సాక్షి, హైదరాబాద్: అధికారంలోకొస్తే ప్రతి ఇంటికీ రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్‌ను అందజేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడీ హామీ అమలును పూర్తిగా దాతల దాతృత్వానికే వదిలేశారు. ఎంతో ఆర్భాటంగా ‘ఎన్టీఆర్ సుజల’ పథకాన్ని ప్రారంభించినప్పటికీ.. ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టట్లేదు. ఒక్కో గ్రామంలో ఈ పథకం ఏర్పాటు చేయాలంటే కనీసం రూ.పది లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
రాష్ట్రంలోని 12 వేలకుపైగా ఉన్న గ్రామపంచాయతీల్లో ఈ పథకాన్ని అమలు చేయాలంటే దాదాపు రూ.1,200 కోట్లు అవసరం. పథకాన్ని దశలవారీగా అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం 2015 మార్చినాటికి 5వేల గ్రామాల్లో దీన్ని ప్రారంభించాలని తొలుత ప్రణాళిక రూపొందించింది. అయితే దీనికి తానుగా నిధులు కేటాయించకుండా దాతల సాయంతో కొనసాగించాలని నిర్ణయించింది.
గత బడ్జెట్‌లో రూ.ఐదున్నర కోట్లనే కేటాయించినా ఖర్చు చేయలేదు. దీంతో 5 వేల గ్రామాల్లో మంచినీటి ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్న లక్ష్యం నీరుగారింది. పట్టణాల్లో వాటితో కలిపి కేవలం 561 మంచినీటి ప్లాంట్లే ఏర్పాటయ్యాయి. బడ్జెట్‌లో ఈ పథకానికి కేవలం రూ.11 కోట్లు కేటాయించారు. ఈ పరిస్థితుల్లో దాతలు ముందుకొచ్చినా వెయ్యికన్నా మంచినీటి ప్లాంట్లు ఏర్పాటయ్యే అవకాశం లేదు. రాష్ట్రంలో పలుగ్రామాల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి కొనసాగుతుంటే టీడీపీ సర్కారు ఇచ్చిన ఎన్నికల హామీ అమలు నత్తనడకన కూడా సాగని పరిస్థితికి ఇది నిదర్శనం.