సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను అప్రమత్తం చేశారు. మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ సూచనలు, రేపటి వరకు అతిభారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జోనల్ కమిషనర్లతో మంగళవారం కాన్ఫరెన్స్ నిర్వహించారామె.
లోతట్టు ప్రాంతాల్లో అస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని మేయర్ అధికారులను ఆదేశించారు. అలాగే.. పోలీస్, జీహెచ్‌ఎంసీ శాఖల సమన్వయంతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రేపటి వరకు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిందని. దీంతో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని కోరారామె.
► ప్రజలు అత్యవసరం పని ఉంటేనే బయటి రావాలని తెలిపారు. హిమాయత్, ఉస్మాన్ సాగర్ జంట జలయాలు గేట్లు ఎత్తి వేసిన నేపథ్యంలో మూసి నది లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని జోనల్ కమిషనర్ లను ఆదేశించారు. హెల్ప్ లైన్ కు వచ్చిన పిర్యాదులకు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులకు మేయర్ సూచించారు.
ఇప్పటికే నగరం, శివారుల్లోని పలు కాలునీలు నీట మునిగి చెరువుల్ని తలపిస్తున్నాయి. జలాశయాలకు నీరు పోటెత్తడంతో గేట్లు వదిలి.. దిగువనకు విడుదల చేస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ముందస్తుగానే ఖాళీ చేయాలని కోరుతున్నారు అధికారులు.
లోతట్టు ప్రజల్ని అప్రమత్తం చేయండి
భారీ వర్షాలకు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ రొనాల్డ్ రాస్ సూచించారు. జంట జలాశయాల గేట్లు తెరిచినందున మూసీ పరివాహక ప్రాంతాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని అధికారుల్ని కోరారాయన. ప్రజలు కూడా ఏదైనా సమస్య ఎదురైతే జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని సూచించారు.
జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్ నెంబర్ 040-2111 1111
డయల్ 100
ఈవీడీఎం కంట్రోల్ రూం నెంబర్ 9000113667
► మరోవైపు మంత్రి తలసాని సైతం హైదరాబాద్ వర్ష పరిస్థితులపై అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్లపై నీరు నిలిచిపోకుండా చూడాలని, కూలిన చెట్లు, కొమ్మలను వెంటనే తొలగించాలని, హుస్సేన్‌సాగర్.. ఉస్మాన్ సాగర్ నీటి స్థాయిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రత్యేకించి నాలాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపైనా తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర సేవలకు జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూంను సంప్రదించాలని ప్రజలను కోరారు.
► ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. వీలును బట్టి వర్క్‌ఫ్రమ్ చేసుకోవాలని సూచించారు. అలాగే.. ఆఫీస్‌లకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ట్రాఫిక్ రద్దీ దృష్టిలో ఉంచుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment