్ సూపరింటెండెంట్ సంజయ్ లాట్కర్ తెలిపారు.
విదేశీ సిమ్‌కార్డులతో మరింత చిక్కు: సంజయ్ లాట్కర్
ఇదిలాఉండగా సైబర్ మోసగాళ్లు ఒకసారి వినియోగించిన ఫోన్ నంబర్లను మరోసారి వాడరు. వీటిని ఎలాగోలా సంపాదించిన కొందరు నేరగాళ్లు యువతి, యువకులు, మహిళలను మీ ఫోటోలను అశ్లీలంగా మార్చి సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించి డబ్బులు గుంజుతున్నారు. బాధితులు ఈ నంబర్లు గురించి తెలిపేందుకు వీల్లేకపోవడంతో ఏమీతోచక కొందరు, పరువు పోతుందన్న భయంతో కొందరు, ఇలా వేలాది మంది పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఆగిపోతున్నారు. గడచిన మూడు-నెలల్లో 1930 హెల్ప్‌లైన్ నంబరుకు వచి్చన 28,209 ఫిర్యాదుదారులు కంప్లైంట్ చేసిన 2,713 మొబైల్ నంబర్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. మిగతా నంబర్ల గురించి ఆమాత్రం సమాచారం కూడా లేదు. దీన్ని బట్టి సైబర్ నేరగాళ్లు విదేశీ సిమ్ కార్డుల ద్వారా ఫోన్ చేస్తున్నారని, ఒకసారి వాడిన సిమ్ కార్డును మరోసారి వినియోగించడం లేదని తెలుస్తోంది. దీంతో నేరగాళ్లందరినీ పట్టుకోవడం సాధ్యం కావడం లేదని సంజయ్ లాట్కర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment