లాస్ ఏంజెలెస్‌లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం
అదుపు చేయలేని స్థితిలో కొత్తగా మరోచోట కార్చిచ్చు
అగ్నిమాపక సిబ్బందికి నీటి కష్టాలు
వాషింగ్టన్: ఆరు చోట్ల ఆరని పెను జ్వాలలు, కమ్మేసిన దుమ్ము, ధూళి మేఘాలు, నిప్పుకణికల స్వైరవిహారంతో లాస్ ఏంజెలెస్ నగర కొండప్రాంతాలు నుసిబారిపోతున్నాయి. వేల ఎకరాల్లో అటవీప్రాంతాలను కాల్చి బూడిదచేసిన వేడిగాలులు అదే బూడిదను జనావాసాల పైకి ఎగదోస్తూ మిగతా పరిసరాలను దమ్ముకొట్టుకుపోయేలా చేస్తున్నాయి.
పొగచూరిన వాతావరణంలో సరిగా శ్వాసించలేక లక్షలాది మంది స్థానికులు ఆపసోపాలు పడుతున్నారు. దీంతో జనం బయట తిరగొద్దని, హెల్త్ ఎమర్జెన్సీ విధిస్తున్నామని స్థానిక యంత్రాంగం శనివారం ప్రకటించింది. 10,000 భవనాలను కూల్చేసి, 11 మంది ప్రాణాలను బలిగొన్న కార్చిచ్చు ఇంకా చల్లారకపోగా తూర్పు దిశగా దూసుకుపోతుండటంతో స్థానిక యంత్రాంగం, అగ్నిమాపక సిబ్బందికి తలకు మించిన భారమైంది.
ఇప్పటికే మూడు లక్షల మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించగా ఆస్తి నష్టం లక్షల కోట్లను దాటి లాస్‌ఏంజెలెస్ నగర చరిత్రలోనే అత్యంత దారుణ దావాగ్ని ఘటనగా మిగిలిపోయింది. పర్వత సానువుల గుండా వేడి గాలుల ఉధృతి ఏమాత్రం తగ్గకపోవడంతో మంటలు మరిన్ని కొత్త ప్రాంతాలకు విస్తరించవచ్చన్న భయాందోళనలు పొరుగు ప్రాంతాలైన ఎన్‌సినో, వెస్ట్ లాస్‌ఏంజెలెస్, బ్రెంట్‌వుడ్‌వాసులను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
మంటలు ఆపేందుకు అవిశ్రాంతంగా పోరాడుతున్న అగ్నిమాపక సిబ్బందికి నీటి కష్టాలు మొదలయ్యాయి. ఫైరింజన్లకు సరిపడా నీటి సౌకర్యాలు లేకపోవడంపై కాలిఫోరి్నయా రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూసమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శాంటా యెంజ్ రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా పూర్తిస్థాయిలో లేకపోవడంపైనా ఆయన ‘ఎక్స్’వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉన్న మంటలకుతోడు కొత్తగా గ్రనడా హిల్స్‌లో అంటుకున్న అగ్గిరవ్వలు ‘ఆర్చర్ ఫైర్’గా విస్తరిస్తూ ఇప్పటికే 32 ఎకరాలను దహించివేసింది. ఈ ప్రాంతంలోనే ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజ కిమ్ కర్దాషియాన్ సోదరీమణుల ఇళ్లు, డిస్నీ కార్పొరేట్ ఆఫీస్ ఉన్నాయి.
కార్చిచ్చులో కళాకారుల కలల సౌధాలు: వెనుక కొండలు, ముందు వినీలాకాశం, కింద సముద్ర తీరంతో అద్భుతంగా కనిపించే లాస్ ఏంజెలెస్‌లో చాలా మంది హాలీవుడ్ సినీ ప్రముఖులు ఎంతో ఇష్టంతో ఇళ్లు కొన్నారు. వాటిల్లో చాలా మటుకు ఇప్పుడు కాలిపోయాయి. 76 ఏళ్ల అమెరికన్ కమేడియన్ బిల్లీ క్రిస్టల్ 1979లో పసిఫిక్ పాలిసేడ్స్‌లో కొనుగోలుచేసిన విలాసవంత భవనం తాజా మంటల్లో కాలిబూడిదైంది.
మ్యాడ్ మ్యాక్స్ స్టార్ మేల్ గిబ్సన్, మరో నటుడు జెఫ్ బ్రిడ్జెస్, సెలబ్రిటీ టెలివిజన్ పర్సనాలిటీ ప్యారిస్ హిల్టన్, ‘ప్రిన్సెస్ బ్రైడ్’నటుడు క్యారీ ఎల్వీస్, ప్రముఖ నటుడు మ్యాండీ మూర్, మీలో వెంటిమిగ్లియా, లీటన్ మీస్టర్, ఆడమ్ బ్రాడీ, ఆంటోనీ హాప్‌కిన్స్, జాన్ గుడ్‌మాయ్న్, మైల్స్ టెల్లర్, అన్నా ఫారిస్, పాలిసేడ్స్ గౌరవ మేయర్ ఎజీన్ లేవీ, క్రిస్సీ టీగెన్, జాన్ లెజెండ్, మార్క్ మరోన్, మార్క్ హామిల్‌ల ఇళ్లు సైతం మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. లిడియా, హర్‌స్ట్, ఆర్చర్, ఈటన్, కెన్నెత్, పాలిసేడ్స్ ఫైర్ దావాగ్నులు మొత్తంగా 37,579 ఎకరాల్లో విస్తరించాయి.
Comments
Please login to add a commentAdd a comment