kalingapatnam
-
Cyclone Gulab: ‘గండం’ దాటింది
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం, సాక్షి, అమరావతి, మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఉత్తరాంధ్రకు కునుకు లేకుండా చేసిన గులాబ్ తుపాను కొద్ది గంటలు ముందుగానే ఆదివారం రాత్రి కళింగపట్నం–గోపాలపూర్ మధ్య తీరం దాటింది. సాయంత్రం 6.30 గంటల సమయంలో తీరాన్ని తాకిన తుపాన్ అనంతరం కళింగపట్నానికి పశ్చిమంగా ఒడిశా వైపు పయనిస్తూ తీరం దాటింది. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా కుంభవృష్టితో తుపాను ప్రభావం తీవ్రంగా కనిపించింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో తుపాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలో తీరం వెంట గంటకు 80–90 కిలో మీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. గులాబ్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కోస్తాంధ్ర జిల్లాల్లోనూ అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జోరు వర్షాలతో నాగావళి పరవళ్లు తొక్కుతోంది. తోటపల్లి ప్రాజెక్ట్ వద్ద నీటి ప్రవాహం పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మడ్డువలస వద్ద కూడా అదే పరిస్థితి ఉంది. హిర మండలం గొట్టాబ్యారేజీ వద్ద వంశధారలో నీటి ప్రవాహం పెరగడంతో 22 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడిచిపెడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో భారీ వర్షానికి జలమయమైన రహదారి చివరిలో నెమ్మదించి.. శ్రీకాకుళం జిల్లాను వణికించిన గులాబ్ ఆఖరులో శాంతించింది. తిత్లీ సమయంలో గంటకు 195 కిలోమీటర్ల వేగంతో రాకాసి గాలులు వీయగా హుద్‌హుద్ వేళ 215 కిలోమీటర్ల వేగంతో పెను తుపాన్ విరుచుకుపడింది. గులాబ్ మాత్రం 80–90 కిలోమీటర్ల వేగానికి పరిమితమైంది. రాత్రి తొమ్మిది నుంచి పది గంటల సమయంలో 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. రహదారులకు అడ్డంగా చెట్లు పడిపోవడంతో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఈ నెల 28న మరో అల్పపీడనం ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో సోమవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతంలో 28వ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీరం దాటే సూచనలున్నాయని భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా గోపినాథపురం సమీపంలో రోడ్డుపై పడిన చెట్లను తొలగిస్తున్న సిబ్బంది శ్రీకాకుళం జిల్లాలో 40.4 మి.మీ సగటు వర్షపాతం ఆదివారం రాత్రి 8.30 నుంచి 10.30 గంటల మధ్య శ్రీకాకుళం జిల్లాలో 40.4 మి.మీ, విశాఖపట్నం జిల్లాలో 37.3 మి.మీ, విజయనగరం జిల్లాలో 26.8 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. కళింగపట్నంలో 148.5 మి.మీ, ఎచ్చెర్లలో 109.5, అడవివరంలో 108, నిమ్మాడలో 96.5, తులుగులో 96.5, విశాఖ నగరంలో 93.3, నరసన్నపేటలో 78.3, రాగోలులో 77, తమ్మినాయుడుపేటలో 71.8, పొలాకిలో 71 మి.మీ వర్షం కురిసింది. ఉత్తరాంధ్రకు వరద హెచ్చరిక ఆదివారం రాత్రి నుంచి శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, విశాఖ జిల్లాలోని అనేక చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. ఉభయగోదావరి జిల్లాల్లోను వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల వల్ల వంశధార, మహేంద్ర తనయ నదులు పొంగి ప్రవహించే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. తుపాను కారణంగా విశాఖలోని పెదజాలరిపేట వద్ద ఒడ్డుకు చేర్చిన పడవలు పునరావాస కేంద్రాలకు తరలింపు.. శ్రీకాకుళం జిల్లాలో 38 పునరావాస కేంద్రాల్లోకి 1,358 మందిని తరలించారు. బందరువానిపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో 500 మందికి పునరావాసం కల్పించారు. వజ్రపుకొత్తూరు మండలంలో 182 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మంచినీళ్లపేటలో 12 మందిని, బైపల్లి గ్రామంలో 54 మందిని, ఎల్‌డీపేటకు చెందిన 26 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మెట్టూరుకు చెందిన 65 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి భోజన సదుపాయాలు కల్పించారు. పూడిలంకలో 73 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించారు. 27 మండలాల్లో ‘గులాబ్’ ప్రభావం తుపాను దృష్ట్యా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. 27 మండలాలపై తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేసి యుద్ధప్రాతిపదికన పరికరాలు, సిబ్బందిని తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశారు. 276 ప్రైవేటు క్రేన్లు, 64 జనరేటర్లు అందుబాటులో ఉంచారు. 25,500 విద్యుత్ స్థంభాలు, 2,732 ట్రాన్స్ఫార్మర్లు స్టోర్‌లో ఉంచారు. శ్రీకాకుళం జిల్లాలో 1400 మందితో 70 బృందాలు, విజయనగరం జిల్లాలో 700 మందితో 35 బృందాలు, విశాఖపట్నం జిల్లాలో 1440 మందితో 72 బృందాలను రంగంలోకి దించారు. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి 24 గంటలూ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. పర్యవేక్షణకు నోడల్ అధికారులను నియమించారు. తుపాను నేపధ్యంలో ఏపీఈపీడీసీఎల్ చేపట్టిన ఏర్పాట్లపై డిస్కం సీఎండీ కె.సంతోషరావుతో కలసి ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ సమీక్ష నిర్వహించారు. లైన్మెన్ నుంచి చైర్మన్ వరకూ ఎవరికీ సెలవులు ఉండవని, పునరుద్ధరణ పనులపై సీఎం జగన్ పర్యవేక్షణ ఉంటుందని, తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బోటు బోల్తా.. ఐదుగురు సురక్షితం శ్రీకాకుళం జిల్లా మంచినీళ్లపేట గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు ఒడిశా నుంచి కొత్త బోటు కొనుగోలు చేసి వస్తుండగా అక్కుపల్లి సమీపంలో గంగువాడ కొండ దగ్గర సముద్రంలో బోటు బోల్తాపడడంతో గల్లంతయ్యారు. వీరిలో ఐదుగురు సురక్షితంగా అక్కుపల్లి, బాతుపురం ప్రాంతాల్లో తీరానికి చేరుకోగా గల్లంతైన బుంగ మోహన్‌రావు (18) కోసం గాలిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యలతో.. తుపాను హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో పకడ్బందీ చర్యలు చేపట్టింది. కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని గమనిస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. తొలిసారి తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. వలంటీర్లను రంగంలోకి దించి ఆయా ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూశారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో ఐదు, కంచిలి మండలంలో 3, ఇచ్ఛాపురంలో 3, పలాసలో 5 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పోలాకి మండలం సముద్ర తీర ప్రాంతంలో పర్యటించారు. పశు సంవర్ధకశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. ఎస్పీ అమిత్ బర్దార్ బారువ మండలం కొత్తూరు, సంతబొమ్మాళి మండలం సున్నపల్లి గ్రామాల్లో పర్యటించి మత్స్యకారులకు జాగ్రత్తలు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ప్రజలు జాగ్రత్తగా తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు. -
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు..
సాక్షి, శ్రీకాకుళం: జిల్లా అంతటా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గంటల పాటు సముద్రంలోకి మత్స్యకారుల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కళింగపట్నం పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఉత్తర బంగాళాఖాతంపై పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాన్ని ఆనుకొని ఉన్న తీవ్ర అల్పపీడనం.. వచ్చే 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారనుంది. కోస్తాంధ్ర అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని..తీరం వెంట గంటకు 50 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. -
హమ్మయ్యా.. వాళ్లు సేఫ్!
తూర్పుగోదావరి జిల్లా: కాకినాడ దమ్ములపేటకు చెందిన ఫిషింగ్ బోటు ఆచూకీ లభ్యమైంది. అందులో ఉన్న మత్స్యకారులందరూ సురక్షితంగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా కళింగపట్న సమీపంలో ఉన్నట్లు కుటుంబసభ్యులకు బోటులోని మత్స్యకారులు తెలిపారు. బోటులో ఆయిల్ అయిపోవడంతో ఈ గందరళగోళం ఏర్పడిందని మత్స్యకారులు తెలిపారు. ఆయిల్ అయిపోయిన విషయాన్ని బోటు యజమాని దృష్టికి తీసుకెళ్లినట్లు మత్స్యకారులు తెలిపారు. దమ్ములపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 7న కాకినాడ నుంచి చేపల వేటకు వెళ్లారు. మత్స్యకారులు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో బాధితుల కుటుంబసభ్యులు ప్రభుత్వాధికారుల దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్న సంగతి తెల్సిందే. దీంతో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా గల్లంతైన బోటు, మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని కోస్టుగార్డులను కోరారు. అయితే మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని తెలియడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
గండం గడిచినట్టే!
మచిలీపట్నం : రోను తుపాను గండం జిల్లాను వీడినట్టేనని అధికారులు చెబుతున్నారు. ఇది పెను తుపానుగా మారి శుక్రవారం సాయంత్రానికి కళింగపట్నానికి 50 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాలోని పారాదీప్‌కు 300 కిలోమీటర్ల దూరంలో, బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌కు 870 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. తుపాను కారణంగా జిల్లాలో గురువారం భారీ వర్షం నమోదైంది. గురువారం రాత్రి నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవటంతో వర్షం తగ్గింది. అయినప్పటికీ రోను తుపాను తీరం దాటే వరకు సముద్రతీరం వెంబడి ఉన్న నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో ప్రత్యేక అధికారులను నియమించి అప్రమత్తంగా ఉంచినట్లు కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. తుపాను పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా తెలుసుకుంటున్నారు. బుధ, గురువారాల్లో 84.62 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఉద్యాన పంటలకు నష్టం రోను తుపాను ప్రభావంతో మోపిదేవి, అవనిగడ్డ, చల్లపల్లి, తోట్లవల్లూరు, కంకిపాడు తదితర మండలాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. అవనిగడ్డ, మోపిదేవి మండలాల్లో 1200 ఎకరాలకు పైగా మామిడి తోటలు ఉన్నాయి. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవటంతో 40 శాతం మేర మాత్రమే కాపు నిలబడిందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం మామిడి కాయలు కోతకు సిద్ధంగా ఉన్న దశలో ఉన్నాయని భారీ వర్షాలు, ఈదురుగాలుల తాకిడికి కాయలు రాలిపోయాయని రైతులు అంటున్నారు. ఉద్యాన శాఖాధికారులు నష్టం అంచనాలు తయారుచేసేందుకు వస్తామని చెప్పినా రాలేదని మోపిదేవి, అవనిగడ్డ మండలాలకు చెందిన మామిడి రైతులు చెబుతున్నారు. నూజివీడు, మైలవరం తదితర ప్రాంతాల్లో ఈదురుగాలుల ప్రభావం అంతగా లేదని, మామిడికి నష్టం జరిగిన దాఖలాలు లేవని ఉద్యానవన శాఖాధికారులు చెబుతున్నారు. వర్షం కారణంగా పూర్తిగా తయారుకాని మామిడి రాలితే రంగు మారటంతో పాటు ఆశించిన ధర పలకదని మామిడి రైతులు వాపోతున్నారు. తుపాను తాకిడికి జిల్లాలో 76 విద్యుత్ స్తంభాలు, నాలుగు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని కలెక్టరేట్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఖరీఫ్‌కు మేలు నడి వేసవిలో కురిసిన ఈ వర్షాలు వరి సాగు చేసే దాదాపు 6.34 లక్షల ఎకరాలకు మేలు చేస్తాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. నైచ్చిన నేల వర్షం కారణంగా వేసవి దుక్కులకు అనుకూలంగా మారుతుందని, దుక్కి అనంతరం పచ్చిరొట్ట విత్తనాలను రైతులు సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. రోను తుపాను జిల్లాలో తీరం దాటడంతో అధికారులు, జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. -
గంటకు 20 కి.మీ. వేగంతో కదులుతున్న తుపాన్
విశాఖపట్నం : కళింగపట్నానికి 150 కి.మీ దూరంలో... గోపాలపట్నానికి 50 కి.మీ దూరంలో తుపాన్ కేంద్రీకృతమైందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ఈ తుపాన్ గంటకు 20 కి.మీ వేగంతో కదులుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని సూచించింది. ఉత్తర కోస్తాలోని అన్ని పోర్టుల్లో 4వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు పేర్కొంది. ఇచ్చాపురంలో 15, కళింగపట్నంలో 14 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. -
కళింగపట్నంలో భారీ వర్షం, ఎగిసిపడుతున్న అలలు
శ్రీకాకుళం: ఉత్తరాంధ్రలో హధూద్ తుఫాన్ ప్రభావం తీవ్రంగానే కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం తీరం వద్ద ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. తుఫాన్ ప్రభావంతో సముద్రం తీవ్ర ఆటుపోట్లకు గురికావడంతో అల్లకల్లోలంగా ఉంది. అలలు 2 మీటర్ల ఎత్తు ఎగసిపడుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో తుఫాన్ సహాయ చర్యల్తో పాల్గొనాలని అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సహాయక చర్యల కోసం 8 హెలికాఫ్టర్లను సిద్ధం చేశారు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయవ్య బంగాళాఖాతంలో కళింగపట్నానికి ఆనుకుని కేంద్రీకృతమైంది. క్రమేపీ బలహీనపడే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కోస్తాంధ్ర మీదుగా తెలంగాణ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో ఈదురులు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం నిపుణులు హెచ్చరించారు. సముద్రంలోకి వేటకు వెళ్లడం ఈ సమయంలో అంత మంచిది కాదన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. -
కళింగపట్నం, భీమిలి ఓడరేవుల్లో పదో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ
-
కళింగపట్నం, భీమిలీలో 10వ నెం. ప్రమాద హెచ్చరికలు
విశాఖ : పై-లిన్ తుపాన్ నేపథ్యంలో విశాఖ జిల్లా కళింగపట్నం, భీమిలీ పోర్టులో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖ, గంగవరంలో 8వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను అధికారులు శనివారం జారీ చేశారు. ఇక కాకినాడలో 5వ నెంబర్, నిజాంపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నంలో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు పై-లీన్ తుపాను తీరం వైపు వేగంగా కదులుతోంది. కడపటి సమాచారం మేరకు కళింగపట్నానికి 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను తీరం దాటే సమయంలో పెను ముప్పు తప్పదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీరం వెంబడి 220 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయి. సముద్రపు అలలు 50 అడుగులకు పైగా ఎగసిపడుతున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అత్యధికంగా 25 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అవుతుందని అంచనా. శ్రీకాకుళం సహా 4 జిల్లాలకు పెనుముప్పు తప్పదని అంచనా వేస్తున్నారు. జిల్లాలో 52000మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఆదేశించారు. పలు రైళ్లు రద్దు అయ్యాయి. పెనుతుపాను ఈరోజు రాత్రికి గోపాల్ పూర్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. తీరప్రాంతాల్లో ఇప్పటికే వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెవెన్యూ కేంద్రాల్లో కంట్రోలు రూమ్‌లు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలు
-
ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలు
కళింగపట్నానికి 340 కి.మీ దూరంలో పైలిన్ తుపాన్ కేంద్రీకృతమైంది. దాంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తుపాన్ వల్ల 50 అడుగులకు పైగా అలలు ఎగిసిపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కోస్తా తీరం వెంబడి అన్ని నౌకాశ్రయాల్లో మూడవ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. పైలిన్ తుపాన్ ఈ రాత్రికి గోపాలుపూర్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. గంటలకు 220 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. తుపాన్ తీరం దాటేటప్పుడు 25 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని విశాఖలోని తుఫాన్ హెచ్చరిక కేంద్రం భావిస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు ఇప్పటికే కురుస్తున్నాయి. విశాఖ - ఒడిశాల మధ్య శనివారం పలు రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
పలు జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
విశాఖపట్నానికి 950 కిలోమీటర్ల దూరంలో ఉత్తర దిశగా ఫైలిన్ తుఫాన్ కదులుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. పారాదీప్నకు 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. తీరం వెంబడి అలల ఉధృతి పెరుగుతుందని వివరించింది. అలాగే కళింగపట్నం - పారాదీప్‌ల మధ్య ఫైలిన్ తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. శ్రీకాకుళం: ఫైలిన్ తుపాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ గురువారం శ్రీకాకుళంలో వెల్లడించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని అధికారులతో ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు వివరించారు. తుఫాన్ నేపథ్యంలో ఎవరికి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైన టోల్ ఫ్రీ నంబర్లు-08942 240557, 9652838191కు ఫోన్ చేయవచ్చని వివరించారు. గుంటూరు: ఫైలిన్ తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ గురువారం వెల్లడించారు. జిల్లాలోని నిజాంపట్నం ఓడరేవులో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు తెలిపారు.సూర్యలంక బీచ్‌లో అలలు ఎగిసిపడుతున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొదని హెచ్చరికలు జారీ చేసినట్లు వివరించారు. అలాగే గుంటూరు, తెనాలి ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తెనాలి కంట్రోల్ రూమ్ 08644 - 223800 వెల్లడించారు. అలాగే తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురంలోని ఆర్డీవో కార్యాలయంలో తూఫాన్ కంట్రోల్ రూమ్ 08856 - 233100 ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని మండల ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ గురువారం ఉదయం ఏలూరులో సమీక్ష నిర్వహించారు. నర్సాపురం డివిజన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆ ప్రాంత అధికారులను ఆదేశించారు. తీరప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఏలూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూంలో టోల్ ఫ్రీ నెంబర్: 08812 230617ను ఏర్పాటు చేశామన్నారు. నెల్లూరు: తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని తీరప్రాంత ప్రజలను నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ కోరారు. జిల్లా కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్‌లో 1800 425 2499, 08612 331477 ట్రోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.