గండం గడిచినట్టే!
మచిలీపట్నం : రోను తుపాను గండం జిల్లాను వీడినట్టేనని అధికారులు చెబుతున్నారు. ఇది పెను తుపానుగా మారి శుక్రవారం సాయంత్రానికి కళింగపట్నానికి 50 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాలోని పారాదీప్‌కు 300 కిలోమీటర్ల దూరంలో, బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌కు 870 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. తుపాను కారణంగా జిల్లాలో గురువారం భారీ వర్షం నమోదైంది. గురువారం రాత్రి నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవటంతో వర్షం తగ్గింది.
అయినప్పటికీ రోను తుపాను తీరం దాటే వరకు సముద్రతీరం వెంబడి ఉన్న నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో ప్రత్యేక అధికారులను నియమించి అప్రమత్తంగా ఉంచినట్లు కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. తుపాను పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా తెలుసుకుంటున్నారు. బుధ, గురువారాల్లో 84.62 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.
ఉద్యాన పంటలకు నష్టం
రోను తుపాను ప్రభావంతో మోపిదేవి, అవనిగడ్డ, చల్లపల్లి, తోట్లవల్లూరు, కంకిపాడు తదితర మండలాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. అవనిగడ్డ, మోపిదేవి మండలాల్లో 1200 ఎకరాలకు పైగా మామిడి తోటలు ఉన్నాయి. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవటంతో 40 శాతం మేర మాత్రమే కాపు నిలబడిందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం మామిడి కాయలు కోతకు సిద్ధంగా ఉన్న దశలో ఉన్నాయని భారీ వర్షాలు, ఈదురుగాలుల తాకిడికి కాయలు రాలిపోయాయని రైతులు అంటున్నారు. ఉద్యాన శాఖాధికారులు నష్టం అంచనాలు తయారుచేసేందుకు వస్తామని చెప్పినా రాలేదని మోపిదేవి, అవనిగడ్డ మండలాలకు చెందిన మామిడి రైతులు చెబుతున్నారు. నూజివీడు, మైలవరం తదితర ప్రాంతాల్లో ఈదురుగాలుల ప్రభావం అంతగా లేదని, మామిడికి నష్టం జరిగిన దాఖలాలు లేవని ఉద్యానవన శాఖాధికారులు చెబుతున్నారు. వర్షం కారణంగా పూర్తిగా తయారుకాని మామిడి రాలితే రంగు మారటంతో పాటు ఆశించిన ధర పలకదని మామిడి రైతులు వాపోతున్నారు. తుపాను తాకిడికి జిల్లాలో 76 విద్యుత్ స్తంభాలు, నాలుగు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయని కలెక్టరేట్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు.
ఖరీఫ్‌కు మేలు
నడి వేసవిలో కురిసిన ఈ వర్షాలు వరి సాగు చేసే దాదాపు 6.34 లక్షల ఎకరాలకు మేలు చేస్తాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. నైచ్చిన నేల వర్షం కారణంగా వేసవి దుక్కులకు అనుకూలంగా మారుతుందని, దుక్కి అనంతరం పచ్చిరొట్ట విత్తనాలను రైతులు సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. రోను తుపాను జిల్లాలో తీరం దాటడంతో అధికారులు, జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.