అప్రమత్తంగా ఉండండి  | CM KCR orders to officials in the wake of heavy rains | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా ఉండండి 

Published Fri, Jul 21 2023 2:07 AM | Last Updated on Fri, Jul 21 2023 10:47 AM

CM KCR orders to officials in the wake of heavy rains - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటం, గోదావరి నది ఉగ్రరూపం దాల్చడం నేపత్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తూ, తక్షణ చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సూచించారు.

భద్రా చలంలో ముంపునకు గురయ్యే అవకాశాలున్న లోతట్టు ప్రాంతాల ప్రజలను యుద్ధ ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని.. గతంలో వరదల సందర్భంగా సమర్థవంతంగా పనిచేసిన అధికారుల సేవలను వినియోగించు కోవాలని చెప్పారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్లు, ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

ఇక తక్షణమే భద్రాచలం వెళ్లి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు చేపట్టాలని హైదరాబాద్‌ కలెక్టర్‌ దుర్శెట్టి అనుదీప్‌ను సీఎం ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం, కొత్తగూడెం కలెక్టరేట్, భద్రాచలం తహసీల్దార్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

సీఎస్, డీజీపీ సమీక్ష
సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌తో కలసి గోదావరి పరీవాహక జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. భారీ వర్షాలు, గోదావరి వరద నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని శాంతికుమారి ఆదేశించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను, సరిపడా మందులు, విద్యుత్‌ పరికరాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.

ఏవిధమైన సహాయ, సహకారాలైనా రాజధాని నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గోదావరి పరీవాహక ప్రాంతాల పోలీసు అధికారులతో ఇప్పటికే సమీక్షించామని.. సహాయ కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు చేశామని డీజీపీ అంజనీకుమార్‌ చెప్పారు. ఐజీ చంద్రశేఖర్‌రెడ్డిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెంటనే వెళ్లి పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించామని వెల్లడించారు. 

‘అవసరమైతే హెలికాప్టర్‌ సేవలు’ 
సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటం, గోదావరి ఉగ్రరూపం దాల్చడం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తూ తక్షణ చర్యలకు ఉపక్రమించాలని సీఎస్‌ శాంతికుమారికి సూచించారు.

భద్రాచలంలో ముంపునకు గురయ్యే అవకాశాలున్న లోతట్టు ప్రాంతాల ప్రజలను యుద్ధప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని.. గతంలో వరదల సందర్భంగా సమర్థంగా పనిచేసిన అధికారుల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు.

సహాయక చర్యల కోసం హెలికాప్టర్లు, ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇక తక్షణమే భద్రాచలం వెళ్లి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు చేపట్టాలని హైదరాబాద్‌ కలెక్టర్‌ దుర్శెట్టి అనుదీప్‌ను సీఎం ఆదేశించారు.

‘వారం రోజులు నిరసనలు వాయిదా’
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ చేపట్టిన రైతు నిరసనలను వారం రోజులు వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూడు గంటల కరెంటు విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలను భారీ వర్షాల నేపథ్యంలో వారంపాటు వాయిదా వేయాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది.

ఈ మేరకు కేటీఆర్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత రైతులందరినీ కలుపుకొని కాంగ్రెస్‌ పార్టీ విధానాలను  ఎండగట్టేలా నిరసన కార్యక్రమాలను పార్టీ కొనసాగిస్తుందని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు, రైతులకు ఈ వారం రోజులపాటు అండగా ఉండాలని బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులను, నాయకులను, కార్యకర్తలను కేటీఆర్‌ కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement