సుజలాం...విఫలాం..!
- ‘ఎన్టీఆర్ సుజలధార’పై చేతులెత్తేసిన సర్కార్
- రూ.2లకే 20 లీటర్ల మినరల్ వాటర్ ఎక్కడ?
- గ్రామాల్లో కలుషిత జలాలే దిక్కు
- ఆర్వో ప్లాంట్స్ లక్ష్యం 263, ఏర్పాటైంది...20
రాష్ర్టంలోని ఐదువేలకు పైగా గ్రామాల్లో ఇంటింటికీ మినరల్ వాటర్! రూ.2లకే 20 లీటర్ల నీరు. యువత, డ్వాక్రా సంఘాలు, ఎన్జీవోల భాగస్వామ్యంతో పటిష్టమైన తాగునీటి ప్రణాళిక! ఇదీ ‘ఎన్టీఆర్ సుజల’ కింద ముఖ్యమంత్రి చంద్రబాబు అట్టహాసంగా ప్రకటించిన పథకం. జిల్లా విషయానికి వస్తే ఈ పథకం అమలు కోసం 263 గ్రామాల్లో ఆర్‌వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని తలపెట్టారు. అయితే ఇప్పటికి ఏర్పాటైనవి ఇరవయ్యే. దీనిని బట్టే ఈ పథకం తీరు ఎంత ఆర్భాటమో చెప్పకనే చెబుతోంది.
‘అధికారంలోకి రాగానే తాగునీటి కష్టాలు తీరుస్తాం....రక్షిత నీరు కాదు..ప్రతి ఒక్కరికి ఏకంగా మినరల్ వాటర్ అందిస్తాం..ప్రతి కుటుంబానికి రూ.2లకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తాం...’ అంటూ ఎన్నికల్లో ప్రచారం ఊదరగొట్టారు. తీరా అందలమెక్కిన తర్వాత ఎన్టీఆర్ సుజలధార పేరిట రూపాయి ఖర్చు లేకుండా ప్రణాళికలు సిద్ధం చేసిన సర్కార్ ఏడాదైనా నిర్ధేశిత లక్ష్యంలో కనీసం 10 శాతం ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేయలేకపోయింది. ఇక ప్రారంభమైన ప్లాంట్స్‌లో కూడా తరచూ సాంకేతిక లోపాలతో ముక్కుతూ..మూలుగుతూ నడుస్తున్నాయి.
సాక్షి, విశాఖపట్నం : సొమ్ము ఒకడిది..సోకొకడది అన్నట్టుగా దాతల సహకారంతో ‘ఎన్టీఆర్ సుజలధార’ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. రక్షిత జలాలు పూర్తి స్థాయిలో అందని 263 గ్రామాల్లో ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి ఎంతగా ఒత్తిడి తీసుకొచ్చినా దాతల నుంచి కనీస స్పందన రాలేదు. ఈ గ్రామాల్లో ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు కోసం స్పాన్సర్లుగా 12 పారిశ్రామిక, సేవా సంస్థలను ఎంపిక చేశారు.
తొలిదశలో రూ.ఐదుకోట్ల 98 లక్షల 83 వేల అంచనాతో 133 ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కానీ చివరి నిముషంలో దాతలు చేతులెత్తేయడంతో కనీసం మండలానికొకటి కాదు కదా కనీసం నియోజకవర్గానికి ఒకటైనా ఏర్పాటు చేసి పరువు నిలబెట్టుకోవాలని తలచారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో అక్టోబర్-2వ తేదీన అతికష్టమ్మీద 19 ఆర్వో ప్లాంట్స్‌ను ప్రారంభించగలిగారు. వీటిలో మెజార్టీ ప్లాంట్స్ సామర్ద్యం వెయ్యిలీటర్లే కావడం గమనార్హం. ఇవి కూడా రోజుకు కేవలం 755 కేన్స్(20 లీటర్ల)ను మాత్రమే సరఫరా చేయగలుగుతున్నాయి.
ప్రకటనలకే పరిమితం
అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబానికి రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తామన్న ప్రభుత్వ హామీ ఆచరణకు నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆర్వో ప్లాంట్స్‌కు నిధులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందా? అంటూ ప్రజలు మండిపడుతున్నారు. మిగిలిన ప్రతిపాదిత ప్లాంట్స్ కోసం అడిగితే ‘చూద్దాం....పెడతాం! అంటూ ప్రకటనలకే అధికార పార్టీ నేతలు పరిమితమవుతున్నారు. జిల్లాలోని 925 పంచాయతీల పరిధిలో రక్షిత నీరు 1669 పంచాయతీల్లో పూర్తి స్థాయిలోనూ, 3799 ఆవాస ప్రాంతాల్లో పాక్షిక స్థాయిలోనూ సరఫరా చేస్తున్నారు. రక్షిత నీటి వనరులు లేని గ్రామాలు 45 ఉండగా, అసలు నీటి వనరులే లేని గ్రామాలు 16 వరకు ఉన్నాయి.
ఫ్లోరైడ్ జలాలే దిక్కు!
ఇటీవల నిర్వహించిన సర్వేలో 45 గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉన్నట్టుగా గుర్తించారు. అంతేకాకుండా 500 చేతిపంపుల ద్వారా వచ్చే నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉందని నిర్ధారణకు వచ్చారు. ప్రత్యామ్నాయం లేక జిల్లాలో 50వేల మందికి పైగా ప్రజలు ఈ ఫ్లోరైడ్ నీటిని తాగుతూ రోగాల బారిన పడుతున్నారు.
ఈ పరిస్థితిని అధిగమించేందుకు పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు రూ.4727 కోట్లతో 13 గ్రిడ్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కనీసం రూ.2 లక్షల వ్యయం కాగల ఆర్వో ప్లాంట్స్‌కే నిధుల్లేనప్పుడు ఇన్ని రూ.వేల కోట్లతో ప్రభుత్వం వాటర్ గ్రిడ్స్ ఏ విధంగా ఏర్పాటు చేస్తుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఏర్పాటైనవి కొన్ని..పనిచేసేవి ఎన్ని?
ఆనందపురం, కశింకోట మండలాల్లో ఏర్పాటు చేసిన మూడు ప్లాంట్స్‌ను స్పాన్సర్స్ నిర్వహిస్తుండగా, మిగిలిన ప్రాంతాల్లోని ఆర్వో ప్లాంట్స్‌ను ఆయా గ్రామ పంచాయితీలే నిర్వహిస్తున్నాయి. అచ్యుతాపురం, రాంబిల్లి, చోడవరం మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్స్ ప్రారంభించిన కొద్దిరోజులకే మూలన పడ్డాయి. మిగిలినవాటి నిర్వహణ అధ్వానంగా ఉంది. మిగిలినపంచాయితీల్లో ప్రతిపాదిత ఆర్వోప్లాంట్స్ కోసం అడిగితే స్పాన్సర్స్ ఎవరూ ముందుకు రావడం లేదు. ఇటీవలే మరో తొమ్మిది ప్లాంట్స్ ఏర్పాటుకు వర్క్ ఆర్డర్స్ ఇచ్చారు.