ఇటీవల కొందరు కనుబొమల దగ్గర, పెదవుల దగ్గర, మరికొందరైతే నాభి దగ్గర కూడా బాడీ పియర్సింగ్ చేయించుకుంటున్నారు. గతంలో సాంప్రదాయికంగా బంగారపు ఆభరణాల తయారీ కళాకారులే ఈ చెవులు కుట్టడాన్ని చేసేవారు. ఇప్పుడైతే చాలాచోట్ల బ్యూటీ సెలూన్లలోనూ పియర్సింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడూ చాలామంది నిపుణులైన డాక్టర్‌ల ఆధ్వర్యంలోనే పియర్సింగ్ చేయిస్తున్నారు.
డాక్టర్ల దగ్గరే మేలు...
ఇప్పుడు అధునాతన పియర్సింగ్ పరికరాలతో చెవులు, ముక్కు లేదా దేహంలో అవసరమైన చోట్ల పియర్సింగ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో రింగులుగా వేయదలచిన లేదా స్టడ్స్‌గా ఉంచదలచిన బంగారు, వెండి తీగలను ముందుగానే డాక్టర్లు స్టెరిలైజ్ చేశాకే ముక్కుచెవులు కుట్టడం చేస్తున్నారు. ఈ కోణంలో చూసినప్పుడు ఆరోగ్యపరంగా డాక్టర్‌ల ఆధ్వర్యంలోనే పియర్సింగ్ ప్రక్రియ జరగడం ఎంతో మంచిది. డాక్టర్ల ఆధ్వర్యంలో ఇలా స్టెరిలైజ్ చేశాకే బంగారు రింగు తొడగడం లేదా స్టడ్స్ తొడగడం వల్ల ఇన్ఫెక్షన్ల వంటి ప్రమాదాలు తగ్గుతాయి. ఇలా చెవి, ముక్కు కుట్టడం లేదా అలా కుట్టిన చోట తీగ / స్టడ్ వేయాల్సిన ప్రదేశాల్లో చిన్న రంధ్రం వేసే సమయంలో కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు.
పియర్సింగ్‌లో కలిగే అనర్థాలు...
ఇన్ఫెక్షన్స్ : కుట్టాల్సిన చోట సెప్టిక్ కాకుండా ఉండేందుకు ప్రక్రియకు ముందూ, ఆ తర్వాతా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోక΄ోతే ఒక్కోసారి ముక్కుకు లేదా చెవికి రంధ్రం వేసిన చోట ఇన్ఫెక్షన్ రావచ్చు. ఆ తర్వాత ఇది మరిన్ని కాంప్లికేషన్లకు దారితీయవచ్చు.
సిస్ట్ / గ్రాన్యులోమా ఏర్పడటం : ముక్కు లేదా చర్మంపైన ఇతర ప్రాంతాల్లో కుట్టిన చోట చిన్న బుడిపె వంటి కాయ రావచ్చు. దీన్ని సిస్ట్ లేదా గ్రాన్యులోమా అంటారు. కుట్టగానే చర్మంలో జరిగే ప్రతిస్పందన వల్ల ఈ సిస్ట్ / గ్రాన్యులోమా వస్తుంది. ఇది సాధారణంగా హానికరం కాదు. చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది. ఏదైనా సమస్య వస్తే డాక్టర్‌కు చూపించి తప్పక చికిత్స తీసుకోవాలి. ఇలా సిస్ట్ / గ్రాన్యులోమా / కీలాయిడ్ వచ్చే అవకాశం ఉన్నవారు చిన్నప్పుడే వేసిన రంధ్రం తప్ప మళ్లీ పియర్సింగ్ చేయించు కోపోవడమే మంచిది.
మచ్చ ఏర్పడటం : కొన్ని సార్లు కుట్టే ప్రక్రియలో వేసే రంధ్రం వద్ద మచ్చలా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు తప్పనిసరిగా డర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి.
అలర్జీలు : కొన్ని సందర్భాల్లో కొందరికి కుట్టడానికి ఉపయోగించే బంగారం లేదా వెండి వల్ల అలర్జీ కలగవచ్చు. దీన్ని కాంటాక్ట్ డర్మటైటిస్ అంటారు. కొందరిలో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వల్ల కూడా ఇలాంటి అనర్థం రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో కుట్టిన చోట్ల ఇన్ఫెక్షన్ రావడం, దురద, స్రావాలు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా డర్మటాలజిస్ట్ సలహా మేరకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
ఇవి గుర్తుంచుకోండి...
శరీర భాగాలకు కుట్టే సమయంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడండి. అంతకు ముందు వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏవీ లేనప్పుడే ముక్కు, చెవులు కుట్టించే ప్రక్రియకు వెళ్లాలి.
చెవులు, ముక్కు కుట్టే సమయంలో రంధ్రం పెట్టాల్సిన చోటిని ముందే నిర్ణయించుకోవాలి. తీరా కుట్టే ప్రక్రియ పూర్తయ్యాక రంధ్రం సరైన స్థానంలో లేదని బాధపడటం కంటే ముందే తగిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి.
చెవులు లేదా ముక్కు కుట్టేవారికి ఉన్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అంటే అనుభవజ్ఞుల దగ్గరే ఈ ప్రక్రియ జరిగేలా చూసుకోవడం మంచిది.
చెవులు లేదా ముక్కు కుట్టించే ముందుగా ప్రీ–స్టెరిలైజ్‌డ్ స్టడ్స్ ఉపయోగించి చెవులు, ముక్కు కుడతారు. కాబట్టి అందరిలో అంతగా ప్రమాదం ఉండకపోవచ్చు. ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
చెవులు లేదా ముక్కు కుట్టడానికి 45 నిమిషాల ముందుగా లోకల్ అనస్థీషియా ఇస్తారు కాబట్టి పెద్దగా నొప్పి అనిపించకపోవచ్చు.
తేలిగ్గా మచ్చ పడే చర్మతత్వం ఉన్నవారు ముక్కు కుట్టించుకోకపోవడమే మంచిది. ఇలాంటి వారు చెవులు, ముక్కు కుట్టించుకోడానికి ముందే డర్మటాలజిస్ట్ / డాక్టర్ సలహా తీసుకోవడం మేలు.
కీలాయిడ్స్ వచ్చే శరీర స్వభావం (శరీరంపై ఏదైనా గాయం అయినప్పుడు ఆ ప్రదేశంలో ఉబ్బినట్లు గా మచ్చ వచ్చే శరీర తత్వం) ఉన్నవారు బాడీ పియర్సింగ్‌కు వెళ్లకపోవడమే మంచిది.
Comments
Please login to add a commentAdd a comment