Water shortages
-
దుమ్ము దుప్పట్లో విలాస నగరం
వాషింగ్టన్: ఆరు చోట్ల ఆరని పెను జ్వాలలు, కమ్మేసిన దుమ్ము, ధూళి మేఘాలు, నిప్పుకణికల స్వైరవిహారంతో లాస్ ఏంజెలెస్ నగర కొండప్రాంతాలు నుసిబారిపోతున్నాయి. వేల ఎకరాల్లో అటవీప్రాంతాలను కాల్చి బూడిదచేసిన వేడిగాలులు అదే బూడిదను జనావాసాల పైకి ఎగదోస్తూ మిగతా పరిసరాలను దమ్ముకొట్టుకుపోయేలా చేస్తున్నాయి. పొగచూరిన వాతావరణంలో సరిగా శ్వాసించలేక లక్షలాది మంది స్థానికులు ఆపసోపాలు పడుతున్నారు. దీంతో జనం బయట తిరగొద్దని, హెల్త్ ఎమర్జెన్సీ విధిస్తున్నామని స్థానిక యంత్రాంగం శనివారం ప్రకటించింది. 10,000 భవనాలను కూల్చేసి, 11 మంది ప్రాణాలను బలిగొన్న కార్చిచ్చు ఇంకా చల్లారకపోగా తూర్పు దిశగా దూసుకుపోతుండటంతో స్థానిక యంత్రాంగం, అగ్నిమాపక సిబ్బందికి తలకు మించిన భారమైంది. ఇప్పటికే మూడు లక్షల మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించగా ఆస్తి నష్టం లక్షల కోట్లను దాటి లాస్ఏంజెలెస్ నగర చరిత్రలోనే అత్యంత దారుణ దావాగ్ని ఘటనగా మిగిలిపోయింది. పర్వత సానువుల గుండా వేడి గాలుల ఉధృతి ఏమాత్రం తగ్గకపోవడంతో మంటలు మరిన్ని కొత్త ప్రాంతాలకు విస్తరించవచ్చన్న భయాందోళనలు పొరుగు ప్రాంతాలైన ఎన్సినో, వెస్ట్ లాస్ఏంజెలెస్, బ్రెంట్వుడ్వాసులను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మంటలు ఆపేందుకు అవిశ్రాంతంగా పోరాడుతున్న అగ్నిమాపక సిబ్బందికి నీటి కష్టాలు మొదలయ్యాయి. ఫైరింజన్లకు సరిపడా నీటి సౌకర్యాలు లేకపోవడంపై కాలిఫోరి్నయా రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూసమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శాంటా యెంజ్ రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా పూర్తిస్థాయిలో లేకపోవడంపైనా ఆయన ‘ఎక్స్’వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉన్న మంటలకుతోడు కొత్తగా గ్రనడా హిల్స్‌లో అంటుకున్న అగ్గిరవ్వలు ‘ఆర్చర్ ఫైర్’గా విస్తరిస్తూ ఇప్పటికే 32 ఎకరాలను దహించివేసింది. ఈ ప్రాంతంలోనే ఎంటర్టైన్మెంట్ దిగ్గజ కిమ్ కర్దాషియాన్ సోదరీమణుల ఇళ్లు, డిస్నీ కార్పొరేట్ ఆఫీస్ ఉన్నాయి. కార్చిచ్చులో కళాకారుల కలల సౌధాలు: వెనుక కొండలు, ముందు వినీలాకాశం, కింద సముద్ర తీరంతో అద్భుతంగా కనిపించే లాస్ ఏంజెలెస్‌లో చాలా మంది హాలీవుడ్ సినీ ప్రముఖులు ఎంతో ఇష్టంతో ఇళ్లు కొన్నారు. వాటిల్లో చాలా మటుకు ఇప్పుడు కాలిపోయాయి. 76 ఏళ్ల అమెరికన్ కమేడియన్ బిల్లీ క్రిస్టల్ 1979లో పసిఫిక్ పాలిసేడ్స్‌లో కొనుగోలుచేసిన విలాసవంత భవనం తాజా మంటల్లో కాలిబూడిదైంది. మ్యాడ్ మ్యాక్స్ స్టార్ మేల్ గిబ్సన్, మరో నటుడు జెఫ్ బ్రిడ్జెస్, సెలబ్రిటీ టెలివిజన్ పర్సనాలిటీ ప్యారిస్ హిల్టన్, ‘ప్రిన్సెస్ బ్రైడ్’నటుడు క్యారీ ఎల్వీస్, ప్రముఖ నటుడు మ్యాండీ మూర్, మీలో వెంటిమిగ్లియా, లీటన్ మీస్టర్, ఆడమ్ బ్రాడీ, ఆంటోనీ హాప్కిన్స్, జాన్ గుడ్మాయ్న్, మైల్స్ టెల్లర్, అన్నా ఫారిస్, పాలిసేడ్స్ గౌరవ మేయర్ ఎజీన్ లేవీ, క్రిస్సీ టీగెన్, జాన్ లెజెండ్, మార్క్ మరోన్, మార్క్ హామిల్ల ఇళ్లు సైతం మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. లిడియా, హర్స్ట్, ఆర్చర్, ఈటన్, కెన్నెత్, పాలిసేడ్స్ ఫైర్ దావాగ్నులు మొత్తంగా 37,579 ఎకరాల్లో విస్తరించాయి. -
భూతాపం.. జల సంక్షోభం
సాక్షి, అమరావతి: భూతాపం (గ్లోబల్ వార్మింగ్) రుతుపవనాల గమనాన్ని నిర్దేశిస్తోందా? దేశంలో నదీ పరీవాహక ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపుతోందా? గోదావరి, కృష్ణా, కావేరి వంటి ద్వీపకల్ప నదులే కాదు.. గంగా, యమునా, బ్రహ్మపుత్ర వంటి హిమాలయ నదుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోందా.. అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతోంది ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన ప్రపంచ జల వనరుల అభివృద్ధి నివేదిక (డబ్ల్యూడబ్ల్యూడీఆర్) గత ఏడాది దేశంలో సమృద్ధిగా వర్షాలు కురిసినా 200 జిల్లాల్లో వరదలు, నీటి ఎద్దడితో ప్రజలు తల్లడిల్లటాన్ని భారతీయ ఉష్ణమండల వాతావరణ సంస్థ (ఐఐటీఎం) ఎత్తిచూపడాన్ని బట్టి.. దేశంలో జల సంక్షోభం తీవ్రమయ్యే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. భూతాపం వల్ల ప్రపంచంలో ఏడాదిలో ఒక నెలపాటు 360 కోట్ల మంది తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారని డబ్ల్యూడబ్ల్యూడీఆర్ వెల్లడించింది. పారిస్ ఒప్పందం మేరకు భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 1.5 డిగ్రీలకు తగ్గించకపోతే.. 2050 నాటికి ఏడాదిలో ఒక నెలపాటు తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే వారి సంఖ్య 517 కోట్లకు చేరుకుంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. నివేదికలోని ప్రధానాంశాలివీ.. ► కార్బన్డయాక్సైడ్, గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణంలో కలవడం భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడానికి దారితీస్తుంది. సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడానికి దోహదపడుతుంది. ► ఇది రుతుపవనాల గమనాన్ని ప్రభావితం చేస్తుంది. గతేడాది దేశ వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిశాయి. కానీ.. ఒకేసారి కుండపోత వర్షం కురవడం, వర్షపాత విరామాలు (డ్రైస్పెల్స్) అధికంగా ఉండటం వల్ల దేశంలో 200 జిల్లాల ప్రజలు వరదలు, నీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ► ఆసియా ఖండంలో భారత్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తదితర దేశాలకు చెందిన 200 కోట్ల మంది తాగునీటి, సాగునీటి అవసరాలను గంగా, యమున, బ్రహ్మపుత్ర వంటి హిమాలయ నదులు తీరుస్తున్నాయి. ► హిమాలయ నదులపై జలవిద్యుత్ కేంద్రాల ద్వారా 500 గిగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. భూతాపం ప్రభావం వల్ల హిమాలయాల్లో గ్లేసియర్స్(మంచు.. హిమానీ నదాలు) కరుగుతున్నాయి. ► 2060 నాటికి హిమానీ నదాలు 50 శాతం కరిగిపోతాయి. ఇది హిమాలయ నదుల ప్రవాహంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 2060 నాటికి ఆ నదుల్లో నీటి లభ్యత 50 శాతం తగ్గిపోతుంది. ఇది 200 కోట్ల మందిని జల సంక్షోభంలోకి నెడుతుంది. ► రుతు పవనాల గమనం వల్ల అతివృష్టి, అనావృష్టి ఏర్పడి ద్వీపకల్ప నదుల్లో నీటి లభ్యతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ► భూతాపం వల్ల భూమిలోకి ఇంకే వర్షపు నీరు కంటే ఆవిరి అయ్యే నీటి శాతమే ఎక్కువ. ఇది భూగర్భ జలాలు అడుగంటిపోవడానికి దారి తీస్తుంది. అంటే.. ద్వీపకల్ప భారతదేశంలో జల సంక్షోభం మరింత ముదురుతుంది. ► భూతాపం 1 డిగ్రీ సెల్సియస్ పెరిగితే ప్రపంచ జనాభాలో 7 శాతం మందికి నీటి లభ్యత 20 శాతం తగ్గడానికి దారి తీస్తుంది. అదే భూతాపం 1.5 డిగ్రీల నుంచి రెండు డిగ్రీలకు పెరిగితే ప్రపంచ జనాభాలో 50 శాతం మంది తీవమ్రైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ► నవంబర్ 4, 2016 నుంచి అమల్లోకి వచ్చిన పారిస్ ఒప్పందానికి కట్టుబడి అమెరికా, యూరోపియన్ యూనియన్, చైనా సహా అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు వాతావరణ కాలుష్యాన్ని నివారించడం ద్వారా భూతాపాన్ని 1.5 డిగ్రీలకు తగ్గించగలిగితే జల సంక్షోభం ముప్పు తప్పుతుంది. -
చుక్క మంచి నీరు కూడా వృధా చేయొద్దు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నీటి కొరతను ఎదుర్కోవడానికి, సముద్రపు నీటిని డీశాలినేషన్ చేసి వినియోగించడంపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇజ్రాయెల్ కంపెనీ ఐడీఈ టెక్నాలజీస్ డిప్యూటీ సీఈఓ లీహి టోరెన్‌స్టైన్, ఇతర ప్రతినిధులు సీఎం జగన్‌తో బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. మంచి నీటిని ఒక్క బొట్టు కూడా వృథా చేయకూడదని తెలిపారు. అందుకోసమే డీశాలినేషన్ నీటిపై దృష్టిపెట్టామని ఆయన అన్నారు. ఇజ్రాయెల్ మొత్తం డీశాలినేషన్ నీటినే వినియోగిస్తోందని సీఎం గుర్తు చేశారు. పారిశ్రామిక అవసరాలకు డీశాలినేషన్ నీటినే వినియోగించాలన్నారు. అవసరమైన పక్షంలో తాగునీటి అవసరాలకోసం కూడా వినియోగించే పరిస్థితి ఉండాలని ఆయన తెలిపారు. ఆ మేరకు డీశాలినేషన్ ప్లాంట్‌ను అప్‌గ్రేడ్ చేసుకునేట్టు ఉండాలన్నారు. ఎక్కడెక్కడ డీశాలినేషన్ ప్లాంట్లు పెట్టాలి అన్నదానిపై అధ్యయనం చేసి, ఆ మేరకు నివేదికలు ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులను సీఎం జగన్ కోరారు. (విద్యుత్ రంగంలో పెట్టుబడులే లక్ష్యం: సీఎం జగన్) మొదటగా విశాఖపట్నంతో ప్రారంభించి దశలవారీగా దానిని విస్తరించుకుంటూ వెళ్లాలని సీఎం జగన్ అన్నారు. విశాఖపట్నం, తడ, కృష్ణపట్నం తదితర ప్రాంతాల్లో డీశాలినేషన్ నీటినే వినియోగించేలా చూడాలన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు డీశాలినేషన్ లేదా శుద్ధిచేసిన నీటినే వాడాలని సూచించారు. అలాగే రాష్ట్రంలోని థర్మల్ ప్లాంట్లు కూడా డీశాలినేషన్ నీటిని వినియోగించేలా ప్రణాళిక తయారు చేయాలని అధికారులకు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న మురుగునీటి శుద్దికి అవుతున్న ఖర్చు, టెక్నాలజీ పైన కూడా దృష్టిపెట్టాలన్నారు. డీశాలినేషన్ ప్లాంట్ల సాంకేతికత, నిర్వహణ, ఖర్చులపై సమగ్ర వివరాలను ఇవ్వాలని సీఎం జగన్ ఐడీఈ టెక్నాలజీస్ ప్రతినిధులను కోరారు. విశాఖపట్నం సహా ఆయా ప్రాంతాలను పరిశీలించి ఆ మేరకు నివేదికలు రూపొందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. పరిశ్రమలకు ఏ ప్రమాణాలతో నీరు కావాలో నిర్ణయించి ఆ మేరకు డీశాలినేషన్ అవుతున్న ఖర్చు, నిర్వహణ తదితర అంశాలన్నీ నివేదికలో పొందుపరచాలన్నారు. సీఎం జగన్ ప్రయత్నం హర్షణీయం: ఐడీఈ టెక్నాలజీస్ ఇండియా అనేక రకాలుగా నీటి కొరతను ఎదుర్కొంటోందని, నీటి భద్రత అనేది చాలా ముఖ్యమని ఇజ్రాయెల్ ఐడీఈ టెక్నాలజీస్ ప్రతినిధుల బృందం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో నీటి కొరతను తీర్చడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రయత్నం హర్షణీయమన్నారు. ఇజ్రాయెల్, భారత్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. 1964 లో తొలిసారిగా కమర్షియల్ డీశాలినేషన్ ప్లాంటును ఇజ్రాయెల్‌లో పెట్టామని పేర్కొన్నారు. ఐడీఈ టెక్నాలజీస్ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తోందని గుర్తు చేశారు. నాలుగు దశాబ్దాలుగా 40 దేశాల్లో 400కు పైగా ఈ ప్లాంట్లను నిర్వహిస్తున్నామని ప్రతినిధుల బృందం తెలిపింది. భారత్‌తోపాటు చైనా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో తమ కంపెనీ కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిపారు. భారత్‌లో 25 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. డీశాలినేషన్ ప్లాంట్ల వల్ల పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందని.. ఉద్యోగాలు వచ్చి ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. సముద్రపునీటిని డీశాలినేషన్ చేయడంతో పాటు కలుషిత నీటిని కూడా శుద్ధిచేయడంలో అత్యుత్తమ సాంకేతిక విధానాలను అవలంభిస్తున్నామని ఐడీఈ టెక్నాలజీస్ బృందం తెలిపింది. ఎస్సార్, రిలయన్స్ కంపెనీల్లో ఇండస్ట్రియల్ మురుగు నీటి శుద్ధికేంద్రాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. శుద్ధిచేసిన మురుగు నీటిని పరిశ్రమలు వినియోగించుకుంటున్నాయిని వారు తెలిపారు. -
ఘనపురం.. దయనీయం
రోహిణిలో తుకం పోసి .. ఆరుద్రలో నాటేసే రైతన్నను అప్పట్లో మోతుబరి రైతు అనేవారు. ప్రస్తుతం ఆరుద్ర వచ్చినా తుకం పోసే పరిస్థితి లేదు. కార్తెలు కదులుతున్నా.. చినుకు కనిపించడం లేదు. వానాకాలం వచ్చినా ఎండల తీవ్రత తగ్గడం లేదు. మంజీర జీర బోయింది. నమ్ముకున్న ఘనపురం ఎడారిలా మారింది. ఇటీవల కురిసిన తేలిక పాటి వర్షాలతో దుక్కులు దున్నిన రైతన్నలు దిక్కులు చూస్తున్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో రుతుపవనాలొచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వరుణుడు కరుణిస్తే గాని ఘనపురం ప్రాజెక్టుకు గ్రహణం వీడే పరిస్థితి కనిపించడం లేదు. అటు వర్షాలు కురవక.. ఇటు ప్రాజెక్టులో చుక్కనీరు లేక ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సాక్షి, మెదక్: మెతుకు సీమ రైతన్నల జీవనాధారం ఘనపురం ప్రాజెక్టు. 1905లో నిర్మించిన ఈ ప్రాజెక్టు నిల్వ నీటి సామర్థ్యం 0.2 టీఎంసీలు. ఆనకట్టకు మహబూబ్‌నహర్ (ఎంఎన్), ఫతేనహర్ కెనాల్ (ఎఫ్ఎన్) ఉన్నాయి. ఎంఎన్ కెనాల్ పొడవు 42.80 కి.మీ. దీనిద్వారా కొల్చారం, మెదక్, మెదక్ రూరల్, హవేలి ఘనపూర్ మండలాల్లోని 18 గ్రామాల కింద 11,425 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. ఎఫ్ఎన్ కెనాల్ పొడవు 12.80 కి.మీ. దీని ద్వారా పాపన్నపేట మండలంలోని 11 గ్రామాల పరిధిలోని 10, 200 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. మొత్తం సాగు భూమి 21,625 ఎకరాలు. ఎగువన ఉన్న సింగూరు ప్రాజెక్టు నిండితే గాని దిగువన ఉన్న ఘనపురం ప్రాజక్టుకు జలకళ రాదు. మంజీర వరదలు వస్తేనే ఘనపురం గలగలలు కనిపిస్తాయి. ఎడారిలా మారిన సింగూరు.. ఘనపురం వేసవిలో మండిన ఎండలతో సింగూరు బీటలు వారింది. 29 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులో ప్రస్తుతం 0.6 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి.ç 0.2 టీఎంసీల సామర్థ్యం గల ఘనపురం ప్రాజెక్టు చుక్క నీరు లేక ఎడారిని తలపిస్తోంది. ఖరీఫ్ సీజన్ కోసం రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. గత రబీలో కొంతమంది మంజీర నదిలో రింగు బోర్లు వేసి, రేయింబవళ్లు కష్టపడి పంట దక్కించుకున్నారు. మరి కొన్ని పంటలు నిలువునా ఎండిపోయాయి. ఘనపురం ప్రాజెక్టు కింద సుమారు నాలుగు వేల ఎకరాల పంట ఎండిపోయింది. కార్తెలు కదిలి పోతున్నా కానరాని చినుకు ఖరీఫ్ సీజన ఆరంభమై .. కార్తెలు కదిలి పోతున్నా చినుకు జాడ కానరావడం లేదు. రోహిణిలో తుకా లు పోస్తే మంచి దిగుబడులు వస్తాయంటారు. కాని ఆరుద్ర సగం పాదం ముగిసినా వరుణుడు కరుణించడం లేదు. ఎండలు ఇంకా మండిపోతూనే ఉన్నాయి. ఇటీవల మృగసిర రోజున కురి సిన కొద్దిపాటి వర్షాలకు తోడు బోర్లు ఉన్న రైతు లు దుక్కులు సిద్ధం చేసుకుంటుండగా, 80 శాతం మంది దుక్కుల కోసం దిక్కులు చూస్తున్నారు. రబీ ముంచింది.. ఖరీఫ్ పైనే ఆశలు గత రబీలో మంజీరను నమ్ముకొని పంటలు వేస్తే ఉన్న ఎకరంన్నర పంట ఎండి పోయింది. తిండి గింజలే దొరకని పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్‌లో పంట వేద్దామంటే ఇప్పటి వరకు దుక్కులు దిక్కులేవు. చినుకు రాలడం లేదు. ఎలా గడుస్తుందోనని ఆందోళనగా ఉంది. –సాలె కుమార్, రైతు, కొడుపాక -
చెంబెడు నీటితో చెరువు నింపుతాం
జనగామ: జలం కోసం జనం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేలా ప్రజాప్రతినిధులు, అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని జనగామ మండలంలోని పెంబర్తి గ్రామ యువకులు నిర్ణయించారు. పెంబర్తిలోని పెద్ద చెరువు ఎండిపోయినా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం.. చుక్క నీరు లేక ఎండుతున్న పంటలకు తోడు గుక్కెడు నీటి కోసం ప్రజలు పడుతున్న కష్టాలను చూసిన చలించిపోయిన యువకులు వినూత్న నిరసనకు దిగారు. స్థానిక యువకులు చొప్పరి సంతోష్, సతీష్, ఏదునూరి రాము, గుడికందుల ప్రశాంత్, మణికంఠ, సాయి, పల్లపు శ్రీకాంత్, గుజ్జుల వేణు, పల్లపు హరీశ్ ఆధ్వర్యాన ఇంటింటికి చెంబెడు నీళ్ల సేకరణకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్లో వెయ్యి దరఖాస్తులు అందించిన యువకులు మరో నిరసన చేపట్టారు. ఇంటింటికీ చెంబు చొప్పున సేకరించిన నీటితో పెద్ద చెరువును నింపే యత్నం చేస్తామని, అప్పుడైనా ప్రజాప్రతినిధులు మేల్కొంటారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా శనివారం వంద బిందెల నీటిని పెద్దచెరువులో పోసి తమ ఆవేదన వెళ్లగక్కారు. ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలపి సత్తా చాటుతామని యువకులు పేర్కొన్నారు. -
కందకాలే కరువుకు విరుగుడు!
కరువు కోరల నుంచి రైతులను రక్షించడానికి వ్యవసాయ భూముల్లో కందకాలు తీసుకోవడమే ఉత్తమ మార్గమనడానికి ప్రబల నిదర్శనం తన మామిడి తోటేనని నీటిపారుదల శాఖ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ సంగెం చంద్రమౌళి స్వానుభవంతో తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి గ్రామపరిధిలో 3.5 ఎకరాల భూమిని గత ఏడాది వేసవిలో కొనుగోలు చేశారు. 500–650 అడుగుల లోతున రెండు బోర్లు వేసినా.. డస్ట్ తప్ప నీటి చుక్క కానరాలేదు. వాన నీటిని సంరక్షించుకుంటే తప్ప నీటి భద్రత సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చారు. పొలంలో ప్రతి 50 మీటర్లకు ఒక చోట వాలుకు అడ్డంగా మీటరు లోతు, మీటరు వెడల్పున 2017 మేలో కందకాలు తవ్వించారు. ఎకరానికి రూ. 5 వేల వరకు ఖర్చయింది. వర్షాలు కురవడంతో కందకాల ద్వారా వర్షపు నీరు పుష్కలంగా భూమిలోకి ఇంకింది. భూగర్భ జలమట్టం పెరిగింది. నీటి కొరత తీరడంతో గత జూలైలో మామిడి మొక్కలు నాటారు. డ్రిప్ ద్వారా పొదుపుగా నీటిని అందిస్తున్నారు. గెస్ట్ హౌస్ కూడా నిర్మించారు. అయినా, ఇంత వేసవిలోనూ నీటి కొరత లేదని చంద్రమౌళి సంతోషంగా చెప్పారు. పొలాల్లో కురిసి వృథాగా పోతున్న వర్షపు నీటిని ఎక్కడికక్కడ భూమి లోపలికి ఇంకించుకుంటే ప్రతి రైతూ కరువును విజయవంతంగా అధిగమించవచ్చని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అయిన సంగెం చంద్రమౌళి, మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి (రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) గత కొన్నేళ్లుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ‘సాక్షి’తో కలసి గతంలో వరుసగా రెండేళ్లు తెలుగు రాష్ట్రాల్లో ‘చేను కిందే చెరువు’ ప్రచారోద్యమాన్ని నిర్వహించి వేలాది మంది రైతుల్లో చైతన్యం నింపిన సంగతి తెలిసిందే. వేలాది ఎకరాల్లో పొలాలను స్వయంగా పరిశీలించి కందకాలు తవ్వించిన చంద్రమౌళి తన పొలంలోనూ కందకాలు తవ్వించి రైతులకు ఆదర్శప్రాయుడిగా నిలిచారు. ఎకరానికి రూ. 5 వేలు చాలు.. సాగు యోగ్యమైన భూముల్లో తెలంగాణ రాష్ట్రమంతటా ఎకరానికి రూ. 5వేల ఖర్చుతో కందకాలు తవ్వడానికి రూ. 8 వేల కోట్లు ఖర్చవుతుందని, వృథాగా పోతున్న 850 టీఎంసీల నీటిని భూమిలోకి ఇంకింపజేయవచ్చని ఆయన అంటున్నారు. భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ కలిపి అందించే నీరు 600 టీఎంసీలేనన్నారు. ఎకరానికి పంటకు రూ. 4 వేల చొప్పున రైతుకు పెట్టుబడిగా ఇస్తున్న ప్రభుత్వం.. ప్రతి రైతూ కందకాలు తవ్వుకోవడం తప్పని సరి చేస్తే ఒక్క ఏడాదిలోనే సాగునీటి భద్రత చేకూరుతుందని ఆయన సూచిస్తున్నారు. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్‌లోని సాగు యోగ్యమైన భూములన్నిటిలో కందకాలు తవ్విస్తే రూ.10 వేల కోట్లు ఖర్చవుతుందని, 950 టీఎంసీల నీటిని భూమిలోకి ఎక్కడికక్కడ ఇంకింపజేయవచ్చని చంద్రమౌళి (98495 66009) సూచిస్తున్నారు. చంద్రమౌళి మామిడి తోటలో కందకం -
‘తన్నీర్’ కోసం తన్నుకు చావాల్సిందేనా?
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికా రాజధాని కేప్ టౌన్ నగరంలో వరుసగా మూడేళ్లపాటు వర్షాలు కురియక పోవడంతో జలాయశాలు ఎండిపోయాయని, భూగర్భ జలాలు ఇంకి పోయాయని, ప్రభుత్వ కుళాయిల నుంచి చుక్క నీరు కూడా చూడని రోజు వస్తుందనే వార్త ఇటీవల ప్రపంచమంతట సంచలనం సృష్టించింది. అలాంటి రోజును ‘డే జీరో’గా కూడా పేర్కొంది. రోజువారి సరాసరి సగటు వినియోగాన్ని 87 లీటర్లకు కుదించింది. ఆ తర్వాత ఇటీవల దాన్ని 50 లీటర్లకు తగ్గించింది. ‘డే జీరో’ రోజు నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రదేశాల నుంచి మాత్రమే నీటిని తీసుకెళ్లాల్సి ఉంటుందని ఆ ప్రభుత్వం అక్కడి ప్రజలను హెచ్చరించింది. ఆ పరిస్థితి భారత్‌కు కూడా త్వరలో వచ్చే ప్రమాదం ఉంది. దేశంలోని పలు నగరాలు మంచినీటి కటకటను ఎదుర్కోనున్నాయని 14, రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని 28 నగరాల్లో ఇటీవల జరిపిన ఓ సర్వే వెల్లడించింది. నీటి కటకటలో బెంగుళూరు నగరం ప్రథమ స్థానంలో ఉన్నట్లు ఇటీవల బీబీసీ కూడా వెల్లడించింది. తీవ్ర నీటి ఎద్దటిని ఎదుర్కొంటున్న కేప్ టౌన్లో నీటి వినియోగం పట్ల షరతులు విధించినా ఇప్పటికీ పట్టణ పాలక సంఘం 24 గంటలపాటు ప్రభుత్వ కుళాయిల నుంచి నీటిని సరఫరా చేస్తోంది. భారత్‌లోని ఈ 28 నగరాల్లో ప్రభుత్వం సగటున కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నది 3.3 గంటలు మాత్రమే. రెండంటే రెండు నగరాల్లో మాత్రమే 12గంటలపాటు నీటిని సరఫరా చేస్తున్నారు. 62 శాతం పట్టణాల్లో కేవలం సరాసరి సగటున రెండు గంటలపాటు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. భారత్‌లో నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం సరాసరి సగటున 135 లీటర్లు సరఫరా చేయాలి. అయితే 124.6 లీటర్లు మాత్రమే సరఫరా చేస్తున్నట్లు సర్వేలో తేలింది. ఈ సరఫరా కూడా క్రమబద్ధంగా లేదు. కొన్ని ప్రాంతాల్లో సగటున 298 లీటర్లు సరఫరా చేస్తుండగా, కొన్ని ప్రాంతాల్లో అతి తక్కువగా 37 లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్’ దేశంలోని 1400 నగరాల్లో నిర్వహించిన సర్వే ప్రకారం సరాసరి సగటున 69 లీటర్ల నీటిని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో కేప్ టౌన్ పట్టణంలో సరాసరి నీటి వినియోగాన్ని రోజుకు 50 లీటర్లకు తగ్గించగా, ఇప్పటికే భారత్‌లోని కొన్ని నగరాల్లో ఇంత కన్నా తక్కువ నీటిని సరఫరా చేస్తున్నారు. ‘డే జీరో’ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ కుళాయిల్లో నీరు రావని, ప్రభుత్వం నిర్దేశించిన నీటి కేంద్రాల నుంచే నీటిని సేకరించుకోవాలని కేప్ టౌన్ ప్రభుత్వం అక్కడి ప్రజలను హెచ్చరించింది. కానీ భారతీయ నగరాల్లో కామన్ పాయింట్ల నుంచి నీటిని తెచ్చుకోవడం కామనే. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం 71 శాతం పట్టణ ప్రజలు ఇళ్లవద్దనే నీటిని పట్టుకుంటారు. 21 శాతం మంది ఇంటికి సమీపంలోని కుళాయిల నుంచి పట్టుకుంటున్నారు. ఎనిమిది శాతం మంది సుదూర ప్రాంతానికి వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. పట్టణాల్లో 77 శాతం మహిళలు నడిచి రావడానికయ్యే సమయం సహా నీటి కుళాయి వద్ద నీటి కోసం సగటున 30 నిమిషాలు నిరీక్షిస్తోందని ‘నేషనల్ శాంపిల్ సర్వే అఫీస్’ అధ్యయనం వెల్లడిస్తోంది. ఈ లెక్కన కేప్ టౌన్లో భవిష్యత్‌లో రానున్న ‘డే జీరో’ పరిస్థితి భారత్‌లో ఎప్పుడో వచ్చిందన్న మాట. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 37 కోట్ల మంది ప్రజలు ఉండగా, ఆ సంఖ్య 2030 నాటికి 60 కోట్ల మందికి చేరుతుందన్నది ఒక అంచనా. నాటికి నీటి డిమాండ్‌కు సరఫరాకు 50 శాతం వ్యత్యాసం ఉంటుందని ‘అసోసియేటడ్ చేంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా, ఆడిటర్ పీడబ్యూసీ’ ఓ నివేదికలో హెచ్చరించాయి. అప్పటి వరకు మన ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోతే నీటి సరఫరా కేంద్రాల వద్ద మనం ‘తన్నీర్ తన్నీర్’ అంటూ తన్నుకు చావాల్సి వస్తుంది. -
ఊట బావుల ఊరు..
బావులు తవ్వితే నీళ్లు.. బోర్లు వేస్తే చుక్క రాదు - మహబూబ్‌నగర్ జిల్లా వెంకటాపూర్‌లో చిత్రమిది! - ఈ మర్మమేమిటో తెలియక తలలు పట్టుకుంటున్న అధికారులు సాక్షి, మహబూబ్‌నగర్: జలం కోసం జనం పరితపిస్తున్న రోజులివి. భానుడి విశ్వరూపానికి భూగర్భ జలాలు అడుగంటిపోయి నీటి ఎద్దడితో జనం అల్లాడిపోతున్నారు. అయితే, మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండలం వెంకటాపూర్ గ్రామం ఇందుకు భిన్నం. ఇక్కడి వ్యవసాయ పొలాల దగ్గర బోర్లు డ్రిల్లింగ్ చేస్తే చుక్క నీరు రాదు. అదే స్థానంలో బావులను తవ్వితే మాత్రం పుష్కలమైన నీరు లభిస్తుంది. 20 అడుగులు తవ్వితే చాలు.. నీరు ఉబికి వస్తోంది. ఊరు ఊరంతా ఇదే పరిస్థితి. దీంతో ఆ గ్రామంలో బోర్లు వేయడం మానేసి ప్రతిఒక్కరూ బావులు తవ్వుకుంటున్నారు. మొదట 20 బావులతో మొదలైన ప్రస్థానం.. ప్రస్తుతం 130 బావులకు చేరింది. ఇంతటి వేసవిలో కూడా ప్రతీ బావి నిండుకుండలా నీటితో కళకళలాడుతుంటుంది. ఇంటింటికి వ్యవసాయం.. ఇంటింటికి బావి ఉండటంతో ఈ గ్రామం సిరుల పంటలకు నిలయంగా మారింది. ఇదే గ్రామానికి పక్కనే ఉన్న తీలేరు, పెద్ద చింతకుంట, బం డ్రవల్లిలలో ఇలాంటి పరిస్థితి కనిపించదు. మరో పక్క ఈ భిన్నమైన పరిస్థితులకు మూల కారణంపై భూగర్భజలశాఖ అధికారులు పరిశోధనలు చేస్తున్నారు. ఇదో ప్రత్యేకత... మరికల్ మండలం తీలేర్ గ్రామ పంచాయతీకి అనుబంధమైన గ్రామమే వెంకటాపూర్. 1950లో పది కుటుంబాలతో గ్రామంగా ఏర్పడిన వెంకటాపూర్‌కు 750ఎకరాల శివారుంది. బావి తవ్విన ప్రతిచోట పుష్కలమైన నీరు రావడంతో కాలక్రమంలో గ్రామం విస్తరించిం ది. మొదట 20 బావులతో మొదలైన వెంకటాపూర్ బావుల ప్రస్థానం ఏటా పెరుగుతూనే ఉంది. ప్రతి కుటుంబానికి ఒక బావి ఉండటంతో తమ పొలాల్లో వరి, వేరుశనగ, తోటలను సాగు చేసుకొని మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. అంతేకాదు బావుల్లో సంవత్సరం పొడువునా నీరు ఉండడంతో చేపల పెంపకం చేపడుతున్నారు. ఇలా రెండు విధా లా రైతులకు లాభసాటిగా మారుతోంది. 15 నుంచి 20 అడుగుల్లోనే నీరు పాలమూరు ప్రాంతమంటే సరైన వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటుతుండడం మనం చూస్తుంటాం. మూడేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చాలా దారుణంగా భూగర్భజలాలు పడిపోయాయి. చాలా గ్రామాల్లో తాగడానికి నీళ్లు లేక దాదాపు 500 అడుగుల లోతుకు బోర్లు వేస్తున్నా ఫలితం ఉండటంలేదు. ఈ నేపథ్యంలో వెంకటాపూర్ గ్రామం ఇందుకు భిన్నంగా ఉంది. బోర్లు వేస్తే చుక్కనీరు పడకపోయినా.. బావులు తవ్వితే అది కూడా 15 నుంచి 20 అడుగుల లోతులో పుష్కలమైన నీరు అందుతోంది. పరిశోధన చేస్తున్నాం వెంకటాపూర్ గ్రామ ప్రత్యేక పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నాం. కేవలం బావులలో మాత్రమే నీరు రావడానికి కొన్ని పరిస్థితులుంటాయి. భూమిలో అనేక పొరలుంటాయి. నీటిని భూమిలోకి పూర్తిగా ఇంకకుండా వెదడ్ (ప్రత్యేక పొర), హార్డ్‌రాక్ వంటి పరిస్థితులున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నల్లరేగడి పొర ఉన్నా కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. అచ్చం ఇలాంటి పరిస్థితే ఏపీలోని కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని విడుతూరులో కూడా ఉంది. అయినా వెంకటాపూర్ గురించి పరిశోధన చేస్తున్నాం. పూర్తి నివేదిక రాగానే అందజేస్తాం. – కె.లక్ష్మణ్, భూగర్భ జల అధికారి, మహబూబ్‌నగర్ -
ఎడారిలో జలసిరి
⇒ రాజస్థాన్ కరువు ప్రాంతాల్లో పొంగుతున్న గంగ ⇒ తెలుగు ఇంజనీర్ శ్రీరాం వెదిరె సారథ్యంలో భగీరథ యజ్ఞం ఏడాదిలోనే ఫలితాలిస్తున్న జల వనరుల అథారిటీ ప్రణాళిక మోడు వారిన భూముల్లో రెండు, మూడు పంటల సాగు గొంతు తడుపుకొనేందుకు చుక్క నీరు లేదు.. పది కిలోమీటర్లు వెళితే గానీ కడివెడు నీరు దొరకదు.. సాగుకు కనుచూపు మేరలో చెరువన్నదే కనపడదు.. ఊరి జనంలో 90 శాతం వలస పోయే పరిస్థితి.. ఇది రాజస్థాన్ ఎడారుల్లో గ్రామీణ ప్రాంతాల దుస్థితి. ఈ పరిస్థితిని మార్చి, గ్రామాలను హరిత వనాలుగా తీర్చిదిద్దేందుకు ఆరేళ్ల కింద ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. అందులో తెలుగు వ్యక్తి కీలకంగా పనిచేస్తున్నారు. ఆనాడు ఈ సంస్థ ప్రతినిధులు భూములను సర్వే చేస్తోంటే స్థానికులు రాళ్లతో తరిమారు. ఇప్పుడవే చేతులు పూలమాలలతో స్వాగతిస్తున్నాయి. ఎందుకు? ఈ ఐదేళ్లలో ఏం జరిగింది? జాతీయ మీడియా బృందంలో భాగంగా ‘సాక్షి’ ప్రతినిధి రాజస్థాన్‌లో జరుగుతున్న జలయజ్ఞంపై చేసిన పరిశీలనలో ఈ ప్రశ్నలకు జవాబు దొరికింది. చుక్క నీటి కోసం కటకటలాడిన చోట ఇప్పుడు పాతాళ గంగ పోటెత్తుతోంది. మోడువారిన భూములు పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి. (రాజస్థాన్ నుంచి లెంకల ప్రవీణ్ కుమార్) రాజస్థాన్‌లో 2011లో ప్రతిపక్ష నేతగా ఉన్న వసుంధరరాజే.. మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని కరువు కోరల నుంచి గట్టెక్కించేందుకు గల అవకాశా లను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అప్పటికే అమె రికాలో 15 ఏళ్లు ఇంజనీర్‌గా పనిచేసి స్వదేశానికి తిరి గి వచ్చిన తెలుగు వ్యక్తి శ్రీరాం వెదిరెకు పలు రాష్ట్రా ల్లో నీటి వనరుల సంరక్షణపై పనిచేసిన అనుభవం ఉంది. దీంతో శ్రీరాం వెదిరెను ఢిల్లీకి పిలిపించిన వసుంధర.. రాజ స్థాన్లో నీటి ఎద్దడి ప్రాంతాలను సుభిక్షం చేసే పని చేపట్టాలని కోరారు. అప్పటికే లోకహిత స్వచ్ఛంద సంస్థతో అనుబంధమున్న శ్రీరాం.. సంస్థకు చెందిన ప్రతినిధులతో కలసి రాజస్థాన్‌కు వెళ్లారు. కరువు ప్రాంతాల్లో నీటి వనరులను పెంచేందుకు సర్వే చేపట్టారు. కానీ స్థానికులు తమ భూములకేదో ప్రమాదం పొంచి ఉందని భావించి రాళ్లు విసురుతూ వారిని తరిమికొట్టే ప్రయత్నం చేశారు. అయినా ఆ బృందం నిరుత్సాహపడలేదు. సరేనన్న గ్రామాల్లో సర్వే చేసి ప్రణాళికలు సిద్ధం చేసింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక పనులు ప్రారంభించింది. వసుంధర రాజస్థాన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. శ్రీరాం వెదిరెకు కేబినెట్ ర్యాంకు హోదా ఇస్తూ ‘రాజస్థాన్ రివర్ బేసిన్, స్టేట్ వాటర్ రీసోర్సెస్ ప్లానింగ్ అథారిటీ’కి చైర్మన్‌ను చేశారు. చతుర్విధ జలప్రక్రియతో జీవం.. రాజస్థాన్ ప్రభుత్వం శ్రీరాం సాయంతో చతుర్విధ జలప్రక్రియను ఎంచుకుంది. వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని భూమాత దాహం తీరుస్తోంది. అదే నీరు పాతాళ గంగై పొంగేలా చేస్తోంది. రాజస్థాన్‌లో సగటు వార్షిక వర్షపాతం 564.89 మిల్లీమీటర్లు. కొన్ని ప్రాంతాల్లో 171 మి.మీ. ఉంటే కొన్ని ప్రాంతాల్లో 950 మి.మీ. వరకు ఉంటుంది. వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీరు ఇంకేలా చేయడం, ఆ తేమ నిండిన భూమిపై నీరు నిలిచి చిన్న చిన్న ఊట చెరువులు, చెరువుల్లో నిల్వగా మారి.. తద్వారా ఆ నీటిని ప్రజలు వినియోగించుకోవడం ఈ చతుర్విధ జల ప్రక్రియలో అనుసరించే విధానం. రివర్ బేసి న్లో ఉండే నీటి వనరులను అనుసంధానం చేసి చివరకు నదులను సజీవంగా చేసే ప్రక్రియ ఈ విధానంలో తుది దశ. వర్షపు నీరు భూమిలోకి ఇంకే లా స్టాగర్డ్ కందకాలు చేసి వాటిపై జట్రోఫా చెట్లను పెంచుతున్నారు. దిగువన చిన్న ఊట చెరువులు, ఆ దిగువన వాటర్ షెడ్లను, చెరువులను నిర్మిస్తున్నారు. చెరువుగా మారేందుకు అవకాశమున్న ప్రతి చోట పైన క్యాచ్‌మెంట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. గతేడాది జనవరిలో తొలి విడతగా జల స్వావలంబన అభియా న్ కింద 3,529 గ్రామాలను ఎంపిక చేసి ఐదారు నెల ల్లోనే పనులు పూర్తిచేశారు. ఇప్పుడు రెండో విడతలో మరో 4,250 గ్రామాల్లో పనులు చేస్తున్నారు. తొలి ఏడాదే ఫలితాలు.. గతేడాదిలో ప్రారంభించి వర్షాకాలం నాటికి పనులు పూర్తయిన ప్రాంతాల్లో.. వర్షపు నీటితో చెరువులు నిం డాయి. వర్షాధారంగా శనగ సాగు చేసుకునే రైతులు ఇప్పుడు 2 నుంచి 3 పంటలు శనగ, గోధుమ సాగుచేస్తున్నారు. వచ్చే ఏడాది వేరుశనగ, మొక్కజొన్న పంటలను సాగుచే స్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంచి నీటి కొరత తీరింది. భూగర్భజలాలు పెరిగి చేతి పంపుల్లో నీరు లభ్యమవుతోంది. ఈ నీటి వనరులు పశువుల దప్పికను తీర్చుతున్నాయి. వలస బాట పట్టే ప్రజలు ఇప్పుడు తమ భూములను సాగులో పెడు తున్నారు. కోటి చెట్ల పెంపకం లక్ష్యంగా మొక్కలు నాటుతున్నారు. వాటిని ఐదేళ్ల పాటు పెంచే బాధ్యతను అటవీ శాఖకు అప్పగించారు. మూడు అడుగుల లోతులోనే నీరు బాన్సా్వరా జిల్లాలోని గోడీ తేజ్‌పూర్‌లో 2,500 హెక్టా ర్ల పరిధిలో ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతం వరకు నీరు ఇంకేందుకు గతేడాది విస్తృతంగా కందకాలు తవ్వారు. వాటి దిగువన ఊట చెరువులు నిర్మించారు. దాంతో ప్రస్తుతం ఎండా కాలంలోనూ అక్కడ నేలలో తేమ కనిపిస్తోంది. మూడు అడుగులు తవ్వగానే నీళ్లు కనిపిస్తున్నాయి. దీంతో సమీప ప్రాంతాల్లోనూ భూగర్భ జలాలు పెరగడం విశేషం. నాణ్యత లోపిస్తే కఠిన నిర్ణయాలు రాజస్థాన్‌లో వందల కోట్లతో చేపడుతున్న ఈ పనుల్లో ఎక్కడైనా శాస్త్రీయత లోపించిందని తేలితే ఆ పనులను రద్దు చేసి కాంట్రాక్టర్లతో మళ్లీ చేయిస్తు న్నారు. ఒక ఊట చెరువు కట్ట నిర్మించాలంటే దశల వారీగా నీళ్లు చల్లి కట్ట పటిష్టం చేస్తూ ఎత్తు పెంచాలి. కానీ అలా జరగలేదని తేలితే వాటిని రద్దు చేస్తున్నా రు. ఆ కట్టలను తొలగించి మళ్లీ నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నారు. తొలి, మలి దశల్లో ఇప్పటివరకు ఇలా దాదాపు 135 పనులను రద్దు చేశారు. తెలుగు వారిది కీలకపాత్ర ఈ పథకాన్ని నిర్విఘ్నంగా, యజ్ఞంగా కొనసాగిం చడంలో తెలుగు వాళ్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో నీటి పారుదల శాఖ ఉద్యో గులైన జక్కిడి జంగారెడ్డి, అఫ్సర్ సాంకేతిక నిపుణు లుగా ప్రత్యేక డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీరాం సన్నిహితుడైన ఇంజనీర్ రాకేష్‌రెడ్డి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వాసు తదితరులు తోడ్పాటు అందిస్తున్నారు. ఏడాదిలో 12 టీఎంసీల నీరు: శ్రీరాం వెదిరె చక్కటి ప్రణాళిక, పనుల్లో నాణ్యత, నిరంతర పర్యవేక్షణతోనే తమ లక్ష్యం సాధ్యమవుతోందని శ్రీరాం వెదిరె తెలిపారు. తమ పనులు విజయవంతమైన ప్రతి చోట పొరుగు గ్రామాల్లోని ప్రజలు ఇలాంటి పనులే కోరుకుంటున్నారని తెలిపారు. బాన్సా్వరా ప్రాంతంలోని కోరాపాడాలో నిర్మించిన చెరువును పరిశీలించేందుకు వెళ్లిన మీడియా బృందంతో ఆయన మాట్లాడారు. ‘‘ప్రజల భాగస్వామ్యంతో ఇదంతా జరుగుతోంది. ఇప్పటివరకు ప్రజలు దాదాపు రూ. 55 కోట్ల విరాళాలను అందించారు. ఇప్పటివరకు 41 లక్షల మంది ప్రజలు, 45 లక్షల మూగజీవాలకు ఈ నీటి వనరుల ద్వారా ప్రయోజనం చేకూరింది. ఇప్పటివరకు అతి తక్కువ ఖర్చుతో దాదాపు 12 టీఎంసీల నీటిని వినియోగంలోకి తేగలిగాం. భూగర్భ జల మట్టాలు దారుణంగా పడిపోయి ఉన్న ప్రాంతాలు ఇప్పుడు జలసిరితో కళకళలాడుతున్నాయి. ఈ పనుల పూర్తి ఫలాలు అందడానికి మరో రెండు మూడేళ్లు పడుతుంది..’’అని పేర్కొన్నారు. వేరు శనగ కూడా పండిస్తా ‘‘ఇంతకుముందు ఒకటే పంట పండేది. ఈ ఏడాది ఎకరం పావులో గోధుమ వేశా. ఈ చెరువుతో మా బతుకు మారుతోంది. వచ్చే ఏడాదిలో గోధుమతోపాటు వేరుశనగ, పత్తి పండిస్తా. కాలం కాస్త బాగున్నా మూడు పంటలు పండిస్తా..’’ – రావోజీ, రైతు, కోరాపాడా శనగ, గోధుమ పండిస్తున్నా గ్రామంలో నిర్మించిన చెరువు ఆశలు చిగురింపజేసింది. గతంలో ఇక్కడ నీళ్లే కని పించేవి కాదు. ఇప్పుడు రెండు మూడు పంటలు పండిస్తు న్నాం. గతంలో వర్షాధా రంతో కేవలం ఒక పంట పండేది. గ్రామంలో 90 శాతం ప్రజలు వలస వెళ్లేవారు. – కమ్జి, రైతు, కోరాపాడా నీటి కమిటీలు పనిచేస్తున్నాయి ‘‘రాజస్థాన్ ప్రభుత్వం కేవలం చెరువులు నిర్మించడమే కాకుండా నీటి వనరులకు గ్రా మస్తులతో కమిటీలు వేస్తోంది. సాగు చేసుకునే వారు నీటిని పొందుతారు. ఇతరత్రా ఉపా ధి లేనివారు చేపలు పట్టుకునేందుకు ఈ కమిటీలు వీలు కల్పిస్తాయి..’’ – జక్కిడి జంగారెడ్డి, సాంకేతిక నిపుణుడు స్వయం సమృద్ధి లక్ష్యంగా.. ‘గ్రామీణ ప్రాంతాలు స్వయం సమృద్ధి సాధించే దిశగా జల స్వావలంబన అభియాన్ పనిచేస్తోంది. గ్రామీణులు ఈ పథకంతో మమేకం అవుతున్నారు. రెండు మూడేళ్లలో పల్లెలన్నీ హరితరూపు దాల్చుతాయి..’ – ధన్సింగ్ రావత్, రాజస్థాన్ గ్రామీణాభివృద్ధి మంత్రి -
బకాయిలు రూ.11 కోట్లు
గత వేసవిలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ట్యాంకర్ల యజమానులకు నేటికీ చెల్లించని డబ్బులు మెదక్ జోన్ : బిల్లులు రాక ట్యాంకర్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు. గత వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొనడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు. ఇందుకు జిల్లాలో రూ.11 కోట్లకుపైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. మళ్లీ వేసవి వస్తున్నా.. బకాయిలు రాకపోవడంతో ట్యాంకర్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల మాటలు నమ్మి అప్పుల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనటంతో గత వేసవిలో జిల్లాలోని అనేక గ్రామాల్లో ట్యాంకర్ల, బోరుబావులను లీజుకు తీసుకుని ట్యాంకర్ల ద్వారా తాగు నీటిని సరఫరా చేశారు. కాగా ఇందుకు సంబంధించి బోరుబావులు, ట్యాంటర్ల యజమానులకు సుమారు పదకొండున్నర కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా నేటికీ పైసా ఇవ్వలేదు. దీంతో ట్యాంకర్ల యజమానులు, బోర్లను లీజుకు ఇచ్చిన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాగా వర్షాకాలం చివరన పుష్కలంగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు కొద్ది మేర పెరిగాయి.. రైతులు ఖరీఫ్‌సీజన్ కన్నా అధికంగా రబీలో వరిపంటలను సాగు చేశారు. దీంతో సాగునీటి వినియోగం పెరగడం, వేసవిని తలపిస్తున్న ఎండలతో బోరుబావుల్లో నీటి మట్టం తగ్గిపోయాయి. పరిస్థితిని చూస్తుటే ఈ యేడు సైతం ట్యాంకర్ల ద్వారానీటిని సరఫరా చేయాల్సి వస్తుందనే భావన వ్యక్తమవుతోంది. నేటికీ డబ్బులు ఇవ్వలేదు పోయిన వేసవిలో మెదక్ మండలం శివ్వాయిపల్లిలో ట్యాంకర్ ద్వారా మార్చి నుంచి సెప్టెంబర్ వరకు మంచి నీటిని సరఫరా చేశాను. రూ.2 లక్షల రూపాయలు రావాలి. అప్పులు చేసి డీజిల్‌ను పోయించాను. ఎప్పుడు అడిగినా ఆఫీసర్లు ఈ రోజు, రేపు అంటున్నారు. అప్పులోళ్లు ఇబ్బందులు పెడుతున్నారు. పైసలిచ్చి ఆదుకోవాలి. – బాలమొల్ల రాజు శివ్వాయిపల్లి -
నీటి కొరత లేకుండా దీక్ష తీసుకుందాం
పుష్కరాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు అమరావతి: కృష్ణా పుష్కరాలకు రాష్ట్రంలో నీటి కొరత లేకుండా దీక్ష తీసుకుందామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.పుష్కరాలపై బుధవారం అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 12 అంశాలపై 12 రోజుల పాటు చర్చలు, గోష్టులు నిర్విహ స్తామని, మంత్రులు వీటికి ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తారని సీఎం తెలిపారు. పుష్కరాలకు భారీగా ఆహ్వానాలు పంపాలని అధికారులను సీఎం ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. శుక్రవారం సాయంత్రానికి తిరిగి విజయవాడ చేరుకుంటారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, కేంద్ర మంత్రులు వెంకయ్య, సురేశ్‌ప్రభు, నిర్మలా సీతారామన్ తదితరులను పుష్కరాలకు ఆహ్వానించనున్నారు. -
ఇదేం కరువు మాయమైన చెట్టూ చెరువు
రంగారెడ్డి జిల్లాలో తీవ్ర దుర్భిక్షం ♦ ఎన్నడూ ఎండిపోని చెరువులూ నైచ్చాయి ♦ పశువులకు గ్రాసం కరువు.. మేత లేక సంతలో అమ్ముకుంటున్న రైతులు ♦ సాగు పనుల్లేక వలసబాట పట్టిన రైతులు, కూలీలు ఇది రంగారెడ్డి జిల్లాలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు కోటిపల్లి దుస్థితి! 12,600 ఎకరాలను స్థిరీకరించే ఈ జలాశయం ఎండిపోవడంతో దీని పరిధిలోని ఆయకట్టు బీడును తలపిస్తోంది. ఒకప్పుడు బోటు షికారు.. చేపల వేట.. పర్యాటకుల సందడితో కళకళలాడే ఈ ప్రాజెక్టు ఇప్పుడిలా కళావిహీనంగా కనిపిస్తోంది. దీని నీటి నిల్వ సామర్థ్యం 1,688 అడుగులు. కానీ ఇప్పుడు ఓ బురద గుంటగా మారింది. మరో వారం రోజుల్లో ఈ నీరు కూడా ఆవిరైపోతుందని భావించిన మత్స్యకారులు బురదలో వలలు వేసి చేపలను పట్టారు. జిల్లాలో ఎక్కడ చూసినా నైచ్చిన నేలలు, అడుగంటిన జలాశయాలు, ఎండిపోయిన పంటలు, మోడువారిన చెట్లే కనిపిస్తున్నాయి. పశువులకు గ్రాసం కరువవడంతో వాటిని సాకలేక రైతులు సంతల్లో అమ్మేస్తున్నారు. రాష్ట్ర రాజధాని అవసరాలను తీర్చే కూరగాయల పంటలు, ఉద్యాన తోటలపైనా కరువు పంజా విసిరింది. ఎద్దు, ఎవుసం పోవడంతో పొట్ట చేతబట్టుకొని రైతులు, వ్యవసాయ కూలీలు వలసబాట పడుతున్నారు! రంగారెడ్డి జిల్లాలో కరువుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... - డోకూరి వెంకటేశ్వర్‌రెడ్డి, సాక్షి ప్రతినిధి, రంగారెడ్డి మేత లేక.. సాకలేక ఈ చిత్రంలో చూడముచ్చటగా కనిపిస్తున్న కాడెద్దులు అమ్మకానికి వచ్చాయి. ఇన్నాళ్లు కంటికి రెప్పలా కాపాడుకున్న ఎడ్లను సాకలేక మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరుకు చెందిన రైతు అంజన్‌గౌడ్ సర్దార్‌నగర్ సంతకు ఇలా తీసుకొచ్చాడు. అంజన్‌గౌడ్ బలహీనతను సొమ్ము చేసుకునేందుకు దళారీలు జోడెడ్లను రూ.40 వేలకు అమ్మాలని బేరమాడారు. ఒకప్పుడు రూ.1.20 లక్షలకు బేరం వచ్చినా అమ్మేందుకు మనసొప్పని ఆ రైతు... దళారుల ధరతో నివ్వెరపోయాడు. ‘ఏం చేస్తాం సార్.. నాకున్న రెండెకరాల్లో మొక్కజొన్న, పత్తి, మినుములు వేశా. వర్షాల్లేక అవి పూర్తిగా ఎండిపోయాయి. బోరు బావి తవ్వించా. అది కూడా పోయింది. మరోవైపు పశువులకు మేత కూడా కరువైంది. చేసేదిలేక నమ్ముకున్న ఎడ్లను అమ్ముదామని సంతకు వస్తే ఇదీ పరిస్థితి’ అని వాపోయాడు. చెరువు తోటయింది.. ఈ చిత్రం చూశారా! ఇదొక జ లాశయం. దాదా పు 3 వేల ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు. సీను కట్ చేస్తే.. ఇప్పుడో తోట! ఈ చెరువు ఎండిపోవడంతో ఓ వ్యాపారి ప్రాజెక్టును పండ్ల తోటగా మార్చాడు. చెరువు గర్భంలో కర్బుజా తోటను సాగు చేశాడు. సారవంతమైన ఒండ్రుమట్టి కావడంతో దిగుబడి కూడా బాగానే వచ్చింది. ఇదంతా ఎక్కడనుకుంటున్నారా. పరిగి మండలం లక్నాపూర్ ప్రాజెక్టులో. మునుపెన్నడూ ఎండిపోని ఈ రిజర్వాయర్ తొలిసారి ఎండిపోయింది. ఎండుముఖం పట్టిన చెరువు పరిస్థితిని ముందే ఊహించిన వ్యాపారి అక్రమంగా పండ్ల తోటను వేశాడు. దీంతో ఇప్పుడు చెరువు స్థానంలో తోట దర్శనమిస్తోంది. అన్నదాతకు ఎంత కష్టం.. ఎంత నష్టం ఆవులకు మేత పెట్టలేని దయనీయ పరిస్థితిలో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏళ్లుగా కుటుంబంలో ఒక్కరిగా మెలిగిన గోమాతను గత్యంతరం లేక రైతన్నలు అమ్మకానికి పెట్టారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు సుమారు రూ.4 కోట్ల విలువైన ఆవులు,గేదెలు,ఎడ్లను రైతులు విక్రయించారు. పంటలు ఎండుతున్నా.. వాటికోసం చేసిన అప్పుల వడ్డీలు మాత్రం పెరుగుతున్నాయి. కనీసం పశువులకు మేత కూడా పెట్టలేని దయనీయ పరిస్థితి. ఒక్కొక్క రైతుది ఒక్కో దీనగాథ. కూతుళ్ల పెళ్లిళ్ల కోసం కొందరు.. అప్పుల వడ్డీ పెరుగుతుందనే కారణంతో కొందరు.. గ్రాసం కోసం వందల్లో ఖర్చు పెట్ట లేక మరికొందరు పశువులను అమ్మేసుకుంటున్నారు. రోజుకు గడ్డికి రూ.500 ఖర్చు పశుగ్రాసం కొరత ఉంది. జత ఎడ్లకు మేతకు రోజుకు రూ.500 ఖర్చు పెట్టాలి. నెలకు ఒక ట్రాక్టర్ గడ్డికి రూ.15 వేల వరకు పెట్టుబడి కావాలి. అంత డబ్బు లేదు. వరి పంట వేసినా..నీళ్లు లేక ఎండిపోయింది. పంటలకోసం చేసిన అప్పులు ఉన్నాయి. వాటికి మిత్తి కట్టాల్సి వస్తుంది. అందుకే ఎడ్లను రూ.40 వేలకు విక్రయించాను. - కృష్ణ, పాత తాండూరు బిడ్డ పెళ్లి కోసం...ఎడ్ల అమ్మకం రూ.1 లక్ష వరకు పంటల కోసం చేసిన అప్పు ఉంది. కంది పంట దిగుబడులు అంతంతమాత్రంగా వచ్చాయి. పశువులకు గడ్డి లభించడం లేదు. మోపు ధర అధికంగా ఉంది. పశువులకు మేత పెట్టే స్తోమత లేదు. ఇప్పుడు బిడ్డ పెళ్లి పెట్టుకున్నా. అందుకే రెండ ఎడ్లను రూ.60వేలకు అమ్మకానికి పెట్టాను. - అంజిలయ్య,వాల్మీకినగర్ ఉద్యానం ఢమాల్.. ఉద్యాన పంటల సాగు భారీగా తగ్గిపోయింది. హైదరాబాద్ చుట్టూరా విస్తరించి ఉండడంతో జిల్లాలో పండి ంచిన కూరగాయల్ని నేరుగా నగరంలోని మార్కెట్లకు రైతులు తరలిస్తారు. జిల్లాలో ఏటా 28,264 హెక్టార్లలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతోటలు సాగవుతాయి. కానీ ఈసారి ఉద్యాన పంటల సాగు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. జిల్లాలో అధికంగా సాగయ్యే టమాటా పంట దిగుబడి దారుణంగా పడిపోయింది. చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి టమాటాను చేవెళ్ల మార్కెట్‌కు దిగుమతి చేసుకుంటున్నారంటే కూరగాయల కొరత తీవ్రతను అంచనా వేసుకోవచ్చు. ఉత్తరాదితో పాటు విదేశాలకు ఎగుమతి చేసే క్యారెట్ పంట 1,736 హెక్టార్ల నుంచి 250 హెక్టార్లకు పడిపోయింది. 30% తగ్గిన పాల ఉత్పత్తి... పాడిరైతులు అధిక ధర వెచ్చించి గ్రాసం కొనలేక.. పశువులనే విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పాలిచ్చే ఆవులు, గేదెల సంఖ్య క్రమంగా తగ్గడంతో పాల ఉత్పత్తిపై ప్రభావం పడింది. జిల్లాలో 65వేల మంది రైతులు పాడిపరిశ్రమపై ఆధారపడ్డవారే. రోజుకు సగటున 1.5 లక్షల లీటర్ల పాలు నగరానికి ఎగుమతి అవుతాయి. తాజా పరిస్థితులతో పాల దిగుబడి 30 శాతం తగ్గింది. ప్రస్తుతం రోజుకు 1.06 లక్షల లీటర్ల పాలు ఎగుమతి చేస్తున్నట్లు మదర్ డెయిరీ మేనేజర్ రమేశ్ చెప్పారు. శివసాగర్ ఎండింది వికారారాబాద్ పట్టణ ప్రజల తాగునీ టి అవసరాలను తీ ర్చే శివసాగర్ చెరువు తొలిసారి ఇలా ఎండిపోయింది. లక్ష జనాభా కలిగిన వికారాబాద్ పట్టణానికి ప్రతిరోజూ 2.44 ఎంఎల్డీ నీటిని సరఫరా చేసే ఈ జలాశయం చుక్కనీరు కూడా లేకపోవడంతో తాగునీటికి బోరుబావులపైనే ఆధారపడాల్సి వస్తోంది. చెంతనే నది అయినా.. యాలాల మండలం బాణాపూర్ అనుబంధ గ్రామం అడాల్‌పూర్ పక్కనే కాగ్నా నది ఉంది. ఇన్నేళ్లూ ఈ నదీ ప్రవాహంతో అడాల్పూర్వాసులకు నీటి కష్టాలంటే తెలియదు. కానీ ఇప్పుడు తొలిసారి నది ఎండిపోయింది. ఇది 40 ఏళ్ల చరిత్రలోనే అతిపెద్ద కరువుగా చెబుతున్న ఈ గ్రామ ప్రజలు... నది అంతర్భాగంలో చెలిమ తవ్వారు. ఈ చెలిమే మండు వేసవిలోనూ వారి దప్పికను తీరుస్తోంది. కాగ్నా ఎండిపోవడంతో తాండూరుకూ తిప్పలు తప్పడం లేదు. ఇక్కడ మూడ్రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. 2,350 చెరువులు ఎండిపోయాయి సాగునీటి ప్రాజెక్టులు పెద్దగా లేకపోవడంతో జిల్లా రైతాంగం భూగర్భ జలాలపైనే ఆధారపడుతోంది. జిల్లావ్యాప్తంగా 2,851 నీటి వనరులు ఉన్నాయి. ఇందులో వంద ఎకరాల విస్తీర్ణం పైబడి 264 చెరువులు, వంద ఎకరాలలోపు చెరువులు 2,587 ఉన్నాయి. ఇవన్నీ నీటితో కళకళలాడితే 1,28,774 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. ప్రస్తుతం జిల్లాలో 2,350 చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. చిన్ననీటి పారుదల ప్రాజెక్టులు కోటిపల్లి, లక్నాపూర్, ఇబ్రహీంపట్నం, శివసాగర్ ప్రాజెక్టులు.. జంటనగరాల దాహార్తి తీర్చే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లు కరువు విలయానికి ఎడారులుగా మారాయి. తాగునీటికి తండ్లాట.. గ్రామీణ నీటిసరఫరా విభాగం గణాంకాల ప్రకారం జిల్లాలో 1,646 ఆవాసాలుండగా.. ఇందులో 1,637 ఆవాసాల్లో తాగునీటి సమస్య ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ బోర్లు ఎండిపోవడంతో అద్దెకు బోర్లు తీసుకుని ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ.. సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం దొరకడంలేదు. ► జిల్లాలోని 12 మండలాల్లో 20 మీటర్ల నుంచి 43 మీటర్లలోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. మరో 15 మండలాల్లో 20 మీటర్లలోతులో గంగమ్మ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. బంట్వారంలో గతేడాది ఇదే సమయంలో 35 మీటర్లలోతులో నీరు లభ్యమైతే.. ప్రస్తుతం 43 మీటర్లకు పడిపోయింది. మొయినాబాద్ మండలంలో గతేడాది ఇదే సమయంలో 27.66 మీటర్ల లోతులో జలాలుండగా.. ప్రస్తుతం 40.46 మీటర్ల లోతుకు వెళ్లాయి. ► జిల్లాలో 10,615 గ్రామీణ నీటి సరఫరా విభా గం బోర్లు, చేతి పంపులుండగా.. ఇందులో 6వేలకు పైగా బోర్లలో నీళ్లు పూర్తిగా అడుగంటాయి. చలో పుణే.. ముంబై పల్లెలపై కరువు తీవ్ర ప్రభావం చూపుతోంది. వ్యవసాయం లేక.. ఉపాధి కరువై గ్రామాలను ఖాళీ చేయిస్తోంది. ఉన్న ఊరిలో ఉపాధి కరువై.. పిల్లాజెల్లా.. తట్టాబుట్టా సర్దుకొని ఉపాధి కోసం ముంబై, పుణే రెలైక్కుతున్నారు. వలస వెళుతున్న వారిలో ఎక్కువగా రైతులే ఉన్నారు. కరువుతో పంటలు లేక.. చేసిన అప్పులు తీర్చలేక.. కుటుంబ పోషణ కోసం పట్టణాల వైపు పయనిస్తున్నారు. తాండూరు రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే కోణార్క్, రాజ్‌కోట్, హుస్సేన్‌సాగర్, ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రోజుకు సగటున ఆరేడు వేల మంది ముంబై, పుణే, కుర్ల, థానే, లోనావాలాకు వలస వెళుతున్నట్లు రైల్వేశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత నెల నుంచి వలసల పర్వం మొదలైందని రైల్వే టికెట్ల జారీని బట్టి తెలుస్తోంది. తాండూరు డివిజన్లోని సిరిగిరిపేట్, సంకిరెడ్డిపల్లితండా, గోవింద్రావుపేట, తొప్పర్లగడ్డ తండా, దుబ్బల తండా, మన్సాన్పల్లి, కోత్లాపూర్, నంద్యానాయక్, బాబునాయక్ తండాలతోపాటు మైల్వార్, నీళ్లపల్లి, జిల్లాలోని దోమ, కులకచర్ల గ్రామాల ప్రజలు తాండూరు రైల్వేస్టేషన్ నుంచి రోజుకు జనరల్ కేటగిరీ టికెట్లు 6 వందల వరకు విక్రయం అవుతున్నట్టు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. భవన నిర్మాణ పనులు లేదా అడ్డా కూలీలుగా అక్కడికి వెళ్లడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఉపాధి హామీ కింద పనులు కల్పించినా డబ్బుల చెల్లింపులో జాప్యం జరుగుతుండడం కూడా వలసలకు కారణమవుతోంది. ప్రతి పశువుకు రెండు కేజీల దాణా జిల్లాలో కరువు తీవ్రంగా ఉంది. నీటి కొరత ఉన్నప్పటికీ, నియంత్రణలో ఉంది. 205 ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం. 87 బోర్లను అద్దెకు తీసుకున్నాం. 14 ప్రాంతాల్లో నీటి ఫిల్లింగ్ చేసి... ఎద్దడి ఉన్న గ్రామాల్లో పంపిణీ చేస్తున్నాం. కరువు ప్రభావం పశువులపై పడింది. పశుగ్రాసం దొరకడం లేదు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు సబ్సిడీపై గడ్డి విత్తనాలను పంపిణీ చేశాం. ప్రతి పశువుకు రోజుకు 2 కేజీల దాణా ఇవ్వాలనే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతున్నాం. నీటి తొట్లను కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఉపాధి కూలీలు వడదెబ్బ బారిన పడకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, డేరాలను అందజేస్తున్నాం. - రజత్‌కుమార్‌సైనీ, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మకరందం కాదు.. మంచినీళ్లు కావాలి! మనుషులే కాదు నీళ్లకోసం క్రిమికీటకాలూ అవస్థలు పడుతున్నా యి. రంగారెడ్డి జిల్లా పరిగిలో ఓ పళ్ల రసం అమ్మే వ్యాపారి రెండు గ్లాసుల్లో నీళ్లు నిం పి పెట్టగా ఇలా గుం పుగా వచ్చిన తేనెటీగ లు దాహం తీర్చు కున్నాయి. - పరిగి -
నీటి దందా
♦ భవన నిర్మాణాలకు తాగునీరు ♦ 9 గ్రామాలకు నీళ్లు కరువు ♦ దారి మళ్లిస్తున్న అక్రమార్కులు ♦ చక్రియాల్ పంప్‌హౌస్ నుంచి ప్రత్యేక లైన్‌తో నీటి సరఫరా ♦ చోద్యం చూస్తున్న అధికారులు అసలే తీవ్ర నీటికొరతతో ప్రజలు అల్లాడుతుంటే.. కొందరు అక్రమార్కులు తాగు నీటిని దారి మళ్లిస్తున్నారు. యథేచ్ఛగా నీటి వ్యాపారం చేస్తున్నారు. చక్రియాల్ పంప్ హౌస్ నుంచి ప్రత్యేక లైన్ ఏర్పాటు చేసి భవన నిర్మాణాలకు నీటిని అందిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటమే ఇందుకు కారణమని స్థానికులు మండిపడుతున్నారు. పుల్కల్: చక్రియాల్ పంప్‌హౌస్ ద్వారా పుల్కల్తో పాటు అందోల్ మండలంలోని వివిధ గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. మంజీర బ్యారేజీ పూర్తిగా ఎండిపోవడంతో ప్రత్యేకంగా వేసిన బోర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. నీటి కొరత వల్ల చౌటకూర్, కోర్పోల్, సుల్తాన్పూర్, పోసన్పల్లి, సరాఫ్పల్లి గ్రామాలకు నీటి సరఫరాను నిలిపివేశారు. అయితే వొన్నాపూర్ శివారులోని సత్యసాయి నీటి పథకం నుంచి పక్కనే నిర్మాణం జరుగుతున్న వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ భవనానికి ప్రత్యేకంగా పైప్‌లైన్ వేశారు. రోజుకు సుమారు 20-30 వేల లీటర్ల వరకు నీటిని సరఫరా చేస్తున్నారు. అదే నీటిని గ్రామాలకు సరఫరా చేస్తే చక్రియాల్తో పాటు మరో 9 గ్రామాల దాహార్తి తీరే అవకాశం ఉంది. కాని స్థానిక గ్రామీణ నీటి సరఫరా అధికారులతో పాటు స్థానిక నాయకులు భవన నిర్మాణ కాంట్రాక్టర్‌తో లాలూచి పడి జనం గొంతు తడపాల్సిన నీటిని నిర్మాణానికి తరలిస్తున్నారు. ‘ఊరికే తీసుకోవడం లేదు. ఇందుకోసం రూ. 2 లక్షలు ఇచ్చాను’.. అంటూ కాంట్రాక్టర్ చెబుతున్నాడు. కానీ జనం నీరు లేక వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు తీస్తుంటే సత్యసాయి నీటి పథకం ద్వారా మాత్రం దర్జాగా భవన నిర్మాణానికి సరఫరా చేస్తున్నారు. నీటిని విక్రయిస్తున్న ఆపరేటర్లు చక్రియాల్ నీటి పథకం ద్వారా వొన్నాపూర్ ఫిల్టర్ నుంచి మంచి నీటిని ఆపరేటర్లు విక్రయిస్తున్నారు. ఇటీవల శివ్వంపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులకు రూ. 800 తీసుకొని ట్రాక్టర్ ట్యాంకర్‌ను నింపి ఇస్తున్న క్రమంలో స్థానికులు పట్టుకున్నారు. అయినా అధికారుల్లో చలనం లేదు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో చాలా గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. పంప్ హౌస్‌లో శుద్ధి చేస్తున్న నీటిని తాగేందుకు ఇవ్వకుండా భవన నిర్మాణాలు, ఇతర అవసరాలకు ఆపరేటర్లు విక్రయిస్తుండటం గమనార్హం. రూ. 2 లక్షలు ఇచ్చాం.. పాలిటెక్నిక్ హాస్టల్ భవన నిర్మాణానికి పైప్‌లైన్ ద్వారా నీటిని తరలిస్తున్నారన్న దానిపై సైట్ మేనేజర్ సుబ్బారావు స్పందిస్తూ.. దొంగతనంగా ఏమీ తీసుకోవడంలేదని, గ్రామస్తుల నిర్ణయం మేరకు రూ. 2 లక్షలు చెల్లించి తీసుకుంటున్నామని తెలిపారు. -
మట్టి ముంతలతో డ్రిప్పు!
గోనె సంచులతో షేడ్‌నెట్!! ఇంటిపంటలకు వేసవికాలంలో అధిక వేడి, నీటి కొరత రూపంలో పెనుముప్పు పొంచి ఉంటుంది. షేడ్‌నెట్ ద్వారా నీడను కల్పించడం, తమకు తోచిన పద్ధతుల్లో డ్రిప్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా వేసవి బెడద నుంచి కొందరు టై ఆర్గానిక్ ఫార్మర్స్ స్వల్ప ఖర్చుతోనే తమ పంటలను కాపాడుకుంటున్నారు. ప్లాస్టిక్ బ్యాగులు లేదా ప్లాస్టిక్ డబ్బాలతో ఏర్పాటు చేసుకునే డ్రిప్ కన్నా.. మట్టి ముంతలతో డ్రిప్ ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. అదెలాగంటే.. ముందుగా చిన్న మట్టి ముంతను తీసుకొని అడుగున జాగ్రత్తగా రంధ్రం చేయాలి. సరిపడా కొబ్బరి పీచును తీసుకొని ఈ రంధ్రంలో దూర్చాలి. ఇలా దూర్చిన పీచు ముంత లోపలా.. బయటా కనీసం రెండు అంగుళాల పొడవు ఉండేలా చూడాలి. కొబ్బరి పీచు ద్వారా ముంతలో ఉన్న నీరు చుక్కలు చుక్కలుగా కిందకు జారుతూ ఉంటుంది. తగినంత ఎత్తున్న మూడు రాళ్లను తీసుకొని, వాటిని మొక్క పాదులో ఉంచి.. వాటిపై నీటి ముంతను ఉంచితే చాలు. నీటి చుక్కలు మొక్కల వేళ్లకు నిరంతరం అందుతూ ఉంటాయి. ముంతపై మూత పెడితే.. నీరు ఆవిరైపోకుండా ఉంటుంది. మొక్కకు రోజంతా తేమ అందుతూ ఉంటుంది. ముంతను నీటితో నింపితే.. రోజంతా మొక్కలకు నీరందుతుంటుంది. ఎండల నుంచి మొక్కలకు పాక్షిక నీడను కల్పించేందుకు గార్డెనింగ్ షాపులలో అమ్మే షేడ్‌నెట్‌ను వాడ టం మామూలే. దీనికి బదులు పల్చని పాత గోనె సంచులను ఉపయోగించుకోవచ్చు. అతి తక్కువ ఖర్చుతోనే ఇంటిపంటలపై షేడ్‌నెట్‌ను ఏర్పాటు చే సుకోవచ్చు. కత్తిరించిన గోనె సంచులను కలిపి దబ్బళంతో కుట్టి.. పరదాలా రూపొందించాలి. దీన్ని ఇంటిపంటలున్న కుండీలు, మడులపైన తాళ్లతో కట్టాలి. దీనివ ల్ల తక్కువ ఖర్చుతోనే మొక్కలను ఎండ బారి నుంచి కాపాడుకోవచ్చు. గోనె సంచుల పందిరి ఏర్పాటుకు చదరపు అడుగుకు ఒక్క రూపాయి ఖర్చవుతుందని ఒక అంచనా. మీరూ ప్రయత్నించి చూడండి..! - ఇంటిపంట డెస్క్ -
నీళ్లొస్తున్నాయ్
విజయవాడ: కృష్ణా జిల్లాలోని పలు గ్రామాల్లో నీటి కొరత తీవ్రంగా ఉంది. కాల్వల ద్వారా చెరువులకు నీరు వదులు తున్నారు. 1255 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజ్ నుంచి కాల్వలకు గురువారం వదిలారు. ఇందులో రైవస్ కాల్వకు 500 క్యూసెక్కులు, బందరు మెయిన్ కాల్వకు 300, ఏలూరు కాల్వకు 300, గుంటూరు చానల్‌కు 155 క్యూసెక్కుల నీరు వదిలారు. ప్రకాశం బ్యారేజ్ ప్రస్తుతం 9.7 అడుగుల నీరు ఉంది. ప్రభుత్వం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని రాష్ట్రానికి వదిలినట్లు తెలిసింది. ఈ నీరు ప్రకాశం బ్యారేజ్‌కు చేరుకునే సరికి నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉంది. -
సుజలం..విఫలం
జిల్లాలో 513 ప్లాంట్లకు ప్రతిపాదనలు నిర్మించింది 31.. పనిచేసేవి సగమే విద్యుత్ బిల్లుల రాయితీ ఇవ్వని వైనం నీటి కొరతతో మూతపడిన ప్లాంట్లు గిట్టుబాటు కావడం లేదంటూ దాతల వెనుకంజ జిల్లాలో ఎన్టీఆర్ సుజల పథకం అమలు నీటిమీద రాతగానే మిగిలిపోయింది. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించి ప్లాంట్లు ఏర్పాటుచేసే బాధ్యతను దాతలకు వదిలేసింది. నీటి కొరత, సర్కారు నుంచి ఆర్థిక తోడ్పాటు లేకపోవడంతో దాతలు కూడా ముందుకురాని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్లాంట్ల ఏర్పాటు ఎక్కడవేసిన గొంగళి అక్కడే.. చందంగా మారింది. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటడం, కాలువల ద్వారా నీరు అందకపోవడంతో తాగునీటి చెరువులు ఎండిపోయి జిల్లావ్యాప్తంగా తాగునీటి సమస్య తాండవిస్తోంది. కనీసం ఇప్పుడైనా సుజల పథకానికి జీవం పోస్తే మంచినీటి సమస్యను అధిగమించవచ్చు. మచిలీపట్నం : జిల్లాలో ఎన్టీఆర్ సుజల పథకం కింద 513 ప్లాంట్లు ఏర్పాటుచేస్తున్నట్లు గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. వీటిలో ఇప్పటివరకు కేవలం 31 ప్లాంట్లు మాత్రమే ఏర్పాటయ్యాయి. ఇందులో సగం పనిచేయని పరిస్థితి నెలకొంది. ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్లలో విద్యుత్‌ను వినియోగించుకుంటే యూనిట్‌కు రూ. 6.25 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇందులో ఒక్కొక్క యూనిట్‌కు రూ. 4 ప్రభుత్వం రాయితీగా ఇస్తామని ప్రకటించింది. అది అందకపోవడంతో సొంత ఖర్చుతో ప్లాంట్లు ఏర్పాటుచేసిన నిర్వాహకులకు నెలనెలా చేతిచమురు వదులుతోంది. పంచాయతీల ద్వారా ఎన్టీఆర్ సుజల పథకాలకు నీటిని సరఫరా చేయాల్సిఉంది 31 ప్లాంట్లలో కొన్నిచోట్ల నీటి కొరత వేధిస్తోంది. వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు కొందరు దాతలు ముందుకు వచ్చినా ప్రభుత్వపరంగా ఆర్థికపరమైన తోడ్పాటు ఇవ్వని పరిస్థితి ఉంది. సుజల పథకం ద్వారా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే ఆయా గ్రామాల్లో ఉన్న పరిస్థితులను బట్టి రూ. 70 వేల నుంచి రూ. 2 లక్షల వరకు ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దాతలు వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రాని పరిస్థితి ఉందని వారు చెబుతున్నారు. ఈ వాటర్ ప్లాంట్ల ఏర్పాటు తన పని కాదన్నట్లుగా ప్రభుత్వం వదిలేసింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వాటర్ప్లాంట్ల ఏర్పాటు, వాటి నిర్వహణ తీరు ఇలా ఉంది. పెడన నియోజకవర్గంలో 88 పంచాయతీలు, 140 గ్రామాలు ఉన్నాయి. బంటుమిల్లి మండలంలో ఐదు, కృత్తివెన్నులో ఒక ప్లాంట్ ఏర్పాటుచేశారు. ఇవి సక్రమంగానే నడుస్తున్నాయి. పెడన పురపాలక సంఘంలో ఒక్క ప్లాంట్‌నూ ఏర్పాటు చేయలేదు. కైకలూరు నియోజకవర్గంలోని తామరకొల్లులో ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్‌ను ఏబీసీ ట్రస్టు ద్వారా రూ. 7 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. పంచాయతీ నుంచి నిధులు ఇవ్వకపోవడం, భూగర్భ జలాలు ఉప్పగా ఉండడంతో ఈ ప్లాంట్ నిర్వహణ కష్టంగా మారి మూతపడింది. గన్నవరం నియోజకవర్గంలో ఎనిమిది వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో ఉంగుటూరు మండలం కొట్టిపాడు, తరిగొప్పులలోని ప్లాంట్లు పనిచేయడం లేదు. గన్నవరం మండలంలోని రామచంద్రాపురం, చిక్కవరం, అల్లాపురం ప్లాంట్లు పనిచేస్తున్నాయి. నూజివీడు నియోజకవర్గం నూజివీడు మండలం రామన్నగూడెం గ్రామంలో ఒకే ఒక్క ప్లాంట్ ఉంది. బోరు నీరు అందుబాటులో లేకపోవడంతో అది కూడా పనిచేయడం లేదు. తిరువూరు నియోజకవర్గంలో మూడు ప్లాంట్లు ఉన్నాయి. గంపలగూడెం మండలం గోసవీడు, తిరువూరు పట్టణంలో రెండు ప్లాంట్లు ఉన్నాయి. విద్యుత్ బిల్లులు ఇవ్వకపోవడంతో నిర్వాహకులపై ఆర్థిక భారం పడుతోంది. నెల నెలా నిర్వహణ వ్యయం అధికమవుతోందని, ఇక భరించలేమని వారు చెబుతున్నారు. నందిగామ నియోజకవర్గంలో 94 గ్రామాలు ఉండగా కంచికచర్లలో నాలుగు, వీరులపాడులో ఒక వాటర్ ప్లాంట్ ఉన్నాయి. నీటి కోసం ప్రజలు ప్లాంట్లకు వెళుతున్నా అందించలేని పరిస్థితి నెలకొంది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఆరు ప్లాంట్లు ఉన్నాయి. చిలకల్లు, బూదవాడ, లింగాల ప్రాంతాల్లో ప్లాంట్లు సక్రమంగానే పనిచేస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు సక్రమంగా పనిచేయడం లేదు. శుద్ధి చేసిన నీటి కోసం ఎదురుచూస్తున్నా వాటర్ ప్లాంట్లు ఏర్పాటుచేయని పరిస్థితి నెలకొంది. -
జలక్షామం
అడుగంటిన జలాశయాలు పొంచి ఉన్న నీటి ఎద్దడి బెంగళూరు: రాష్ట్రంలో జలక్షామ పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడూ లేనంతగా కృష్ణ, కావేరి నది పరివాహక ప్రాంతాల్లోని జలాశయాలు అడుగంటాయి. డెడ్ స్టోరీజీ కంటే నీటి మట్టం కిందకు పడిపోయింది. దీంతో ఈ వేసవిలో బెంగళూరుతో సహా రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటిని ఎలా సరఫరా చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో కృష్ణ, కావేరి నదీ పరివాహక ప్రాంతంలోని ప్రధానంగా పదమూడు నదీజలాశయాలు ఉన్నాయి. వీటి ద్వారానే రాష్ట్రంలో మెజారిటీ ప్రాంతాలకు తాగు, సాగునీటిని విడుదల చేస్తారు. ఈ ఏడాది రాష్ట్రంలో ఖరీఫ్, రబీ సీజన్లలో తక్కువ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ఖరీఫ్ సీజన్లో 32 శాతం తక్కువ వర్షపాతం కురవగా, రబీలో 55 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఈ రెండు సీజన్లలో మొత్తం 17 శాతం తక్కువ వర్షపాతం కురిసింది. అంతేకాకుండా రాష్ట్రంలో అంతకు ముందు రెండేళ్లు కూడా వర్షం సరిగా పడలేదు. దీంతో రాష్ట్రంలోని నదుల్లో నీటి ప్రవాహనం తగ్గిపోవడంతో జలాశయాల్లో కూడా నీటి నిల్వలు అడుగంటి పోతున్నాయి. ఈ విషయంలో కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ భాగాలకు సాగునీటిని అందించే తుంగభద్ర డ్యాం మరీ ఘోరం. ఈ డ్యాం పూర్తిస్థాయి స్టోరేజ్ కెపాసిటీ 100.86 టీఎంసీలు కాగా ప్రస్తుతం (ఫిబ్రవరి-21 నాటికి) ఇక్కడ కేవలం 8.884 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది ఇదే సమాయానికి తుంగభద్ర డ్యాంలో దాదాపు 31 టీఎంసీల నీరు ఉండటం గమనార్హం. ఇక కృష్ణా నదీపరివాహక జలాశయాలైన భద్ర, ఘటప్రభ, మలప్రభ, అల్మట్టి, నారాయణపుర జలాశయాల్లో కూడా ఇదే పరిస్థితి. ఈ విషయమై కర్ణాటక స్టేట్ న్యాచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ (కేఎస్‌ఎన్‌డీఎంసీ) డెరైక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ...‘కావేరి నదీ పరివాహక ప్రాంతంలో నిర్మించిన కేఆర్ఎస్ వంటి జలాశయాల్లో డెడ్ స్టోరేజీ కంటే తక్కువకు నీటి మట్టం పడిపోవడం గమనించాం. అయితే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఈ పరిస్థితి ఎప్పుడూ తలెత్తలేదు. ఈ ఏడాది మాత్రం కావేరితో పాటు కృష్ణా నదీపరివాహక ప్రాంతంలోని జలాశయాలు కూడా డెడ్‌స్టోరేజీ కంటే దిగువన నీటి మట్టాన్ని కలిగి ఉన్నాయి. అందువల్లే కావేరితో పాటు కృష్ణా నదీపరివాహక ప్రాంతంలో ఈ వేసవిలో పంటకు అవసరమైన నీటిని విడుదల చేసేది లేదని ప్రకటించాం.’ అని పేర్కొన్నారు. ఇక బెంగళూరు తాగునీటి అవసరాలు తీర్చే కే.ఆర్.ఎస్‌లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఈ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 49.45 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.69 టీఎంసీలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది ఇదే సమాయానికి (ఫిబ్రవరి-16) కేఆర్‌ఎస్‌లో 32.84 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. దీంతో రానున్న వేసవిలో తాగు నీటి కోసం ఇప్పటి నుంచే ఆంక్షలు విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా వర్షాభావ పరిస్థితుల్లో కర్ణాటకలో గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా తాగు, సాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురయ్యిదని కేఎస్‌ఎన్‌డీఎంసీ అధికారులు పేర్కొంటున్నారు. -
ఏడుకొండలపై నీటికి కోటా
తిరుమల గోవిందుని సన్నిధిలో తాగడానికి గుక్కెడు నీళ్లు కరువైపోయాయి. కొండమీద తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల తాగునీటి జలాశయాలు ఎండిపోయాయి. ఉన్న నీటితో రెండు బ్రహ్మోత్సవాలు నెట్టుకొచ్చిన టీటీడీకి భవిష్యత్‌పై నీటి కష్టం ఎదురవుతోంది. కొండమీద పెరిగిన నీటి పొదుపు చర్యలు తీవ్ర నీటి ఎద్దడి కారణంగా తిరుమల కొండ మీద టీటీడీ నీటి పొదుపు చర్యలు చేపట్టింది.ఆలయం, అన్నప్రసాద కేంద్రం మినహాయించి మిగిలిన చోట్ల సుమారు 40 శాతం కోత విధించారు. 30 మఠాలు, 20 దాకా పెద్ద హోటళ్లు, మరో 50 హోటళ్లకు సరఫరాలోనూ పొదుపు చర్యల్ని తీవ్రం చేశారు. దీంతో తిరుపతి నుంచి ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇక స్థానికులు నివాసం ఉండే బాలాజీనగర్‌లో కూడా పది రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. కాటేజీల్లోని నీటి కొళాయిల సరఫరాలోనూ కోత విధించారు. ఆరుబయట కొన్ని తాగునీటి కొళాయిల్ని మూసివేశారు. ఆరుబయట రోడ్లకు ఇరువైపులా ఉండే మరుగుదొడ్లు, స్నానాల గదుల్లో కొన్ని మూసివేశారు. నీరు వృథా కాకుండా నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. అడుగంటి ప్రధాన జలాశయాలు శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులతోపాటు ఆలయ అవసరాల కోసం 32 లక్షల గ్యాలన్లు నీరు అవసరం. ఏటా కొండమీద శేషాచలం అడవుల్లో 1,369 మి.మీ.వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఈ యేడు అందులో సగం కూడా పడలేదు. దీంతో తాగునీరు సరఫరా చేసే గోగర్భం ( 2,840 లక్షల గ్యాలన్ల సామర్థ్యం), ఆకాశ గంగ (670 లక్షల గ్యాలన్లు), పాపవినాశనం (5,240 లక్షల గ్యాలన్లు), కుమారధార(3,224 లక్షల గ్యాలన్లు), పసుపుధార (886.70 లక్షల గ్యాలన్ల) ఎండిపోయాయి. ఈ ప్రాజెక్టుల్లో అడుగంటిన బురద నీరు కనిపిస్తోంది. గంగ, బోర్ల నీటితో నెట్టుకొస్తున్న టీటీడీ తిరుమల అవసరాల కోసం రోజూ 7 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పెర్ డే) తెలుగుగంగ నీటిని సరఫరా చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం రోజూ 10 ఎంఎల్డీ (22.5 లక్షల గ్యాలన్లు) తెలుగుగంగ నీటిని సరఫరా చేయాల్సి ఉన్నా అది అమలు కావటం లేదు. దీనిపై ప్రభుత్వంతో టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు చర్చలు జరుపుతూ తెలుగుగంగ కోటాను పెంచే చర్యలు చేపట్టారు. దీంతోపాటు కల్యాణిడ్యామ్లో వేసిన బోర్ల ద్వారా మరికొంత నీటిని సేకరిస్తున్నారు. గతంలో ఇక్కడ వేసిన 25 బోర్లలో 13 ఎండిపోయాయి. వర్షంపై టీటీడీ గంపెడాశ నైరుతి రుతుపవనాలు మొహం చాటేయగా, ఈశాన్య రుతుపవనాలపై టీటీడీ గంపెడాశతో ఉంది. ఈనెల 11వ తేది నుంచి ప్రారంభమయ్యే కార్తీక మాసంలో తిరుమలలో వర్షం కురిసే అవకాశం ఉందని టీటీడీ వాటర్‌వర్క్స్ ఇంజనీరు నర సింహమూర్తి తెలిపారు. ఆ మేరకు వర్షాలు పడకుంటే తిరుమల భక్తులకు తాగునీటి కష్టాలు మరింతగా పెరిగే ప్రమాదముంది. -
నీటి కోసం ధర్నా
నీటి కొరత తీర్చాలంటూ నల్లగొండ జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం పాతర్లపాడు క్రాస్‌రోడ్డు వద్ద స్థానికులు బుధవారం పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. సుమారు 200 మంది బిందెలతో రహదారిపై బైఠాయించారు. దీంతో సూర్యాపేట - దంతాలపల్లి రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వారానికి ఒక్కసారి కూడా నీటిని అందించడం లేదని, ఈ పరిస్థితుల్లో ఎలా జీవించాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ నారాయణకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కాలేదని, అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
సారూ.. ఎండుతోంది మా నోరు!
క్యాంపస్‌లో నీటి సమస్య తీవ్రమైంది. రోజువారీ అవసరాలకు కాదుకాదా... కనీసం తాగడానికి కూడా గుగ్గెడు నీరు కరువైంది. 48 గంటలుగా చుక్కనీరు రాకున్నా అధికారులు కనీస చర్యలు తీసుకోలేదు. దీంతో ఆగ్రహించిన విద్యార్థినులు మంగళవారం రాత్రి నిరసనకు దిగారు. సారూ... ఎండుతోంది నోరు... మమ్మల్ని కాస్త పట్టించుకోరూ.. అంటూ నినాదాలు చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ బుధవారం ఎస్వీయూ బంద్‌కు పిలుపునిచ్చారు. - రెండు రోజులుగా మహిళా హాస్టల్లో నీటికొరత - మంగళవారం రాత్రి విద్యార్థులు ఆందోళన - నచ్చజెప్పే ప్రయత్నం చేసిన రిజిస్ట్రార్ - శాంతించని విద్యార్థినులు, నేడు ఎస్వీయూ బంద్ యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీ మహిళా హాస్టల్లో రెండు రోజులుగా నీటికొరత తీవ్రమైంది. మంగళవారం చుక్కనీరు కూడా దొరకని పరిస్థితి. తాగడానికి, బాత్రూమ్లో వాడకానికి నీరు లేవు. దీంతో మంగళవారం రాత్రి భోజనం తినేందుకు కూడా చుక్కనీరు లేదు. దీంతో ఆగ్రహించిన విద్యార్థునులు మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు. ప్రకాశం భవన్‌కు వెనుకవైపున ఉన్న మహిళ హాస్టళ్ల సముదాయ ప్రాంగణంలో విద్యార్థులు బైఠాయించి నినాదాలు చేశారు. చాలారోజులగా హాస్టల్లో ఇదే పరిస్థితి ఉన్నా.. వార్డన్లు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 1000 మంది ఉన్న హాస్టల్లో 9 మంది తాగునీటి కుళాయిలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. అలాగే గదికి ఇద్దరు ఉండాల్సిన రూముల్లో 7 నుంచి 9 మందికి కేటాయించారని చెప్పారు. దోమల భాద ఉన్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హాస్టల్లో భోజనం సరిగా లేదని ఆరోపించారు. వార్డన్‌ను తొలగించాలని డిమాండ్ చేశా రు. 2 గంటల పాటు ఆందోళన కొనసాగింది. మహి ళా హాస్టల్లో ఈ తరహా ఆందోళన జరగడం ఇదే మొదటిసారి. దీంతో రిజిస్ట్రార్ దేవరాజులు, హాస్టల్‌కు చేరుకుని విద్యార్థులతో చర్చించారు. అయినా వారు శాంతించలేదు. దీంతో ఆయన నీరు తెప్పించే ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఈ అంశంపై వార్డన్ శకుంతల మాట్లాడుతూ నీటి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఈ ఆందోళనకు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు హేమంత్ యాదవ్, తేజ, కిశోర్, హేమంత్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సమస్యల పరిష్కరానికి బుధవారం పరిపాలనాభవనం వద్ద ఆందోళన చేస్తున్నట్లు , యూనివర్సిటీలో బంద్ పాటిస్తున్నట్లు విద్యార్థినులు పేర్కొన్నారు. -
అదే తంతు.. సాగునీటికి వంతు
గోదావరి డెల్టా ఆయకట్టుకు రబీ సాగులో ఈ ఏడాది నీటి ఇబ్బందులు తప్పేటట్టు లేవు. మార్చి నెలాఖరులోపు రబీ సాగు పూర్తి చేయాలని అధికారులు హెచ్చరిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. జనవరి నెలాఖరుకు గానీ పూర్తిస్థాయిలో నాట్లు పడే అవకాశం కనిపించడం లేదు. నీటి లభ్యత తక్కువగా ఉన్నందున ఈసారి వంతులవారీ విధానమే శరణ్యమని అధికారులు అంటున్నారు. * డెల్టా ఆయకట్టుకు వంతులవారీ విధానం తప్పదంటున్న అధికారులు *గత ఏడాదిలో పోలిస్తే 40 శాతం తక్కువగా వర్షపాతం * 8 నుంచి 10 టీఎంసీల నీటి కొరత * క్రాస్‌బండ్స్ వేసి ఇంజిన్లతో నీరు తోడేందుకు రూ.4.50 కోట్లు ఖర్చవుతాయని అంచనా కొవ్వూరు : 2014 రబీ సీజన్లో గోదావరి డె ల్టా పరిధిలో ఉభయ గోదావరి జిల్లాల్లో 8.96 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. మరో 1.16 లక్షల ఎకరాల్లో చేపల చెరువులున్నాయి. ఇప్పటి వరకు పశ్చిమ డెల్టా, తూర్పు డెల్టా పరిధిలో 35 శాతం చొప్పున నాట్లు వేయగా, సెంట్రల్ డెల్టాలో మాత్రం కేవలం 20 శాతం నాట్లు పడ్డాయి. పూర్తి స్థాయిలో నాట్లు పడడానికి మరో నెలరోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది కంటే వర్షపాతం 40 శాతం తక్కువగా నమోదైంది. దీంతో ఈసారి వంతుల వారీ విధానం అనివార్యంగా కనిపిస్తోంది. ఈ సీజన్లో 35 టీఎంసీల నీరు గోదావరిలో సహజ సిద్ధంగా లభిస్తుండగా మరో 40 టీఎంసీల నీరు సీలేరు నుంచి వస్తుందని అంచనా వేస్తున్నారు. అదనంగా ఎనిమిది నుంచి 10 టీఎంసీల నీరు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి నీటిలభ్యత సానుకూలంగా ఉన్నప్పటికీ నాట్లు ఆలస్యమైతే సాగునీటి ఇబ్బందులు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈనెల 13వ తేదీన భారీ నీటిపారుదల శాఖ మంత్రి ధవళేశ్వరంలో జరిపిన సమీక్షా సమావేశంలో రబీ సాగుకు సాగునీటి ఇబ్బందులు అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. దీనిలో భాగంగా సాగునీటి విడుదలను క్రమబద్ధీకరించేందుకు లస్కర్లను కాంట్రాక్టు పద్ధతిపై నియమించాలని ఆదేశించారు. ప్రస్తుతం గోదావరికి ఇన్‌ఫ్లో జలాలు 10వేల క్యూసెక్కులు వస్తాయని అంచనా వేయగా 11,900 క్యూసెక్కుల నీరు లభ్యమవుతుందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈనెలాఖరు నాటికి 60 శాతం మేరకు నాట్లు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జనవరి నెలాఖరు నాటికి నాట్లు పూర్తయితే మేనెలాఖరు నాటికి గానీ పంట చేతికి అందదు. మార్చి నుంచి వేసవి తీవ్రత పెరగడంతో సాగునీరు అధికంగా అవసరమవుతుంది. పంట పొట్టదశలో ఉన్న సమయంలో నీటిఎద్దడి తలెత్తితే దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉండడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. సరాసరి రోజుకి 10వేల క్యూసెక్కుల నీరు అవసరం ప్రస్తుతం సీలేరు విద్యుత్ ఉత్పత్తిని బట్టి 2,800 నుంచి 3,500 క్యూసెక్కుల జలాలు లభ్యం అవుతున్నాయి. సహజ జలాలు ఎనిమిది నుంచి తొమ్మిది వేల క్యూసెక్కులు అందుతున్నాయి. జనవరి నుంచి ఐదు నుంచి ఆరు వేల క్యూసెక్కుల సహజ జలాలు మాత్రమే లభ్యమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సరాసరి రోజూ 10వేల క్యూసెక్కుల నీరుసాగు అవసరం. డిసెంబర్ నుంచి సహజ జలాలు తగ్గే అవ కాశం ఉండడంతో సీలేరు జలాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. కనీసం సహజ జలాలు, సీలేరుతో కలిపి తొమ్మిది వేల క్యూసెక్కులు ఉంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదు. ఫిబ్రవరి నెలలో రబీ పంట ఈనిక దశలో ఉంటుంది కనుక 11 నుంచి 12 వేల క్యూసెక్కుల వరకు నీరు అవసరం అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఆ సమయంలో నీటి పొదుపును పాటించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు రూ.4.50 కోట్లతో ప్రతిపాదనలు గోదావరి డెల్టా కాలువలకు క్రాస్బండ్ల ఏర్పాటు, ఇంజన్ సాయంతో నీరు తోడడం, కాలువల్లో తూడు తొలగింపు తదితర పనులకు రూ.4.50 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. నీటిఎద్దడి అధిగమించేందుకు అవసరమైతే వంతులవారీ విధానం అమలు చేస్తాం. దుబారాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్ధితుల్లోను మార్చి నెలాఖరు నాటికి కాలువలకు నీటి విడుదల నిలిపివేయాలి. లేదంటే వచ్చే ఖరీఫ్ సీజన్‌కు కాలువలకు, లాకులకు మరమ్మతులు చేపట్టే అవకాశం ఉండదు. -సుగుణాకరరావు, ఎస్ఈ, నీటిపారుదల శాఖ హెడ్ వర్క్సు.