స్వచ్ఛతకు నీళ్లొదిలారు
‘నెల్లూరు నీళ్లు తాగితే జబ్బులు ఖాయం’ అని స్వయానా జిల్లా కలెక్టరే అన్నారంటే నగరంలో తాగునీటి వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది. అధికారులు కాస్త దృష్టిపెడితే రక్షిత నీటిని ఇవ్వడం పెద్ద విషయం కాదని ఈ నెల 2న జూబ్లీహాల్లో జరిగిన స్వచ్ఛభారత్ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన చురకంటించారు. అయినా కూడా కార్పొరేషన్ అధికారుల్లో చలనం లేదు. అంటువ్యాధులు పొంచి ఉన్న కాలంలో మురికి, నీచు వాసనతో కూడిన తాగునీరు కుళాయిల్లో వస్తుండటం నగరవాసులను కలవరపెడుతోంది.
* నగరంలో ఆకుపచ్చరంగులో తాగునీరు
* ప్రబలుతున్న అంటువ్యాధులు
* చోద్యం చూస్తున్న అధికారులు
* మినరల్‌వాటర్‌కు భలే డిమాండ్
నెల్లూరు(హరనాథపురం): నెల్లూరు నగరంలోని వెంగళరావునగర్‌కు చెందిన ప్రసాద్‌ది సామాన్య కుటుంబం. తాగునీటి కోసం తప్పనిసరిగా నగరపాలక సంస్థ కుళాయిలపై ఆధారపడాల్సిందే. ఇటీవల కార్పొరేషన్ నీటిని తాగిన ప్రసాద్ డయేరియా బారిన పడ్డాడు. నగరంలోని ఓప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రాణాపాయ స్థితిలోంచి బయటపడ్డాడు. ఆస్పత్రి ఖర్చు దాదాపు రూ.10 వేలు అయింది. దేవుడా ఏంటి ఈ పరిస్థితి అనుకుంటూ రోజుకు రూ.25 పెట్టి మినరల్ వాటర్ కొనుక్కుని వాడుకుంటున్నాడు. ఈ పరిస్థితి ఒక్క ప్రసాద్‌దే కాదు. నగరంలో దాదాపు 75 శాతం మంది ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా నగరపాలక సంస్థ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.
వాతావరణంలో మార్పుల నేపథ్యంలో నగరంలో అంటురోగాలు ప్రబలుతున్నాయి. నగర పాలక సంస్థ పరిధిలో 54 డివిజన్ల ప్రజలకు పెన్నానది, సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకు, హెడ్‌వాటర్ రిజర్వాయర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. సాధారణంగా ఈ ప్రదేశాల్లో నీటిని క్లోరినేషన్ చేసి అనుబంధ ట్యాంకులకు పంపాల్సి ఉంది. అక్కడి నుంచి పైపుల ద్వారా వివిధ ప్రాంతాల ప్రజలకు నీటిని సరఫరా చేస్తారు. ఈ క్రమంలో నీటిని శుభ్రపరచడంలో కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనికి తోడు నగరంలోని తాగునీటి పైపులైన్లు పగుళ్లిచ్చి నీరు లీకేజీ అవుతున్నాయి.
ఈ ప్రదేశాల నుంచి వ్యర్థాలు, మురుగునీరు ప్రవహిస్తూ కుళాయిల ద్వారా కలుషిత నీరు సరఫరా అవుతున్నాయి. దీంతో కార్పొరేషన్ కుళాయిల నుంచి ఆకుపచ్చరంగులో నీరు విడుదలవుతోంది. ఈ నీరు దుర్గంధం వెదజల్లుతూ, చిన్నపాటి పురుగులు కన్పిస్తున్నాయి. ఈ నీటిని చూస్తేనే ప్రజల కడుపులు కెళ్లిస్తున్నాయి. ఈ నీటిని తాగుతున్న ప్రజానీకం వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే సమస్య. ఈ విషయంపై నిత్యం కార్పొరేషన్ అధికారులకు ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.
మినరల్ వాటర్‌కు పెరిగిన డిమాండ్
కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల నగర ప్రజలు నానా ఇక్కట్లు ఎదుర్కుంటున్నారు. సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజల పరిస్థితి మరీ దారుణం. నీరు కలుషితమవడంతో ప్రజలు మినరల్ వాటర్‌పై ఆసక్తి కనపరుస్తున్నారు. ప్రస్తుతం వాటర్ ప్లాంట్ నిర్వాహకులు అడ్వాన్స్‌గా రూ.140 తీసుకుని 20లీటర్ల క్యాను నీటిని రూ.25 నుంచి రూ.30 వరకు విక్రయిస్తున్నారు. దీంతో నగరంలో మినరల్ వాటర్‌కు డిమాండ్ పెరిగింది. మినరల్ వాటర్ కొనలేని సామాన్యులు గత్యంతరం లేక కార్పొరేషన్ నీటిని తాగుతూ వ్యాధుల బారిన పడుతున్నారు.
అధికారులు ఏం చేస్తున్నట్టు?
నగరంలో కలుషిత నీరు సరఫరా అవుతున్నా నగర పాలక సంస్థ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. సాధారణంగా నీటిని సరఫరా చేసే పెన్నానది, సమ్మర్‌స్టోరేజీ ట్యాంకు, హెడ్‌వాటర్ రిజర్వాయర్ల వద్ద నిత్యం నీటిని శుభ్రపరచి క్లోరినైజేషన్ చేయాల్సి ఉంది. పాయింట్ టు పాయింట్ క్లోరిన్ శాతం 0.2పీపీఎం ఉండాలి. ఇంజనీరింగ్ విభాగంలోని ఏఈల నుంచి ఫిట్లర్ల వరకు ప్రతి ఒక్కరి వద్ద క్లోరిన్ శాతాన్ని పరిశీలించేందుకు క్లోరోస్కోప్స్ పరికరాలు ఉండాలి. అయితే ఎక్కడా క్లోరిన్ శాతాన్ని పరిశీలించిన దాఖలాలు కానరావడం లేదు. పైపులైన్ల లీకేజీలను ఎప్పటికప్పుడు పరిశీలించి మరమ్మతులు చేయాల్సిన అధికార యంత్రాంగం నిద్రమత్తులో జోగుతోంది.
ఆధార్‌సీడింగ్, పింఛన్ల వెరిఫికేషన్‌లకు కింది స్ధాయి సిబ్బందిని ఉపయోగించడంతో వారి రెగ్యులర్ పనితీరును ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో కిందిస్థాయి సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ లీకేజీలను అరికట్టడంలో విఫలమవుతున్నారు. అటు ప్రజలు, ఇటు పత్రికలు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా వీరికి మాత్రం సమస్య పట్టడం లేదు. కార్పొరేషన్‌కు, తమ నివాసాలకు మినరల్ వాటర్ తెప్పించుకుంటున్నారు.
సాక్షాత్తు రాష్ట్ర పురపాకశాఖ మంత్రి నారాయణ స్వయంగా సమ్మర్‌స్టోరేజీ ట్యాంకును పరిశీలించి మురుగునీరు వస్తున్నదని హెచ్చరించినా కార్పొరేషన్ అధికారుల తీరు మారలేదు. నూతన కమిషనర్ చక్రధర్‌బాబు అధికారులతో సమావేశం నిర్వహించి తాగునీటి వ్యవస్థపై అప్రమత్తంగా ఉండాలని, లీకేజీలను అరికట్టాలని, అంటువ్యాధులపై అవగాహనతో ఉండాలని సూచించారు. అయినా అధికారుల్లో చలనం లేకపోవడం విచారకరం. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ప్రజలకు పరిశుభ్రమైన తాగునీటిని అందించాల్సి ఉంది.