మంటలను మరింతగా ఎగదోస్తున్న పెనుగాలులు
24కు పెరిగిన మృతుల సంఖ్య
లాస్ ఏంజెలెస్: అమెరికాలోని లాస్ ఏంజెలెస్ అటవీ ప్రాంతాలను బూడిదచేస్తున్న కార్చిచ్చు మళ్లీ కన్నెర్రజేయనుందని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరించింది. పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంతంలోని దావాగ్నిని ఇప్పటిదాకా కేవలం 14 శాతం మాత్రమే అదుపులోకి తెచ్చిన నేపథ్యంలో వాతావరణ విభాగ నివేదికలు స్థానికుల్లో భయాందోళనలను మరింత పెంచాయి.
గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, దీంతో అడవిలో కార్చిచ్చు మరింత విస్తరించే ప్రమాదముందని అమెరికా నేషనల్ వెదర్ సర్వీస్ సోమవారం ప్రకటించింది. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు వీయనున్న శాంటా అనా పెనుగాలులతో ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం సాయంత్రం దాకా ‘రెడ్ ఫ్లాగ్’ వార్నింగ్ అమల్లో ఉంటుంది.
మరోవైపు అటవీప్రాంతాల్లో అగ్నికీలల సంబంధ అగ్నిప్రమాద ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య తాజాగా 24కు పెరిగింది. ఇంకా డజన్ల మంది జాడ తెలియాల్సిఉంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే ఒక్క లాస్ ఏంజెలెస్ సిటీ, కౌంటీ పరిధుల్లో లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకువెళ్లాలని సూచించగా, మిగతా చోట్ల కలిపి మరో 87,000 మందికి సురక్షిత స్థలాలకు వెళ్లాలని స్థానికయంత్రాంగం హెచ్చరికలుచేసింది.
ఆరు చోట్ల కార్చిచ్చు వ్యాపించగా పసిఫిక్ పాలిసేడ్స్, ఏటోన్ ప్రాంతాల్లోని దావాగ్ని మాత్రమే ఇంకా అత్యంత ప్రమాదకరస్థాయిలో కొనసాగుతు న్నాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో 60 శాతం విస్తీర్ణానికి సమానమైన అటవీభూములను పాలిసేడ్స్, ఏటోన్, హర్‌స్ట్ కార్చిచ్చులు బూడిదకుప్పలుగా మార్చేశాయి. మొత్తంగా అన్ని కార్చిచ్చుల కారణంగా 40,000కుపైగా ఎకరాల్లో అటవీప్రాంతం పూర్తిగా కాలిపోయింది. 12,000కు పైగా ఇళ్లు, దుకాణాలు, పాఠశాలలు తగలబడ్డాయి. అయితే దుప్పటిలా కమ్మేసిన పొగ, దుమ్ము చాలా వరకు తగ్గడంతో కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు తెరిచారు.
బాణాసంచా వల్లే: వాషింగ్టన్ పోస్ట్
నూతన సంవత్సర వేడుకల్లో జనం కాల్చిన బాణాసంచా కారణంగానే పసిఫిక్ పాలిసేడ్స్‌లో అగ్గిరాజుకుందని వాషింగ్టన్ పోస్ట్ వార్తాసంస్థ ఒక కథనంలో పేర్కొంది. రేడియో సంప్రదింపులు, ఆ ప్రాంతంలో బాణాసంచా కాల్చడానికి ముందు, ఆ తర్వాత తీసిన ఉపగ్రహ ఛాయా చిత్రాలు, స్థానికుల ఇంటర్వ్యూలతో ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్లు తన కథనంలో పేర్కొంది. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చిన ప్రదేశంలో అగ్గిరవ్వలు అడవిలో పడి దావాగ్ని మొదలైందని, అయితే వెంటనే దానిని ఆర్పేశారు.
కానీ దావాగ్ని తాలూకు నిప్పుకణికలు కొన్ని అలాగే ఉండిపోయి భీకరగాలుల సాయంతో నెమ్మదిగా మళ్లీ దావాగ్నికి ఆజ్యంపోశాయని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. గత మంగళవారం తొలుత పసిఫిక్ పాలిసేడ్స్‌లో మంటలు అంటుకున్నప్పుడు స్థానికులు ఫిర్యాదుచేసినా అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా రావడంతో మంటలు అదుపుతప్పి చివరకు లాస్ ఏంజెలెస్ చరిత్రలోనే మరో అతిపెద్ద దావాగ్నిలా ఎదిగాయని ఆరోపణలున్నాయి. ‘‘ ఆరోజు మేం వెంటనే ఫోన్లుచేశాం. కానీ లాస్‌ఏంజెలెస్ ఫైర్ డిపార్ట్‌మెంట్(ఎల్‌ఏఎఫ్‌డీ) నుంచి స్పందన రాలేదు. 45 నిమిషాలతర్వాత ఒక హెలికాప్టర్ వచ్చి నీళ్లు పోసి వెళ్లిపోయింది. మంటలు మాత్రం ఆరలేదు’’ అని స్థానికులు మైఖేల్ వాలంటైన్ దంపతులు చెప్పారు.
ప్రైవేట్ నీటిట్యాంక్‌లకు గిరాకీ
తమ ప్రాంతంలో చెలరేగుతున్న మంటల నుంచి తమ ఇళ్లను కాపాడుకునేందుకు స్థానికులు ఆపసోపాలు పడుతున్నారు. దీంతో ప్రైవేట్ నీటిట్యాంక్‌లకు గిరాకీ అమాంతం పెరిగింది. ఇదే అదనుగా ప్రైవేట్ వాటర్‌ట్యాంక్ సంస్థలుచార్జీలు మోతమో గిస్తున్నాయి. లాస్ ఏంజెలెస్‌లోని సంపన్నులు ప్రభుత్వ అగ్నిమాపక సిబ్బంది వచ్చేదాకా ఆగకుండా ప్రైవేట్ ఫైర్‌ఫైటర్‌లను రప్పిస్తున్నారు. అయితే ఆ సేవలందించే సంస్థలు గంటకు 2,000 డాలర్లు అంటే రూ.1,73,000 చార్జ్ చేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ దిగ్గజాలు రిక్ కరుసో, కీత్ వాసర్‌మ్యాన్ సహా చాలా మంది ఇదే బాటపట్టారు. ‘‘ నా ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంది. సంస్థ మొదలైననాటి నుంచి హాలీవుడ్‌లో ఇంతస్థాయి డిమాండ్ ఎప్పుడూ లేదు’’ అని కవర్డ్6 ఫైర్‌ఫైటింగ్ సేవల సంస్థ యజమాని క్రిస్ డన్ చెప్పారు. ‘‘ నగరపాలకులను నమ్మలేమని ఈవారం ఘటనతో తేలిపోయింది. నా దగ్గర డబ్బుంది. అయితేమాత్రం ఏం లాభం. ఇళ్లు తగలబడ్డాయి’’ అని ఒక హాలీవుడ్ ప్రముఖుడు వాపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment