విశాఖ : పై-లిన్ తుపాన్ నేపథ్యంలో విశాఖ జిల్లా కళింగపట్నం, భీమిలీ పోర్టులో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖ, గంగవరంలో 8వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను అధికారులు శనివారం జారీ చేశారు. ఇక కాకినాడలో 5వ నెంబర్, నిజాంపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నంలో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు పై-లీన్ తుపాను తీరం వైపు వేగంగా కదులుతోంది. కడపటి సమాచారం మేరకు కళింగపట్నానికి 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను తీరం దాటే సమయంలో పెను ముప్పు తప్పదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీరం వెంబడి 220 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయి. సముద్రపు అలలు 50 అడుగులకు పైగా ఎగసిపడుతున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అత్యధికంగా 25 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అవుతుందని అంచనా.
శ్రీకాకుళం సహా 4 జిల్లాలకు పెనుముప్పు తప్పదని అంచనా వేస్తున్నారు. జిల్లాలో 52000మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఆదేశించారు. పలు రైళ్లు రద్దు అయ్యాయి. పెనుతుపాను ఈరోజు రాత్రికి గోపాల్ పూర్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. తీరప్రాంతాల్లో ఇప్పటికే వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెవెన్యూ కేంద్రాల్లో కంట్రోలు రూమ్లు ఏర్పాటు చేశారు.
విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077
తూర్పుగోదావరి: 0884-2365506
పశ్చిమగోదావరి: 0881230617
నెల్లూరు: 08612331477