చుక్క మంచి నీరు కూడా వృధా చేయొద్దు: సీఎం జగన్‌ | YS Jagan Meeting With IDE Technology Deputy CEO Leahy Torrenstein | Sakshi
Sakshi News home page

చుక్క మంచి నీరు కూడా వృధా చేయొద్దు: సీఎం జగన్‌

Published Wed, Feb 26 2020 5:15 PM | Last Updated on Wed, Feb 26 2020 6:07 PM

YS Jagan Meeting With IDE Technology Deputy CEO Leahy Torrenstein - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నీటి కొరతను ఎదుర్కోవడానికి, సముద్రపు నీటిని డీశాలినేషన్‌ చేసి వినియోగించడంపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇజ్రాయెల్‌ కంపెనీ ఐడీఈ టెక్నాలజీస్‌ డిప్యూటీ సీఈఓ లీహి టోరెన్‌స్టైన్, ఇతర ప్రతినిధులు సీఎం జగన్‌తో బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. మంచి నీటిని ఒక్క బొట్టు కూడా వృథా చేయకూడదని తెలిపారు. అందుకోసమే డీశాలినేషన్‌ నీటిపై దృష్టిపెట్టామని ఆయన అన్నారు. ఇజ్రాయెల్‌ మొత్తం డీశాలినేషన్‌ నీటినే వినియోగిస్తోందని సీఎం గుర్తు చేశారు. పారిశ్రామిక అవసరాలకు డీశాలినేషన్‌ నీటినే వినియోగించాలన్నారు. అవసరమైన పక్షంలో తాగునీటి అవసరాలకోసం కూడా వినియోగించే పరిస్థితి ఉండాలని ఆయన తెలిపారు. ఆ మేరకు డీశాలినేషన్‌ ప్లాంట్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకునేట్టు ఉండాలన్నారు. ఎక్కడెక్కడ డీశాలినేషన్‌ ప్లాంట్లు పెట్టాలి అన్నదానిపై అధ్యయనం చేసి, ఆ మేరకు నివేదికలు ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులను సీఎం జగన్‌ కోరారు. (విద్యుత్‌ రంగంలో పెట్టుబడులే లక్ష్యం: సీఎం జగన్‌)

మొదటగా విశాఖపట్నంతో ప్రారంభించి దశలవారీగా దానిని విస్తరించుకుంటూ వెళ్లాలని సీఎం జగన్‌ అన్నారు. విశాఖపట్నం, తడ, కృష్ణపట్నం తదితర ప్రాంతాల్లో డీశాలినేషన్‌ నీటినే వినియోగించేలా చూడాలన్నారు. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌కు డీశాలినేషన్‌ లేదా శుద్ధిచేసిన నీటినే వాడాలని సూచించారు. అలాగే రాష్ట్రంలోని థర్మల్‌ ప్లాంట్లు కూడా డీశాలినేషన్‌ నీటిని వినియోగించేలా ప్రణాళిక తయారు చేయాలని అధికారులకు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న మురుగునీటి శుద్దికి అవుతున్న ఖర్చు, టెక్నాలజీ పైన కూడా దృష్టిపెట్టాలన్నారు. డీశాలినేషన్‌ ప్లాంట్ల సాంకేతికత, నిర్వహణ, ఖర్చులపై సమగ్ర వివరాలను ఇవ్వాలని సీఎం జగన్‌ ఐడీఈ టెక్నాలజీస్‌ ప్రతినిధులను కోరారు. విశాఖపట్నం సహా ఆయా ప్రాంతాలను పరిశీలించి ఆ మేరకు నివేదికలు రూపొందించాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. పరిశ్రమలకు ఏ ప్రమాణాలతో నీరు కావాలో నిర్ణయించి ఆ మేరకు డీశాలినేషన్‌ అవుతున్న ఖర్చు, నిర్వహణ తదితర అంశాలన్నీ నివేదికలో పొందుపరచాలన్నారు.

సీఎం జగన్‌ ప్రయత్నం హర్షణీయం: ఐడీఈ టెక్నాలజీస్
ఇండియా అనేక రకాలుగా నీటి కొరతను ఎదుర్కొంటోందని, నీటి భద్రత అనేది చాలా ముఖ్యమని ఇజ్రాయెల్‌ ఐడీఈ టెక్నాలజీస్‌ ప్రతినిధుల బృందం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో నీటి కొరతను తీర్చడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నం హర్షణీయమన్నారు. ఇజ్రాయెల్, భారత్‌ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. 1964 లో తొలిసారిగా కమర్షియల్‌ డీశాలినేషన్‌ ప్లాంటును ఇజ్రాయెల్‌లో పెట్టామని పేర్కొన్నారు. ఐడీఈ టెక్నాలజీస్‌ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తోందని గుర్తు చేశారు. నాలుగు దశాబ్దాలుగా 40 దేశాల్లో 400కు పైగా ఈ ప్లాంట్లను నిర్వహిస్తున్నామని ప్రతినిధుల బృందం తెలిపింది.

భారత్‌తోపాటు చైనా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో తమ కంపెనీ కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిపారు. భారత్‌లో 25 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. డీశాలినేషన్‌ ప్లాంట్ల వల్ల పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందని.. ఉద్యోగాలు వచ్చి ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. సముద్రపునీటిని డీశాలినేషన్‌ చేయడంతో పాటు కలుషిత నీటిని కూడా శుద్ధిచేయడంలో అత్యుత్తమ సాంకేతిక విధానాలను అవలంభిస్తున్నామని ఐడీఈ టెక్నాలజీస్‌ బృందం తెలిపింది. ఎస్సార్, రిలయన్స్‌ కంపెనీల్లో ఇండస్ట్రియల్‌ మురుగు నీటి శుద్ధికేంద్రాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. శుద్ధిచేసిన మురుగు నీటిని పరిశ్రమలు వినియోగించుకుంటున్నాయిని వారు తెలిపారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement