అమెరికాలోని లాస్ ఏంజలెస్ కార్చిచ్చు( Los Angeles Wildfire ) సంక్షోభం ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే వేలాది మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పెద్ద పెద్ద నిర్మాణాలన్నీ బూడిద పాలయ్యాయి. మంటలు ఇంకా చల్లారలేదు. ఎటు చూసినా విధ్వంసమే. లాస్ ఏంజెలెస్‌లోనే బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra ) నివాసముంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కార్చిచ్చు సంక్షోభంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మంటలకు ఆహుతైన భవనాలను, అడవి ప్రాంతానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. మంటలు ఆర్పేందుకు కృషి చేస్తున్న అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
‘హృదయం భారంగా ఉంది. నా బాధను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఈ కార్చిచ్చు నుంచి నా కుటుంబాన్ని కాపాడిన అగ్నిమాపక సిబ్బందికి జీవితాంతం రుణపడి ఉంటాను. స్నేహితులు, సహచరులు ఎంతోమంది నివాసాలను కోల్పోయారు. వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ మంటల కారణంగా ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఈ ప్రాంతాన్ని పునర్నిర్మించుకోవడానికి అధిక స్థాయిలో మద్దతు అవసరం. ఈ విధ్వంసం నుంచి ప్రజలను కాపాడడం కోసం అగ్నిమాపక సిబ్బంది, వాలంటీర్లు వారి ప్రాణాలను పణంగా పెట్టి పని చేశారు. మీరే నిజమైన హీరోలు’ అని ప్రియాంక రాసుకొచ్చింది.ఇంటితో సహా సర్వం కోల్పోయిన వారికి అంత అండగా ఉండాలని, విరాళాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
పెళ్లి తర్వాత హాలీవుడ్‌కి మకాం
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతే ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి, బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రముఖ సింగర్, యాక్టర్ నిక్ జోనాస్‌ని వివాహం చేసుకొని హాలీవుక్‌కి మకాం మార్చింది. అమెరికాలో స్థిరపడ్డ ప్రియాంక కేవలం హాలీవుడ్ చిత్రాలపైనే దృష్టి పెట్టారు. ‘సిటాడెల్ సీజన్– 1’వెబ్ సిరీస్‌లో నటించిన ఆమె ప్రస్తుతం సీజన్ 2లో బిజీగా ఉన్నారు.
రాజమౌళీ- మహేశ్ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక
మహేశ్‌బాబు(Mahesh Babu) హీరోగా రాజమౌళి ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బి 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపొంనుంది. ఈ సినిమా కోసం పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, మీసాలతో సరికొత్త లుక్‌లోకి మారిపోయారు మహేశ్‌బాబు. దుర్గా ఆర్ట్స్‌పై కేఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమా 2025లో ప్రారంభం కానుంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందనున్న ఈ సినిమాలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ ఈ మూవీని అనువదించనున్నారు.
అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో మహేశ్‌బాబుకి జోడీగా ప్రియాంకా చోప్రా నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత దక్షిణాదిలో ప్రియాంకా చోప్రా నటించినట్లు అవుతుంది. 2002లో తమిళ చిత్రం ‘తమిళన్’ హీరోయిన్‌గా పరిచమైన ప్రియాంక.. ఆ తర్వాత బాలీవుడ్‌కే పరిమితం అయింది. రామ్‌చరణ్‌కి జోడీగా ‘జంజీర్’ (2013) చిత్రంలో నటించినప్పటికీ అది స్ట్రైట్ బాలీవుడ్ మూవీ.
Comments
Please login to add a commentAdd a comment