సుజలం..విఫలం
జిల్లాలో 513 ప్లాంట్లకు ప్రతిపాదనలు
నిర్మించింది 31.. పనిచేసేవి సగమే
విద్యుత్ బిల్లుల రాయితీ ఇవ్వని వైనం
నీటి కొరతతో మూతపడిన ప్లాంట్లు
గిట్టుబాటు కావడం లేదంటూ దాతల వెనుకంజ
జిల్లాలో ఎన్టీఆర్ సుజల పథకం అమలు నీటిమీద రాతగానే మిగిలిపోయింది. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించి ప్లాంట్లు ఏర్పాటుచేసే బాధ్యతను దాతలకు వదిలేసింది. నీటి కొరత, సర్కారు నుంచి ఆర్థిక తోడ్పాటు లేకపోవడంతో దాతలు కూడా ముందుకురాని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్లాంట్ల ఏర్పాటు ఎక్కడవేసిన గొంగళి అక్కడే.. చందంగా మారింది. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటడం, కాలువల ద్వారా నీరు అందకపోవడంతో తాగునీటి చెరువులు ఎండిపోయి జిల్లావ్యాప్తంగా తాగునీటి సమస్య తాండవిస్తోంది. కనీసం ఇప్పుడైనా సుజల పథకానికి జీవం పోస్తే మంచినీటి సమస్యను అధిగమించవచ్చు.
మచిలీపట్నం : జిల్లాలో ఎన్టీఆర్ సుజల పథకం కింద 513 ప్లాంట్లు ఏర్పాటుచేస్తున్నట్లు గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. వీటిలో ఇప్పటివరకు కేవలం 31 ప్లాంట్లు మాత్రమే ఏర్పాటయ్యాయి. ఇందులో సగం పనిచేయని పరిస్థితి నెలకొంది. ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్లలో విద్యుత్‌ను వినియోగించుకుంటే యూనిట్‌కు రూ. 6.25 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇందులో ఒక్కొక్క యూనిట్‌కు రూ. 4 ప్రభుత్వం రాయితీగా ఇస్తామని ప్రకటించింది. అది అందకపోవడంతో సొంత ఖర్చుతో ప్లాంట్లు ఏర్పాటుచేసిన నిర్వాహకులకు నెలనెలా చేతిచమురు వదులుతోంది. పంచాయతీల ద్వారా ఎన్టీఆర్ సుజల పథకాలకు నీటిని సరఫరా చేయాల్సిఉంది 31 ప్లాంట్లలో కొన్నిచోట్ల నీటి కొరత వేధిస్తోంది. వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు కొందరు దాతలు ముందుకు వచ్చినా ప్రభుత్వపరంగా ఆర్థికపరమైన తోడ్పాటు ఇవ్వని పరిస్థితి ఉంది. సుజల పథకం ద్వారా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే ఆయా గ్రామాల్లో ఉన్న పరిస్థితులను బట్టి రూ. 70 వేల నుంచి రూ. 2 లక్షల వరకు ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దాతలు వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రాని పరిస్థితి ఉందని వారు చెబుతున్నారు. ఈ వాటర్ ప్లాంట్ల ఏర్పాటు తన పని కాదన్నట్లుగా ప్రభుత్వం వదిలేసింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వాటర్‌ప్లాంట్ల ఏర్పాటు, వాటి నిర్వహణ తీరు ఇలా ఉంది.
పెడన నియోజకవర్గంలో 88 పంచాయతీలు, 140 గ్రామాలు ఉన్నాయి. బంటుమిల్లి మండలంలో ఐదు, కృత్తివెన్నులో ఒక ప్లాంట్ ఏర్పాటుచేశారు. ఇవి సక్రమంగానే నడుస్తున్నాయి. పెడన పురపాలక సంఘంలో ఒక్క ప్లాంట్‌నూ ఏర్పాటు చేయలేదు.
కైకలూరు నియోజకవర్గంలోని తామరకొల్లులో ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్‌ను ఏబీసీ ట్రస్టు ద్వారా రూ. 7 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. పంచాయతీ నుంచి నిధులు ఇవ్వకపోవడం, భూగర్భ జలాలు ఉప్పగా ఉండడంతో ఈ ప్లాంట్ నిర్వహణ కష్టంగా మారి మూతపడింది.
గన్నవరం నియోజకవర్గంలో ఎనిమిది వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో ఉంగుటూరు మండలం కొట్టిపాడు, తరిగొప్పులలోని ప్లాంట్లు పనిచేయడం లేదు. గన్నవరం మండలంలోని రామచంద్రాపురం, చిక్కవరం, అల్లాపురం ప్లాంట్లు పనిచేస్తున్నాయి.
నూజివీడు నియోజకవర్గం నూజివీడు మండలం రామన్నగూడెం గ్రామంలో ఒకే ఒక్క ప్లాంట్ ఉంది. బోరు నీరు అందుబాటులో లేకపోవడంతో అది కూడా పనిచేయడం లేదు.
తిరువూరు నియోజకవర్గంలో మూడు ప్లాంట్లు ఉన్నాయి. గంపలగూడెం మండలం గోసవీడు, తిరువూరు పట్టణంలో రెండు ప్లాంట్లు ఉన్నాయి. విద్యుత్ బిల్లులు ఇవ్వకపోవడంతో నిర్వాహకులపై ఆర్థిక భారం పడుతోంది. నెల నెలా నిర్వహణ వ్యయం అధికమవుతోందని, ఇక భరించలేమని వారు చెబుతున్నారు.
నందిగామ నియోజకవర్గంలో 94 గ్రామాలు ఉండగా కంచికచర్లలో నాలుగు, వీరులపాడులో ఒక వాటర్ ప్లాంట్ ఉన్నాయి. నీటి కోసం ప్రజలు ప్లాంట్లకు వెళుతున్నా అందించలేని పరిస్థితి నెలకొంది.
జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఆరు ప్లాంట్లు ఉన్నాయి. చిలకల్లు, బూదవాడ, లింగాల ప్రాంతాల్లో ప్లాంట్లు సక్రమంగానే పనిచేస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు సక్రమంగా పనిచేయడం లేదు. శుద్ధి చేసిన నీటి కోసం ఎదురుచూస్తున్నా వాటర్ ప్లాంట్లు ఏర్పాటుచేయని పరిస్థితి నెలకొంది.