రాష్ట్ర స్థాయిలో టోల్ ఫ్రీ నంబర్ 18005 94007 ఏర్పాటు
రాష్ట్రంలోని ఏ గ్రామం నుంచి అయినా ఫిర్యాదులకు అవకాశం
ఈ సౌకర్యం గ్రామీణ ప్రజలకు మాత్రమే
నల్లగొండ: మీ గ్రామంలో తాగునీటి సరఫరాలో సమస్య వచ్చిందా? నీళ్లు రావటం లేదా? అయితే ఎందుకు ఆలస్యం..! ఫోన్ తీయండి.. ఒక్క కాల్ చేయండి... మీ సమ స్య పరిష్కారమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తితే ఫిర్యాదులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ 18005 94007ను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని ఏ గ్రామం నుంచి ఫోన్ చేసినా సరే.. మీ ఫిర్యాదును నమోదుచేసుకొని.. సంబంధిత జిల్లా అధికారులకు సమస్యను తెలిపి పరిష్కారానికి కృషిచేస్తారు. గత నెల 23న హైదరాబాద్‌లో పది మంది అధికారులతో రాష్ట్రస్థాయిలో టోల్ ఫ్రీ నంబర్ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు.
సమస్య పరిష్కారం ఇలా..
రాష్ట్రంలో ఏదైనా గ్రామంలో తాగునీటి సమస్య ఏర్పడితే స్థానిక అధికారుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. మీ ఫోన్‌కాల్ రాష్ట్ర కార్యాలయంలో రికార్డవుతుంది. తర్వాత అక్కడి అధికారులు ఆ సమస్యను సంబంధిత జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారికి తెలుపుతారు. ఆ అధికారి సంబంధిత అధికారిని క్షేత్రస్థాయికి పంపి సమస్య పరిష్కారానికి కృషిచేస్తారు. సమస్య పరిష్కారమైన తర్వాత ఆ విషయాన్ని జిల్లా అధికారి తిరిగి రాష్ట్ర కార్యాలయానికి తెలుపుతారు. టోల్‌ఫ్రీ నంబర్ కార్యాలయం అధికారులు ఫిర్యాదుదారునికి ఫోన్ చేసి సమస్య పరిష్కారమైందా లేదా? అని ధ్రువీకరించుకుంటారు. ఇది మున్సిపాలిటీల ప్రజలకు వర్తించదు.
Comments
Please login to add a commentAdd a comment