NTR Sujala Scheme
-
ఎన్నికల పథకం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎన్నికలప్పుడు టీడీపీ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆయన పేరుచెప్పి ఓట్లు పొందే ఎత్తుగడకు దిగుతుంది. కానీ ఎన్టీఆర్ అంటే టీడీపీకి ఏమాత్రం ప్రేమ లేదనడానికి ఆయన పేరుతో ప్రభుత్వం నెలకొల్పిన ఎన్టీఆర్ సుజల పథకం అమలుతీరే నిదర్శనం. బాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ప్రతి ఇంటికీ రెండు రూపాయలకే 20 లీటర్ల సురక్షిత తాగునీరందిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ఎన్టీఆర్ సుజల పథకం అని నామకరణం చేశారు. అసలే ఫ్లోరైడ్‌తో అష్టకష్టాలు పడుతున్న ప్రకాశం జిల్లాకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని అందరూ ఆశించారు. అయితే బాబు నాలుగేళ్ల పాలన ముగిసినా ఈ పథకం ద్వారా జిల్లావాసులకు గుక్కెడు నీరందలేదు. ఇప్పుడు మళ్లీ ఎన్నికల ఏడాది కావడంతో జిల్లాలో ఎన్టీఆర్ సుజల పథకం ప్రవేశపెడుతున్నట్లు సర్కార్ ప్రచారం మొదలు పెట్టింది. ప్రకాశం జిల్లాలో 8,60,423 కుటుంబాల పరిధిలో 33,97,448 జనాభా ఉన్నారు. అధికారంలోకి వస్తూనే ప్రతి కుటుంబానికి రెండు రూపాయలకే 20 లీటర్ల శుద్ది జలం ఇస్తామని బాబు ప్రకటించారు. తాగునీటిని అందరికీ అందుబాటు లోకి తెస్తామన్నారు. బాబు పాలనకు నాలుగేళ్లు నిండాయి. ఇప్పటికీ జిల్లాలో ఎన్టీఆర్ సుజల పథకం కింద చుక్క నీరివ్వలేదు. జిల్లాలో ముఖ్యంగా పశ్చిమప్రకాశంలోని దర్శి, మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కందుకూరు, కనిగిరి నియోజకవర్గాల్లో తాగునీటి కష్టాలు అధికంగా ఉన్నాయి. వెయ్యి అడుగుల మేర బోరుబావులు తవ్వినా నీరు దొరికే పరిస్థితి లేదు. పైగా ఆ స్థాయిలో భూగర్భ జలం అరకొరగా పైకి వచ్చినా ప్లోరైడ్ శాతం అధికంగా ఉంటుంది. నీటిని తాగితే ప్లోరోసిస్ తో పాటు కిడ్నీ వ్యాధికి గురికావాల్సి వస్తోంది. దీంతో ఇప్పటికే జిల్లాలో వందలాది మంది మృతి చెందగా వేలాది మంది వ్యాధికి గురై బాధ పడుతున్నారు. ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా తాగునీరందుతుందని అందరూ ఎదురు చూశారు. ఇప్పటికీ పథకం ఊసేలేదు. ఎన్టీఆర్ సుజల పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శలు రావడంతో దాతలను వెతికి పథకాన్ని రన్ చేయాలని ప్రభుత్వం గ్రామీణ తాగునీటి పథకం అధికారులను ఆదేశించింది. అయితే ఈ ప్రయత్నం వికటించింది. మేము దానమిచ్చి ఎన్టీఆర్ పేరెందుకు పెట్టుకుంటామంటూ చాలా మంది దాతలు ముఖం చాటేశారు. ఆ తరువాత పథకాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇటీవల ప్రతిపక్ష వైఎస్సార్సీపీ తో పాటు అన్ని పక్షాలు బాబు నెరవేర్చని వాగ్దానాలతో పాటు ఎన్టీఆర్ పేరుతో పెట్టిన సుజలపథకాన్ని ప్రభుత్వం అటకెక్కించిందని విమర్శలు చేశారు. విమర్శల దాడి పెరగడం, ఎన్నికల ఏడాది కావడంతో ఇప్పడు చంద్రబాబు ప్రభుత్వం ఎన్టీఆర్ సుజల పథకాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. ప్రకాశం జిల్లాలో ఆరు నియోజకవర్గాల పరిధిలో బేస్తవారిపేట, గిద్దలూరు, రాచర్ల, కంభం, కొమరోలు, సీఎస్‌పురం, దొనకొండ, దోర్నాల, మార్కాపురం, పెద్దారవీడు, పుల్లలచెరువు, తర్లుపాడు, యర్రగొండపాలెం, దర్శి, ముండ్లమూరు, పీసీపల్లి, పొదిలి, కందుకూరు తదితర 18 మండల కేంద్రాల్లో శుద్ధజల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల అధికారులు ప్రకటించారు. ఇందు కోసం రూ.64.01 కోట్లు మంజూరు చేసి టెండర్ల పిలిచినట్లు ప్రకటించారు. శుద్ధజల కేంద్రాలకు పుష్కలంగా నీరు అవసరం. గంటకు 20 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న బోరుబావులు తవ్వాల్సి ఉంది. అలా అయితేనే 10 వేల లీటర్ల సురక్షిత నీరు వస్తుంది. అప్పుడే ప్రజలకు నీటిని అందించే అవకాశం ఉంటుంది. పశ్చిమ ప్రకాశంలో పుష్కలంగా నీరున్న ప్రాంతాలు అరుదు. దీంతో ఈ పథకం పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒకట్రెండు చోట్ల నీరున్న ప్రాంతాలు దొరికినా.. బోరు బావుల తవ్వకం, శుద్ధజల కేంద్రాల ఏర్పాటు, మారుమూల గ్రామాలకు పైప్లైన్ల నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి లేదు. ఈ పథకం అమలుకు రెండేళ్లు పట్టే అవకాశం ఉంది. ఈ లెక్కన ఫ్లోరోసిస్ ప్రాంతాలకు ఎన్టీఆర్ సుజలం పేరుతో సురక్షిత నీరు అందిస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరే అవకాశం లేదు. ఇది ఎన్నికల ప్రచారం కోసమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పసుపు క్యాన్ కొంటేనే ‘సుజలధార’
కాశీబుగ్గ : పసుపు క్యాన్‌కు రూ.400 చెల్లిస్తేనే ఎన్టీఆర్ సుజల తాగునీరు అందించే కార్డు అందజేస్తామని నిర్వాహకులు తేల్చిచెప్పడంతో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రజలు విస్తుపోతున్నారు. మున్సిపాలిటీలో 11 చోట్ల, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో 6 చోట్ల సుజలధార పథకాలు ఏర్పాటు చేశారు. తాగునీరు కావాలంటే రూ.400 చెల్లించి పసుపు ట్యాంకు తమ వద్దే కొనుగోలు చేయాలని నిర్వాహకులు చెబుతుండటంతో ప్రజలు మండిపడుతున్నారు. తమవద్ద పాత క్యాన్లు ఉన్నాయని చెబుతున్నా వినడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు కూడా ముఖం చాటేస్తుండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక జన్మభూమి కమిటీ సభ్యులు తమ చేతికి మట్టి అంటకుండా కొంతమంది వ్యక్తులను నియమించి ఈ ట్యాంకులను ఒకొక్కటి రూ.400 చొప్పున అమ్ముతున్నారు. పలాస ప్రభుత్వ ఆసుపత్రి, పురుషోత్తపురం, పలాస హైస్కూల్, మున్సిపల్ కార్యాలయాల వద్ద ఈ వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు దృష్టి సారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం రెండు రూపాయలకే 20 లీటర్లు తాగునీరు అందిస్తామని ఏర్పాటుచేసి ప్రారంభించిన నిర్వాహకులు ఇప్పుడు పసుపు క్యాన్ కొనుగోలు చేస్తేనే తప్ప కార్డు ఇవ్వమని చెబుతుండటం తగదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలనని పలువురు కోరుతున్నారు. -
సుజలం..విఫలం
జిల్లాలో 513 ప్లాంట్లకు ప్రతిపాదనలు నిర్మించింది 31.. పనిచేసేవి సగమే విద్యుత్ బిల్లుల రాయితీ ఇవ్వని వైనం నీటి కొరతతో మూతపడిన ప్లాంట్లు గిట్టుబాటు కావడం లేదంటూ దాతల వెనుకంజ జిల్లాలో ఎన్టీఆర్ సుజల పథకం అమలు నీటిమీద రాతగానే మిగిలిపోయింది. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించి ప్లాంట్లు ఏర్పాటుచేసే బాధ్యతను దాతలకు వదిలేసింది. నీటి కొరత, సర్కారు నుంచి ఆర్థిక తోడ్పాటు లేకపోవడంతో దాతలు కూడా ముందుకురాని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్లాంట్ల ఏర్పాటు ఎక్కడవేసిన గొంగళి అక్కడే.. చందంగా మారింది. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటడం, కాలువల ద్వారా నీరు అందకపోవడంతో తాగునీటి చెరువులు ఎండిపోయి జిల్లావ్యాప్తంగా తాగునీటి సమస్య తాండవిస్తోంది. కనీసం ఇప్పుడైనా సుజల పథకానికి జీవం పోస్తే మంచినీటి సమస్యను అధిగమించవచ్చు. మచిలీపట్నం : జిల్లాలో ఎన్టీఆర్ సుజల పథకం కింద 513 ప్లాంట్లు ఏర్పాటుచేస్తున్నట్లు గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. వీటిలో ఇప్పటివరకు కేవలం 31 ప్లాంట్లు మాత్రమే ఏర్పాటయ్యాయి. ఇందులో సగం పనిచేయని పరిస్థితి నెలకొంది. ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్లలో విద్యుత్‌ను వినియోగించుకుంటే యూనిట్‌కు రూ. 6.25 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇందులో ఒక్కొక్క యూనిట్‌కు రూ. 4 ప్రభుత్వం రాయితీగా ఇస్తామని ప్రకటించింది. అది అందకపోవడంతో సొంత ఖర్చుతో ప్లాంట్లు ఏర్పాటుచేసిన నిర్వాహకులకు నెలనెలా చేతిచమురు వదులుతోంది. పంచాయతీల ద్వారా ఎన్టీఆర్ సుజల పథకాలకు నీటిని సరఫరా చేయాల్సిఉంది 31 ప్లాంట్లలో కొన్నిచోట్ల నీటి కొరత వేధిస్తోంది. వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు కొందరు దాతలు ముందుకు వచ్చినా ప్రభుత్వపరంగా ఆర్థికపరమైన తోడ్పాటు ఇవ్వని పరిస్థితి ఉంది. సుజల పథకం ద్వారా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే ఆయా గ్రామాల్లో ఉన్న పరిస్థితులను బట్టి రూ. 70 వేల నుంచి రూ. 2 లక్షల వరకు ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దాతలు వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రాని పరిస్థితి ఉందని వారు చెబుతున్నారు. ఈ వాటర్ ప్లాంట్ల ఏర్పాటు తన పని కాదన్నట్లుగా ప్రభుత్వం వదిలేసింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వాటర్ప్లాంట్ల ఏర్పాటు, వాటి నిర్వహణ తీరు ఇలా ఉంది. పెడన నియోజకవర్గంలో 88 పంచాయతీలు, 140 గ్రామాలు ఉన్నాయి. బంటుమిల్లి మండలంలో ఐదు, కృత్తివెన్నులో ఒక ప్లాంట్ ఏర్పాటుచేశారు. ఇవి సక్రమంగానే నడుస్తున్నాయి. పెడన పురపాలక సంఘంలో ఒక్క ప్లాంట్‌నూ ఏర్పాటు చేయలేదు. కైకలూరు నియోజకవర్గంలోని తామరకొల్లులో ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్‌ను ఏబీసీ ట్రస్టు ద్వారా రూ. 7 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. పంచాయతీ నుంచి నిధులు ఇవ్వకపోవడం, భూగర్భ జలాలు ఉప్పగా ఉండడంతో ఈ ప్లాంట్ నిర్వహణ కష్టంగా మారి మూతపడింది. గన్నవరం నియోజకవర్గంలో ఎనిమిది వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో ఉంగుటూరు మండలం కొట్టిపాడు, తరిగొప్పులలోని ప్లాంట్లు పనిచేయడం లేదు. గన్నవరం మండలంలోని రామచంద్రాపురం, చిక్కవరం, అల్లాపురం ప్లాంట్లు పనిచేస్తున్నాయి. నూజివీడు నియోజకవర్గం నూజివీడు మండలం రామన్నగూడెం గ్రామంలో ఒకే ఒక్క ప్లాంట్ ఉంది. బోరు నీరు అందుబాటులో లేకపోవడంతో అది కూడా పనిచేయడం లేదు. తిరువూరు నియోజకవర్గంలో మూడు ప్లాంట్లు ఉన్నాయి. గంపలగూడెం మండలం గోసవీడు, తిరువూరు పట్టణంలో రెండు ప్లాంట్లు ఉన్నాయి. విద్యుత్ బిల్లులు ఇవ్వకపోవడంతో నిర్వాహకులపై ఆర్థిక భారం పడుతోంది. నెల నెలా నిర్వహణ వ్యయం అధికమవుతోందని, ఇక భరించలేమని వారు చెబుతున్నారు. నందిగామ నియోజకవర్గంలో 94 గ్రామాలు ఉండగా కంచికచర్లలో నాలుగు, వీరులపాడులో ఒక వాటర్ ప్లాంట్ ఉన్నాయి. నీటి కోసం ప్రజలు ప్లాంట్లకు వెళుతున్నా అందించలేని పరిస్థితి నెలకొంది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఆరు ప్లాంట్లు ఉన్నాయి. చిలకల్లు, బూదవాడ, లింగాల ప్రాంతాల్లో ప్లాంట్లు సక్రమంగానే పనిచేస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు సక్రమంగా పనిచేయడం లేదు. శుద్ధి చేసిన నీటి కోసం ఎదురుచూస్తున్నా వాటర్ ప్లాంట్లు ఏర్పాటుచేయని పరిస్థితి నెలకొంది. -
సుజలమేదీ!
మొక్కుబడిగా ఎన్టీఆర్ సుజల పథకం రూ.2కే 20 లీటర్ల నీరు హామీకి మంగళం పట్టించుకోని ప్రభుత్వం ముందుకు రాని దాతలు మంచి నీరందక రోగాల బారిన జనం చాలా గ్రామాల్లో ఫ్లోరైడ్ నీళ్లే దిక్కు ‘‘తాగునీటిని వారం రోజు ల పాటు నిల్వ ఉంచుకుని తాగడం వల్లే రోగాలు వస్తాయి. నీటిని నిల్వ ఉంచుకుని వాడుకోకూడదు’’ అని వైద్యులతోపాటు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెబుతున్నారు. చిత్తూరు : ప్రతిరోజూ స్వచ్ఛమైన మంచి నీటిని అందిస్తే ప్రజలు ఆ నీటినే సేవించేవారు. కానీ జిల్లాలో వారం రోజుల కొకమారు మాత్రమే ప్రజలకు తాగునీరు అందుతోంది. దొరికిన నీటిని నిల్వ ఉంచుకుని జాగ్రత్తగా వాడుకోవాల్సి వస్తోంది. ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా ప్రజ లందరికీ రూ.2లకే 20 లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తానని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించి ఏడాది ముగుస్తోంది. ఈ పథకం ద్వారా తాగునీరు పూర్తిస్థాయిలో సరఫరా చేయడం లేదు. జిల్లాలో తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీరే దిక్కు. చివరకు ఆ ప్రాంతాల్లో కూడా సుజలం అందడం లేదు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. తొలుత ప్రభుత్వమే ప్రజలకు స్వచ్ఛమెన నీటిని అందిస్తుందని ప్రకటించారు. ఇప్పుడు మాట మార్చారు. ఎన్టీఆర్ సుజల పథకానికి ఒక్కపైసా నిధులు కూడా వెచ్చించేందుకు ప్రభుత్వం ససేమిరా అంటోంది. దాతలు ముందుకొస్తే తప్ప ఈ పథకాన్ని కొనసాగించలేమని తేల్చి చెప్పింది. దాతలు నామమాత్రంగా కూడా ముందుకు రాకపోవడంతో ఈ పథకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయింది. ఇప్పటివరకు జిల్లాలో కుప్పంలో 18 ప్లాంట్లు, చిత్తూరులో 3, శ్రీకాళహస్తిలో 4, నగరిలో 2, పలమనేరు, పుంగనూరు, సత్యవేడు, చంద్రగిరి నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున ఎన్టీఆర్ సుజల పథకం ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కుప్పం మినహా మిగిలిన ప్రాంతాల్లో ఈ ప్లాంట్లు పూర్తిస్థాయిలో నడిచే పరిస్థితి లేకుండా పోయింది. గంటకు 500 లీటర్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ ఏర్పాటుకు రూ.1.5లక్షలు ఖర్చు కాగా, 2వేల లీటర్ల సామర్థ్యం ప్లాంట్‌కు రూ.3.5లక్షలు వెచ్చించాల్సి ఉంది. పెద్ద ప్లాంట్లు కాకుండా చిన్న చిన్న ప్లాంట్ల ఏర్పాటు చేసేందుకైనా దాతలను వెతకమని అధికారులను ఆదేశించింది. దీంతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో చిన్న చిన్న పారిశ్రామికవేత్తలతో పాటు ఆర్థిక సామర్థ్యం కలిగిన వారితో పలుమార్లు సమావేశాలు నిర్వహించి ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే ఎవరూ ముందుకు రాలేదు. పైగా ఎన్టీఆర్ పేరు పెట్టుకుని ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా మేమెందుకు నిధులు ఖర్చు పెట్టాలంటూ కొందరు అధికారులను నిలదీశారు. దీంతో ఈ పథకం అటకెక్కింది. ఫ్లోరైడ్ ప్రాంతాల్లో మొదటి ప్రాధాన్యత కింద వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ తరువాత ఆ హామీని గంగలో కలిపింది. జిల్లా ప్రజల సంగతి దేవుడెరుగు కనీసం ఫ్లోరైడ్ ప్రాంతాల్లోనైనా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీటిని అందిస్తారనుకుంటే అధికారులు ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. జిల్లా ప్రజలు ఓవైపు ఫ్లోరైడ్ నీరు, మరోవైపు వారానికి ఒకమారు వచ్చే నీటిని తాగి అనారోగ్యం బారిన పడుతున్నారు. జిల్లాకు సంబంధించి ప్రజల అవసరాల కోసం, అభివృద్ధి కోసం ఎన్ని కోట్లు నిధులైనా ఇస్తానని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి ఒట్టిమాటలతో సరిపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా దాతల సంగతి పక్కనపెట్టి ప్రభుత్వం ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని ప్రజలు కోరుతున్నారు. -
సుజలాం...విఫలాం..!
- ‘ఎన్టీఆర్ సుజలధార’పై చేతులెత్తేసిన సర్కార్ - రూ.2లకే 20 లీటర్ల మినరల్ వాటర్ ఎక్కడ? - గ్రామాల్లో కలుషిత జలాలే దిక్కు - ఆర్వో ప్లాంట్స్ లక్ష్యం 263, ఏర్పాటైంది...20 రాష్ర్టంలోని ఐదువేలకు పైగా గ్రామాల్లో ఇంటింటికీ మినరల్ వాటర్! రూ.2లకే 20 లీటర్ల నీరు. యువత, డ్వాక్రా సంఘాలు, ఎన్జీవోల భాగస్వామ్యంతో పటిష్టమైన తాగునీటి ప్రణాళిక! ఇదీ ‘ఎన్టీఆర్ సుజల’ కింద ముఖ్యమంత్రి చంద్రబాబు అట్టహాసంగా ప్రకటించిన పథకం. జిల్లా విషయానికి వస్తే ఈ పథకం అమలు కోసం 263 గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని తలపెట్టారు. అయితే ఇప్పటికి ఏర్పాటైనవి ఇరవయ్యే. దీనిని బట్టే ఈ పథకం తీరు ఎంత ఆర్భాటమో చెప్పకనే చెబుతోంది. ‘అధికారంలోకి రాగానే తాగునీటి కష్టాలు తీరుస్తాం....రక్షిత నీరు కాదు..ప్రతి ఒక్కరికి ఏకంగా మినరల్ వాటర్ అందిస్తాం..ప్రతి కుటుంబానికి రూ.2లకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తాం...’ అంటూ ఎన్నికల్లో ప్రచారం ఊదరగొట్టారు. తీరా అందలమెక్కిన తర్వాత ఎన్టీఆర్ సుజలధార పేరిట రూపాయి ఖర్చు లేకుండా ప్రణాళికలు సిద్ధం చేసిన సర్కార్ ఏడాదైనా నిర్ధేశిత లక్ష్యంలో కనీసం 10 శాతం ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేయలేకపోయింది. ఇక ప్రారంభమైన ప్లాంట్స్‌లో కూడా తరచూ సాంకేతిక లోపాలతో ముక్కుతూ..మూలుగుతూ నడుస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం : సొమ్ము ఒకడిది..సోకొకడది అన్నట్టుగా దాతల సహకారంతో ‘ఎన్టీఆర్ సుజలధార’ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. రక్షిత జలాలు పూర్తి స్థాయిలో అందని 263 గ్రామాల్లో ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి ఎంతగా ఒత్తిడి తీసుకొచ్చినా దాతల నుంచి కనీస స్పందన రాలేదు. ఈ గ్రామాల్లో ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు కోసం స్పాన్సర్లుగా 12 పారిశ్రామిక, సేవా సంస్థలను ఎంపిక చేశారు. తొలిదశలో రూ.ఐదుకోట్ల 98 లక్షల 83 వేల అంచనాతో 133 ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కానీ చివరి నిముషంలో దాతలు చేతులెత్తేయడంతో కనీసం మండలానికొకటి కాదు కదా కనీసం నియోజకవర్గానికి ఒకటైనా ఏర్పాటు చేసి పరువు నిలబెట్టుకోవాలని తలచారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో అక్టోబర్-2వ తేదీన అతికష్టమ్మీద 19 ఆర్వో ప్లాంట్స్‌ను ప్రారంభించగలిగారు. వీటిలో మెజార్టీ ప్లాంట్స్ సామర్ద్యం వెయ్యిలీటర్లే కావడం గమనార్హం. ఇవి కూడా రోజుకు కేవలం 755 కేన్స్(20 లీటర్ల)ను మాత్రమే సరఫరా చేయగలుగుతున్నాయి. ప్రకటనలకే పరిమితం అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబానికి రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తామన్న ప్రభుత్వ హామీ ఆచరణకు నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆర్వో ప్లాంట్స్‌కు నిధులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందా? అంటూ ప్రజలు మండిపడుతున్నారు. మిగిలిన ప్రతిపాదిత ప్లాంట్స్ కోసం అడిగితే ‘చూద్దాం....పెడతాం! అంటూ ప్రకటనలకే అధికార పార్టీ నేతలు పరిమితమవుతున్నారు. జిల్లాలోని 925 పంచాయతీల పరిధిలో రక్షిత నీరు 1669 పంచాయతీల్లో పూర్తి స్థాయిలోనూ, 3799 ఆవాస ప్రాంతాల్లో పాక్షిక స్థాయిలోనూ సరఫరా చేస్తున్నారు. రక్షిత నీటి వనరులు లేని గ్రామాలు 45 ఉండగా, అసలు నీటి వనరులే లేని గ్రామాలు 16 వరకు ఉన్నాయి. ఫ్లోరైడ్ జలాలే దిక్కు! ఇటీవల నిర్వహించిన సర్వేలో 45 గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉన్నట్టుగా గుర్తించారు. అంతేకాకుండా 500 చేతిపంపుల ద్వారా వచ్చే నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉందని నిర్ధారణకు వచ్చారు. ప్రత్యామ్నాయం లేక జిల్లాలో 50వేల మందికి పైగా ప్రజలు ఈ ఫ్లోరైడ్ నీటిని తాగుతూ రోగాల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు రూ.4727 కోట్లతో 13 గ్రిడ్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కనీసం రూ.2 లక్షల వ్యయం కాగల ఆర్వో ప్లాంట్స్కే నిధుల్లేనప్పుడు ఇన్ని రూ.వేల కోట్లతో ప్రభుత్వం వాటర్ గ్రిడ్స్ ఏ విధంగా ఏర్పాటు చేస్తుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏర్పాటైనవి కొన్ని..పనిచేసేవి ఎన్ని? ఆనందపురం, కశింకోట మండలాల్లో ఏర్పాటు చేసిన మూడు ప్లాంట్స్‌ను స్పాన్సర్స్ నిర్వహిస్తుండగా, మిగిలిన ప్రాంతాల్లోని ఆర్వో ప్లాంట్స్‌ను ఆయా గ్రామ పంచాయితీలే నిర్వహిస్తున్నాయి. అచ్యుతాపురం, రాంబిల్లి, చోడవరం మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్స్ ప్రారంభించిన కొద్దిరోజులకే మూలన పడ్డాయి. మిగిలినవాటి నిర్వహణ అధ్వానంగా ఉంది. మిగిలినపంచాయితీల్లో ప్రతిపాదిత ఆర్వోప్లాంట్స్ కోసం అడిగితే స్పాన్సర్స్ ఎవరూ ముందుకు రావడం లేదు. ఇటీవలే మరో తొమ్మిది ప్లాంట్స్ ఏర్పాటుకు వర్క్ ఆర్డర్స్ ఇచ్చారు. -
‘ఎన్టీఆర్ సుజల’ దాతలకే అంకితం!
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకొస్తే ప్రతి ఇంటికీ రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్‌ను అందజేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడీ హామీ అమలును పూర్తిగా దాతల దాతృత్వానికే వదిలేశారు. ఎంతో ఆర్భాటంగా ‘ఎన్టీఆర్ సుజల’ పథకాన్ని ప్రారంభించినప్పటికీ.. ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టట్లేదు. ఒక్కో గ్రామంలో ఈ పథకం ఏర్పాటు చేయాలంటే కనీసం రూ.పది లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని 12 వేలకుపైగా ఉన్న గ్రామపంచాయతీల్లో ఈ పథకాన్ని అమలు చేయాలంటే దాదాపు రూ.1,200 కోట్లు అవసరం. పథకాన్ని దశలవారీగా అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం 2015 మార్చినాటికి 5వేల గ్రామాల్లో దీన్ని ప్రారంభించాలని తొలుత ప్రణాళిక రూపొందించింది. అయితే దీనికి తానుగా నిధులు కేటాయించకుండా దాతల సాయంతో కొనసాగించాలని నిర్ణయించింది. గత బడ్జెట్లో రూ.ఐదున్నర కోట్లనే కేటాయించినా ఖర్చు చేయలేదు. దీంతో 5 వేల గ్రామాల్లో మంచినీటి ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్న లక్ష్యం నీరుగారింది. పట్టణాల్లో వాటితో కలిపి కేవలం 561 మంచినీటి ప్లాంట్లే ఏర్పాటయ్యాయి. బడ్జెట్లో ఈ పథకానికి కేవలం రూ.11 కోట్లు కేటాయించారు. ఈ పరిస్థితుల్లో దాతలు ముందుకొచ్చినా వెయ్యికన్నా మంచినీటి ప్లాంట్లు ఏర్పాటయ్యే అవకాశం లేదు. రాష్ట్రంలో పలుగ్రామాల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి కొనసాగుతుంటే టీడీపీ సర్కారు ఇచ్చిన ఎన్నికల హామీ అమలు నత్తనడకన కూడా సాగని పరిస్థితికి ఇది నిదర్శనం. -
సుజలం..అపహాస్యం
కాతేరు (రాజమండ్రి రూరల్) :ప్రజాప్రతినిధుల తీరు కారణంగా ఎన్టీఆర్ సుజల పథకం ప్రజల మధ్య అపహాస్యంపాలైంది. రాజమండ్రి రూరల్ మండలం కాతేరు గ్రామంలో ఇప్పటికే రూ.2కు 20 లీటర్ల మంచినీరు ఇస్తున్న పథకానికి.. ‘ఎన్టీఆర్ సుజల’గా పేరు పెట్టి ప్రారంభించడమే కాకుండా.. రూ.2కే మంచినీరు ఇస్తామంటూ ప్రజాప్రతినిధులు చెప్పడంతో ప్రజలు ముక్కున వేలు వేసుకునే పరిస్థితి ఏర్పడింది.2012లోనే ప్రారంభమైన పథకంకాతేరు ప్రజలకు సురక్షిత మంచినీరు అందించే ఉద్దేశ్యంతో బీజేపీ రాష్ట్ర నాయకుడు కంటిపూడి సర్వారాయుడు రూ.10 లక్షలతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. కంటిపూడి లక్ష్మణరావు అండ్ చెరుకూరి సత్యనారాయణమూర్తి మెమోరియల్ ట్రస్టు పేరుతో దీని నిర్మాణం చేపట్టి 2012 ఆగస్ట్ 13న ప్రారంభించారు. అప్పటినుంచీ గ్రామస్తులకు రూ.2కే 20 లీటర్ల మంచినీరు అందిస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఈ పథకాన్ని గ్రామ పంచాయతీకి అప్పగించారు. అప్పటినుంచీ దీనిని గ్రామస్తులు వినియోగించుకుంటున్నారు. పేరు మార్చి మళ్లీ ప్రారంభం కాతేరులో మంగళవారం ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం జరిగింది. దీనికిముందు కంటిపూడి లక్ష్మణరావు అండ్ చెరుకూరి సత్యనారాయణమూర్తి మెమోరియల్ ట్రస్టు స్థాపించిన వాటర్ప్ల్లాంట్కు ‘ఎన్టీఆర్ సుజల పథకం’ అంటూ ఫ్లెక్సీ తగిలించారు. గుమ్మానికి చకాచకా రిబ్బన్ కట్టేశారు. శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ చైతన్యరాజు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరుల సమక్షంలో రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ ఈ పథకాన్ని మరోసారి ప్రారంభించారు. ఈ తతంగం చూసి గ్రామస్తులు నివ్వెరపోయారు. రెండున్నరేళ్లుగా మంచినీరందిస్తున్న ప్లాంట్‌కు ఎన్టీఆర్ సుజల పథకం పేరు పెట్టి మళ్లీ ప్రారంభించడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. సురక్షిత మంచినీరు లభ్యం కాక కాతేరులోని మిలిటరీ కాలనీ, శాంతినగర్, దేవీనగర్, రావుగారు బిల్డింగ్స్ తదితర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటువంటిచోట్ల ‘సుజల’ ప్లాంట్ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి యానాపు యేసు అన్నారు. -
జన్మభూమి సభల్లో 19,600 పింఛన్ల పంపిణీ
సాక్షి, కాకినాడ: జిల్లాలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఇప్పటి వరకు 19,600 మందికి ఎన్టీఆర్ భరోసా కింద వృద్ధులు, వితంతువులకు రూ.వెయ్యి , వికలాంగులకు రూ.1500 వంతున పింఛన్లను పంపిణీ చేసినట్టు కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. జన్మభూమి-మావూరు కార్యక్రమాల వివరాలను మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో ఆమె వివరించారు. సోమవారం నాటికి జిల్లా వ్యాప్తంగా 9వేల వృద్ధాప్య పింఛన్లు, 6,465 వితంతు పింఛన్లు, 3,300 వికలాంగ పింఛన్లు, 796 చేనేత పింఛన్లు, 227 గీత కార్మికుల పింఛన్లను పంపిణీ చేశామన్నారు. జన్మభూమిలో 2,250 మొక్కలను నాటడంతో పాటు 137 ట్రీగార్డులను పంపిణీ చేసినట్టు చెప్పారు. ఇప్పటి వరకు జన్మభూమి గ్రామ, వార్డు సభల ద్వారా ప్రజల నుంచి 16,525 ఫిర్యాదులు, విజ్ఞాపనలను స్వీకరించినట్టు చెప్పారు. తొలి దశలో 73 సుజల ప్లాంట్లు ఎన్టీఆర్ సుజల పథకం కింద జిల్లాలో తొలిదశలో 304 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నప్పటికీ ఇప్పటివరకు 73 నెలకొల్పగలిగామని కలెక్టర్ నీతూప్రసాద్ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ పథకం అమలు పురోగతిపై జెడ్పీ చైర్మన్ నామన రాంబాబుతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాంట్ల ఏర్పాటులో రాష్ర్టంలో తూర్పుగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని, ఇదే స్పూర్తితో లక్ష్యాన్నిమించి 700 నుంచి 800 ప్లాంట్లు ఏర్పాటు చేయగలమన్న విశ్వాసం వచ్చిందని చెప్పారు. ఆర్వో ప్లాంట్లు 1500 లీటర్లు వాడితే అందులో 700 లీటర్లుశుద్ధి చేసిన నీరు రాగా, మిగిలిన 800 లీటర్ల నీరు వృధాగా పోకుండా చెట్ల పెంపకానికి, గృహాల్లో ఇతర అవసరాల వినియోగానికి మళ్లించాలని సూచించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ శ శాంక్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఆర్పీ నందారావు, ముఖ్యప్రణాళికాధికారి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
దాతలారా ... దయచేయండి
ఒంగోలు: కేవలం రెండు రూపాయలకే ప్రతి పల్లెకు 20 లీటర్ల మినరల్ వాటర్ అందజేస్తామని ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఇచ్చిన హామీ. ఈ పథకానికి పెట్టిన పేరు ‘ఎన్టీఆర్ సుజల పథకం’. చంద్రబాబు ప్రకటించిన అయిదు సంతకాల్లో ఇది కూడా ఒకటి. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 818, మున్సిపాల్టీల్లో 98 ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు వ్యయం కనీసంగా రూ.32 కోట్లు అవుతుందని భావిస్తున్నారు. నిర్మాణం ఇలా... ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సంబంధిత ఆవాస ప్రాంతంలో ఏదో ఒక ప్రభుత్వ భవనం లేదా కమ్యూనిటీ హాలులో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే దానికి తప్పనిసరిగా కరెంటు సౌకర్యం ఉండాలి. అక్టోబరు 2వ తేదీ అంటే గాంధీ జయంతి నాటికి ప్రతి మండలానికి కనీసం ఒక ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాలు అందాయి. కానీ చేతిలో దాతలు ఇచ్చే పైకం మాత్రం లేదు. ప్రతి గంటకు వెయ్యి లీటర్లను శుద్ధిచేసే ప్లాంట్‌కు కనీసంగా రూ.3 లక్షలు ఖర్చు అవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించాలంటే బిగ్‌షాట్సే లక్ష్యంగా పెట్టుకోవాలి. ప్రభుత్వంలోని పలు కీలకమైన విభాగాలకు ఈ బాధ్యత అప్పగిస్తున్నారు. ముఖ్యంగా గ్రానైట్ వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, వీటిని పర్యవేక్షించే శాఖాధికారులను అప్రమత్తం చేశారు. ఇక వ్యాపారులపై కూడా కన్ను పడింది. ఏదో ఓ లొసుగు బయటకు తీసి విరాళాల ఒత్తిడి తేవడానికి పక్కా ప్లాన్ తయారు చేసుకున్నారు టీడీపీ నేతలు. డబ్బు ఒకరిది ... డాబు మరొకరిది ... ఇదేమి పథకమంటూ ఇప్పటికే ఒత్తిడికి గురవుతున్న అజ్ఞాత దాతలు మదనపడుతున్నారు. -
‘ఎన్టీఆర్ సుజల’కు సహకరించండి
విజయవాడ : ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ సుజల పథకం నిర్వహణకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు తమవంతు సహకారం అందించాలని కలెక్టర్ రఘునందనరావు పిలుపునిచ్చారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువరం ఎన్టీఆర్ సుజల తాగునీటి పథకంపై జిల్లా అధికారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒకటి చొప్పున అక్టోబర్ 2న ప్రారంభించేందుకు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి ప్రజల తాగునీటి సమస్యపై దృష్టి సారించి ప్రతి ఇంటికి రూ.2 లకే 20 లీటర్ల మంచినీటిని అందించాలని నిశ్చయించారన్నారు. ఈ పథకంలో భాగంగా ఆగస్టు 30వ తేదీన విధి విధానాలతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులను చేస్తామని తెలిపారు. ఫేజ్-1లో ఐదు వేల గ్రామాల్లో ఈ పథకం ప్రారంభించాలని నిర్ణయించగా, జిల్లాలో 513 గ్రామాలను మొదటి దశకు ఎంపిక చేశామన్నారు. జిల్లాలో 221 ఆర్వో ప్లాంట్స్, ఒక ఇడియఫ్ ప్లాంట్స్, 291 అల్ట్రా ఫిల్ట్రేషన్ గ్రావిటి ఫిల్టర్ ప్లాంట్ల ఆవశ్యకత ఉన్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అమరేశ్వరరావు తెలిపారు. కలెక్టర్ పిలుపునకు స్పందన .... సమావేశంలో ఈ పథకాన్ని ప్రారంభించి రాష్ట్రానికే ఆదర్శ జిల్లాగా నిలపాలని ఇచ్చిన కలెక్టర్ పిలుపునకు నూజివీడు, తిరువూరు, గన్నవరం, జగ్గయ్యపేట, కైకలూరు, పెడన, మచిలీపట్నం, గుడివాడ, ఇబ్రహీంపట్నం తదితర నియోజకవర్గాల పరిధిలో ప్లాంట్ల నిర్వాహణకు సంబంధించి ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థల తరఫున హాజరైన ప్రతినిధుల ద్వారా ప్రకటించారు. జెడ్పీ సీఈవో డి.సుదర్శనం, జిల్లా పంచాయితీ అధికారి కె.చంద్రశేఖర్, జిల్లా ఇండస్ట్రీస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ సుజల పథకం కోసం సాంకేతిక నిపుణుల కమిటీ
హైదరాబాద్: ప్రతి ఇంటికీ రెండు రూపాయలకే ఇరువై లీటర్ల మంచినీటి క్యాన్ అందజేసేందుకు ఉద్దేశించిన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. పథకం అమలుకు విధివిధానాలు ఖరారు చేసేందుకు ముగ్గురు మంత్రుల ఉప సంఘం ఏర్పాటు కాగా.. మంత్రుల ఉప సంఘం ఈ సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయితీ రాజ్ రిటైర్టు సీఈ ఆర్. కొండలరావు చైర్మన్‌గా మొత్తం 8 మందిని ఈ కమిటీలో సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి జవహర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పథకం అమలులో నీటి శుద్ధి చేయడానికి ఏర్పాటు చేసే ఫ్లాంట్లకు ఎలాంటి మిషనరీలను ఉపయోగించాలి.. గ్రామాల్లో ఏర్పాటు చేసే ఫ్లాంట్‌కు ఎంత ఖర్చు అవుతుంది.. ఫ్లాంట్ నిర్వహణను మహిళా సంఘాలు, ఎన్జీవో సంస్థలను అప్పగిస్తే ఎలా ఉంటుందన్న తదితర అంశాలపై అధ్యయనం చేసి, వీలునుబట్టి జూలై పదవ తేదీలోగా కమిటీ తమ నివేదికను అందజేయాలని ప్రభుత్వం కోరింది. -
'2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్'
హైదరాబాద్: ప్రతి ఇంటికి 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. తొలి విడతలో 5,200 గ్రామాల్లో అమలు చేస్తామని ఆయన అన్నారు. అక్టోబర్ నుంచి ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభిస్తామని ఓ ప్రశ్నకు మంత్రి వివరణ ఇచ్చారు. ఈ పథక విధివిధానాలపై ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు అయ్యన్నపాత్రుడు తెలిపారు. ప్రతి పల్లెలో సురక్షిత తాగునీటిని తక్కువ ధరకే అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతి గ్రామంలో రూ.2కే 20 లీటర్ల సురక్షిత తాగునీరు అందించే కార్యక్రమాన్ని పటిష్టవంతంగా అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆధికారులకు అయ్యన్నపాత్రుడు ఆదేశాలు జారీ చేశారు.